సమీపంలో తూటాలు దూసుకుపోతున్న చప్పుడు...
అదీ వినబడింది లిప్తపాటే...
ఆ తర్వాత శశాంక అసంకల్పితంగా ఒక ధ్యానంలోకి జారిపోయాడు.
ముందుకు చాచిన అతడి చేయిప్పుడు లోహంతో చేయబడినట్టు దృఢంగా మారింది.
ఈ క్షణం కోసమే పన్నెండు సంవత్సరాలుగా ఎదురుచూసి అలసినట్టు అతడి వూపిరి గడ్డకట్టుకు పోయింది.
మెదడు నుంచి చేతివేళ్ళకు సామగానంలా సాగిపోతున్న సంకేతాలు.
అతడు శిల అయ్యాడు. స్థాణువుగా మారేడు...
నిశ్శబ్దం చుట్టూ...
ఒంటరిగా శూన్యంలో ఒక లక్ష్యం కోసం పరిశ్రమిస్తున్నట్టు అతడి కుడికన్ను అరమోడ్పుగా మూసుకుంది.
అక్కడొక ఆర్తనాదం నిస్సహాయంగా, అస్పష్టంగా...
మనసు పొరల్ని తూట్లు చేసే దీనాలాపన, పూపిరందని ఓంకారంలా.
ఒక నీటి బొట్టు కనుకొలకుల్లోకి జారింది.
ట్రిగ్గర్ నొక్కాడు...
ఆ బాష్ప బిందువు చెంపవరకూ దొర్లింది.
మళ్ళీ ట్రిగ్గర్ నొక్కాడు.
ఆగని అశ్రువు పెదవి అంచుదాకా పరుగెత్తి శక్తి ఉడిగినట్టు ఆగిపోయింది.
మరో తూటా...
కన్నీరు ఆవిరైంది... పిస్టలు ఖాళీ అయిపోయింది. పోటీ ముగిసింది. అతడింకా తేరుకోలేదు.
అలాగే నిలబడి వున్న శశాంక భుజంపై ఓచేయి పడడంతోపాటు "కంగ్రాట్స్" అన్న అభినందన వినిపించింది.
తల తిప్పి చూసేడు.
అతడికి చాలా చేరువయి రాజమణి నిలబడి వున్నాడు విజయ గర్వంతో. రాజమణి అంచనా తప్పు కాలేదు.
ప్రిలిమినరీస్ లోనే శశాంక సాధించినది సామాన్యమైనది కాదు. 'బుల్' లో కేవలం చదరపు అంగుళం వైశాల్యంలో ఆరు రౌండ్లనీ కాల్చిన శశాంక ఇక్కడికి మొదటివాడిగా మాత్రమే రాలేదు.సుమారు అయిదు సంవత్సరాల క్రితం రాజా మాన్ సింగ్ జాతీయస్థాయిలో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు.
ఆ విషయం అతడ్ని పత్రికా విలేఖరు చుట్టుముట్టే వరకు గుర్తించలేదు.
గుర్తించగానే శశాంక రాజమణి పాదాల్ని తాకేడు ముందుగా.
అందులో భేషజం లేదు. అతడి జీవిత గతిని మార్చిన ఒక దేవుడికి వినమ్రంగా అందజేసిన ప్రణామం తప్ప.
* * *
"హౌ నైస్ ఇటీజ్..." తండ్రిని పసిపిల్లలా పెనవేసుకుంది కృప. రాజమణి ఆనందాన్ని దాచుకోలేక పోతున్నాడు. అసలు ఈ మధ్య కాలంలో అతడింతగా ఆనందపడిన క్షణాలు లేవు.
అతడి కళ్ళలో ఎంతటి సంతృప్తి మెరుస్తూందీ అంటే ప్రపంచం గర్వించతగ్గ కొడుకును కన్న తండ్రి కూడా అంతగా ఉత్సాహపడడు. యుద్ధంలో ఒకనాడు శతృవుల వ్యూహాన్ని ఛేదించి ఒక బెటాలియన్ ప్రాణాలు కాపాడినపుడు కూడా అతడింతలా గర్వపడలేదు. ఒకప్పటి అనాధ. ఇప్పుడు తన అల్లుడు. రేపటి నుంచి అంతర్జాతీయ పోటీలకు భారతదేశపు ప్రతినిధి. తుది ఘట్టం ఇంకా వుందని తెలుసుకాని పూర్తిగా అదీ అధిగమించగలడన్న నమ్మకం ఏర్పడిపోయింది.
నిశ్శబ్దంగా నిలబడ్డ భర్తనే క్రీగంట గమనిస్తుందామె.
ఆ సమయంలో తాను వారి కడ్డం కాకూడదని గ్రహించిన రాజమణి "బేబీ నేను క్లబ్ కి వెళ్తున్నాను" హడావుడిగా వెళ్ళబోతుంటే "డాడీ కాఫీ" అంది.
కూతురి చెవిలో అన్నాడు "అయామ్ సో హ్యాపీ... హూ కేర్స్ కాఫీ నౌ..."
"ఓహ్... డాడీ"
"టేక్ కేరాఫ్ హిమ్" ఆప్యాయంగా కృప తల నిమురుతూ "యు నో ఐ హేవ్ సఫిషియంట్లీ టేకెన్ కేరాఫ్ హిమ్" అనేసి హుషారుగా బయటికి వెళ్ళిపోయాడు.
"స్ల్పెండిడ్" అలసటగా వున్న శశాంక భుజాలపై చేతులు వేస్తూ అంది "అయామ్ ఓవర్ జోయ్డ్... డిలైటెడ్... ఇంకా... ఏమనాలబ్బా..."
శశాంక పెదవులపై అదే నవ్వు విడీ విడనట్టుగా...
"అవును... ఏంటీ మూడీగా వున్నారు... నేను రాలేదని కోపం కదూ!"
తల అడ్డంగా వూపేడు.
"సో... ఇప్పుడు అసలు కారణాన్ని మీకు తెలియ పరచాను" అంటూ బెడ్ రూందాకా లాక్కుపోయింది. "ఎందుకంటే పెద్ద మీరేనేంటి నేనూ గుడ్ న్యూస్ చెప్పగలను"
గదిలోకి అడుగుపెట్టగానే లైటు వేసింది.
బడలికగా బెడ్ పై ఒదిగిన శశాంక సమీపంలో కూర్చుని అతని కళ్ళలోకే చూస్తూ వుండిపోయింది ఉదయం డాక్టర్ తను ప్రెగ్నెంట్ అని చెప్పాక మనసు మనసులో లేదు.
సాయంత్రందాకా ఎలా గడిపిందో ఆమెకు గుర్తుకు రాలేదు.
"చూడండి హీరోగారూ... మిమ్మల్ని కొన్ని అద్భుతమైన ప్రశ్నలు అడుగుతున్నాను. ఆలోచించి చెప్పాలి. పెళ్ళయిన ఆడది ఎప్పుడు ఎక్కువ ఆనందపడుతుంది?"
