Previous Page Next Page 
అనైతికం పేజి 9


    నాకెందుకో వదిన బాగా నచ్చింది. భార్యగా- ఆమెని ఇంటికి తీసుకురాబోయే ముందు అన్నయ్య- నన్నూ, అమ్మనీ, నాన్ననీ కూర్చోబెట్టి తను పెళ్ళి చేసుకోబోతున్న సంగతి చెప్పినప్పుడు- తనంత 'స్టుపిడ్' మరొకడు వుండడనిపించింది. నాన్న స్థాణువయ్యారు. అమ్మ శోకాలు పెట్టింది... "పెళ్ళీ పెటాకులూ లేకుండా ఎవడితోనో రెండేళ్ళు కాపురం చేసినదాన్ని చేసుకుంటావుట్రా. నేను ఏ నూతిలోనో పడి చస్తాను" అని గుండెలు కొట్టుకుంది.

 

    "ఇదంతా చెప్పమని తనే అన్నదమ్మా. తనని కొన్నాళ్ళు గమనించు. నేనెందుకు చేసుకున్నానో నీకే తెలుస్తుంది" క్లుప్తంగా అన్నాడు అన్నయ్య. వారంరోజులపాటు నిరాహార దీక్షలూ, సత్యాగ్రహాలు జరిగినా చలించలేదు. ఆ విధంగా జరిగింది వాళ్ళపెళ్ళి...

 

    "నా సంగతికేంగానీ, నువ్వు చెప్పు. ఎలా వుంది నీ సంసారం...." అని అడిగాను.

 

    "మీ అన్నయ్య సంగతి నీకు తెలుసుగా. ప్రపంచంలోని అతి కొద్దిమంది మంచివాళ్ళలో ఒకరు" అంది వదిన.

 

    ఆ తన్మయత్వంలోని సిన్సియారిటీని గుర్తించగలిగాను. "...నేను అడుగుతోంది అమ్మ గురించి" అన్నాను.

 

    "పెద్ద గొడవలేమీ లేవు" అంది క్లుప్తంగా. నేనూ మా అత్తయ్య సినిమా ప్రహసనపు ఆయాసం గురించి చెప్పాను. అంతా విని వదిన ఒక్కక్షణం మౌనంగా ఊరుకుని, "అంత ఆయాసంగా వున్నది నాతో అంతసేపు ఎలా మాట్లాడిందీ" అని అడిగింది. నిజమే. నాకూ తట్టలేదు ఆ విషయం. అంతలో ఆమే తిరిగి అంది - "వీధి చివరున్న మెడికల్ షాప్ దగ్గర తనని దింపి, వెనక్కి వచ్చి నిన్ను సినిమాకి తీసుకెళ్ళటం ఏమిటి? ఆయాసంతో, తిరిగి నడిచి వస్తుందా? ఇదంతా మీ నుంచి జాలిని 'పర్చేజ్' చేసే ప్రయత్నం..."

 

    ... వదినా వాళ్ళు వెళ్ళిపోయాక కూడా ఈ ఆలోచన్లు నన్ను వదల్లేదు. అయితే నేను ఆలోచించింది మా అత్తగారి గురించి కాదు. నా ఆడపడుచు గురించి! ఎవరయినా ఆ అమ్మాయిని 'నీ అభిరుచులు ఏమిటి?' అని అడిగితే రెండే చెపుతుందనుకుంటాను. "మాట్లాడటం... వినటం..." అని.

 

    బాతాఖానీ వేయడం తన రొటీన్. అయితే ఆ అమ్మాయి చదువు గురించో, కెరియర్ గురించో మాట్లాడగా నేను చూడలేదు. లేటెస్ట్ ఫ్యాషన్, సినిమాలు, షాపింగ్ ఆ అమ్మాయి హాట్ టాపిక్స్. అదంతా చిన్నతనమూ, బాధ్యతారాహిత్యమూ తప్ప మరీ ప్రమాదకరంగా నాకేం తోచలేదు. నిజానికి అలాంటి అమ్మాయిలే ఎక్కువగా వుంటారీ రోజుల్లో అని నాకు తెలుసు.

 

    కాని మా అత్తగారు పొరపాటున కూడా కూతుర్ని పిల్చి ఏ పనీ చెప్పకపోవడం నా కాశ్చర్యం కలిగించేది. పైగా ఆ అమ్మాయి తోటి అమ్మాయిలతో కలిసి మాట్లాడే మాటలు విని నవ్వుతూ, "ఏంటో ఈ కాలం పిల్లలే అంత... ఒకటే అల్లరి" అని ముద్దుగా విసుక్కోవడం నాకు చిత్రంగా తోచేది. పైగా కూతురి స్నేహితులకి బాధ్యతగా కాఫీలు, టిఫిన్లు అందించేది.

 

    మా ఇంట్లో ఇళా వుండేది కాదు. నాకూ, మా అన్నయ్య క్కూడా అతి తక్కువ ఫ్రెండ్స్ సర్కిల్ వుండేది. అవసరమైతే తప్ప ఎప్పుడూ స్నేహితులు మా ఇంటికి వచ్చేవారు కాదు. గంటలు తరబడి గేట్ల దగ్గిరా, నాలుగురోడ్ల కూడలిలో మాట్లాడటం అన్నయ్య కస్సలు అలవాటు లేదు. మా మాటలు కూడా సాధారణంగా ఫలానా కోర్స్, ఫలానా ఉద్యోగం గురించి సాగేవి. ఎప్పుడో తప్ప సినిమాలు, ఫ్యాషన్స్ మా టాపిక్స్ అయ్యేవికాదు. నేనెవరితోనైనా ఇలాంటి పోచికోలు కబుర్లాడాలనుకుంటే మా అమ్మ ఎప్పటికీ ఒప్పుకుని వుండేది కాదని నాకు ఖచ్చితంగా తెల్సు. ఒక్కతే ఆడపిల్లను కదా అని గారాబం చెయ్యలేదు.

 

    ప్రేమగా చూడడం వేరు. గారాబంగా చూడడం వేరు. పనీ పాట రెగ్యులర్ గా చెయ్యకపోయినా కనీసం ఎలా చెయ్యాలో తెలిసే స్థితిలో నన్నుంచింది.

 

    నా ఆడపడుచుకి ప్రొద్దున్నే తొమ్మిదిన్నరకి క్లాసు. ఎనిమిదిన్నరకి నిద్ర లేచేది. అప్పటికే మా అత్తగారు స్నానం, పూజ ముగించుకుని వంటకి సిద్ధపడేది. నేను పైపై పనులు చేసేదాన్ని. మా ఆడపడుచు మాత్రం తీరిగ్గా తొమ్మిదింటికి తయారయి, తిండి దగ్గర తల్లిని హడావుడి పెట్టేది. "... అసలే క్లాసుకి లేటయి నేనేడుస్తూంటే, వంట ఆలస్యంగా చేశావు" అని అరుస్తూంటే ఆ అత్తగారు 'తొందరగా నిద్రలేచి తెములు మరి' అని తిట్టాల్సిందిపోయి, "అయ్యో! బిడ్డ సగం కడుపుతో వెళ్ళిపోతోందే" అని అల్లల్లాడుతూంటే నేను ప్రేక్షకురాలినే అయ్యేదాన్ని.

 

    ఎందుకో ఆ పద్ధతి సరైనది కాదనిపించింది నాకు. అసలా వయసులో ముసలావిడ ఒళ్ళు హూనం చేసుకుంటూంటే- సాయపడాల్సింది పోయి ఆ అమ్మాయి దౌర్జన్యంగా పనులు జరిపించుకోవడం నాకు నచ్చలేదు. ఇంచుమించు నా వయసుదే కాబట్టి నచ్చచెప్పుకోవచ్చు అనుకున్నాను. అది నేను చేసిన మొదటి తప్పు.

 

                                 *    *    *

 

    మా ఇంటికి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే వుంటారు. బంధువులనీ, స్నేహితులనీ, ఇరుగుపొరుగువాళ్ళు, ఆఫీసువాళ్ళు ఏ సమయంలోనైనా చెప్పాపెట్టకుండా వచ్చేస్తూ వుంటారు. ఏ వేళలో వచ్చినా, కాఫీ, టిఫిన్లు అందించాల్సిందే. ఆడవాళ్ళకయితే పండూ, తాంబూలం ఇప్పించకుండా పంపేదికాదు నా అత్తగారు. సాధారణంగా నా తోడికోడలితోనో, ఆవిడ సమయానికి అందుబాటులో లేకపోతే నాతోనో బొట్టూ, తాంబూలం ఇప్పించేది. బంధువులయితే, అలా వచ్చి, అది తమ స్వంత ఇల్లు అన్నట్లు కొద్దిరోజులపాటు వుండిపోయేవారు. అదే ఊళ్ళో వున్న కొందరు పొద్దున్న వచ్చి, సాయంత్రం వరకూ వుండేవారు. వీళ్ళకి మరి తమ ఇళ్ళల్లో ఏమీ తోచదనుకుంటాను. పెళ్ళయిన కొత్తలో, నా భర్త ఆఫీసుకి వెళ్ళిపోయాక ఇంటికి ఇలా ఎవరో ఒకరు వస్తే నాకూ కాలక్షేపంగానే వుండేది. కానీ, రోజులు గడిచినకొద్దీ వాళ్ళకి బోర్ కొట్టించసాగింది. టైం వేస్ట్ అనిపించింది. అందులోనూ నాకు కొత్తవాళ్ళతో మాట్లాడ్డం అలవాటులేదు. అందుకే న్యూస్ పేపరో, పుస్తకమో చదువుతూ వాళ్ళతో మాట్లాడేదాన్ని.

 

    ముఖ్యంగా ఎవరైనా బయటివాళ్ళొచ్చి కూర్చున్నప్పుడు మా అత్తగారు వంటింట్లో పనిచేసుకుంటూ వుంటే, నేను డ్రాయింగ్ రూంలో పేపరు చదువుకుంటూ వాళ్ళతో ముక్తసరిగా కబుర్లు చెప్పటం బాగా ఇబ్బందిగా అనిపించేది. ఒకరోజు ఒకావిడ వుండబట్టలేక అనేసింది.

 

    "ఇద్దరు కోడళ్ళొచ్చినా నీ కష్టాలు మాత్రం తీరటం లేదేంటమ్మా!" అని.

 

    నాకు తల కొట్టేసినంత పనైంది. వాళ్ళకేం తెలుసు. నేను చేద్దామనుకున్నా ఆవిడ సహకరించదని, అసలు నా పద్ధతులేవీ ఆవిడకు నచ్చవనీ.

 

    "ఏదో కొత్త అమ్మాయి కదా! మన ఇంటి పద్ధతులూ అవీ ఇంకా అలవాటు కాలేదు. నెమ్మదిమీద నేర్చుకుంటుందిలే పాపం" అని మా అత్తగారు సర్దిచెపుతున్నట్టు అన్నది. నాకు షాక్ తగిలినట్టయింది. మొట్టమొదటిసారి నా అత్తగారి స్వభావం అర్థమైనట్టు అనిపించింది.

 

    నా కోసం మరో షాక్ మరుసటిరోజు ఎదురుచూస్తోంది.

 

                                    4

 

    ఆయన ఇంటికి వచ్చినప్పుడు నేనూ, నా భర్తా ఇంట్లో లేము. నైటీలు, కొత్త బెడ్ షీట్, బెడ్ ల్యాంప్ లాంటి వస్తువులు కొనటానికి వెళ్ళాము. బెడ్ లాంప్ చాలా నచ్చింది. నాకు బెడ్ షీట్ అయితే అద్భుతంగా వుంది.

 

    షాపింగ్ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి, తెలుగు సినిమాలో 'శుభం' సీన్ లా వున్నదా దృశ్యం.

 

    ఆయన ఇంట్లో వాళ్ళందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ వున్నాడు. నా ఆడపడుచు ఆయన మెడచుట్టూ చేతులేసి, భుజంమీద తలవాల్చుకుని కూర్చుని వుంది. మమ్మల్ని చూడగానే ఆయన చాలా సంతోషంగా పలకరించారు. టూర్ నుంచి వచ్చేటప్పుడు ఇంట్లో అందరికీ కొత్త బట్టలు తెచ్చినట్టున్నాడు. అవన్నీ ఎదురుగా పరిచి వున్నాయి. నా భర్తతో అవీ ఇవీ మాట్లాడుతూనే "ఇదిగోనమ్మా, ఇది నీకు" అంటూ ఓ చీర పాకెట్ నా కందించాడు. నేను మొహమాటంగానే అది అందుకున్నాను.

 

    "ముందే ఫలానా ఫ్లైట్ కి వస్తున్నానని చెప్పలేదేం అన్నయ్యా? ఏర్ పోర్ట్ కి వచ్చేవాడినికదా!" అంటున్నాడు నా భర్త.

 

    "ఫర్లేదులేరా? కొత్తగా పెళ్ళయినవాడివి, ఏ సరదాల్లో వుంటావో అని" నవ్వేశాడాయన.

 

    ఆయన అందరితోనూ కలుపుగోలుగానే వున్నా, ప్రతి ఒక్కరూ ఆయనంటే భయమూ, కాస్త గౌరవమూ కలిగి వుండడం నేను గమనించాను. అంతేకాదు, ఆ వాతావరణంలో ఓ కొత్త డిసిప్లిన్ ప్రవేశించడం కూడా గమనించాను.

 

    అందరూ బోలెడంత ఉత్సాహంగా మాట్లాడుకుంటూ వుంటే, అక్కడ వుండడం నాక్కొంచెం ఇబ్బందిగా తోచింది. నా షాపింగ్ సామానూ, నా బావగారు నా కిచ్చిన చీరా లోపల పెట్టే నెపంతో నా గదిలోకి వెళ్ళిపోయాను. నేను తెచ్చిన బెడ్ ల్యాంప్ కి స్టాండు ఏర్పాటుచేసి, ఫిక్స్ చేసి, కనెక్షన్ కూడా ఇచ్చాను. బెడ్ షీట్ కూడా సరిచేసి. పాతదాన్ని తీసి, ఉతకాల్సిన బట్టల్లో వేయడానికి బయటకు నడవబోతుంటే నా భర్తా, తోడికోడలు ఎదురొచ్చారు.

 

    "ఆయనొచ్చేశారు కదా! అలసిపోయినట్టున్నారు. కాసేపు పడుకోవాలంటున్నారు. ఈ గది నేను తీసుకోనామ్మా!" అందావిడ.

 

    ఆయనకు బడలికగా వుంటే మా గదే ఎందుకు కావల్సొచ్చిందో నా కర్థంకాలేదు. పోనీ ఇద్దామంటే లోపల నేను పరచిన కొత్త బెడ్ షీట్. నా ల్యాంప్ మొదటిసారిగా వాళ్ళు ఉపయోగించుకుంటారన్న విషయం చివుక్కుమనేలా చేసింది. నేనలా సందేహిస్తూంటే నా భర్త, "ఇది వాళ్ళ గదేనోయ్. అన్నయ్య ఊళ్ళో లేకపోవటం వల్ల ఇన్ని రోజులూ మనకి ఇచ్చేశారు" అన్నాడు.

 

    షాక్ తగిలినట్టు అయింది. అయితే ఇన్నాళ్ళూ మేము పడుకున్నది మా తోటికోడలూ, బావగారూ పడుకున్న పడకమీద అన్నమాట!

 

    నా తోటికోడలు కొత్త బెడ్ షీట్ తీసెయ్యబోతూంటే ఆయన వారించి "ఉంచెయ్యి వదినా. అన్నయ్యకి ఒకవైపు నిద్రొస్తూందంటే ఇప్పుడీ తతంగాలన్నీ దేనికి?" అన్నాడు. ఈ లోపులో నేను గబగబా మా సామాన్లు తీసేసుకున్నాను.

 

    బిబిసిలో వార్తలు వస్తున్నాయి. బోస్నియాలో సెర్బుల ఆక్రమణకి నిరాశ్రయులైన ముస్లిమ్ లు తండోపతండాలుగా సరిహద్దులవైపు సాగిపోవటం చూపిస్తున్నారు.

 

    నాకు నవ్వొచ్చింది ఆ సమయానికి టీవీలో అది రావటం!

 

    మొత్తానికి "మా" చిన్నగదిలో సెటిల్ అయ్యాం. అప్పటి వరకూ స్టోర్ రూమ్ అనుకున్నాను దాన్ని. భోజనాల గదికీ, బాల్కనీకి మధ్య వుంది.

 

    బట్టలు ఆరేయాలన్నా- తీసెయ్యాలన్నా ఆ గదిలోంచే వెళ్ళాలి. నీళ్ళొచ్చే పంపుకూడా బాల్కనీలోనే వుంది.

 

    పైకి చాలా మామూలుగా కనపడే విషయాలైనా ఆ రెండూ ఎంత దారుణమైనవో మరుసటిరోజు నాకు అర్థమైంది.

 

                                    5

 

    నా బావగారు మా ఇంట్లో గాడ్ ఫాదర్. ఆయన ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు. ఆయన్తో కాస్త స్వతంత్రించి మాట్లాడేది, గారాలు చేసేదీ నా ఆడపడుచు ఒక్కతే.

 

    నా తోటికోడలూ, మా బావగారూ మాట్లాడుకోవటం ప్రత్యక్షంగా నేనెప్పుడూ చూడలేదు. భర్త అవసరాలను కనిపెట్టి వుండగలిగే అవకాశం దక్కటమే తన మహద్భాగ్యంగా భావించే మనిషిగా ఆమె నాకు కనపడింది. పూజలు చేసినంత భక్తిగా ఆయన పనులు నిర్వర్తించేది. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS