Previous Page Next Page 
అనైతికం పేజి 10


    నాక్కాస్త కొత్తదనంపోయి, ఇంటి పనుల్లో తలదూర్చసాగాను. మా అత్తగారు చాలా పనులు తనే చేసేది. ఆమెకి అసిస్టెంట్స్ లాగా మేమూ వుండేవాళ్ళం. కింది అధికారి కాస్త ఇంగితం వున్నవాడై, పై అధికారి పని చేతకానివాడైతే ఎన్ని అవస్థలు పడతాడో, అన్ని అవస్థలూ పడేవాళ్ళం.

 

    తొమ్మిదింటికి వంట పూర్తిచేయటం కోసం యుద్ధ ప్రాతిపదికమీద పనులు నిర్వర్తించవలసి వచ్చేది. అయినా అది పూర్తయ్యేది కాదు. కాస్త కామన్ సెన్స్ ఉపయోగిస్తే అది చాలా సులువుగా చెయ్యొచ్చుననేది నిర్వివాదాంశం. ఇంట్లో ఎవరికీ ఆ ఆలోచన రాకపోవటం నాకు చిత్రంగా తోచింది.

 

    స్నానం చేశాకకానీ వంటింట్లో అడుగు పెట్టకూడదని రూలు. బాత్ రూంలో స్నానాలు గావించి ఒకరి తరువాత ఒకరం సైనికుల్లా వంటింట్లో ప్రవేశించేసరికి ఏడున్నర అయ్యేది. రాత్రే గిన్నెలు బయట పెట్టుకుంటే - ప్రొద్దున్న పనిమనిషికి (స్నానం చేయకుండానే) వేసెయ్యొచ్చన్న ఆలోచన మా అత్తగారికీ, తోటికోడలికీ ఇంతకాలం రాకపోవటం ఆశ్చర్యం.

 

    నా పెళ్ళికి ముందునుంచే మా ఆడపడుచుకి కొన్ని నిబంధనలు సడలింపబడ్డాయి. స్నానం చేయకుండా కాఫీ తాగటం, వంటింట్లో ప్రవేశించటం లాటివన్నమాట. తను లేచేసరికి బాత్ రూమ్ ఖాళీ వుండకపోవటంతో- కాఫీ తాగేసి, ఈ తరువాత బాత్ ప్రహసనం ముగించుకుని అర్జెంటుగా తయారై వెళ్ళాల్సి వచ్చేది. అందుకోసం ఈ మినహాయింపుల్ని ఆ అమ్మాయి అధికారయుక్తంగా పొందింది.

 

    తొందరగా వంట ఎలా పూర్తి చెయ్యొచ్చో ఐన్ స్టీన్ లెవల్లో ఒకరోజు నా భర్తకి వివరించాను.

 

    "పోన్లెద్దూ. అమ్మ ఆచారం సంగతి నీకు తెలుసు కదా! స్నానాలు అయితేగానీ వంటింట్లోకి వెళ్ళటం ఇష్టం వుండదు" అన్నాడు.

 

    "పోనీ మీ చెల్లెలిని కాస్త తొందరగా లేచి పనిమనిషికి గిన్నెలు వేయమని చెప్పండి. అప్పటికి నేను కూరలు తరగడం మొదలు పెట్టేస్తాను. ఓ పది నిముషాలైనా సేవ్ అయినట్టు వుంటుందికదా!" అన్నాను.

 

    అతనో క్షణం నిశ్శబ్దంగా వుండి తర్వాత అన్నాడు.

 

    "చూడూ! ఇప్పటివరకూ మేము మా చెల్లెలికి ఏ పనీ చెప్పలేదు. రేప్పొద్దున పెళ్ళి చేసుకుని ఎలాంటి ఇంటికి వెళ్ళిపడుతుందో ఏమో, కనీసం ఇక్కడున్నంత వరకైనా దానికి ఏ లంపటాలూ తగిలించకూడదని మా ఉద్దేశ్యం. ఇంకెప్పుడూ పని విషయంలో దాని పేరెత్తకు" అన్నాడు.

 

    నాకు పెళ్ళయ్యాక మొదటిసారిగా ఆవేశం కలిగింది- 'ఏమిటి ఇతగాడి ఉద్దేశ్యం? మేమేనా గారాబాల్లేకుండా పెరిగింది? లంపటాలు మేమేనా తగిలించుకుని బ్రతకాలి? పెళ్ళి చేసుకునేది వేరేవాళ్ళ లంపటాలు కూడా నెత్తిన వేసుకోవడానికా' అనుకున్నాను. ఆ సంభాషణ అక్కడితో ఆగిపోయింది. కానీ, నేను చేసిన పొరపాటు ఏమిటో నాకు మరుసటిరోజు తెలిసింది.

 

    "నీకిక్కడ ఏదైనా ఇబ్బందిగా వుందామ్మా?" అనడిగింది మా అత్తగారు.

 

    "దేనికండీ?" అన్నాను అర్థంకాక తెల్లబోయి.

 

    "పని విషయమైనా, లేక ఏదైనా పద్ధతులూ, అవీ అయినా" అందావిడ. ఆవిడ ఏ సందర్భంలో ఆ మాటంటోందో నా కర్థం కాలేదు.

 

    తిరిగి ఆవిడే అంది - "అందుకే ఈ పనులన్నీ నీకు అలవాటు లేదేమో, నేనే చేసుకుంటానంటే, నీవు అలా కూడా నా మాట విన్లేదాయె. అన్నీ ఒక్కదానివే నెత్తిన వేసుకున్నావు. చెయ్యడం కష్టంగా వుంటే, పనిచెయ్యడం వదిలెయ్ గానీ, వాడితో గొడవ పెట్టుకోకమ్మా". నాకు విషయం కాస్త అర్థమైంది.

 

    "నేనేం గొడవ పెట్టుకోలేదండీ, అంత హడావుడయితే అమ్మాయి వచ్చి సాయం చేస్తే తొందరగా అయిపోతుంది కదా అన్నానంతే" అన్నా నిజాయితీగా.

 

    "అదేనమ్మా! అబ్బాయిలిద్దరికీ చెల్లెలంటే ప్రాణం. అది ఏ మాత్రం కష్టపడడం వాళ్ళు చూడలేరు. రేపు పెళ్ళయి అత్తగారింటికి వెళ్తే అక్కడ ఎలాంటి మనుషుల మధ్య వుండవలసొస్తుందో. అందరూ నీ అంత అదృష్టవంతులే వుండరు కదా! అందుకే ఇక్కడ ఏ పనీ చెప్పకుండా, ఏ హద్దులూ పెట్టకుండా చూసుకుంటాం. పెళ్ళయ్యాక వాళ్ళే నేర్చుకుంటారు. ఇప్పుడు నువ్వు నేర్చుకోవట్లా? ఈ కాలం పిల్లలు మంచి చురుకైన వాళ్ళు. ఏదైనా ఒక్కసారి చెప్తే ఇట్టే పట్టేస్తారు. మా కాలంలో అయితే...."

 

    నేను వినటం లేదు. హృదయం భగ్గుమంది. మా ఇద్దరికీ చిన్న మాటా మాటా వస్తే అది తల్లిదాకా తీసుకెళ్ళి నన్ను విలన్ ని చేస్తాడా? అయినా నేనన్నదాంట్లో తప్పేముంది? వాళ్ళ పని వాళ్ళకి చేసుకోవడానికి కష్టంగా వుంటే ప్రొద్దున్నే అవన్నీ వాళ్ళ టైంకి అమర్చి పెట్టాల్సిన అవసరం నాకు మాత్రం ఏముంది? ఇంతా చేసీ నా అంత అదృష్టవంతులు ఇంకొకరు లేరా?     

 

    ఆయన స్నానానికి బాత్రూంలోకి వెళ్ళబోతూంటే తలుపుకి అడ్డంగా నిల్చుని "ఈ విషయం మీ అమ్మకి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది?" అనడిగాను తీవ్రంగా.

 

    "ఏ విషయం?" అనడిగాడు తెల్లబోయి.

 

    "అదే నిన్న మనం మాట్లాడుకున్నది..."

 

    "నేనేం చెప్పలేదే, ఏం జరిగిందీ?" అనడిగాడు.

 

    అతని కంఠంలో సిన్సియారిటీ నిజంగా అతను చెప్పలేదని తెలుపుతోంది. బహుశా ఆవిడే విన్నదేమో... ఈ భావన నన్ను మరింత ఇరిటేట్ చేసింది. అప్పటికీ మేము చిన్న స్వరంతోనే మాట్లాడుకున్నాం. కొడుకూ, కోడలు ఏదో మాట్లాడుకుంటూ వుంటే పని గట్టుకుని వినడమే కాకుండా, ఏమిటని నన్ను నిలదీసి, పైగా నాకు సంజాయిషీ లాంటి ధర్మబోధ కూడా చేస్తుందా?

 

    తరువాతి రోజు నేను ఏడింటి వరకూ లేవలేదు. అంతే కాదు ఆ రాత్రి నా భర్తని తాకనివ్వలేదు...మొదటిసారిగా! అతను నన్ను లేపటానికి ప్రయత్నించాడు. నేను తలనొప్పిగా వుందని ముసుగు పెట్టుకున్నాను.

 

    అతను ప్రొద్దున్నే ఆ విషయం వాళ్ళ అమ్మతో చెప్పినట్టున్నాడు. ఆవిడ కంగారుగా నా గదిలోకి వచ్చేసింది. "ఏమ్మా చాలా ఎక్కువగా వుందా నొప్పి? లేచి ముఖం కడుక్కో. కాఫీ కలిపి ఇస్తాను. తాగేసి, టాబ్లెట్ వేసుకుని పడుకుందువు గానీ" అంది ఆదుర్దాగా. ఆవిడ తాపత్రయం చూసి నా ప్రవర్తనకి నాకే బాధేసింది.

 

    "ఏదో ముసలావిడ. ఆవిడ ఛాదస్తం ఆవిడది. అది భరించడం నా బాధ్యత కాదూ. కొంచెం ఒంట్లో బాలేదంటే ఎంత ఆరాటపడుతోందో?" అన్న అపరాధ భావన కలిగింది.

 

    లేచి "ఫర్లేదు లెండి. ఈ మాత్రం నొప్పి నా కలవాటే. మీరు వెళ్ళండి. నేను మొహం కడుక్కుని వచ్చి, కూరల విషయం చూసుకుంటాను" అన్నాను. "కాసేపు పడుకో" అని ఆవిడ వారిస్తున్నా విన్లేదు.

 

    "చూశావా, అమ్మ మనసెంత మంచిదో. గొడవ పెంచుకోవాలంటే క్షణం పట్టదు. రాజీ అవ్వాలంటేనే తర్వాత కష్టం...." అని నా భర్త నాకు నచ్చచెప్తుంటే నేనేం మాట్లాడలేదు.

 

                                    6

 

    నా గది నాకు చాలా అసంతృప్తిని మిగిల్చింది. ఇల్లు తుడిచే గుడ్డలు, చీపురు లాంటివి బాల్కనీలో ఒక మూల గూటిలో పెట్టి వుంటాయి కనుక, పనిమనిషి ప్రొద్దున్నే ఆరింటికి వచ్చి మా గది తలుపు తట్టేది. చచ్చినట్టు లేవక తప్పేది కాదు. ఉషోదయాల్లో నాకు నా భర్త గుండెల్లో తల దాచుకుని, మరికాసేపు వెచ్చగా పడుకోవాలన్పించేది. అతను మాత్రం ఐదున్నరకే లేచేవాడు. చకచకా తన బట్టలు సరిచేసుకుని, పక్కబట్టలు నలిగిపోయుంటే సర్దేసి, నన్ను లేపి నైటీహుక్స్ అవీ సరిచేసుకోమనేవాడు. ఇంతా చేస్తే ఇదంతా కేవలం మా పనిమనిషికి 'క్యాజువల్' గా కనపడటం కోసం!

 

    ...సూర్యకిరణాలు కిటికీ గుండా లోపలికి పడి గిలగింతలు పెడుతూంటే, బద్ధకంగా కళ్ళు తెరచి అనాచ్చాదితంగా వున్న భర్త గుండెను చూసి, ఆయనకు కనబడకుండా అటు తిరిగి హుక్స్ పెట్టేసుకుని, అతనికి మెలకువ రాకుండా మెల్లగా, అతి మెల్లిగా అతని చేతుల్ని తొలగించుకుని, కిటికీ పరదాలు పూర్తిగా తెరిచేసి, రేడియోలో ఏ సుప్రభాతమో వస్తుంటే పొగలు కక్కే కాఫీ కప్పుతో అతనికి మేలుకొలుపు పాడి...కాఫీ అయిపోయాక, నేను ఇల్లు తుడుస్తుంటే, అతను కూరకు తరిగేసి, తర్వాత వంట పూర్తిచేసుకుని... అతని తలకు నూనె పట్టించి, మర్దనా చేసి, నలుగుతో నేనూ అతనూ జంటగా స్నానాలు చేసి...

 

    ఇవన్నీ అంత ఖరీదైన కోర్కెలా? పెళ్ళయిన తొలిసంవత్సరమైనా తను తీర్చుకోవాలని ప్రతీ కన్నెపిల్లా కోరుకునే కనీస కలలు కావూ?

 

    నాకు మొదటిసారిగా కన్నీళ్ళు కొలకులు దాటి ప్రవహించాయి. తరువాత ఇదంతా ఒక రొటీన్ వ్యవహార మవ్వొచ్చు. అది వేరే విషయం. మేము 'తొలి' ని కోల్పోతున్నాం. అందుకే కన్నీళ్ళు. అన్ని ఉమ్మడి కుటుంబాల్లో ఇలాంటి సమస్య వుండదు. ముఖ్యంగా భర్తకి ప్రైవసీ విలువ తెలిసుండాలి. "మమ్మల్ని ఏడు వరకూ లేపకమ్మా! నీకేవైనా కావాలనుకుంటే రాత్రే మా గదిలోంచి తీసి వుంచుకో" లాంటి మాటలు ఖచ్చితంగా చెప్పడంలో మొహమాటపడడానికి ఏముందో నా కర్థంకాని విషయం. మొహమాటపడటానికి ఇది అతని ఇల్లేకదా! ఒక రోజు చీపురుకట్ట తీసి బయట హాల్లో రాత్రే పెట్టేస్తే మా అత్తగారు మందలించింది. ముందుగదిలో చీపురుకట్ట వుండకూడదట. అయితే ఇంకో గదిలో పెట్టొచ్చుకదా! నా భర్త సిల్లీ విషయంలో కూడా జోక్యం చేసుకుని తల్లికి వత్తాసు పలకటం ఆశ్చర్యం! ఇలాంటివాళ్ళు తామేం కోల్పోతున్నారో తెలుసుకోరు. అంతేకాదు, అవతలివ్యక్తి ఆనందాన్ని కూడా నాశనం చేస్తున్నారని తెలుసుకోరు.

 

    నా ఇంట్లో వాళ్ళ మనస్తత్వం నాకు క్రమంగా అర్థమయింది. నా బావగారు, అన్నీ ఆర్డర్ లో వున్నంతవరకూ దేంట్లోనూ తలదూర్చరు. ఆయన మాట మా ఇంట్లో శిలాశాసనం. డబ్బు, చిల్లర ఖర్చులూ మా తోటికోడలి అజమాయిషీలో జరుగుతున్నాయి. నా అత్తగారికి తన హయామయి పోయిందన్న విషయం అర్థమైపోయింది. వంట పని తాను తీసేసుకుని చాలా తెలివిగా, ఓ స్ట్రాటజీతో పాచి పనులు నాకు అంటగట్టింది. ఇది ఇంట్లో అందరికీ అర్థమయినా, వాళ్ళ చాపకిందికి నీరు రానంతవరకూ మెదలకుండా వుండే డిప్లొమాట్లు, ముఖ్యంగా నా భర్త... అన్నీ అర్థమయినా ఏమీ చేయలేని, చేయని అసమర్థుడు... అశక్తుడు!

 

                                *    *    *

 

    ఓ రోజు సినిమాకెళ్ళాం. ఏ కళ నున్నాడో కానీ అతను చాలా జాలీగా కనిపించాడా రోజు. సినిమా మంచి హ్యూమరస్ ది అవడం వల్ల అన్నీ మరిచిపోయి చాలా ఎంజాయ్ చేశాం. దార్లో అతను నాకు పూలు కొన్నాడు. స్కూటర్ మీద అతని వెనక చుట్టూ చెయ్యేసుకుని కూర్చోడం చాలా రోజుల తర్వాత ఆనందాన్ని కలిగించింది.

 

    ఏదో విషయానికి నవ్వుకుంటూ మా ఇంటి సందు మలుపు తిరగబోతూంటే ఆ మలుపు దగ్గరున్న మెడికల్ షాపులో నా అత్తగారు ఏవో మందులు కొంటూ కనిపించింది. అతను కంగారుపడి స్కూటర్ స్టాండ్ వేసి తల్లి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మమ్మల్నిద్దరినీ చూసి "సినిమా ఎలా వుందర్రా?" అనడిగిందావిడ.

 

    "మందులు ఎవరికి కొంటున్నావ్?" అడిగాడతను.

 

    "నాకేరా. బాగా తలనొప్పిగా వుంటే భరించలేక పోయాను" అంది. "ఎప్పట్నుంచీ?" అన్నాడతను. అంటూ కంగారుగా ఆమె నుదుటిమీద చెయ్యివేసి "మేమొచ్చే వరకూ ఆగలేక పోయావా అమ్మ. వచ్చేక తెచ్చేవాణ్ణిగా మందులు నీకు!" అన్నాడు.

 

    "ఫర్లేదులేరా, అదే తగ్గిపోతుంది. ఇదిగో ఇళా కంగారు పడతావనే నువ్వొచ్చే లోపల మందు తీసుకుందామని వచ్చాను. పద" అంది. నేను ప్రేక్షకురాలిలా చూస్తున్నాను.

 

    అతను ఆవిడని స్కూటర్ వెనుక కూర్చొబెట్టుకుని ఇంటికి వెళ్ళాడు. నేను నడుస్తున్నాను. మనసంతా ఆలోచనలు. మేం వచ్చేవరకు ఆవిడ ఇంట్లోనే ఆగి, మందులు తెమ్మని కొడుక్కి పురమాయించవచ్చు కదా! ఒక్క అయిదు నిమిషాలసేపు ఆగలేక పోయిందా అనిపించింది. 'మేం కంగారుపడతామని' ఆవిడ చెప్పే కారణం నన్నెందుకో కన్విన్స్ చేయలేదు. మేమింటికి రాగానే ఆవిడ పడుకుని వుంటే మాకెలాగూ ఆవిడ అనారోగ్యం గురించి తెలుస్తుంది. ఆవిడ కావాలని మా ఆనందాన్ని ఇలా నాశనం చేస్తుందా అనిపించింది. అప్పటివరకూ వున్న నా ఉత్సాహం అంతా ఊదేసినట్లుగా అయింది. మేము సినిమాకి వెళ్ళడానికీ, ఆవిడకి తలనొప్పి రావడానికీ అవినాభావ సంబంధం వున్నట్లనిపించింది. నేనూహించినట్టే ఇంట్లో అడుగు పెట్టేసరికి నా భర్త ఆవిడ తలకి జండూబామ్ రాస్తున్నాడు. నన్ను చూసి ఆవిడ "పాపం నడిచి వచ్చినట్లు వుందిరా అమ్మాయి" అంటూంటే నేను విననట్టే నా గదిలోకి వెళ్ళిపోయాను. మంచం మీద బోర్లా పడుకుని మోచేతి వంపులో మొహం దాచుకున్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS