Previous Page Next Page 
బ్రహ్మ ప్రళయం పేజి 10

"కమిషనర్...సర్...నాలాంటి మనిషి ఒకడు వుండడం నాకు షాకింగ్ న్యూస్ కాదు. కానీ, నేను చెప్పిన నిజాలు చాలామందికి షాకింగ్ న్యూసే! మనుషులందరూ ఒకటి కాదనీ, మనుషులంటే ముప్ఫయ్ మూడు వేల కులాలకి చెందిన వాళ్ళనీ, అగ్రకులాల వాళ్ళనీ, నిమ్న కులాల వాళ్ళనీ, హరిజనులూ, గిరిజనులూ అనీ, ఆర్యులనీ, ద్రావిడులనీ, తెలుగు వాళ్ళనీ, తమిళులనీ, పంజాబీలనీ, బెంగాలీలనీ, ఇండియన్స్ అనీ యూరోపియన్స్ అనీ, అమెరికన్స్ అనీ, ఆఫ్రికన్స్ అనీ, నల్లవాళ్ళనీ, తెల్లవాళ్ళనీ, పచ్చవాళ్ళనీ విభజించి పాలిద్దామనుకుంటారే - ఆ పిచ్చివాళ్ళకి ఇది షాకింగ్ న్యూస్!" అన్నాడు సాహస్ ఆవేశంగా.
నిజంగానే షాకయినట్లు చూస్తోంది ప్రగతి. 'ప్రతిబింబం' మార్కు మనిషి కూడా డిటో!
పైకి గబగబా అప్పచేప్పేస్తున్నట్టు మాట్లాడేస్తూ ఉన్నాడే గానీ, సాహస్ మెదడు అతి తీవ్రంగా ఆలోచిస్తోంది.
ఇక్కడ అచ్చం తనలాంటి మనిషే ఇంకోడు వున్నాడు.
అచ్చం తనలాగే అంటే...నూటికి నూరు శాతం కాదూ -
నూటికి డెబ్భయ్ వంతులు తనని పోలి వున్నాడు!
అతను కాస్త తనలాగే మారితే - లేదా, తను కాస్త అతనిలాగా మారితే - ఎక్కడో ఒక పాయింట్ దగ్గర-
ఇద్దరూ ఒకటే అని భ్రమ కలిగించవచ్చును.
కానీ -
ఇతను -
ఇక్కడ -
ఎందుకు?
వెంటనే ఒక విషయం గుర్తు వచ్చింది సాహస్ కి.
అది ఇరాకీ స్ట్రాంగ్ మాన్ అయిన సద్దాం హుస్సేన్ ముద్దుల కొడుకు ఉదయ్ గురించి!
ఉదయ్!
ద స్పాయిల్డ్ బ్రాట్!
సర్వ సాధారణంగా జరిగే లోకరీతీ నీతీ ఉదయ్ విషయంలో కూడా నిజం అయ్యాయి.
ఉదాహరణకి చెప్పుకోవాలంటే, అష్టకష్టాలు అనుభవించి, అనుభవం సంపాదించి, ప్రముఖ స్థానానికి వస్తాడు ఒక వ్యక్తి.
సహజంగానే అతనికి సంతానం వుంటుంది.
అసలు వాడికంటే, ఆ రెండో తరం వాళ్ళకి వుండే అహంభావం, అతిశయం, అధికార దర్పం అతి ఎక్కువగా వుంటాయి.
అందులోనూ రాజకీయాధికారం చేజిక్కించుకున్న వ్యక్తి తాలూకు సంతానానికయితే...
వాళ్ళ అహంకారానికి ఆకాశమే హద్దు!
ఇరాకీ స్ట్రాంగ్ మాన్ సద్దాం హుస్సేన్ కి కూడా ముద్దుల సంతానం వుంది. కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు!
సద్దాం హుస్సేన్ అల్లుడు మామగారి మీద తిరుగుబాటు చేసి, విజయం సాధించలేక, దేశం వదిలి పారిపోయాడు - పెళ్ళాం పిల్లలతో సహా.
ఇరాక్ లోనే -
సద్దాం హుస్సేన్ కొడుకు ఉదయ్, చాలా రఫ్ అండ్ టఫ్ మాన్! జులాయిగా పెరిగాడు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కన్నూ మిన్నూ కాననట్లు ప్రవర్తిస్తుంటాడు.
సహజంగానే అతనికి శతృవులు ఎక్కువ!
పబ్లిక్ ప్లేసెస్ లోకి వెళ్ళాలంటే భయం ఉదయ్ కి!
ఇదిలా వుండగా,
చిన్నప్పుడు ఉదయ్ కి ఒక క్లాస్ మేటు వుండేవాడు. అచ్చం ఉదయ్ లాగే వుండేవాడు.
చాలా సంవత్సరాలు గడిచి, ఇద్దరు మిత్రులూ పెద్దవాళ్ళయ్యాక, వాళ్ళ మధ్యదూరం పెరిగింది, స్నేహం తరిగింది.
కానీ ఒకరోజున -
హఠాత్తుగా మిలిటరీ వాళ్ళు ఆ బాల్యం నేస్తం దగ్గరికి వచ్చారు. "ఉదయ్ రమ్మంటున్నారు" అని బలవంతంగా లాక్కెళ్ళారు.
ఎందుకు లాక్కెళ్ళారూ?
ఉదయ్ కి "డబుల్" గా వుండడానికి!
తన ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండానే, ఉదయ్ కి "డబుల్"గా మారాల్సి వచ్చింది ఆ చిన్నప్పటి క్లాస్ మేట్ కి. వాళ్ళిద్దరికీ దగ్గరి పోలికలు వున్నాయేగానీ, నూటికి నూరు శాతం ఒకే రకంగా లేరు!
అందుకని -
ఆ ఫ్రెండ్ రూపాన్ని మార్చే ప్రయత్నాలు జరిగాయి. అతని సైకాలజీ మార్చే ప్రయత్నాలు జరిగాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS