Previous Page Next Page 
బ్రహ్మ ప్రళయం పేజి 9

ఆ అద్దంలోకి చూడగానే...
దిగ్భ్రాంతి చెందాడు సాహస్!
అలాంటి దృశ్యాన్ని తన జన్మలో చూస్తానని కలలో కూడా ఊహించలేదు సాహస్!
అద్దంలో కనబడుతున్నది తనే!
కానీ -
ఎంత మార్పు!
తనది చిన్నప్పటి నుంచి రెగ్యులర్ గా ఎక్సర్ సైజు చేసిన బాడీ!
అయితే - అద్దంలో కనబడుతున్నది అంత ఆరోగ్యంగా వున్న శరీరం కాదు. హెవీ డ్రింకింగ్, క్రమశిక్షణ లేని జీవితం, చెయిన్ స్మోకింగ్...
వగైరా లక్షణాలన్నిటి వల్లా షేప్ లెస్ గా వున్న బాడీ...
బట్ స్టిల్...
అది తనే!
ఒక్కక్షణం కన్ ఫ్యూజన్ తర్వాత, సాహస్ మైండు క్లియర్ అయింది. పరిస్థితి అర్థం అయింది.
తన ఎదురుగుండా అద్దం లేదు.
ఉత్త ఫ్రేం మాత్రం వుంది.
అక్కడ కనబడుతున్నది తన ప్రతిబింబం కాదు!
అచ్చం తనలాగానే వున్న మరో మనిషి!
ఒక్క క్షణంలో తనని తాను అదుపులోకి తెచ్చుకున్నాడు సాహస్.
ఎదుట కనబడుతున్న మనిషి భుజం తట్టి, ప్రగతి వైపు తిరిగాడు.
"నైస్ గై" అన్నాడు చాలా మామూలుగా.
ఈసారి షాక్ అవడం ప్రగతి వంతయింది.
"ఈ ప్రపంచంలో అచ్చం నీలాంటి మనిషే ఇంకొకడు వున్నాడంటే ఆశ్చర్యంగా, భయంగా లేదా?" అంది.
చిన్నగా స్మైల్ చేశాడు సాహస్.
"ఈ  ప్రపంచంలో ప్రతి మనిషికీ, అతన్ని పోలిన వాళ్ళు కనీసం ఆరుమంది అయినా వుంటారని అంటారు. అదలా వుంచితే, మనుషులందరికీ పూర్వీకుడు ఒక్కడే అని ఇప్పుడు శాస్త్రజ్ఞుడు చెబుతున్నారు. విన్లేదా?" అన్నాడు.
ఇంటరెస్ట్ లేనట్లు బోర్ గా చూడాలని ప్రయత్నించింది ఆ అమ్మాయి.
కానీ -
తన మొహంలో కుతూహలం కనబడిపోతుంది.
"వాట్ నాన్సెన్స్ యూ ఆర్ టాకింగ్?" అంది తనకు సహజమైన రూడ్ నెస్ తో.
"ఐ విల్ ఎక్స్ ప్లెయిన్!" అన్నాడు సాహస్ తాపీగా. "అచ్చం నాలాంటి మనిషే ఇంకొకడు వుండడం షాకింగ్ కాదు! అసలు సిసలైన షాకింగ్ న్యూస్ ఏమిటంటే, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి మొగాడూ ప్రతి మొగాడికీ చుట్టమే అని ఈ మధ్యే తేలింది."
అతను చెప్పేది వింటుంటే, అద్దంలో ప్రతిబింబంగా నీలుక్కుపోయి నిలుచుని వున్న మనిషిలో కూడా చలనం వచ్చింది.
"అది ఎలా?" అన్నాడు.
"చెబుతాను! ఒక లక్షా తొంభైవేల సంవత్సరాల క్రితం ఒక పురుషుడు వుండేవాడు. ఇప్పుడున్న మొగవాళ్ళందరికీ అతనే పూర్వీకుడని సరికొత్త పరిశోధనలు చెబుతున్నాయి. అప్పట్లో అనేకమంది మొగవాళ్ళు వుండి వుండవచ్చును. కానీ కేవలం ఒక్క పురుషుడి సంతతి మాత్రమే ఇవాళ ఈ ప్రపంచంలో నిలిచి వుంది" అన్నాడు సాహస్.
"అది మనకెలా తెలుస్తుంది?" అంది ప్రగతి అప్రయత్నంగానే.
"ప్రతి మనిషిలోనూ జీన్స్ వుంటాయి. ఇరవై నాలుగు రకాల సూక్ష్మమైన దారాల వంటివి ఈ జీన్స్ ని పట్టుకుని వుంటాయి. 'వై' క్రోమోజోమ్ ఈ దారాల వంటి వాటిలో ఒకటి. తక్కిన క్రోమోజోమ్స్ లాగా కాకుండా, ఈ 'వై' క్రోమోజోమ్ కేవలం తండ్రినుంచి కొడుకికి మాత్రమే సంక్రమిస్తుంది.
శాస్త్రజ్ఞులు తమ పరిశోధనల్లో ఎనిమిది మంది నీగ్రోలని, ఇద్దరు ఆస్ట్రేలియన్ లనీ, ముగ్గురు జపనీయులని, ఇద్దరు యూరోపియన్ లనీ 'వై' క్రోమోజోమ్స్ తీసి పరిశీలించారు. తేలింది ఏమిటంటే, ఇప్పుడు బతికి వున్న పురుషులందరి 'వై' క్రోమోజోమ్స్ కూడా 1,88,000 సంవత్సరాల క్రితం బతికి వుండిన ఒక పురాతన పురుషుడి ద్వారా సంక్రమించినవే అని! అంటే ఏమిటి? ఇప్పుడున్న మొగాళ్ళంతా ఒకళ్ళకొకళ్ళు అన్నదమ్ములు! లేదా రక్త సంబంధీకులు అన్నమాట! ఇలా అని ఘంటారావంగా తేల్చి చెప్పింది యూనివర్శిటీ ఆఫ్ అరిజోనాకి చెందిన సైంటిస్టు మైకేల్ హోమర్. ఇప్పుడు చెప్పు! ఇప్పుడున్న మొగాళ్ళందరూ ఒకళ్ళకి ఒకళ్ళు ఇంత దగ్గరి చుట్టాలయినప్పుడు ఇతను నా పోలికతో వుండడంలో అబ్బురమేమిటి? వాట్ బ్రదర్?" అన్నాడు సాహస్ తన "ప్రతిబింబం" వైపు తిరిగి.
అచ్చం సాహస్ లాగే వున్న ఆ వ్యక్తి ఒక్క గుటక మింగి కళ్ళప్పగించి చూశాడు.
అతని భుజం మీద గట్టిగా చరిచి, పెద్దగ నవ్వి ప్రగతి వైపు తిరిగాడు సాహస్.
"ఈ విషయంలో ఇంకా వివరాలు కావాలంటే యేల్ యూనివర్శిటీకి సంబంధించిన రాబర్ట్ డోరిట్ ని అడగండి." అని ఆగి,


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS