Previous Page Next Page 
తృప్తి పేజి 8


    తులశమ్మగారికి అంతా తెలుస్తూనే వున్నా లేవడానికి ఓపిక లేక కళ్ళు మూసుకుని అలాగే పడుకుండిపోయింది.
    ఆ రోజంతా ఆ ఇంట్లో నుండి నానా రాద్ధాంతం వినిపిస్తూనే వుంది. వర్ధనమ్మగారు మనసు కొట్టుకుపోయి అటూ ఇటూ తారట్లాడ్తోంది. మధ్య మధ్యలో కోడలితో... ఒక్కసారి ముసలావిడ్ని చూసిరానుటే? కాస్త హార్లిక్స్ తాగుతుందేమో అడగనా?" అని రెండుమూడు సార్లు అడిగింది. కావేరి తల అడ్డంగా ఊపింది. దాంతో ఆవిడింక ధైర్యం చెయ్యలేదు. "కొడుకొచ్చినట్టున్నాడు. డాక్టర్ దగ్గరకి తీసుకెళ్తాడేమో" అంటూ కాసేపు కిటికీ దగ్గర నిలబడింది.
    "అత్తయ్యా! టి.వీ.లో మీకిష్టమైన సీరియలొస్తుంది ఇలా రండి" పిలిచింది కావేరి.
    "బామ్మ రాదమ్మా. అక్కడింతకంటే మంచి నాటకమవుతోంది" అన్నాడు మధు నవ్వుతూ.
    "తప్పు అలా అనకూడదు" చిన్న గొంతుకతో కొడుకుని కసిరింది కావేరి.
    ఆ రాత్రి వర్ధనమ్మగారు అన్నంముందు కూర్చుందే గానీ అన్నం సహించలేదు. అటూ ఇటూ కెలికి మజ్జిగపోసుకుని పిడిచి తాగి లేచెళ్ళి పోయింది. కావేరికీ అలాగే ఉంది కాని బయటపడలేదు. అందరూ పడుకున్నాక భర్తతో అంది.
    "ఆ కొడుకసలు పట్టించుకోడెందుకండీ?
    ఏ కొడుకూ?" సుధాకర్ ఎవరి గురించీ పట్టించుకోడు. ఎన్నిసార్లు చెప్పినా పక్కింటాయన పేరు కూడా గుర్తుంచుకోలేకపోయాడింతవరకూ.
    కావేరి పొద్దుటినుండి వర్ధనమ్మగారు పడ్తున్న ఆరాటం, ఆ కోడలి రుద్రతాండవం, కొడకు అసమర్థతా వివరించి చెప్పింది.
    "భార్యకి భయపడని భర్తవరోయ్ లోకంలో? నువ్వు సహకరిస్తున్నావు కాబట్టి ఇద్దరి చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేశాను. వాళ్ళెప్పుడొచ్చినా ఆదరిస్తున్నాను. లేకపోయినా చేసేవాడ్నేమో. కానీ ఇంటిదాని పోరు ఇంతింత కాదనీ, మనశ్శాంతుంటుందా? ఇద్దరం రోజూ పోట్లాడుకుంటుంటే మధ్యలో పిల్లల భవిష్యత్తు పాడయిపోతుంది. అందుకని మాట్లాడకుండా ఊరుకునేవాడ్నేమో ఎవరు చెప్పగలరు?"
    "ఏమో! నాకు మటుకు తల్లిని పలకరించడానికీ, మందిప్పించడానికీ కూడా ధైర్యంలేని బ్రతుకూ ఒక బ్రతుకేనా అనిపిస్తోంది. అటువంటివాడంటే భార్యకూ విలువుండదు. ఒకటి రెండుసార్లు ఎదిరించి మాట్లాడి 'నా తల్లికి మందిప్పిచ్చుకుంటాను. నువ్వెవరివి కాదనడానికి?' అనడిగితే తను తెలుసుకుని అతనికి స్వతంత్రభావాలున్నాయని జాగ్రత్తగా వుంటుంది. అంతేకానీ తానా అంటే తందానా అంటుంటే ఆ భర్తంటే లోకువేగాక కొన్నాళ్ళకి వాజమ్మని చేసుకున్నానని అసహ్యం కలుగుతుంది." తన మనోభావాలు వెల్లడించింది కావేరి.
    "అందరూ మనలాగే ఆలోచిస్తారనుకోకు! లోకో భిన్నరుచి. అనవసరంగా ఎవళ్ళ గురించో ఆలోచిస్తూ టైమ్ వేస్ట్ చెయ్యకు" అంటూ లైటార్పేశాడు సుధాకర్.


                             *    *    *    *


    "ఆడది కాదూ, ఆ మాత్రం అన్నం వండిపెట్టలేదూ! ఒక్కపూటకే చెయ్యలేక హోటల్ నుండి తెప్పించింది చూడు" అంటూనే కూర తరుగుతోంది వర్ధనమ్మ.
    కావేరి పిల్లల్ని తయారుచెయ్యటంలో హడావిడిగా ఉంది. "ఆవిడ్ని పట్టించుకొనేందు కొక్కళ్ళూ లేరు. టిఫిన్ తినేసి ఆ కొడుకెళ్ళిపోయాడు. టిక్కుటిక్కుమని ఈవిడా వెళ్ళిపోతోంది. పిల్లలు చిన్నవాళ్ళు. కాస్త గంజికాచి పోసే దిక్కులేకుండా వదిలి వెళ్ళిపోతున్నారు. మనమేవన్నా సహాయం చేద్దామా అంటే అదో పెద్ద నేరం"
    ఉల్లిపాయలు తరుగుతున్నందుకో లేక నిజంగానో కళ్ళనుండి నీళ్ళు కారిపోతున్నాయి. మధ్యమధ్యలో కొంగుతో తుడుచుకుంటోంది.
    పూజకి జడేస్తున్న కావేరి "ఆవిడ వెళ్ళిపోయాక ఒక్కసారి చూసిరండి. అవసరమైతే ఏదైనా చేసి తీసికెళ్ళి తాగించండి" అంది. దాంతో బోలెడు ఉత్సాహం వచ్చేసిందావిడకి. గబగబా పని పూర్తిచేసి,జావకాచింది. అది పుచ్చుకుని వెళ్ళడానికి గడియారంకేసి చూస్తూ కూర్చుంది. తొమ్మిదింటికి సుధాకర్ పిల్లల్నీ, భార్యనీ టి.వి.యస్ మీదెక్కించు'కుని, వాళ్ళని స్కూల్ లో భార్యని బస్ స్టాప్ లో దింపడానికి తీసుకెళ్ళిపోయాడు. పదవుతుండగా నర్మద ఆఫీస్ కి బయల్దేరింది. సందు చివరవరకూ వెళ్ళిపోయేంతదాకా ఆగి అప్పుడు బయల్దేరింది వర్ధనమ్మ జావ గిన్నెతో తులశమ్మ దగ్గరకు.


                                          *    *    *    *


    "ఎందుకలా అన్నింటికీ జవాబివ్వకుండా నవ్వుతావు? నీ నవ్వు కోసం పడి చస్తాను అన్నంతమాత్రాన అలా చచ్చేదాకా నవ్వుతావా?"
    ఉడుకుమోత్తనంగా అడుగుతున్న శేఖర్ ని చూసి మళ్ళీ నవ్వింది యమున. యమున నిజంగానే చాలా అందంగా నవ్వుతుంది. నవ్వగానే ఆమె మూతితో పాటు ముక్కు కూడా నవ్వుతుంది. ఆపైన తళుక్కుమనే పలువరుస. ఛామన ఛాయలో చాలామంది దృష్టిలో నలుపు అనిపించే యమునకి వుండే నిడుపాటి కురులు పెట్టని ఆభరణాలు. ఆ కళ్ళు ఎవరో కవి వర్ణించినట్లు పండు వెన్నెల గనులే.
    "మాట్లాడ్తావా లేక ఈ నీళ్ళల్లోకి దూకేయమంటావా?" సీరియస్ గా అడిగాడు శేఖర్.
    యమున మళ్ళీ నవ్వింది.
    గబగబా షర్ట్ పైన వేసుకున్న జర్కిన్ విప్పి "ఇది పట్టుకో" అంటూ యమున చేతికిచ్చి వంగి షూస్ లేస్ తియ్యసాగాడు. "ఎలాగో దూకేస్తున్నావుగా. ఇవన్నీ తీసి జాగ్రత్త చెయ్యడం ఎవరికోసం?" అల్లరిగా అడిగింది.
    "అదే చెప్పబోతున్నాను. నీకు పిల్లలు పుట్టాక మగపిల్లాడికి ఇచ్చి 'నాకోసం ప్రాణత్యాగం చేసుకున్న ఓ అమాయకుడివి, ఇవి నీకిమ్మన్నాడు' అని చెప్పు"
    "ఉహూ" చెప్పనన్నట్లుగా తల అడ్డంగా వూపింది.
    "ఏం ఎందుకు చెప్పవూ? అందుకు కూడా నేను తగనా?" మరింత ఉక్రోషంగా అడిగాడు.
    "ఛీ ఏం బావుంటుంది చెప్పు? అప్పుడవి ఓల్డ్ ఫ్యాషన్ అయిపోతాయి" గంభీరంగా చెప్పింది. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS