"పెళ్ళైతే మీవాళ్ళకి సహాయం చెయ్యవద్దంటానా? నేనంత కర్కోటకుడ్నా?" అని శేఖర్ చాలాసార్లన్నాడు. కానీ హన మనసుకి తెలుసు పెళ్ళయ్యాక పుట్టింటికి సహాయం చెయ్యడం జరగనిపనని. ఒకవేళ చేసినా అది అందరి దృష్టిలో మహాపరాధం. 'పుట్టింటికి దోచిపెడ్తుంది' 'ఆ మొగుడు ఏమీ అనలేడు పాపం' అంటూ చెవులు కొరుక్కుంటుందీ లోకం. అక్క కూడా పెళ్ళికిముందెంతో ఆలోచించింది. బావగారు చాలా మంచివారు 'నా వాళ్ళకీ, నీవాళ్ళకీ కూడా సహాయం చేద్దాం' అన్నారు. అలా పెళ్ళవగానే ఇలా కూరుకుపోయింది సంసార కూపంలో. "కావేరి చాలా మంచిది" అనే పేరు తెచ్చుకోవడానికి ఎన్ని కోరికల్ని, ఎన్ని సుఖాల్ని త్యాగం చేసిందో ఎవరికి తెలుసు? నాన్నగారు అత్తారింటికి పంపించేటప్పుడు చెప్పారు. "ఇప్పటినుండీ నీకదే స్వంతిల్లు. వాళ్ళే అయినవాళ్ళు. వాళ్ళ బాగే నీ బాగు. మా గురించి బాధపడకు. నువ్వు మాకు చేసే సహాయమల్లా పుట్టింటికి మంచి పెంపకం అన్నపేరు తీసుకురావడమే" అని. అవి తూ.చా. తప్పకుండా పాటించింది కావేరి. మంచిపేరు తెచ్చింది పుట్టింటికి. కానీ తన విషయంలో అలా జరగదు. పెళ్ళయ్యాక తను పుట్టింటికి సహాయం చెయ్యక తప్పదు. శేఖర్ తనను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏమీ అనుకోకపోవచ్చు కానీ శేఖర్ వైపు వాళ్ళందరూ తనని ప్రేమించి అర్థం చేసుకోవాలనేముంది? ఈ విధంగా ఆలోచించి తను శేఖర్ని ఆపుతోంది. ఆర్నెల్లుగా అతనితో పరిచయం. రమేషన్నయ్య పెళ్ళిలో చూశాడు తనని. వివరాలు సేకరించి ఓరోజు డైరెక్టుగా ఆఫీస్ గేటు దగ్గర కాపేశాడు. "మీరు రమేష్ చెల్లెలు కదా!" అని అడిగాడు. తను అవునంది.
"నా పేరు శేఖర్. ఇంజనీరింగ్ డిగ్రీ వుంది. ఈ మధ్యే ఉద్యోగం కూడా వచ్చింది. మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. నేనెలాంటివాడ్నో నా పుట్టుపూర్వోత్తరాలేమిటో రమేష్ ద్వారా తెలుసుకోండి" అని భయం, బెరుకూ లేకుండా చెప్పేశాడు.
తను షాకైపోయింది. ఆ షాక్ లోంచి తేరుకునేలోపే రమేషన్నయ్య ద్వారా సిఫార్సు చేయించుకున్నాడు. "వాడు నా ప్రాణస్నేహితుడమ్మా, చాలా మంచివాడు. ఒక్కడే కొడుకు. బాధ్యతలేమీ లేవు. ఒప్పుకో! బాబాయ్ కి ఇంతకంటే మంచి అల్లుడు ఎక్కడ దొరుకుతాడు?" అన్నాడు.
"అది కాదన్నయ్యా, పరిస్థితులు తెలిసీ...."
"అవన్నీ వాడితో మాట్లాడు. వాడొప్పుకుంటే కొన్నాళ్ళు ఆగమను" అంటూ ఓ ఆదివారం వాళ్ళింట్లో మీటింగ్ కూడా ఏర్పాటుచేశాడు.
అందగాడూ, తెలివైనవాడూ ముఖ్యంగా మంచివాడూ అయిన శేఖర్ అలా తన ప్రమేయమేమీ లేకుండానే తన జీవితంలోకి చొరబడ్డాడు. ఆ బంధం చాలా బలమైనదిగా మారి తనకి వూపిరి ఆడనివ్వటం లేదు. మొదట ఏముందీ మూడేళ్ళు ఎంతలోకి గడుస్తాయి? అనుకున్నా రానురాను ఒక్కోరోజు ఒక్కో యుగంగా గడవసాగింది. మనసులు కలసిపోయాక మనుషులు విడివిడిగా ఉండటమెంత దుర్భరమో ఒక్క ప్రేమికులకే తెలుస్తుంది! తన ఇల్లూ, బాధ్యతల విషయంలో తలమునకలుగా వుండి కొంతవరకూ దృష్టిమరలుస్తుంటుంది. కానీ శేఖర్ వాళ్ళింట్లో సంబంధాలు చూస్తామంటూ తొందర చెయ్యడంతో తను చెప్పేద్దామంటున్నాడు. ఈ విషయం బయటపడితే అభిమానం గల అమ్మా నాన్నలూ, తమ్ముడూ చాలా బాధపడతారు. అంతేకాక ఇబ్బందో సబ్బందోపడి తన పెళ్ళి చేసేస్తారు. అందుకే శేఖర్ ని బయటపడొద్దని బ్రతిమాలుకుంటోంది. కాని ఎన్నాళ్ళు? ఆర్నెల్లు ఆపేటప్పటికి తన తలప్రాణం తోకకొచ్చింది.
"ఈవేళ ఆఫీస్ కెళ్ళవటే?" అంటూ అమ్మ లేపుతుంటే బద్ధకంగా లేచింది యమున.
* * * *
"ఏమిటీమధ్య చిక్కిపోతున్నారు? ఒంట్లో బావుండటంలేదా?" అడిగింది కావేరి.
"లేదు బాగానే వుంది కానీ పనెక్కువైపోయింది. నిద్రలేమివల్ల అలసటగా ఉంటోంది" చెప్పింది సింధు.
"పనిమనిషెలా వుంది?"
"చిట్టెమ్మా! బానేవుంది. వంట కూడా బాగానే చేస్తుంది. పిల్లలు బాగా మాలిమి అయిపోయారు. మా అత్తగారెళ్ళిపోతున్న ప్రతిసారీ గొడవచేసేవారు. ఈసారి చిట్టెమ్మ పుణ్యమా అని ఏడవలేదు."
"అదృష్టవంతులు, మా పనిమనిషి వారానికి మూడు అర్థపూటలు మానేస్తుంది. ఇంక ఆదివారమొస్తే సాధారణంగా ఫుల్ డే లీవ్" నవ్వుతూ చెప్పింది కావేరి.
"చిట్టెమ్మ వచ్చాక నాకా బాధ తప్పింది. ఇన్నాళ్ళూ ఎలా గడిపానా? అని నాకే అనుమానమొస్తుంది. అంటే అంతలా ఆధారపడిపోయానన్నమాట!" తనూ నవ్వేస్తూ చెప్పింది.
"ఇంతకీ మా ఇంటికెప్పుడొస్తారు? మా అత్తగారిప్పటికి చాలాసార్లు అడిగారు తీసుకురమ్మని"
"మీ అత్తగారికి నా సంగతెలా తెలుసు?"
"నేను బయటికొచ్చాక జరిగేవన్నీ ఇంటికెళ్ళాక పూసగుచ్చినట్లు చెబుతానావిడకి"
"మీ ఇద్దరూ అంత చనువుగా మాట్లాడుకుంటారా?" ఆశ్చర్యంగా అడిగింది సింధు.
"ఒకింట్లో వున్నాక చనువురాదా? మాట్లాడుకోమా! అంతలా ఆశ్చర్యపోతున్నారు. మీరు మీ అత్తగారితో చనువుగా వుండరా?"
"ఆవిడదంతగా మాట్లాడే స్వభావం కాదు. నేను కూడా ఆవిడతో అలాగే వుంటాను. అయినా నా దగ్గరుండేది చాలా తక్కువ కదా!"
"నేనివాళ మీ స్టాప్ లోనే దిగిపోతున్నాను. అమ్మా వాళ్ళింటికెళుతున్నాను" చెప్పింది కావేరి.
"అయితే మా ఇంటికి కూడా రావాలి"
"ఇంకోసారి ప్రత్యేకంగా మీ ఇంటికే వస్తాను అడ్రెస్ ఇవ్వండి. ఇవాళ మాత్రం వదిలెయ్యండి ప్లీజ్"
సింధు సరేనని కాగితం మీద అడ్రస్ రాసిచ్చింది. మరోసారి తప్పకుండా రావాలని మరీమరీ చెప్పింది.
"నేనొస్తాను, వచ్చి మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను కూడా!" చెప్పింది కావేరి.
"తప్పకుండా వస్తాను. నాకూ మీ ఇంటినీ ముఖ్యంగా మీ అత్తగార్నీ చూడాలనుంది" అంది సింధు.
బస్ దిగి ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
కావేరిని చూడగానే చాటంతయింది కాత్యాయిని మొహం. "ఎంత చిక్కిపోయావే! వంట్లో బావుంటోందా? పిల్లలెలా ఉన్నారు?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అన్నింటికి ఓపిగ్గా సమాధానమిచ్చి "యమునేది?" అనడిగింది.
