"నువ్వింకేం కథలు చెప్పకు. నీ కొడుక్కి యాక్సిడెంట్ అయితే నీ బదులుగా నీ స్థానంలో నిలబడే స్థాయికి ఎదిగిపోయిందా నీ అసిస్టెంట్?"
"నీలూ! నా మాట విను! నా జీవితంలో మరో స్త్రీ లేదు" అతని మాట నూతిలోంచి వస్తున్నట్లుగా స్థిరంగా ఉంది.
"లేకపోతే.... లేకపోతే.... నేనంటే నీకున్న ప్రేమంతా ఏమయిపోయింది? నేనొక్కపూట కనబడకపోతే తహతహలాడిపోయేవాడివి! ఆ ప్రేమంతా.... ఆ ప్రేమంతా.... ఎక్కడికి పోయింది?" ఏడుపు ఆపుకోలేక పోయింది నీలిమ.
వణుకుతున్న గొంతులోంచి దుఃఖం పొంగుకొచ్చింది.
ఆ దుఃఖపు జీర అతని హృదయాన్ని చుట్టలుగా చుట్టి పిండేసినట్లయింది.
"నీలూ.... ప్లీజ్!" అంటూ ఆమె తలమీద చెయ్యివేసి దగ్గరగా హత్తుకోబోయాడు.
అతని చేతిని విసిరికొట్టి దూరంగా జరిగింది.
"నన్ను ముట్టుకోకు!" పుట్టలకొద్దీ అసహ్యం కట్టలు తెగినట్లు అరిచింది.
"నీలూ.... హార్ట్ సర్జరీ తప్ప నాకింకెవరూ లేరు. నామాట...." అన్నాడు.
"స్టాపిట్ ఐసే! నాకింకేం చెప్పడానికి ప్రయత్నించకు" అంటూ అక్కడనుండి చరచరా వెళ్ళిపోయింది.
ఊహించని పరిణామానికి ఖంగుతిన్నాడు శరత్ చంద్ర.
ఆ రాత్రి ఇద్దరికీ భోజనం, నిద్రా రెండూ లేవు. కదిపితే కరిచేట్లు ఉంది నీలిమ.
పిల్లలిద్దరూ పడుకున్న డబుల్ కాట్స్ మీద కూతురి ప్రక్కన ఒదిగి పడుకుంది ఆమె! కొడుకు ప్రక్కనే కుర్చీవేసుకుని కూర్చుని ఉన్నాడతను.
అతని మనసూ, శరీరమూ తీవ్రంగా అలసిపోయి వున్నాయి! అయినా అతనికి నిద్రరావడం లేదు. నీలిమ అన్న మాటలతో మనసు అంతా కలతబారి పోయింది. నిద్రలేని కళ్ళు మండిపోతున్నాయి. తెల్లవారుజామైంది.
సగం పైగా క్షీణించిపోయిన చంద్రుడి వెలుగు పల్చని తెల్ల సిల్క్ ఓణీలా కిటికీలోంచి జీవన్ మీద వాలుతోంది!
నిద్రపోతున్న కొడుకు ముఖంలోకి చూశాడు. వడలిన పిందెలా ఉంది. అతనికెందుకో కొద్ది క్షణాలు అయోమయంగా తోచింది. భార్య వేసిన నిందతో మొద్దుబారిన మెదడు ఇంకా తేరుకోలేదు.
కొడుకుని చూస్తున్న కొద్దీ క్రమక్రమంగా.... హృదయం జాలితో నిండిపోయింది.
మంచంమీదికి వంగి బుగ్గమీద ముద్దిచ్చాడు. నిద్రలో వాడు కొద్దిగా కదిలాడు.
"ఆకలేస్తుందేమో....!" అనుకొని లేచి వంటగదిలోకెళ్ళి లైటు వేసాడు. నిద్రాభంగం కలిగిన ఒక బొద్దింక స్టవ్ క్రిందనుండి బయటికొచ్చి 'ఎవరక్కడ?' అన్నట్లు చూసి వెనక్కి వెళ్ళిపోయింది.
ఫ్రిజ్ లో పాలు వేడిచేసి గ్లాసులో పోసుకొచ్చాడు. నిద్రాభంగం కాకుండా జీవన్ తలని కొద్దిగా పైకెత్తి, గ్లాసు నోటిదగ్గర వుంచాడు. వాడి చెవి దగ్గర నోరుంచి-
"జీవూ..... నీకు ఆకలేస్తుంది కదూ! పాలుతాగమ్మా" అని వాడికొక్కడికే వినబడేటట్లు రెండుసార్లు అన్నాడు.
అంతే.... హిప్నటిక్ సజషన్ లాగా గ్లాసులోని పాలు అన్నీ గటగట తాగేశాడు.
కానీ తండ్రి తనాకలి తీర్చిన విషయం నిద్రిస్తున్న అతని మెదడులో రికార్డు కాలేదు.
తెల్లవార్లూ కొడుకు పక్కనే కూర్చుండిపోయాడు శరత్ చంద్ర. తూరుపు తన నల్లని మొహానికి పౌడర్ అద్దుకుంటుండగా కునుకు పట్టింది. మళ్ళీ మెలకువ వచ్చేసరికి ఏడున్నర కావస్తోంది.
నీలిమ అప్పటికే వంటగదిలోకి వెళ్ళిపోయింది. పిల్లలింకా నిద్ర లేవలేదు.
ఆ రోజంతా ఇంట్లోనే వుండి జీవూ అవసరాలు చూడాలని వుంది. కానీ హాస్పిటల్ కి వెళ్ళక తప్పదు. నెలరోజులకు సరిపడా ఆపరేషన్ కేసులు వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి.
ముఖ్యంగా రాత్రి ఆపరేషన్ చేసిన కేసు ఎలా వున్నాడో చూడాలి!
తల బరువుగా ఉంది! కళ్ళు మంటలుగా ఉన్నాయి. తప్పదు అన్నట్లు కుర్చీలోంచి లేచాడు. వంగి కొడుకుని మరొక్కసారి ముద్దాడి బాత్ రూమ్ వేపు అడుగులేశాడు.
మరో గంటలో తయారయిపోయాడు. జీవన్ మందులన్నీ సర్ది వంటగదిలోకెళ్ళి చెప్పాడు నీలిమతో.
"నేను హాస్పిటల్ కి వెళుతున్నాను. తప్పడంలేదు. జీవూ మందులు టేబుల్ మీద వుంచాను" ఒక్క నిమిషం ఆగి మళ్ళీ అన్నాడు.
"నీలూ! నిన్ను, పిల్లల్నీ అన్యాయం చెయ్యాలని నాకే కోశానా లేదు. నన్నర్ధం చేసుకో!"
ఆ మాటలకి వేరే అర్ధం తోచింది నీలిమకి అంటే - మాకన్యాయం చేయకుండా అన్నీ సమకూరుస్తూనే.... తన అవసరాలు తీర్చుకుంటాడన్నమాట. చివ్వున తలెత్తి కొరకొరా చూసింది. మళ్ళీ యుద్ధం మొదలయితే పిల్లలెక్కడ లేచి వింటారో అని పరుగులాంటి నడకతో బయటపడి.... వేగంగా మెట్లు దిగి కారెక్కాడు.
"ఎంత నిర్లక్ష్యం?" అనుకొంది నీలిమ. కోపం బుసబుస పొంగింది.
* * * *
హాస్పిటల్లో కారు దిగుతూనే ఆర్ధోపెడిక్ డిపార్ట్ మెంట్ వైపు నడిచాడు. ముందుగా కృపాకర్ ని తనకి చేసిన సహాయానికి కృతజ్ఞత తెలుపుకోవలసి ఉంది!
అప్పుడే తన గదిలోకొస్తూ కనిపించాడు కృపాకర్?
"థాంక్యూ వెరీమచ్ కృపాకర్! నిన్న మా వాణ్ణి పూర్తిగా వదిలేశాను. ట్రబులిచ్చానేమో?" చేయి కలుపుతూ అన్నాడు శరత్ చంద్ర.
"నో ట్రబుల్! నథింగ్! మనకీ మనకీ థ్యాంక్సేమిటి? మీ కేసు బావుందా?" తేలికగా అన్నాడాయన.
ఎప్పుడెవరు పుటుక్కుమంటారో తెలీని డిపార్ట్ మెంట్ శరత్ చంద్రదని ఆయనకి తెలుసు! "ఇప్పుడు వెళ్ళి చూడాలి!" అన్నాడు శరత్.
"మీ వాడి ఎక్స్ రేస్ చూడండి! కమాన్!" అంటూ శరత్ ని లోపలికి తీసికెళ్ళి జీవన్ ఎక్స్ రేస్ చూపించాడు.
మోకాలి క్రింది భాగంలో విరిగి ప్రక్కకు జరిగిన రెండు ఎముకలూ కట్టువేసిన తర్వాత యధాస్థానంలోకి వెళ్ళిపోయి కన్పిస్తున్నాయి ఎక్స్ రే లలో.
"రిడక్షన్ చాలా బాగా వచ్చింది కృపాకర్!" సంతృప్తిగా అన్నాడు. అతని మాటల్లోని మెచ్చుకోలుకి కృపాకర్ మొహంలోకి కూడా తృప్తి తొంగిచూసింది.
మరోసారి ఆయనకి థాంక్స్ చెప్పుకొని రికవరీ రూమ్ వైపు కదిలాడు. ఆత్రి ఆపరేషన్ చేసిన రోగి మెల్లగా కోలుకొంటున్నాడు. అతని పేరు చలపతిరావు. ఛాతీ చుట్టుప్రక్కల శరీరభాగాలనుండి వేళ్ళాడుతున్న ట్యూబులతో, ఆక్సిజన్, మానిటర్ మొదలయిన వాటితో ఉన్నట్యూబు కనెక్షన్ లతో తన చుట్టూ అల్లుకున్న గూటి మధ్యలో సురక్షితంగా నిద్రిస్తున్న సాలెపురుగులా ఉన్నాడతను.
