Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 9


    ఒక అద్భుతమైన విశ్లేషణని నిశ్శబ్దంగా వింటున్నాడు శశాంక.


    "ఈ ప్రపంచంలో వున్న నిస్సహాయుల్ని అందర్నీ ఆదుకునే శక్తి లేదు నాకు... కాని నిన్ను మాత్రమే ఆదుకోవాలనిపించింది... గురిచూసి కాల్చాలన్న నీ ఉక్రోషానికి, నిన్ను దహించి వేస్తున్న ఆలోచనలకి నిర్మాణాత్మకమైన ఓ లక్ష్యాన్ని ఏర్పరచాలని నీకిష్టమైన ఘూటింగ్ లో నిన్ను నిష్ణాతుడ్ని చేసాను... ఎదుగుతున్న నిన్ను చూస్తూ ఎంత సంబరపడిపోయాను అంటే దేశ రక్షణే ధ్యేయం గల ఒక సైనికాధికారిగా నీలో అంతర్గతంగా వున్న శక్తిని పోజిటివ్ గా ప్రపంచానికి పరిచయం చేయాలని ఇంత శ్రమపడ్డాను... శశాంకా... నా ఆలోచనలకి సహకరించింది నా లక్ష్యమొక్కటే కాదు. నిన్ను బాల్యం నుంచే ఇష్టపడిన ఒక్కగానొక్క కూతురైన నా కృప కూడా... నిజానికి నీకు కాదీ పరీక్ష. పన్నెండు సంవత్సరాల నా సుదీర్ఘమైన తపస్సుకి... నువ్వు నా ఇంట్లో ఎలా అడుగుపెట్టినా, ఆ తర్వాత నాకు అల్లుడివైనా నా ప్రయత్నంలో నేను గెలిచానూ అన్న సంతృప్తి దక్కించాలీ అంటే అక్కడ గురి తప్పినందుకు పడ్డ బాధను గుర్తుచేసుకుంటే ఇక్కడ తప్పని నీ గురితో గుర్తింపు పొందాలి... అర్ధమైందనుకుంటాను."


    కారు అప్పటికే పోటీలు నిర్వహించబడుతున్న కంటోన్ మెంటు ప్రాంతానికి వచ్చింది.


    తనకోసం అంట శ్రమపడిన రాజమణి మాటలు నీతి శతకంలా కాక వేదంలా, రమ్య వాదాల్లా అతడి మనసుకు హత్తుకుపోయాయి.


    చెప్పింది చేయడమే తప్ప మాటలతో తన ఆలోచనల్ని కాని, కృతజ్ఞతను కాని వ్యక్తం చేయడం తెలీని శశాంక ఎంత దీక్షగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలనుకుంటున్నదీ రాజమణి సైతం వూహించి వుండడు...


    నిజానికిది పరీక్ష కాదు...


    మనసు మెలిపెట్టే ఎమోషన్స్ కి చిత్తశుద్ధితో ఏర్పాటు చేయబడిన అవుట్ రిట్.


    ఒక అనాథగా యాత్ర మొదలుపెట్టినా అసాధారణమైన ప్రజ్ఞను ప్రదర్శించి తన సాధనకి తిరుగులేని ఫలితాన్నందించడమే తను చెల్లించగల గురుదక్షిణ...


    అప్పుడు టైం పది గంటలు కావస్తూంది.


    పోటీలో పాల్గొంటున్న వ్యక్తులవైపు చూశాడు శశాంక. వయసులో అందరూ తనకన్నా పెద్దవాళ్ళే. అనుభవంలో సైతం తనకన్నా నిష్ణాతులెందరో వుండి వుంటారన్న ఆలోచన అతడ్ని కొద్దిగా జలదరింప జేసింది.


    మరో మూడు రోజుల్లో జాతీయ స్థాయిలో నిర్వహించబడే పోటీకి ఇది మొదటి ఘట్టం...


    ఇక్కడ నెగ్గిన వాళ్ళతోపాటు వెస్ట్ జోన్ నుంచి జాతీయస్థాయిలోకి వచ్చిన వాళ్ళలో చివరిపోటీ వుంటుంది. అక్కడ వరుసక్రమంలో మంచి మార్కుల స్కోర్ చేసిన మొదటి ముగ్గురూ అంతర్జాతీయ పోటీలకి పంపబడతారు.


    పోలెండ్ లో జరిగే అంతర్జాతీయ షూటింగ్ పోటీలకి గాని, చెకొస్లావేకియా ప్లాసెన్ లో నిర్వహించబడే "గ్రాండ్ ప్రీ ఫ్లాసెన్ ఒలింపిక్ ఈవెంట్స్ కి" గాని, రుమేనియా రాజధాని బుకారిస్ట్ లో మరో నెల రోజుల్లో జరగబోయే "ట్రెడిషనల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ షూటింగ్" పోటీలకుగాని, స్విజర్లాండు జూరిక్ లో మే ముప్పై ఒకటి నుంచి జూన్ ఆరు వరకు ఏర్పాటు చేయబడిన "8 వ అంతర్జాతీయ షూటింగ్ మ్యాచ్ వీక్" గ్గాని క్వాలిఫై కావాలీ అంటే రెండు మెట్లు అధిరోహించాలి.


    ఒకటి ఇక్కడ ప్రిలిమినరీస్ లో.


    రెండోది జాతీయ స్థాయిలో.


    ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి మరో అయిదు నిముషాలలో.


    మైక్ లో తన పేరు అనౌన్స్ చేయగానే శశాంక భయమో లేక చావు బ్రతుకుల సమస్యను పరిష్కరించే ఓ "ఎరీనా" లో అడుగు పెడుతున్న అనుభూతితో కొద్దిగా వణికాడు.


    వెళుతూ యధాపాలంగా గురువు, దైవం అన్నీ అయిన రాజమణి కేసి చూసినపుడు అతడు కళ్ళతోనే అందించిన ఆశీస్సులు శశాంక ఎన్నటికీ మరచిపోలేనివి.


    విశాలమైన గ్రౌండ్ లో సుమారు ముప్పై అయిదు మీటర్ల దూరంలో టార్గెట్స్ నిలబడి వున్నాయి.


    అంగుళం పొడవు, అంగుళం వెడల్పుతో టార్గెట్ మధ్యలో నల్లగా కనిపిస్తున్న "బుల్" అతడి చిరకాల తపస్సు ఈ క్షణంని పరీక్షించే కేంద్రంలా వుంది.


    బుల్ పైన "మేగ్" పై "ఇన్నర్" గా నిర్దేశిస్తూ గీయబడిన రెండు వృత్తాలూ సమాధిలోకి జారే ఒక రుషి దాటాల్సిన రెండు దశల్నీ సూచిస్తున్నాయి.


    0 38 పిస్టలు అందించారు శశాంకకి...


    ముప్పై అయిదు మీటర్ల రేంజ్ లో వున్న టార్గెట్ ల్ ఆరు రౌండ్లు కాల్చినపుడు తూటాలు ఏర్పరచిన రంధ్రాల మధ్య దూరం రంధ్రాలేర్పడిన ప్రదేశం షూటర్ శక్తికి కొలబద్దలుగా మారతాయి.


    వరుసలో నిలబడ్డ పార్టిసిపెంట్స్ ఎవరికి వారు టార్గెట్స్ వేపు ఏకాగ్రతగా దృష్టి సారిస్తున్న సమయంలో షూటింగ్ ప్రారంభానికి అనుకూలంగా సంకేతం ఇవ్వబడింది... 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS