Previous Page Next Page 
వజ్రాల పంజరం పేజి 9


    "వండర్ ఫుల్" అనుకోలేదు విజూష, బయటికే అనేసింది.

 

    రెండోరౌండ్ ప్రేక్షకులు ఉత్కంఠమధ్య  వేగంగా సాగిపోయింది.

 

    "మన జాతీయగీతం తొలిసారి అఫీషియల్ గా పాడిందెప్పుడు?"

 

    "1911 డిసెంబర్ 27వ తేదీన కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సదస్సులో" అన్నాడు జగన్.


 
    "రైట్. సత్యమేవ జయతే అని జాతీయ చిహ్నంపై రాయబడిన  సంస్కృత వాక్యం ఏ ఉపనిషత్తులోనిది?"

 

    "కటోపనిషత్తు"

 

    "యు ఆర్ రాంగ్ మిస్టర్ సురేంద్ర. నౌ ఇట్స్ మిస్టర్ రమేష్"

 

    "మాండకోపనిషత్తు"

 

    "రైట్ సీ మిస్టర్ రుత్వి"

 

    రెండో రౌండులోని ఆఖరు ప్రశ్నని అడిగాడు క్విజ్ మాస్టర్.

 

    "పాము విషయం ముంగిసకి ఎందుకు ప్రమాదం కాదు?"

 

    "పాము విషంలో అల్ఫాన్యూరోటాక్సిన్  అనే పదార్దం వుంటుంది" రుత్వి మరేదో  చెప్పబోతుంటే వారించాడు క్విజ్ మాస్ట్ర్ ఆర్దోక్తిగా .

 

    "నాకు పూర్తిగా జవాబు కావాలి."

 

    "సాధ్యం కాదు" రుత్వి అన్నాడు.

 

    "చాలా వివరాలను  తెలియచెప్పాలి"

 

    "సారీ" రిస్ట్వాచ్ చూసుకుంటూ "పదిసెకండ్ల గడువు అయిపోయింది మిస్టర్ రుత్వి. పాము కాటు తిన్నాక ముంగిస  ఒక విధమైన ఆకు తింటుంది. కాబట్టి దానికి ప్రాణహానిలేదు.

 

    "సారీ సార్" రుత్వి అడ్డం పడబోతుంటే వినలేదు క్విజ్ మాస్టర్.

 

    "మిస్ సునంద! రెండో రౌండ్  తర్వాత స్కోరు వివరాలు చెప్పండి"

 

    వెంటనే చెప్పింది సునంద. "జరిగిన రెండు రౌండ్స్ లో మిస్టర్ సురేంద్ర ఓ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతే మిస్టర్ రుత్వి రెండు  జవాబుల్లోనూ ఫెయిలయ్యారు. సో మిస్టర్ జగన్నాధ్ రెండు వందలు, మిస్టర్ సురేంద్ర నూట తొంభై, మిస్టర్ రమేష్ రెండు వందలు, మిస్టర్ రుత్వి నూట ఎనభై."

 

    ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య అంతసేపూ నిబ్బరంగా వున్న రుత్వి మొహం  చిన్నబోవడం చాలా స్పష్టంగా కనిపించింది.

 

    మనసు కలుక్కుమంది విజూషకి.

 

    ఇక మిగిలింది రేపిడ్ ఫైర్ రౌండ్.


 
    క్విజ్ లో గెరిచిన రుత్విని తను ఓడిస్తానని పందెం కాసి మనస్పూర్తిగా అతడి విజయాన్ని కోరుకుంటూందే.....

 

    ఇప్పుడేం జరగబోతూంది.


 
    "యూ ఆర్ రియల్లీ లక్కీ సశ్యా" పక్క టేబుల్ నుండి విష్పరింగ్ గా వినిపించింది  విజూషకి.


 
    "టెన్షన్ తట్టుకోలేక రవీంధ్రభారతి నుంచి పరుగెత్తుకొచ్చేసారు గానీ రుత్వి తప్పకుండా ఓడిపోతాడే... మీరిద్దరి పందెం ప్రకారం ఓడిన రుత్వి నిన్ను పెళ్లిచేసుకుని నీతోపాటు స్టేట్స్ కి వచ్చేస్తాడు."

 

    అప్పుడు చూసింది విజూష ఆందోళనగా.

 

    పక్క టేబుల్ దగ్గర కూర్చున్న ఇద్దరమ్మాయిల్లో 'సశ్య' ఎవరని గుర్తించగలిగిన విజూష విస్పారితంగా వుండిపోయింది.

 

    ప్లజింగ్ నెక్ లైన్ టీషర్టులాంటిది వేసుకున్న సశ్య ప్లాజోపేంట్ తో ఆధునికంగా అలంకరించుకుని అక్కడికి వచ్చిన ఖజురహో శిల్పంలా వుంది.

 

    గెలిచే రుత్వికోసం పందెం కాస్తే అతడు ఓడిపోవాలని మరో అమ్మాయి ఇప్పటికే అతడితో పందెం కాసిందా....


 
    పాల భాగంపై పేరుకుంటున్న స్వేదం తుడుచుకుంటూ తల తిప్పిన విజూష  తననే గమనిస్తున్న స్పూర్తిని చూసింది.


                                                     *    *    *    *


    చాలా బాగుందికదూ? అడిగింది స్పూర్తి విజూషని చూస్తూ.

 

    బాగున్నది సశ్య అందమో, లేక ఆమె కాసిన పందెమో అర్దం కాలేదు విజూషకి.

 

    అలాంటి టెన్ష్ సిట్యుయేషన్ లో స్పూర్తి అంత కేజువల్ గా మాట్లాడటం విజూషకి నచ్చలేదు.

 

    అసలు పరిచయమేలేని రుత్విని చూసింది కొన్ని క్షణాల క్రితమైతే నేం.....

 

     ఇంతకాలమూ ఏ కిరణమూ చొరవని గుండెగూటిలో మృదువుగా చిగురించే బంధ ప్రబంధ వర్ణనలా విస్తరించిపోతున్నాడు.

 

    కాల సంకీర్ణ చరణ మంజీరంలా తన బ్రతుకు మైదానంలో అడుగుపెట్టి -

 

    రవ్వంత ధ్వనికూడా నిశ్శబ్ద నదీతీరాన పడివున్న సైకత రేణువులా అనిపిస్తున్నాడు.

 

    యవ్వన వనంలోని కేళీ సరస్సు చిరు అలల చప్పుడు వివరంగా వినిపిస్తున్నాడు.

 

    "విజ్జూ" భుజంపై చేయి పడేసరికి ఆలోచనల్లోనుంచి తేరుకుంది విజూష.

 

    స్పూర్తి అంది - "నేను బాగుందీ అన్నది మన పక్కనవున్న సశ్యనబడే అమ్మాయి అందం గురించి మాత్రమేకాదే. కాకతాళీయంగా వినిపించిన మరో పందెం గురించి తెలిసి కూడా...."

 

    విజూష భావరహితంగా చూసింది.

 

    "నువ్వు గెలిచిన రుత్విని నీవాడిగా చేసుకుంటానని పందెం కాస్తే ఇక్కడ మరో అమ్మాయి ఓడిన రుత్వికి భార్య కావాలనుకుంటుంది. "

 

    "అయినా ఉక్రోషంగా అంది విజూష.

 

    "ఇష్టం వున్న ఆడపిల్లే అయితే కోరుకున్న మగాడి ఓటమి కోరుకుంటుందా?"

 

    "వైనాట్"ఒక రచయిత్రిలా విశ్లేషించింది స్పూర్తి.

 

    "సశ్య రుత్విని గాఢంగా ప్రేమించి వుండవచ్చు. పెళ్ళికోసం అడిగితే అతడు తను ఎలాగూ ఓడే అవకాశం లేదన్న పిచ్చి నమ్మకంతో ఓడితే పెళ్లి చేసుకుని ఫారెన్ వస్తానని మాటిచ్చి వుండొచ్చు."

 

    "అంటే?" విజూషలో ఆందోళన ఎక్కువైంది.

 

    "సశ్యకి రుత్వి పూర్వం పరిచయం వున్నట్లేగా"

 

    "ఉండకుండా  పెళ్లి ప్రసక్తి పందెం కాయడం, స్టేట్స్ కి వెళ్లడం అనే టాపిక్స్ ఎలా చోటు చేసుకుంటాయి విజ్జూ" విజూషని మృదువుగా రెచ్చగొట్టింది స్పూర్తి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS