Previous Page Next Page 
మంచివాడు పేజి 9


                                రైల్లో మిసెస్ కైలాసం


  మధ్యాహ్నం మూడు గంటల నుండి కుండపోతగా వర్షం కురుస్తోంది. బయట కాలు పెట్టాలంటే భయంగా వుంది. చల్లటి ఈదురుగాలి ఎముకల్ని కొరికేస్తుంది. ఎలాగో సగం తడిచి రైలు స్టేషను చేరుకున్నాను. బండి రెండు గంటల లేటు అని తెలిసి మహా కోపం వచ్చింది. ఎవరి మీదో తెలియదు. రైల్వే వాళ్ళను కాసేపు, మొత్తం ప్రభుత్వాన్ని మరికొంతసేపు తిట్టుకుంటూ వెయిటింగ్ రూంలో కూర్చున్నాను.
చాలా చిరాగ్గా వుంది. బద్ధకంగా వుంది. హాయిగా, వెచ్చగా దుప్పటి కప్పుకుని నిద్రపోవాలని వుంది. కాని అటువంటి అదృష్టం నాకు లేనందున నామీద నాకే విసుగనిపించింది. ప్రయాణం చెయ్యక తప్పదు.
తెల్లవారి పదిన్నరకల్లా ఇంటర్ వ్యూకు హాజరు కావాలి. ఎన్ని ఇంటర్ వ్యూలకు హాజరు కాలేదు ఈ ఐదు సంవత్సరాల్లో? అదో ఫార్స్. ఉద్యోగం ముందే ఎవరికి ఇవ్వాలో నిర్ణయం జరిగిపోతుంది. ఈ ఇంటర్వ్యూలంతా ఓ తంతు. ప్రశ్నలు వేస్తారే గాని సరిగ్గా సమాధానాలు కూడా వినరు.
రైలు కూత వినిపించి ఉలిక్కిపడి ఆలోచన నుంచి బయటపడ్డాను. ప్లాట్ ఫారం మీద కోలాహలం ఎక్కువయింది. నా సామాను తీసుకుని కూలీ హైదరాబాద్ కంపార్టుమెంటు వైపుకు పరుగెత్తు తున్నాడు. పరుగు లాంటి నడకతో అతన్ని అనుసరించాడు. ఒకరిద్దర్ని ఢీ కొని క్షమాపణ చెప్పుకుని ముందుకు వెళ్ళాను. కూలీ కన్పించడం లేదు. నాకు గాబరా వేసింది. హైదరాబాద్ కంపార్టుమెంటు కన్పించగానే ప్రాణం లేచి వచ్చింది. పెద్దగా తొక్కిసలాట లేదు. కాని జనం బాగానే తోసుకుంటున్నారు. ఎలాగో సీలు చేసుకుని డోర్ దగ్గర రాడ్ పట్టుకుని ఒక కాలు ఫుట్ బోర్డు మీద వేసి రెండో కాలు ఎత్తానో లేదో, ముక్కుకు ఎవరిదో మోచెయ్యి పొడుచుకుని కళ్ళ ముందు రంగు రంగుల నక్షత్రాలు గిర్రున తిరిగాయి. అంత బాధలోను ఒక చెవ్వు నుంచి తప్పుకున్న కళ్ళజోడు పడిపోకుండా పట్టుకున్నాను. అదృష్టం కొద్దీ అది కింద పడలేదు. అసలే ఈ సారైనా ఉద్యోగం వస్తుందో లేదోనని బెంగగా వుంది. చిన్నప్పటి నుంచి అలవాటైన కళ్ళజోడు లేకపోతే నా మొహం ఎలా వుంటుందో ఊహించుకోవడానికి నాకే భయంగా వుంటోంది. ఇంటర్వ్యూకు కళ్ళు చికిలిస్తూ వెళితే ఏం బావుంటుంది? కుడికాలు కంపార్టుమెంటులో పెట్టానో లేదో వీపుకు ఏదో గట్టిగా తగిలింది. ఒక్కసారిగా రైలుకు రెక్కలొచ్చి ఎగిరి పోతున్నట్టూ. దాని రెక్కలు పట్టుకుని నేను వేలాడుతున్నట్టూ అనిపించింది. విచ్చిపోతున్నట్టున్న నాడుల్ని కూడ దీసుకుని నిలదొక్కుకున్నాను.
ఓ యువతీ నన్ను తోసుకుంటూ ముందు కంపార్టుమెంటులోకి వెళ్ళింది. ఆమె చేతిలో చిన్న పెట్టె వుంది. నా వీపుకు తగిలిందేదో వెంటనే అర్థం అయింది. అమాంతం ఆమెను నమిలి మింగి జీర్ణించుకోవాలనిపించింది.
కాని వెంటనే నాకు నా సామాను సంగతి గుర్తుకు వచ్చింది. ముందుకు రెండు అడుగులు వేశానో లేదో నా సామాను తెచ్చిన కూలీ కన్పించి, సామాను సర్దిన చోటు చూపించాడు. కూలీకి డబ్బులిచ్చి ఇరుగ్గా వున్నా థర్డుక్లాసు బర్తు మీద ముసలి వాళ్ళ మధ్య ఇరుక్కుని కూర్చున్నాను.
"సరిగ్గా కూర్చో!"
నేను చివ్వున తలెత్తి ఎదురు బెర్తుమీద సరిగ్గా నా కెదురుగా కూర్చున్న ఆమెను చూశాను. ఆవిడే! ఎడంకాలు మీద కుడికాలు క్రాసుగా వేసుకుని, మేము ఇద్దరం కూర్చున్న సీటులో ఒక్కర్తే కూచుని పైగా పక్కావిడ్ని జరగమంటున్నది. ఆవిడ అన్న తీరూ, ఆ వేష భాషలూ, ఆ దర్పం చూసి, పాపం ఆమెకు కుడి పక్క కూర్చున్న పల్లె పడుచు భయపడి మరీ ముడుచుకు కూర్చుంది. ఎడం వైపు ఎవరూ లేరు. కిటికీ పక్కగా బాగా స్థలాన్ని ఆక్రమించుకుని కూర్చున్న ఆ యువతిని నేను పైనుంచి కిందకు చూశాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS