Previous Page Next Page 
వజ్రాల పంజరం పేజి 10


    "దురదృష్టవంతురాలివి విజ్జూ. లేకలేక ఓ పందెం కాసేవ్. ఇంత కాలమూ ఏవన్నా సాధించగలిగిన నువ్వు, ఈ పందెంలో ఓడిపోతున్నావు."

 

    "నో" అంటూ అరవబోయి ఆవేశాన్ని నిగ్రహించుకుంది. "నేను ఓడిపోను."

 

    "నువ్వు గెలిచేది ఎట్లీస్ట్ గెలవడానికి ప్రయత్నించేది రుత్వి క్విజ్ కాంపిటీషన్ లో గెలిచినప్పుడు మాత్రమే. అలా చూడకు" మృదువుగా అంది స్పూర్తి.

 

    "ఒకవేళ రుత్వి ఓడితే మరో ఒప్పందం ప్రకారం సశ్యకి భర్తవుతాడు.

 

    "కాడు" అనాలని వున్నా అనలేకపోయింది విజూష.

 

    కనీసం ముఖ పరిచయమయినా లేని రుత్వి గురించి ఏ ధైర్యంతో అలా వాదించగలదు.

 

    అయినా విజూషకి ఇంకా రుత్వి గెలుస్తాడనే వుంది. అది కూడా కాదు.

 

    రుత్వి తన మనిషే అని మనసు నచ్చచెబుతోంది నమ్మకంగా.

 

    అయినా అదోలాంటి అసూయ.

 

    తలతిప్పి ఓరకంట సశ్యని చూసింది విజూష.

 

    రెండు పదులు దాటిన వయసు, అది గెలుపు తనదేనన్న  గర్వమో లేక రుత్వి  ఇప్పటికే తనవాడయ్యాడన్న భావమో కొన్ని క్షణాల క్రితం దాకా చచ్చి సమాధి అయిపోయిన నమ్మకాల క్రీనీడలో  అమె కళ్లలో నుంచి ఆశావాదంతో మళ్లీ పుట్టుకొస్తున్నట్టుగా వుంది.

 

    చేవలో ఎవరికెవరూ తక్కువకాని ఇద్దరు అమ్మాయిలు అలా టెన్స్ గా వున్న ఆ క్షణంలో...

 

    రేపిడ్ ఫైర్ రౌండ్ మొదలయింది.

 

    రుత్వి అనబడే ఒక యువకుడు ఏ వ్యక్తి మనిషవుతాడో తేల్చబోయే ఆఖరి ఘట్టంలా...

 

    "మిస్టర్ జగన్నాధ్...." క్విజ్ మాస్టర్ చేతిలో కార్డ్స్ ని చూస్తూ "రెండు నిముషాల వ్యవధిలో మీరు పది ప్రశ్నలకి జవాబు చెప్పాలి. నౌ యువర్ టైం స్టార్ట్స్" ప్రశ్నలడగడం ప్రారంభించాడు.

 

    "ప్రపంచంలో ఇప్పుడు అత్యధికంగా అమ్ముడయ్యే ఏస్పిరిన్ ఏనే టాబ్లెట్ మొట్టమొదట కనిపెట్టబడింది ఎప్పుడు?"

 

     "క్రీస్తు శకం 1890 లో"

 

    "ఏ దేశంలో కనిపెట్టారు?"

 

    "జర్మనీకి చెందిన బేయర్ డ్రగ్ కంపెనీ."

 

    "చైనాకి చెందిన గ్రేట్ వాల్ పొడవెంత?"

 

    " పధ్నాలుగువందల మైళ్లు"

 

    "రైట్. షాజహాన్ భార్య అయిన ముంతాజ్ కి ఎంత మంది పిల్లలు?"

 

    "పద్నాలుగుమంది."

 

    "ముంతాజ్ కి చనిపోయేనాటికి ఆమె వయసెంత?"

 

    "ముప్పైతొమ్మిది"

 

    "రైట్! టునీషియాలో వాడే భాషలు."

 

    "అరబిక్ .. ఫ్రెంచ్"

 

    "అమెరికాలోని సి. ఐ. ఎ. ని ప్రారంభించిన ప్రెసిడెంట్ పేరు?"

 

    "హారిట్రూమన్"

 

    "కరెక్ట్. మనిషిని పొలిటికల్ ఏనిమల్ అన్న ఫిలాసఫర్ ఎవరు?"

 

    "అరిస్టాటిల్"

 

    " వెరీ కరెక్ట్. దశావతారాలలో కృష్ణుడు ఎన్నో అవతారం?"

 

    "ఆరు."

 

    "రాంగ్. పది మార్కులు మైనస్ చేయబడుతుంది మిస్టర్ జగన్నాధ్. కృష్ణావతారం ఎనిమిదోది."

 

    "జూరాష్ట్రియన్ మతంలో శవాన్ని దహనం చేస్తారా? ఖననం చేస్తారా?"

 

    "ఖననం చేస్తారు"

 

    "రాంగ్... ఎనదర్ మైనస్ టెన్ మార్క్స్ మిస్టర్ జగన్నాధ్. జూరాష్ట్రియన మతంలో శవాన్ని ఎత్తయిన ఫ్లాట్ ఫామ్స్ పై వుంచుతారు. పక్షులస ఆహారంగా తీసుకోవడానికి వీలుగా. "

 

    క్షణం ఆగిన క్విజ్ మాస్టర్ -

 

    "నౌ ఇట్స్ మిస్టర్ సురేంద్ర" అంటూ ప్రశ్నల్ని సందించడం ప్రారంభించాడు.

 

    "హిందు అనే పేరు ఎలా వచ్చింది?"

 

    "సంస్కృత పదం సింధునుంచి వచ్చిన పేరది."

 

    "సింధు అంటే?"

 

    "నది అని అర్దం."    

 

    "రైట్. బెస్ట్ మాన్ అవార్డ్ దేనికి చెందింది."

 

    క్షణం ఆలోచించిన సురేంద్ర " పాస్" అన్నాడు జవాబు తెలీదన్నట్టుగా.

 

    "ఉత్తమ అంతర్జాతీయ వైమానిక సర్వీసులకిచ్చే అవార్డుని 'బెస్ట్ మాన్' అవార్డు అంటారు.


 
     నెక్ట్స్... 1997 లో ఇంటర్ పోల్ సమావేశాలు ఏ దేశంలో నిర్వహించాలని నిర్ణయించారు?"

 

    "ఇండియా"

 

    "రైట్"

 

    "అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఉపాధ్యక్షునిగా ఎన్నికయిన భారతీయుడి పేరు."

 

    "పి. టి. ఉపర్ కోయా."

 

    " ఆసియా ఖండంలో మొట్టమొదటి బిషప్"

 

    "పాస్"

 

    "భద్రాచలంలోని గుడ్ సమారిటన్ ఇవాందజిలికాల్ చర్చికి చెందిన ఎ. కాటక్షమ్మ . నౌ ప్రధమశ్రేణి క్రికెట్ అంపైర్ గా అర్హత పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ."

 

    "సుమతీ అయ్యర్"

 

    "రైట్!"

 

    బజర్ మోగడంతో "రెండు నిమిషాల వ్యవధి పూర్తయిపోయింది మిస్టర్ సురేంద్ర. ఇట్స్ నౌ మిస్టర్ రమేష్ అంటూ మూడో పార్టిసిపెంట్ వైపు తిరిగాడు క్విజ్ మాస్టర్.

 

    "భద్రతామండలి తాత్కాలిక సభ్య దేశ స్థానానికి పోటీపడిన దేశాలు ఏవి?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS