Previous Page Next Page 
మంచివాడు పేజి 8

ఎన్నికల తేదీ దగ్గిర పడుతున్నకొద్దీ ప్రచారం ముమ్మరంగా సాగిపోతూంది. శ్రీమతి శిఖండమ్మ వెళ్ళిన చోటల్లా మరో పార్టీ వాళ్లకు మంచినీళ్ళు కూడా పుట్టవనే నమ్మకం వుంది ఆ పార్టీ వాళ్ళకు. ఆఖరి క్షణాల్లో రామలింగంగారు అమాంతం ఓటర్లను కావలించుకొని ఆవురుమన్నారు. తమ పార్టీనీ, అభ్యర్థినీ కాకపోయినా తనను చూసైనా ఓటు వెయ్యమని వేడుకున్నాడు. ప్రేమ లేకపోయినా జాలి వల్లనైనా వెయ్యమన్నాడు. వేస్తానని వాగ్దానం చేసిందాకా పట్టుకున్న కాళ్ళు విడిస్తే వొట్టు.
ఆఖరిక్షణంలో భుజంగం గారికి ఆవేశం పెరిగిపోయింది. భూమ్మీద కాళ్ళానలేదు. ఎదటి పార్టీ వాళ్ళను నోటికొచ్చిన బండబూతులూ తిట్టారు.
శ్రీమతి శిఖండమ్మ నాయకత్వాన పాతికమంది మహిళలదాకా ఇంటింటికి వెళ్ళి ఆడంగులకు పళ్ళూ, పువ్వులూ, పసుపూ కుంకుమా ఇచ్చి ఓట్లు అడిగారు. ఆడవాళ్ళ ఓట్లన్నీ పడిపోతాయనే నమ్మకం కలిగింది. మిసెస్ కైలాసం ఏం చేసినా ఆడవాళ్లే చెయ్యాలి. వాళ్ళకున్న తెగింపు మొగవాళ్ళల్లో ఎక్కడుంది." అంటూ మురిసిపోయింది.
మహిళామణుల ప్రచార ధాటికి వోటర్ల తల ఊగిసలాడి పోయినై. బాలెట్ పెట్టెలు నిండిపోయినై. మిసెస్ కైలాసానికి విజయం తథ్యం అన్నారు. కనీసం పది వేలన్నా మెజారిటీ వుంటుందన్నారు లాబీ వర్గాలవారు.
ఆ రాత్రి అలసిపోయి మంచంమీద వాలిపోయిన మిసెస్ కైలాసానికి మనస్సు మాత్రం ఎంతో తేలిగ్గా ఆవేశంలో ఎగురుతున్నట్టనిపించింది. అలసటతో మూతలు పడి కళ్ళల్లో అసెంబ్లీ హాలు కనిపించసాగింది.
తన గొప్పతనాన్ని గుడ్డి ప్రభుత్వం గుర్తించలేకపోయింది. కాని ప్రజలు గుడ్డివాళ్ళు కారు! అందుకే వాళ్ళు గుర్తించారు. ఒకసారి తను బడ్జెట్ సెషన్ కు డైరెక్టర్ తో వెళ్లి గాలరీలో కూర్చుంది! కిందకు చూస్తూ. ఒక బెంచీ నుంచి మరో బెంచీకి వెళుతూ, వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెబుతూ తిరిగే ఆడ ఎం.ఎల్.ఏ. లు పైన కూర్చున్న తనకు మానస సరోవరంలో విహరించే హంసల్లా కన్పించారు. కొందరు బాతుల్లా నడుస్తున్నట్టనిపించింది. ఆనాడే తనకు అనిపించింది తను కూర్చోవలసినది గ్యాలరీలో కాదని కింద హాలులోననీ. తన గొప్పతనాన్ని తను ఏనాడో గ్రహించింది. కాని ఆలస్యంగా గుర్తించారు.
తన డైరెక్టరు తనను వింత మృగంలా చూసేవాడు. ఆ జానకి తలపొగరు అంతా ఇంతా కాదు. రేపు తను ఎం.ఎల్.ఏ. అవుతుంది. మినిష్టర్ కూడా అవుతుంది. సి.యం. అడిగి తను ప్రత్యేకంగా ఆ శాఖకి మినిష్టర్ అవుతుంది. అప్పుడు చూపిస్తుంది తన తడాఖా. లేకపోతే తనకు రివర్షన్ ఇప్పించి ఎన్.జీ.ఓ.ని చేస్తాడూ? టెస్టు పాసు కాలేదట తను. వెధవ టెస్టులు. అసలు తనలాంటి వాళ్ళకు ఎగ్జెంప్షన్ ఇప్పించాలి ఆ జానక్కి ప్రమోషన్ ఇచ్చి సీట్లో కూర్చోపెడతాడా?
తను ఎం.ఎల్.ఏ. అయ్యాక అంత సింపుల్ గా వుంటే లాభం లేదు. కొంచెం స్మార్టుగా వుండాలి. పట్టుచీరల్లో తను మరీ లావుగా పొట్టిగా కన్పిస్తుంది. సిల్కు చీరలు కావాలి. హైహీల్స్ వేసుకుంటే తను మరీ అంత పొట్టిగా కన్పించదు. అసెంబ్లీలో తను అలా అలా సరస్సులో బాతులా ఈదుతూ నడుస్తోంది. కలల్లో నుంచి నిద్రలోకి జారిపోయింది మిసెస్ కైలాసం.
"ఏమైనా ఈ ఎన్నికల రద్దీలో మిసెస్ కైలాసంగారికి డబ్బు బాగానే కరిగింది. దాదాపు వున్నదంతా వదిలిపోయినట్టే. కొంచెం బాధ కలిగినా... తీరా రంగంలో దిగాక డబ్బుకు వెనకా ముందూ చూసుకుంటే ఎలా? ఆవార తను గెలిచాక సంపాదించుకోలేకపోతుందా? మినిష్టరు కాకపోయినా హీన పక్షం డిప్యూటీ స్పీకర్ అయినా కాకపోతుందా? అనుకుంటూ తృప్తి పడింది.
ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. బయటకు వెళ్ళాలంటే పెద్ద చిక్కే వచ్చి పడింది. చీర మార్చుకుందామంటే మారు చీర మంచిది లేదు. అన్నీ విడిచేసి వున్నై. పెట్టెలో ఒక్కటీ లేదు. ఎలక్షన్స్ రద్దీలూ పూటకొక్కటి తొక్కేయడం జరిగింది. పట్టుచీరలన్నీ కారు దుమ్ములో ధ్వంసం అయినై. మహిళా ప్రచారకులంతా అందినంత వరకు కట్టిపారేశారు... దొరికినంత వరకు ఎత్తుకుపోయారు.
అప్పటికీ వాళ్ళకోసం ఎన్ని చీరలు కొన్నదీ? షావుకారు కొట్లో అప్పుచేసి తీసుకొంది. వాళ్ళందర్నీ మేపడానికి కాబూలీ వాలా దగ్గర అప్పుకూడా తీసుకుంది. ఎంత వెతికినా ఒక్కటీ మంచిచీర కన్పించలేదు. చిరాకు వేసింది మిసెస్ కైలాసానికి.
ఒక ప్రక్క వోట్ల లెక్కింపు జరిగిపోతుందేమో. ఈ ఒంటి చీరెతో ఎలా పోతుంది! తూ! పాడు! అంత దుమ్ము కొట్టుకొని నలిగిన చీరె కట్టుకొని ఎలా పోవడం? అందరూ తనను చూస్తూ "ఈమేనా? మిసెస్ కైలాసం, ఎం.ఎల్.ఏ.?" అంటే తనకే కాకుండా తన పార్టీకి ఎంత నామోషీ. పోనియ్ కొత్తది కొందామంటే డబ్బు లేదాయే! ఇప్పటికి చీరల బాపతు పద్దు చాలా పెద్దదే వుంది ఆ షాపులో.
మిసెస్ కైలాసంగారి మెదడులోకి మెరుపులా ఓ ఆలోచన వచ్చింది. సరాసరి బట్టల షాపులోకి వెళ్లి రెండు సిల్క్ చీరలు తీసింది. తొందర్లోనే తనకు డబ్బు వస్తుందనీ మొత్తం బాకీ ఒకేసారి తీరుస్తానని చెప్పింది. సంగతి అర్థం చేసుకున్న షావుకారు కిక్కురు మనకుండా ఇచ్చాడు. పాత బాకీతోపాటు కొత్తది కూడా రాబట్టుకోవాలనే ఆశతో.
సాయంకాలానికే ఫలితాలు తెలిశాయ్. మిసెస్ కైలాసానికి డిపాజిట్ గల్లంతు అయింది. అంటే మరీ అంత అన్యాయంగా రాలేదు. ఎలక్షన్ ముందు విత్ డ్రా చేసుకున్న అభ్యర్థికంటే ఏడు వోట్లు ఎక్కువే వచ్చినై.
ఆ వార్త విన్న మిసెస్ కైలాసానికి తల గిర్రున తిరిగి కైలాసంకేసి ఎగిరిపోతున్నట్టనిపించింది. ఏదో మైకం చుట్టేస్తోంది. కళ్ళముందు చిందర వందరగా నలిగి పడివున్న పట్టుచీరెల కుప్పా, పద్దు పుస్తకంలో బట్టలషాపు షావుకారు... కాబూలీ ... వాలా ... గిర్రున రంగులరాట్నంలా తిరుగుతున్నారు ఒకరి తర్వాత ఒకరు.
భారతదేశంలో ఈ సారి ఎన్నికల్లో మహిళల కిచ్చిన ప్రాతినిథ్యం ప్రపంచ చరిత్రలో అపూర్వం" రేడియోలో విన్పిస్తోంది.
మిసెస్ కైలాసం ఒక్క ఊపున వెళ్ళి రేడియో గొంతు నొక్కేసింది.
"వెధవ ప్రజలు ... మాబ్ ... మంద అదే గొర్రెల మంద ... ఎవరికి ఓటివ్వాలో తెలియని గొర్రెల మంద. ఈ మంద ఎప్పటికి మారుతుందో! ఈ దేశం ఎప్పటికి బాగుపడుతుందో!" పళ్ళు నూరబోయి నాలిక కరుచుకొని "అబ్బా!" అన్నది మిసెస్ కైలాసం.
ఎం. ఎల్.ఏ. గా పోటీచేసి ఓడిపోయిన మిసెస్ కైలాసం ఏమయిందీ ఎక్కడుందీ తెలుసుకొని మరొకసారి చెబుతాను.

                                                  **    **    **


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS