తెల్లగా తెల్లారేక విషయం తెలిసిన జానయ్య బాధ పడ్డాడు. కొడుకుపై కోపగించుకున్నాడు చౌదరికి భయపడ్డాడు.
అందుకే చౌదరికి ముఖం చూపించలేక సర్ది సమాధానం చెప్పుకోలేక పొరుగూర్లో వున్న చెల్లెల్ని చూట్టానికని వెళ్ళేడు అకారణంగా.
మరోగంట తర్వాత విషయం తెలుసుకున్న చౌదరి చూసి చూసి చంద్రమ్మని ఏమీ అనలేని నిస్సహాయస్థితిలో తండ్రీ కొడుకుల్ని యిద్దర్నీ తిట్టుకుంటూ వెళ్ళేడు.
ఆ సాయంకాలం రచ్చబండ దగ్గర చౌదరి, ప్రెసిడెంటు నాయుడు, మునసబు ధర్మారెడ్డి, కారణం శేషయ్య కూర్చున్నారు. నలుగురూ రోజూ కలుస్తూనే వుంటారు. కాలక్షేపనికి పేకాడతారు.
పేచీలకి ఆలోచనలు, ప్రభుత్వాన్ని దించేందుకు ఎక్కించేందుకు ప్రణాళికలు, ఊరుని కట్టుదిట్టం చేసేందుకు కాండక్టురూల్స్ అక్కడే తయారవుతాయి.
పేక దస్తు కలిపి విషయం అంతా చెప్పేడు చౌదరి.
రచ్చబండపై నలుగురే వున్నారు. దూరంగా తలారి, పాలేరు, బంటు కూర్చుని వున్నారు బీడీలు కాలుస్తూ.
"అయితే జానిగాడికి బలిసిపోయిందన్నమాట!"
మున్సబు మాటలకి "ఊ వాళ్ళకేం? ప్రభుత్వం అనుకూలంగా వుంది. మనం ఏం చేస్తాం?" అన్నాడు కరణం.
"చెమ్డాలొలిస్తే సరి!"
"నాయుడూ! అదంతా సులభం కాదిప్పుడు."
"తడాఖా చూపించమంటావా? కారణం మాటలకి శవాలుగా అన్నాడు నాయుడు.
"ఊ అదిగో! సోంగాడు వస్తున్నాడు ఓ చూపు చూడు!" అన్నాడు కవ్వింపుగా కారణం ముక్క విసుర్తూ.
ఆ ముక్క అందుకుని షో చేస్తూ "అయితే చూడు!" అన్నాడు సర్పంచి కొండప్ప నాయుడు.
అంతలో అటుగా వచ్చిన సోము తలదించుకుని వెళ్ళసాగాడు. అతని వెంట అయిదారుగురు యువకులున్నారు.అందరూ రోజు కూలికి వెళ్ళి బ్రతికేవాళ్ళే. రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళు కాబట్టి బలిష్టంగా వున్నారు.
"ఒరే సోమిగా! ఆగరా!"
నాయుడి మాటలకి ఆగేడు. అతనికి ఆ నలుగురినీ చూడగానే విషయం తెలిసిపోయింది. ఏదో పేచీ వస్తుందనే అనుకున్నాడు.
సరిగ్గా అప్పుడే వచ్చాడు పురోహితుడు శాస్త్రి తమ్ముడు శేఖర్. అతనికి లేని వ్యసనమంటూ లేదు. పేకాటతో వీళ్ళజత, అన్నిట్లో వీళ్ళకి తోడుగా వుంటాడు.
"ఏమిటి వ్యవహారం?" అన్నాడు తనూ వాళ్ళతో కూర్చుని ముక్క వెయ్యమంటూ!
"బాపనయ్య కి నీకెందుకులే!"
"చౌదరీ! నా సంగతి తెలిసే అలా అంటావేం?"
"సర్లే! మీ సంగతి తరువాత! ఆ ఏరా? ఏం సంగతులు?" అడిగాడు నాయుడు సిగరెట్ ముట్టించుకుంటూ.
అప్పుడే అంతా సిగరెట్లు ముట్టించారు.
"ఏ మున్నయ్యండీ!"
"ఎందుకుండవు? పెద్ద మొనగాడి వవుతున్నావటగా!"
సోము సంధానం యివ్వలేదు.
"మీ నాయన ఎక్కడ్రా?"
"ఊరు నుంచి యింకా రాలేదండి!"
"వస్తాడా? చస్తాడా? అది సరే! నిన్న పనికి వస్తామని యీరోజు ఎగవేశారట కదా!"
"లేదండీ!"
"ఆయ్! అబద్దాలు కూస్తావా? రేపు కాడిని పంపుతానని మీఅబ్బ అన్లేదూ? అంతా దొంగనాయాండ్లు. మాట తప్పుతారు. ఏమైనా అంటే అలగా జనంతో పేచీ!" చౌదరి అందుకున్నాడు కస్సుమంటూ.
"నాకు తెలియదండీ!" వినయంగానే సమాధానం యిచ్చాడు సోము.
"తెలియదంటావేంరా గాడ్ది కొడకా! మీ నాయన అప్పుచేసింది తెలియదూ? అది తీర్చాలని తెలియదూ? ఇంకేంట్రా తెలిసేది!" నాయుడు తిట్టాడు.
