Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 8


    "గాడ్..." నవ్వేశాడు తను చేసిన పొరపాటు గమనించగానే.


    "మీ బనీను విషయంలో గాడేమీ గైడెన్సు యివ్వరు" అంటూ తనే బలవంతంగా బనీను చేతుల్తో తీసేస్తుంటే ఆమెను దగ్గరగా లాక్కున్నాడు.


    ఏళ్ళ తరబడి వ్యాయామంతో రాటుదేలిన అతడి వక్షస్థలంపై గువ్వలా ఒదిగిపోతూనే "ఏంటిది" అంది చిరుకోపంతో.


    "గాడెస్... గాడ్ అన్నానుగా... పొరపాటు సరిదిద్దుకుంటున్నాను."


    "సంతోషించాం... ముందు వదలండి"


    తల అడ్డంగా వూపేడు.


    "మహానుభావా! అవతల డాడీ వెయిట్ చేస్తున్నారు. అసలు...."


    ఆమె పెదవులు అలసిపోవడం ఇష్టం లేనట్టు తల వంచి అల్లరిగా లాక్ చేసేసాడు.


    సింతసైజర్ గా మారిన ఆమె శరీరం రాగాలను రాసులుగా పోసి మనసుకందిస్తే మూగదైన గొంతు "వక" అంటూ పల్లవిని పెదవుల దిగువనే దాచేసింది.


    అభ్యంగన స్నానం చేసిన ఆమె కురులు వారి ఆధరాల సంగమానికి తెరగా మారి వెలుగు కిరణాల కళ్ళు మూసేసాయి.


    ఆమె చేతులు బిగుసుకున్నాయి. కాని తెచ్చి పెట్టుకున్న కోపంతో ముఖాన్ని దూరంగా జరుపుతూంది.


    వదలిపెట్టేసాను మరోసారి హారన్ వినిపించగానే.


    "మరీ అల్లరెక్కువవుతుంది" కళ్ళలో చెదరని అనురాగపు నీడలు ఆమె చెక్కిళ్ళపై ప్రతిఫలిస్తుంటే పోతపోసిన శిల్పంలా వున్న శశాంకని రెప్పవాల్చకుండా చూసింది.


    "యేడవక, ఇది అల్లరి కాదు" బనీను మార్చుకుని వైట్ పోలిస్టర్ షర్టు టక్ చేసుకుంటూ అన్నాడు "సైకోథెరపీ"


    "ఇంత హఠాత్తుగా ఎందుకో"


    "తోడు రమ్మంటేనే అన్నందుకు" అల్లరిగా నవ్వుతూనే.


    "ఈ విధంగా తప్ప నిన్ను మూడ్ లోకి రప్పించే అవకాశం లేదని అనిపించినందుకు" అన్నాడు.


    ఆ క్షణంలో ఆమెకు ఒకనాడు ఎగ్జిబిషన్ షూటింగ్ స్టాల్ దగ్గర అమాయకంగా నిలబడి బెలూన్స్ ని గురితప్పకుండా షూట్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరచిన ఓ అబ్బాయి గుర్తుకొచ్చాడు. "నాకు నమ్మకముంది. నేను తోడులేకపోయినా మీరు సాధించగలరు."


    ఏ దృశ్యం కదిలిందో, ఏ స్మృతి మెదిలిందో క్షణకాలంలో గంభీరంగా మారిపోయాడు "నా సాధనలో ఎప్పుడూ తోడున్నావు కృపా."


    "ఇప్పుడూ వున్నాను... మీకు తోడుగా ఎప్పుడూ వుంటాను. మీమీదొట్టు!" అతన్ని సమీపించి ఆకతాయిగా అతడి చెంపల్ని పట్టుకుని ఏం జరుగుతున్నదీ అతడు గుర్తించేలోగానే ముద్దు పెట్టేసింది. "ఇప్పటికీ మోతాదు చాలు. మిగతాది రాత్రికి మీరొచ్చాక చూసుకుందాం...మాటాడకుండా నడవండి... నో రిగ్రెట్స్... గుడ్ న్యూస్ తో మీరు తిరిగొస్తే, వుంటే నేనూ ఏదన్నా గుడ్ న్యూస్ చెబుతా" అంటూ అతడ్ని బలవంతంగా బయటకు లాక్కొచ్చింది.


    డ్రైవింగ్ సీటులో తండ్రి పక్కన కూర్చున్న శశాంకని చూస్తూ


    "గుడ్ లక్... బై" అంది.


    కృపతో మాటాడేటప్పుడు చాలావరకూ బుద్ధిమంతుడైన బాలుడిలా నిలబడడమే అలవాటైన శశాంక


    "వుంటే నేనూ ఏదన్నా గుడ్ న్యూస్ చెబుతా" అన్న మాటలో అంతరార్ధాన్ని గుర్తించలేకపోయాడు.


    నిజానికి భర్తకు తోడుగా వెళ్లాలని ఉదయం వరకూ అనుకుంది కృప...


    కాని ఎనిమిది గంటల ప్రాంతంలో కళ్ళు తిరిగినట్టయింది. ఆ తర్వాత వాంతి చేసుకుంది.


    అప్పుడే అనుకుంది డాక్టరు దగ్గరకు వెళ్లాలని...


    శశాంక గుడ్ న్యూస్ చెబుతాడన్న నమ్మకం ఆమెకుంది. వీలైతే అతను తిరిగి వచ్చేసరికి తనూ గుడ్ న్యూస్ చెప్పాలన్న ఉత్కంఠే ఆమెను నొక్కిపట్టి ఇంటి దగ్గర వుండిపోయేట్టు ఆపింది.


                                                     *    *    *    *


    "నీతో మనసువిప్పి మాట్టాడ్డానికి ఇంతకన్నా మంచి సమయం మరోటి వస్తుందని నేననుకోను శశాంకా!


    పన్నెండు సంవత్సరాల క్రితం చాలా కాకతాళీయంగా కలిసావు నువ్వు. అప్పుడే గుర్తించాను నీలో వున్న జీల్ ని మాత్రమే కాదు నీకు తెలియకుండా నీలో రగులుతున్న ఒక అగ్ని పర్వతాన్ని కూడా...


    నిస్సహాయతలో మిగిలిన నిన్నలాగే వదిలేస్తే నువ్వు ఓ కలుపు మొక్కగా మారిపోతావన్న భయంకన్నా ప్రపంచంపై పెంచుకున్న పగతో పెద్ద క్రిమినల్ గా మారతావన్న ఆలోచన కూడా నన్ను గట్టిగా కుదిపింది. అందుకే నాతో తీసుకొచ్చాను..." కారు నడుపుతూనే చెప్పుకుపోతున్నాడు రాజమణి.


    నెమ్మదిగా తలతిప్పి చూసిన శశాంక గంభీరంగా ఒక స్వప్నంలోలా మాటాడుతున్న రాజామణి చూపుల్లో తను గొప్ప పని చేసానన్న ఆలోచనకన్నా ఒక మంచి పని చేయడంలో పొందిన సంతృప్తే ద్యోతకమౌతుంది.


    "నీ కథ విన్న నాకు అనిపించిందొక్కటే... నీ తల్లి మరణం కన్నా తప్పిన గురి నిన్ను ఎక్కువ క్షోభకు గురిచేసింది. అది నీ చూపుల్లో సైతం స్పష్టంగా అర్ధమైపోయింది. ఈ ప్రపంచంలో నేర ప్రవృత్తికి అలవాటు పడిన ప్రతిమనిషికీ ఇలాంటి ఒక కథ వుంటుందని తెలిసినా నీ కథ ప్రపంచానికే అమితమైన హాని కలిగించే మలుపు తిరగబోతూందని బోధపడింది. ఎగ్జిబిషన్ లో నువ్వు చూపిన నేర్పుని గుర్తించినపుడు నిజానికి నువ్వు అక్కడ గురిపెట్టి కాలుస్తున్నది బెలూన్స్ ని కాదు... నీ నిస్సహాయతని, దానికి కారణమైన ప్రపంచాన్ని. అది నీ గమ్యం కాకూడదని నిరూపించడమే నా లక్ష్యంగా మార్చుకున్నాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS