అసలు వయసు చెప్పడం కష్టమే. గిట్టని వాళ్లయితే నలభై దాటాయి అనొచ్చు. కాని నాకు మాత్రం 30-35కు మధ్య వుంటుందనిపించింది. వేషం మాత్రం ఇరవై ఐదు లోపు వయస్సు గల నవయువతిలా వేసుకుంది.
ఇంతలో నల్లగా పోత పోసిన విగ్రహంలా వున్న ఓ కార్మిక యువతీ మాసిన చీరతో వచ్చి నిల్చుంది. ఇద్దరు కూర్చునే చోటుకు ఆక్రమించుకుని కూర్చున్న ఆమెను కొంచెం జరగమని అడిగింది. ఆమె తనను కానట్టు నిర్లక్ష్యంగా ముఖం తిప్పుకుని కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది.
"ఏవమ్మోయ్ నీకే చెప్పేది అసంట జరుగు" అంటూ దాదాపు ఆమె ఒళ్ళో కూర్చున్నట్టే కూర్చుంది జబర్దస్తీగా. ఆవిడ ముందు ఉలిక్కిపడి, ముఖం చిట్లించుకుని జరిగి కూర్చుని ఆ స్త్రీని కొరకొరా పైనుంచి కిందకు చూడసాగింది.
కొంగా, సన్యాసి కథ గుర్తొచ్చి నాకు నవ్వొచ్చింది.
"అనాగరిక జంతువులు, మురికి మనుషులు" అంది దురుసుగా ఆమె.
"ఏటమ్మాయ్ మహా పేలుతున్నావ్!" ఆ స్త్రీ మళ్ళీ నోరెత్తు తంతాను అన్నట్టు అన్నది. దాంతో ఆమె బిక్కచచ్చిపోయి నా వంక చూసింది కోపంగా.
"అదేమిటి" మధ్యలో నేనేం చేశాను?" అనాలనిపించింది. వస్తున్న నవ్వును పెదవుల మధ్య బంధించి ఆమె ముఖంలోకి చూశాను. ఆమె నన్ను ఆపాదమస్తకం కదిలించకుండానే నా పేగులు లెక్కపెట్టేలా చూస్తూంది. కాని నేను ఆవలించినా ఆవిడ నా పేగులు లెక్కపెట్టలేదని ఆమె ముఖమే చెబుతోంది.
ఇంకా నొప్పి పెడుతున్న ముక్కూ, వీపూ, రైలు ఎక్కేప్పుడు ఆవిడ చూసిన సభ్యత, నాగరికతల్ని గుర్తు చేశాయి.
ఆవిడ తన సీట్లో ఇబ్బందిగా కదిలింది. ముఖం గంభీరంగా పెట్టి, తను అసలు థర్డు క్లాసులో ప్రయాణం చేయవలసిన వ్యక్తి కాదన్నట్టు కూర్చుంది.
నేను చూసి చూడనట్టు ఆమెను గమనిస్తున్నాను. ఆవిడ హ్యాండ్ బ్యాగ్ తెరిచి పెన్, డైరీ బయటకు తీసి ఏదో నోట్ చేసుకుని మళ్ళీ బ్యాగ్ లో పెట్టి నాకేసి చూసింది. అదంతా నేను చూడాలనీ, తను మామూలు మనిషి కాదని నిరూపించుకోవాలనీ పడే అవస్థ అని ఇట్టే అర్థం అయింది నాకు. అందుకే ఆమెను చూడనట్టే, ఎదురుగా కూర్చున్న అందరిలో ఆమెకు నాతో మాట్లాడాలని వుంది. తనను పరిచయం చేసుకోవాలని వుంది. తను ఈ థర్డు క్లాసు మనిషి కాదని నా ముందు నిరూపించు కోవాలని వుంది. నేనే ముందు ఆమెను పలకరించాలని కూడా వుంది. కొందరి భావాలు ఇట్టే తెలిసిపోతాయి వాళ్ళు చెప్పకుండానే. వాళ్ళ ప్రతి కదలికా వాళ్ళను పరిచయం చేస్తాయి. నేను అవతల మనిషి ఆవలించకుండానే పేగులు లెక్కపెట్ట గలనని ఆమెకు తెలియదు పాపం. అందుకే నేను మరీ బెట్టుగా, నిర్లక్ష్యంగా కూర్చున్నాను.
"ఎందాక వెళుతున్నావ్?" సన్నాయి నొక్కులు నొక్కుతూ వినిపించింది.
ఆ ఏకవచన ప్రయోగానికి ఉలిక్కిపడ్డాను. మళ్ళీ నన్ను కాదేమోలే అనుకున్నాను.
"నిన్నే అడుగుతూంట!"
నాకు వళ్ళు మండిపోయింది. ఆవిడ కంఠంలో అహంకారం, ముఖంలో గర్వం చూస్తూ వుంటే ఆవిడ సంగతేమిటో తెలుసుకోవాలనిపించింది.
"హైదరాబాద్! నువ్వు!" అన్నాను అంతకంటే గట్టిగా ఒక్కొక్క శబ్దాన్నే నొక్కుతూ.
ఆవిడకు మాత్రం నా ఏకవచన ప్రయోగము బాగానే గుచ్చుకుంది నేను అనుకున్నట్టే.
"హైదరాబాద్." అంది ముఖం కొంచెం ప్రక్కకు తిప్పుకొని. నేను వెళ్ళే హయిదరాబాద్ నువ్వు రావడం ఏమిటి అన్నట్టుంది ఆవిడ ధోరణి.
"హయిదరాబాదులో ఏం చేస్తున్నావూ?" సాగదీసింది.
