Previous Page Next Page 
అనైతికం పేజి 8


                                              అధ్యాయం - 2

 

    అహల్య చెప్పిన కథ :

 

    ఆనందమంటే విచారం లేకపోవటం కాదని నా ఇరవై ఆరో ఏట తెలిసింది. అప్పటివరకూ నేను చాలా హాయిగా జీవితాన్ని గడిపాను. నేనూ, అన్నయ్యా, అమ్మా, నాన్నా- చక్కటి పొదరిల్లు మాది. మేమిద్దరమూ బ్రిలియంట్ స్టూడెంట్స్ మి. చాలా గారాబంగా పెరిగాము.

 

    అన్నయ్య ప్రేమ వివాహం చేసుకుని వదినని అకస్మాత్తుగా ఇంటికి తీసుకువచ్చేవరకూ మా పొదరింట్లో ఏ గొడవలూ రాలేదు. చక్కటి తోటలో నడుస్తూంటే హఠాత్తుగా కాలిక్రింద లాండ్ మైన్ పేలినట్టు జరిగిందా సంఘటన.

 

    అన్నయ్య ఆ విధంగా చేస్తాడని మేము కలలో కూడా వూహించలేదు. నాన్నకు హార్ట్ అటాక్ రాకపోవటమే అంత విషాదంలోనూ కాస్త ఆనందం కలిగించిన విషయం.

 

    మా వదిన పేరు అచ్చమ్మ! అవును, అచ్చమ్మ! అన్నయ్య ఆ అమ్మాయిని పరిచయం చేస్తూ ఆమె పేరు చెప్పగానే ఉలిక్కిపడ్డాను. నా కళ్ళలో షాక్ ని అన్నయ్య గుర్తించలేదు గానీ ఆమె గుర్తించినట్టుంది.

 

    సన్నగా నవ్వింది. అయితే ఆ నవ్వు నాపట్ల సానుభూతో, లేక అది తన 'ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సో' నా కర్థం కాలేదు. ఆమెకి అప్పటికి పాతిక సంవత్సరాలుండవచ్చు. నా పాతిక సంవత్సరాల్లోనూ తను ఆ పేరు చెప్పగానే ఎదుటి వారి కళ్ళల్లో కనపడిన షాక్ ఆమెకి ఆ చిరునవ్వుని ఒక అలవాటుగా మార్చి వుండవచ్చు.

 

    ఏది ఏమైనా అన్నయ్య అంత పని చేస్తాడని మేము కలలో కూడా ఊహించలేదు. బుద్ధిగా చదువుకునేవాడు. ఇంటి పట్టునే వుండేవాడు. అన్నిటికన్నా ముఖ్యంగా- నాన్న మాటంటే వేదంలా భావించేవాడు. అటువంటి మనిషి- ఇంత భయంకరమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో నాకు అర్థంకాలేదు.  

 

    'భయంకరమైన' అని నేను అనటానికి కారణం ఆమె పేరు 'అచ్చమ్మ' అవటం కాదు. ఆమె అంతకుమునుపే మరో వ్యక్తితో సంసారం చేయటం వల్ల కూడా కాదు.

 

    ఆమె డైవోర్సీ కాకపోవడం వల్ల!

 

    ప్రేమ పేరుతో ఇంట్లో చెప్పా పెట్టకుండా లేచిపోయి, 'వివాహం లేకుండా' రెండు సంవత్సరాలు ఒక వ్యక్తితో 'గడిపి'- విభేదాలవల్ల విడిపోయి వచ్చిన స్త్రీ అవటం వల్ల!

 

    మీరే చెప్పండి, ఇంతకన్నా భయంకరమైన విషయం మరొకటి వుంటుందా?

 

                                       2

 

    మా అన్నయ్య అటువంటి స్త్రీని వివాహం చేసుకుని ఇంటికి తీసుకురావటం, నా తల్లిదండ్రులు నా పెళ్ళికి తొందరపడేలా చేసింది. ఇటువంటి విషయాలు దాచినా దాగవని మావాళ్ళు గ్రహించారు. అందరూ చెవులు కొరుక్కోకముందే ఈ విషయాన్ని (వదిన పేరుతో సహా) దాచిపెట్టి నా వివాహం జరిపించారు.

 

    ఆ విధంగా నా జీవితం ఒక మలుపు తిరిగింది.

 

    నేను అత్తవారింటికి వెళ్ళిపోయాను.

 

    నా తల్లిదండ్రులు అన్నయ్యని ఇంట్లోంచి వెళ్ళిపొమ్మని గెంటెయ్యలేదు. ఈ వయసులో కొడుకుని 'వదులుకుని' వాళ్ళు వుండలేరు. అందుకని అయిష్టంగానైనా వదినని ఇంట్లోకి ఆహ్వానించక తప్పలేదు.

 

    అయినా నేను చెప్పదల్చుకున్నది మా అన్నా వదినల గురించి కాదు. నా జీవితంలో అచ్చమ్మ పాత్ర గురించి! విచారమంటే ఆనందం లేకపోవటం అని నేను తెలుసుకోవటం గురించి!!

 

    నేనేమీ ప్రొఫెషనల్ రైటర్ ని కాను. సంఘటనలను నాటకీయంగా చెప్పటం నాకు చాతకాదు. నవలల్లాగా జీవితంలో సంఘటనలకి నాటకీయత వుండకపోవచ్చు. అందువల్ల నా కథ కొంతవరకూ చదివి, 'ఏముంది? ప్రతీ ఇంట్లోనూ జరిగేది ఇదే కదా!' అని మీరు అనుకోవచ్చు.

 

    అయ్యుండవచ్చు.

 

    మొదటి సగం అలాగే వుండొచ్చు.

 

    కానీ ఆ పరిణామక్రమంలో రెండో సగం మాత్రం 'ప్రతీ ఇంట్లో' జరిగేది కాదు.

 

    ప్రతి స్త్రీ మనసులో జరిగేది.

 

                                                     3

 

    నా భర్త పెద్దగా సరసం తెలిసిన మనిషి కాదు కానీ, అతనికి నా మీద అపారమైన ప్రేమ వున్నదని పెళ్ళయిన వారం రోజులకే అర్థమైంది.

 

    వంటింట్లో వుంటే వెనుకనుంచి కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవటం, డైనింగ్ టేబుల్ దగ్గర ఎవరూ చూడకుండా క్రింద నుంచి కాలు తొక్కటం అతనికీ తెలియదు. అవన్నీ పుస్తకాల్లో రాస్తారేమో నాకూ తెలీదు. అలా అని ఏకాంతానికి ఏ లోటూ వుండేది కాదు. మిగతా గదుల్తో సంబంధం లేకుండా మాకు ప్రత్యేకమైన గది కేటాయించారు.

 

    నేనూ, మా వారూ, అత్తమామలు, ఆడపడుచు, తోటి కోడలు, ఆమె భర్త చిన్నసైజు కుటుంబం మాది.

 

    నా భర్తలో నాకు నచ్చని పాయింట్ ఒకటుంది.

 

    ఆదివారం పూటయినాసరే- మధ్యాహ్నం మా బెడ్ రూమ్ తలుపు వేయటానికి సంకోచించేవాడు నా భర్త! అందరూ ఏమనుకుంటారో అని బిడియపడేవాడు. నాకూ ఆ 'యావ' అంతగా వుండేది కాదు కానీ, నాలుగైదు రోజులపాటు ఆయన్తో కలిసి ఎక్కడికైనా వెళ్ళి గడపాలన్న కోరిక మాత్రం కలిగేది. ఆ ఇంటి హడావుడి చూశాక, అది మరీ బలీయమైంది.

 

    అత్తవారింట్లో అడుగుపెట్టిన నెలవరకూ ఎదురు చూసి, ఆయన ఆ ప్రసక్తి తీసుకురాకపోవడంతో "ఏవండీ! సరదాగా ఓ వారం రోజులు ఎక్కడైనా తిరిగి వద్దామా?" అని అడిగాను.

 

    "అంటే హనీమూన్ కా?" అన్నాడతను చిలిపిగా. నాకు కాస్త సిగ్గేసింది. నన్ను దగ్గరకు తీసుకుని "అమ్మకూడా అదే అడుగుతుందోయ్. ఎక్కడికీ వెళ్ళటం లేదేమిట్రా అని. కానీ అన్నయ్య కూడా మన పెళ్ళయిన దగ్గర్నుంచీ టూర్ లోనే వున్నాడు కదా. మనం కూడా వెళ్ళిపోతే ఎలా? అన్నయ్య రాగానే వెళ్దాం" అన్నాడు.

 

    ఇంత చిన్న విషయం నాకు స్ఫురించనందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. మా అత్తగారు కూడా ఈ విషయం ఆలోచించి నందుకు కాస్త గర్వంతో కూడిన సంతోషమనిపించింది. ఆ సంతోషంలో ఇక 'హనీమూన్' విషయం పూర్తిగా మర్చిపోయి, అడ్జస్టయ్యాను.

 

    అడ్జస్ట్ మెంట్...

 

    అది మనసంతా తాత్కాలికమైన సంతృప్తిని కలిగించి, శాశ్వతానుభూతిని దూరం చేసే ప్రక్రియ అని రెండో వారంలో తెలిసింది.

 

    అత్తారింటి కొచ్చిన రెండో వారంలో 'సినిమా కెళ్దామా' అని అడిగాను. వెంటనే ఒప్పుకున్నాడు. ఇద్దరం తయారై బయటికి వెళ్ళబోతూ మా అత్తగారికి చెప్పాము.

 

    "నన్ను కాస్త స్కూటర్ మీద ఆ మెడికల్ షాప్ దగ్గర దింపి మీ ఆవిడని తీసుకెళ్ళరా అబ్బాయ్...." అందావిడ.

 

    ఆయన ఆదుర్దాగా- "ఎందుకు?" అని అడిగాడు. "మరేంలేదురా, కాస్త ఆయాసంగా వుంది. అదెప్పుడూ వున్నదేగా. మందు వేసుకుంటే తగ్గిపోతుంది. వెళ్ళి మందులు తెచ్చుకుందామనీ.." అంది.

 

    ఆయన సందిగ్ధంలో పడటం చూసి "పదరా. ఆలస్యమయితే మళ్ళీ మీకు టిక్కెట్లు దొరకవు" అని తొందర పెట్టింది.

 

    నా కెందుకో గిల్టీగా అనిపించింది. "మీకు ఆయాసంగా వుంటే మేము సినిమాకి ఎలా వెళ్తాం. మీ అబ్బాయి మందులు తెస్తాడు కానీ, మీరు కాస్త నడుమువాల్చి విశ్రాంతి తీసుకోండి అత్తయ్యగారూ" అన్నాను మనస్పూర్తిగా.

 

    "ఛా ఛా. అదేమిటమ్మా. నాకీ ఆయాసం కొత్తకాదు. దీని గురించి మీరు సినిమా మానెయ్యటమేమిటి?" అంది నొచ్చుకుంటూ. పది నిముషాలు ఒకరికొకరు నచ్చచెప్పుకునే ప్రయత్నంలో గడిచాక, సినిమా టైమ్ అయిపోయి- ఆ విధంగా సమస్యా పరిష్కారం జరిగింది. ఈ చర్చ జరుగుతున్నంతసేపూ మా ఆడపడుచు సోఫాలో కూర్చుని ఫెమీనా చదువుతోంది. మా తోటికోడలు వంటింట్లో వుంది.

 

    నిజం చెప్పొద్దూ. నాకెందుకో కాస్త దిగులుగా అనిపించింది. అంతలో దేవుడు పంపించినట్టు మా అన్నయ్యా, వదినా వచ్చారు. అంతా కబుర్లలో పడ్డారు. మా వారూ, అన్నయ్యా బైటహాల్లో మాట్లాడుకుంటున్నారు. మా అత్తగారు వదిన్ని యక్షప్రశ్నల్తో అభిమానంగా చంపుతోంది. వదినకి 'అచ్చమ్మ' అన్న పేరెందుకు పెట్టారు? అన్న దగ్గిర్నుంచీ... మా అన్నయ్యతో ప్రేమ వివాహం వరకూ... (వదిన గతం మా అత్తగారికి తెలీదింకా) సమాధానాలివ్వటానికి తను ఇబ్బంది పడటం చూసి నేనేదో మిషమీద వదిన్ని నా గదిలోకి తీసుకొచ్చేసాను. తను చాలా రిలీఫ్ గా ఫీలయింది. "ఎలావుంది కొత్త కాపురం" అని అడిగింది. నేను రవ్వంత సిగ్గుతో "బావుంది" అన్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS