Previous Page Next Page 
డెత్ సెంటెన్స్ పేజి 9

   
    ఆపరేషన్ అయిదు గంటల్ని మింగేసింది!

 

    మృత్యువు సిగ్గుతో తలదించుకు వెళ్ళిపోయింది.

 

    థియేటర్ నుండి బయటికొచ్చాడు శరత్ చంద్ర! రోగి ప్రాణానికేం భయంలేదన్న సంతృప్తి అతని మొహంలో కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది!

 

    చకచకా మెట్లెక్కి పై అంతస్థులోని జీవన్ గదివైపు అడుగులేశాడు. కొడుకును చూడాలన్న ధ్యాస తప్ప లిఫ్ట్ వాడొచ్చన్న ఆలోచన కూడా రాలేదు.

 

    శరత్ చంద్ర ని చూసి చేతిలో మ్యాగజైన్ తో లేచి నిలబడింది రవళి.

 

    నీలిమలో ఏ కదలికా - ఆమె మొహంలో ఏ భావమూ లేదు.

 

    "మీరింకా ఇక్కడే ఉన్నారా రవళీ?" అని కృతజ్ఞత నిండిన గొంతుతో అంటూ వడివడిగా వచ్చి కొడుకువైపే చూసుకొంటూ అదే మంచంమ్మీద కూర్చున్నాడు. డీప్ స్లీప్ లో ఉన్నాడు జీవన్?

 

    పసివాడు పడిన బాధని నిద్రలో కూడా వెల్లడిస్తోందతని మొహం.

 

    'దెబ్బలెంత బాధపెట్టాయో.... ఎంత భయపడిపోయాడో....' ఆత్మీయంగా తడిమి తడిమి చూసుకుంటూ.

 

    "సారీ నీలూ! నేను రాలేకపోయాను. చాలా భయపడి పోయావు కదూ!" అదే ఆప్యాయతతో భార్యతో అన్నాడు.

 

    "ఆ...ఆ" అంది.

 

    అక్కడ రవళి వుండటం యిబ్బందిగా వుంది ఆమెకి.

 

    "థాంక్స్ రవళీ! నేను లేకపోయినా అన్నీ జరిపించారు. థాంక్స్ ఎలాట్" అన్నాడు రవళిని చూస్తూ.

 

    "నేనేం చేశాను సార్! జస్ట్ ప్రక్కన ఉన్నాను. అంతా కృపాకర్ గారే చేశారు" చెప్పింది.

 

    "ఆయనెక్కడ ఉన్నారు? అని మరుక్షణంలోనే గుర్తొచ్చినట్లు "ఓ... ఆయన వెళ్ళిపోయారని చెప్పారు కదూ" అన్నాడు.

 

    "అవున్సార్" అంది.

 

    "ఓహో... నేనిక్కడుండగానే ఇద్దరూ ఫోన్ లలో మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట! నాతో ఒక్కమాట మాట్లాడనివాడు...." అనుకొంటూనే ఉడికిపోయింది నీలిమ.

 

    "మీరెలా వెళతారు ఇంటికి? నేను డ్రాప్ చేస్తాను" అన్నాడు రవళిని.

 

    "ఇవాళ నైట్ డ్యూటీ నాదేసార్. ఇంటికి వెళ్ళడం లేదు" చెప్పి ఇద్దరి దగ్గరా సెలవు తీసుకుంది. మరోసారి థాంక్స్ చెప్పాడు శరత్ చంద్ర.

 

    "జీవూ బాగా ఏడ్చాడా నీలూ?" రవళి వెళ్ళగానే నీలిమ ప్రక్కకొస్తూ అడిగాడు.

 

    "ఇప్పటికి కనిపించామా మేం?" కోపంతో తన్నుకొచ్చిందామాట.

 

    "ఏమిటి నీలూ నేనేం చేయగలను చెప్పు"

 

    "ఏమీ చెయ్యలేవు. మా కోసం నువ్వేం చెయ్యక్కరలేదు. మాకన్నా రోడ్డుమీద అనాదలు నయం" ఆ అర్ధరాత్రి నిశ్శబ్దంలో ఆమె గొంతు ప్రతిధ్వనించింది.

 

    ఎవరయినా వింటే బావుండదని వెంటనే గది తలుపులు మూశాడు.

 

    "నీలూ.... అక్కడ నేను పేషెంట్ ని వదిలివస్తే అతను చనిపోతాడు."

 

    "ఇక్కడ మేం చచ్చినా నీకేం ఫర్వాలేదు"

 

    "అవేం మాటలు నీలిమా?"

 

    "వాడెలా వున్నాడో అని చూడటానికి కూడా తీరదా నీకు?"

 

    "ఈ వృత్తి అలాంటిది. నీకు తెలీనిదేముంది?"

 

    "కష్టంలో ఉన్న మా దగ్గర నిలబడటానికి కూడా రానివ్వనంత గొప్పదా నీ వృత్తి? నిన్ను మానుండి దూరం చేస్తున్నది నీ వృత్తేనా... మరేదయినానా?" అరుస్తోంది నీలిమ.

 

    "నీలిమా ప్లీజ్! ఇంటికెళ్ళి మాట్లాడుకొందాం! ఇక్కడేం వద్దు అంటూనే జీవన్ ని భుజంమ్మీద పడుకోబెట్టుకొని, తలుపు తీసుకొని బయటపడి కారిడార్ లోంచి కారు పార్కింగ్ వైపు నడిచాడు.

 

    గత్యంతరం లేక పాపని ఎత్తుకొని అతన్ననుసరించింది నీలిమ. మరో మూడు నిమిషాల్లో కారు హాస్పిటల్ ఆవరణ వదిలి రోడ్డెక్కి ఇంటివేపు దూసుకుపోయింది.

 

    దారిలో వాళ్ళేం మాట్లాడుకోలేదు. నీలిమ మనసు మాత్రం భగ్గున మండిపోతోంది.

 

    కారు ఇల్లు చేరింది. పనిమనిషి ఇంటికి తాళం వేసి పక్కఫ్లాట్లో ఇచ్చి వెళ్ళినట్లుంది.

 

    తన దగ్గరున్న డూప్లికేట్ తాళంతో తలుపు తెరిచింది. కారు గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ లో ఆపి పిల్లలిద్దర్నీ ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టాడు.

 

    "అసలెలా జరిగింది యాక్సిడెంట్?" బట్టలు మార్చుకొంటూ అడిగాడు.

 

    "స్కూటర్ గుద్దేసింది" శరత్ చంద్రనే గుద్దసినంత స్పీడ్ గా చెప్పింది.

 

    "నేను రాలేదని నీకు చాలా కోపం వచ్చినట్లుంది" సంజాయిషీగా అన్నాడు.

 

    "నువ్వెందుకొస్తావ్? నీకు ఇప్పుడు మేమెందుకు కనిపిస్తాం?" విసురుగా మంచంమీది దుప్పటి దులుపుతూ అంది.

 

    "అంటే?"

 

    "ఏమీ తెలియనట్లు నటించకు శరత్ చంద్రా! నువ్విప్పుడు ఇదివరకటి నా శరత్ చంద్ర వి కాదు" బాంబులా పేలిందామె.

 

    "రవళీ! నువ్వేం మాట్లాడుతున్నావ్?"

 

    "అదే.... అదే....ఎవరా రవళి? ఎందుకలా కలవరిస్తున్నావ్ చెప్పు?" దులుపుతున్న దుప్పటి వదిలి, ఊహించని వేగంతో అడుగు ముందుకువేసి రెండు చేతులతో అతని షర్ట్ పట్టుకొని బలంగా ఊపేస్తూ అడిగింది.

 

    "మైగాడ్! షి ఈజ్ జస్ట్ మై అసిస్టెంట్, దట్సాల్ నీలూ!" తనని కుదిపేస్తున్న ఆమె రెండు చేతుల్నీ గట్టిగా పట్టుకుంటూ అన్నాడు.

 

    "ఓ....వ్! అసిస్టెంట్ కాబట్టేనా అంత కలవరిస్తున్నావ్?" నిప్పులు చెరుగుతున్నట్లు అతని మొహంలోకి చూస్తూ అడిగింది.

 

    "రోజంతా పిలిచీ.... పిలిచీ.... అలా వచ్చేసింది. అంతే నీలిమా! నన్ను నమ్ము" ఆమె చేతులలాగే పట్టుకొని అభ్యర్ధిస్తున్నట్లు అన్నాడు.

 

    అనుకోని అభండానికి అతని మొహం పేలవంగా మారిపోయింది.

 

    అతని చేతుల్లోంచి తన చేతులు విసురుగా లాగేసుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS