పోతే-తుమ్మల్లో పొద్దు గూకినట్లుండే తమరి మొహంలో జన్మలో ఒక్కసారైనా ఒక్క చిరునవ్వు."
అంకుష్ చెంప ఛెళ్ళుమంది.
"ఐ విల్ కిల్ యూ!" అంది ప్రగతి ఆగ్రహంగా.
"అంతకంటే ఏం చెయ్యలేవ్!" అన్నాడు అంకుష్ నిరసనగా.
విస్మయంగా అంకుష్ వైపు చూస్తున్నాడు సాహస్.
ఎవరీ పిల్లాడు?
ఏమిటీ సాహసం?
ఎలాంటి పరిస్థితిలో వున్నారు తాము?
ఈ పిల్లగాడికేమీ అర్థం కావడం లేదు. అంతా ఆటగోటి తనంగా వుంది! నిజం!
అప్రయత్నంగా వాళ్ళిద్దరి చూపులూ కలుసుకున్నాయి. "జాగ్రత్త" అన్నట్లు కనుసైగ చేశాడు సాహస్.
"నాకేం ఢోకా లేదు!" అన్నట్లు నిర్లక్ష్యంగా నవ్వాడు ఆ పిల్లాడు - అంకుష్!
ప్రగతి మొహం వైపు చూశాడు సాహస్.
ఆమె మొహం కోపంతో వంకర్లు తిరిగిపోతోంది.
కోపం ఎంత అందమైన మొహాన్ని అయినా ఎంత అనాకారిగా మార్చెయ్యగలదో అర్థం అయింది సాహస్ కి.
ఈ అమ్మాయి కావడానికి ఆడపిల్లే!
కానీ పక్కా మగరాయుడు!
ఈ అమ్మాయి చీర కట్టుకుంటే ఆడతనం వస్తుందా?
ఆ అమ్మాయిని చీరెలో ఊహించుకోలేకపోయాడు సాహస్!
పోనీ మిడీస్ లో?
మాగ్జీస్ లో?
మినీ స్కర్టులలో -
చుడీదార్ లలో -
ఉహు!
ఊహకి అందట్లేదు!
ఆ అమ్మాయి పుట్టడంతోనే పోలీసు యూనిఫారంతో పుట్టినట్లుంది!
అందమైన ఆడపిల్లలకి ఎత్తయిన ఛాతీ ఆకర్షణ!
ఈ అమ్మాయికి తన ఛాతీకంటే, ఛాతీ మీద వున్న మెడల్సే ముఖ్యంలాగా వుంది!
యా! షీ ఈజ్ ఏ బార్న్ కాప్!
పోలీస్ కమిషనర్ ప్రగతి, పిల్లాడు అంకుష్ ని అంచనా వేస్తున్నట్లు చూసింది.
"నీ పని పడతాను వుండు!" అని అటూ ఇటూ చూసింది.
అక్కడే వుంది ఒక బోను -
అందులో వుంది ఒక పులి!
నిద్రపోతోంది ఆ పెద్దపులి!
ఒక్క జెర్కుతో పులిబోను తెరిచింది ప్రగతి. అంకుష్ ని అందులోకి నెట్టి, తలుపు వేసేసింది.
పులి ఒక్కసారి మగతగా కదిలి మళ్ళీ పడుకుంది.
"పెద్ద పులి... సెడేషన్ లో వుంది. తెలివిరాగానే ఈ తెలివి తక్కువ పిల్లాడి ప్రాణాలతో ఆడుకుంటుంది" అంది ప్రగతి నిర్దాక్షిణ్యంగా.
నిటారుగా నిలబడ్డాడు సాహస్.
"నౌ! లుక్..." అన్నాడు తర్జనితో బెదిరిస్తూ.
"పిల్లలతో ఆటలు పెద్దవాళ్ళకి అంత శోభని కలిగించవు! నేను వున్నాను...నాతో చెప్పు... ఏమిటిదంతా?"
"చెప్పను...చూపిస్తాను" అంది ప్రగతి.
"యాజ్ యు లైక్!" అన్నాడు సాహస్.
"షాకయిపోతావ్!"
నిర్లక్ష్యంగా భుజాలు ఎగరేశాడు సాహస్.
తన చుట్టూ ఒకసారి చూసింది ప్రగతి.
"ఓకే!" అంది అధికార పూర్వకంగా.
ఆ సంకేతాన్ని అర్థం చేసుకుని, అరక్షణంలో అదృశ్యమైపోయారు, ఆమె తాలూకు మనుషులంతా.
"నౌ యూ ఆర్ రియల్లీ ఇన్ ఫర్ ద షాక్ ఆఫ్ యువర్ లైఫ్!" అంది ప్రగతి అదోలా నవ్వుతూ.
అలా నవ్వుతూనే సాహస్ ని రూడ్ గా నెడుతూ ఒక అడ్డం దగ్గరికి తీసుకెళ్ళింది.
