Previous Page Next Page 
రాగోదయం పేజి 8


    బీరువా తెరిచి డబ్బూ నగలూ ఓసారి కళ్ళారా చూసుకుని లక్ష్మి అమ్మవారికి నమస్కరించుకుని ఆ రెండు రూపాయలనీ రెండు రూపాయల కట్టలో జతచేసి లెక్కపెట్టేడు. వంద నోట్లు అయ్యాయి-దాంతో ఆ కట్టతీసి అలా వందేసిగా కట్టిన కట్టల వరసలో వుంచాడు. తర్వాత ఖాళీగా వున్న ఆ స్థలాన్ని చూసి "అమ్మణ్ణి దయవుంటే మళ్ళీ రేపటికి ఆ చోటు భర్తీ చేయనా?" అనుకున్నాడు తిరిగి బీరువా వేశాడు.
    
                                              3
    
    ఆ రోజు మడిదగ్గరకి చద్ది తీసుకుని వెళ్ళి జరిగిందంతా కొడుక్కి చెప్పాడు జానయ్య. అంతా వినగానే సోము ముఖం బిర్ర బిగుసుకుపోయింది. నరాల్లోకి రక్తం వేగంగా ప్రవాహించింది. ముఖం ఎర్రనైంది.
    తండ్రితో ఏమీ అనకుండా కొరడాలాంటి చెర్నాకోల "ఛెళ్" మనిపించాడు. చురుక్కుమన్న కోడెగిత్తలు వులికి పడ్డట్లయి, అకారణమైన ఆ దెబ్బని వూహించలేక వేగంగా కదిలాయి.
    ఆ ప్రవర్తన, తీరుకి నిట్టూర్చాడు జానయ్య.
    మధ్యాహ్నానికి యింటికి తిరిగి వచ్చాడు సోము నేరుగా బడి దగ్గరికి వెళ్ళేడు. అక్కడ జయన్న వున్నాడు అతనిది ఆ వూరు కాదు ఆ వాడాకాదు. సోముకి హైస్కూల్లో క్లాసుమేట్ సోము చదువలేక టెన్త్ తో తిరిగొస్తే జయన్న కాలేజీ మెట్లెక్కాడు. తర్వాత ట్రయినింగ్ అయ్యాడు. ఉద్యోగం కోసం ప్రయత్నించగానే రిజర్వేషన్ లో వుద్యోగం దొరికింది. అది అదృష్టవశాత్తూ ఆ వూరే అయింది.
    బాల్య స్నేహితులు యిద్దరూ అందుకే సంతోషించారు. ఆ వూరన్న అభిమానంతో జయన్న రాత్రుళ్ళు కూడా శ్రమపడి అందరికీ అక్షరాలు దిద్దబెడుతున్నాడు. ఈ నాలుగైదు నెలలుగా సోముకూడా అతనికి తోడుపడుతున్నాడు.
    జయన్నతో విషయం అంతా చెప్పేడు!
    "వెట్టి చాకిరి క్రింద రిపోర్టు చేద్దామా?"
    "ఊహూఁ వద్దు!"
    "ఏం? ఎందుకని?"
    "వద్దు జయా! రిపోర్టు దాకా ఎందుకు, నేను రేపు కాడి గట్టుకుని మడిలోకే వెళతాను. ఏం జరుగుతుందో చూద్దాం!"
    "ఏం జరుగుతుందంటావు?"
    సోము మాట్లాడలేదు.
    "మీ నాయనకి యిబ్బంది."
    ఇబ్బంది, ఇబ్బందులకేంలే, మా నాయన బ్రతుకంతా యిబ్బందులతోనే గడిచిపోయింది. ఆయన యిబ్బంది పడని దెపుడు? ఆయన బాధలకి అలవాటు పడ్డాడు.
    ఆ మాటలలో వేదన, కసి కనిపించాయి జయన్నకి. ఒకవేళ ఆ అప్పు కట్టమని తొందర చేస్తే?"
    సోము వెంటనే జవాబివ్వలేదు.
    "సోమూ" అలా చేస్తే లెక్క తేల్చమని అడగండి"
    "లెక్క తేల్చేదేవిటి? కారు కారుకి చెల్లు వేస్తున్నాం బాండు తిప్పి రాయిస్తున్నాడు మా నాన్న."
    "ఆర్నెల్ల కోసారా?" ఆశ్చర్యపోయాడు జయన్న.
    "వింతేముంది అందులో, పల్లెల్లో అది చాలా మామూలు, అందరూ అలవాటు పడిపోయారు. విత్తేముందు తెచ్చుకోవటం పైరుకాగానే ధాన్యమూ, అదమ్మి డబ్బో యిచ్చెయ్యటం అంతా నాలుగు నెలల కాలం? అంతే"
    "అవున్లే, బ్యాంకులే ఆర్నెల్లకోసారి వడ్డీ కట్టిస్తూ వుంటే ఈ వడ్డీ వ్యాపారస్తుల నడిగేదేవుంది?"
    "జయన్నా! ఓ పని చేద్దామా!"
    "ఏమిటి?"
    "సన్నకారు రైతు కింద అప్పు కట్టటానికి శక్తి లేదని పిటీషను పెట్టేద్దాం?"
    "మీ నాన్న ఒప్పుకోవద్దూ?"
    "అవును! అదీ నిజమే!" నిట్టూర్చాడు సోము.
    ఎటూ నిర్ణయించుకోలేని సోము ఆ రాత్రి ఓ నిర్ణయానికి వచ్చి వేకువని లేవగానే విషయం అంతా తల్లితో చెప్పి చీకటిలోనే కాడిగట్టుకుని వెళ్ళేడు.
    తనూ వేకువనే లేచినా కొడుకు పశువుల పని చూస్తూ వుండటంతో వేకువనే వీచే వేసవి చల్లగాలులకి అలాగే పడుకున్నాడు జానయ్య. తుషార వదనాలు చల్లగా జోకొట్టాయి.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS