Previous Page Next Page 
డెత్ సెంటెన్స్ పేజి 8


    అలా అనుకున్నందుకు ఆమె మనసు మూలిగింది. మరుక్షణం వేడెక్కింది.

 

    ఈ మధ్య శరత్ చంద్ర 'నీలిమా' అనటానికి బదులు 'రవళీ' అని తరుచుగా పిలుస్తున్నాడు.

 

    "అయితే డాడీ రావడం లేదా?" దుఋఖమూ, కోపమూ మిళితమై జీవన్ గొంతు ఆమెనీ లోకంలోకి తెచ్చింది.

 

    "వచ్చేస్తారన్నయ్యా" అమ్మని ఆనుకొని నిలబడి ముద్దుగా అంటున్నమువ్వని నిశితంగా అప్పుడే చూసింది రవళి.

 

    'అంతా సార్ పోలికే' అనుకుంది. అలా అనుకోవడంలో ఎంతో ఇష్టం కలిగింది.

 

    "రావడం కుదరలేదు బాబూ! నీకేం భయంలేదు. అన్ని ఏర్పాట్లూ నేను చూసుకుంటానుగా!" జీవన్ చెయ్యందుకొని మృదువుగా నొక్కుతూ అనునయంగా చెప్పింది రవళి.

 

    'ఏర్పాట్లు మేం చేసుకోలేకనా? ఈ పరిస్థితులలో కూడా కొడుకుపక్కన నిలబడలేని తండ్రి ఎందుకూ?' కోపంగా అనుకుంది నీలిమ.

 

    జీవన్ కి మాత్రం రవళి మాటలు వినిపించలేదు.

 

    'డాడీ రాడు, నాకోసం ఎక్కడికీ రాడు. ఆఖరికి నేను చచ్చిపోతున్నానని చెప్పినా రానే రాడు....' అనుకున్నాడు.

 

    అతనికి ఎవరిమీదో తెలీని కసి కలిగింది. ఆకుల చాటున ఒదిగివున్న పుచ్చుపిందని తుంపి విసిరేస్తున్నట్లూ, తనంటే ఎవరికీ లక్ష్యం లేనట్లూ ఫీలయ్యాడు'

 

    మనసంతా పిండేసినట్లయి - దుఃఖం పొంగుకొచ్చింది. మనసు బరువునంతా బయటికి మోసుకొచ్చిన కన్నీరు భారంగా చెంపమీదనుండి జారుతుండగా.... డాక్టర్ కృపాకర్ ఆ గదిలో కొచ్చాడు. కళ్ళనీళ్ళతో వున్న జీవన్ ని చూస్తూనే -

 

    'వ్వాట్ మైబాయ్? వీపింగ్.... నో నో నో! యు ఆర్ ద సన్ ఆఫ్ బ్రేవ్ శరత్ చంద్రా! మీ డాడీలా ఏ పరిస్థితులకీ జంకకూడదు! యూ విల్ బి ఆల్ రైట్ డియర్! నేనున్నాను కదా!" అంటూ కన్నీళ్ళు తుడిచి వీపు చరుస్తూ అన్నాడు.

 

    జీవన్ మాట్లాడలేదు. మరో అయిదు నిమిషాల్లో స్ట్రెచర్ మీద థియేటర్ కి మార్చబడ్డాడు. నీలిమనీ, మువ్వనీ కృపాకర్ తన ప్రైవేట్ రూములో కూర్చోబెట్టి తనూ థియేటర్ లోకి వెళ్ళిపోయాడు.

 

    తన దుఃఖం, కోపం తీరకముందే జీవన్ మత్తులోకి వెళ్ళిపోయాడు. రవళి జీవన్ దగ్గరికీ నీలిమ దగ్గరికీ తిరుగుతూ ఆమెకి ధైర్యం చెపుతూ, మధ్యమధ్యలో ఫోనుద్వారా విషయాలు ఎప్పటికప్పుడు శరత్ చంద్రకీ అందజేస్తోంది!

 

    అన్నీ జరుగుతుండగానే కంట్లో కనుమాయగా కాలచక్రం రెండు గంటల్ని మింగేసింది!

 

    మత్తులో ఉండగానే కాలు ఎముక సరిచేసి కట్టువేయడం జరిగిపోయింది జీవన్ కి. గదిలోకి తీసుకొచ్చి పడుకోబెట్టాడు జీవన్ ని. అతనింకా మత్తులోనే ఉన్నాడు.

 

    "ఎలా ఉంది డాక్టర్!!" కొడుకును చూస్తూనే ప్రక్కనే ఉన్నకృపాకర్ ని ఆత్రుతగా అడిగింది నీలిమ.

 

    "బాగుందమ్మా! ఏం కంగారులేదు. ఆరువారాల్లో ఎముక అతుక్కుపోతుంది." అన్నారాయన.

 

    "థాంక్యూ వెరీ మచ్ డాక్టర్! ఫాదర్ కూడా దగ్గర లేకుండా అన్నీ చేశారు"

 

    "ఇవన్నీ మామూలే కదమ్మా! పైగా శరత్ చంద్ర నా కొలీగ్. ఒకరినొకరం ఈ మాత్రం చేయలేకపోతే ఎలాగ?" అని రవళివైపు తిరిగి...

 

    "డాక్టర్! శరత్ చంద్ర వచ్చేవరకూ మీరు చూసుకుంటారు కదా! నేను వెళ్ళాల్సివుంది" అన్నాడు.

 

    "నేనుంటాను సార్! మీరు వెళ్ళండి!" అంది రవళి.

 

    మత్తులో వున్న జీవన్ వైపోసారి చూసి ఇద్దరి దగ్గరా శెలవు తీసుకుని వెళ్ళిపోయాడు కృపాకర్.

 

    టైమ్ రాత్రి తొమ్మిది కావస్తోంది! ఏమీ తినకుండా మువ్వ నిద్రపోతోంది. పిల్లలకోసం ఫ్లాస్క్ నిండా పాలు, తనకీ నీలిమకీ టిఫినూ హోటల్ నుండి తెప్పించింది రవళి. జీవన్ కింకా మత్తు వీడలేదు మువ్వకి నిద్రలోనే పాలు త్రాగించింది నీలిమ.

 

    వద్దు వద్దంటున్నా నీలిమ చేత టిఫిన్ తినిపించింది రవళి. ఇద్దరూ ఎక్కువ మాట్లాడుకోలేదు. ఏమడిగినా నీలిమ పొడిపొడిగా సమాధానం చెబుతుండటంతో రవళి ఏం మాట్లాడలేకపోయింది. ఇంత చేస్తున్నా కనీసం థాంక్స్ చెప్పకపోవడం కూడా కొత్తగా ఉంది రవళికి.

 

    టైమ్ పదకొండు కావస్తోంది!

 

    వార్డుల్లో సందడి తగ్గింది. పగటిపూట జనంతో రద్దీగా ఉండే కారిడార్స్ విశ్రాంతి తీసుకుంటున్నాయి.

 

    గదిలో జీవన్ దగ్గర కుర్చీలో కూర్చుని మ్యాగజైన్ తిరగేస్తోంది రవళి. కొడుకు మంచాన్ని ఆనుకుని కుర్చీలో కూర్చుని ఉంది నీలిమ.

 

    'ఇంతవరకూ రానేలేదు ఈయన! కొడుకు ఎలా ఉన్నాడని కూడా ధ్యాసలేదు. కనీసం.... కనీసం... తనతోనయినా ఫోనులో మాట్లాడలేదు. భార్యగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు సరే.... కొడుకంటే కూడా లక్ష్యం లేదా?

 

    వాడు 'డాడీ....డాడీ' అని గుండెలవిసేలా ఏడ్చాడే.... మనిషేనా.... ఈయన? తామేం మణులూ మాణిక్యాలూ కోరడంలేదే!

 

    రవళి అట.... రవళి! తనకి బదులుగా పంపించేంత ఆత్మీయురాలయిపోయిందా ఈవిడ? 'ఛీఛీ' మనసు మండిపోతుండగా అనుకుంది. రకరకాల ఆలోచనలు తలని బరువెక్కిస్తున్నాయి.


                                             *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS