Previous Page Next Page 
వజ్రాల పంజరం పేజి 8


    "ఇండోనేషియా"

 

    "వెరీ కరెక్ట్. సీ మిస్టర్ రమేష్, 1964 ఒలింపిక్స్ లో ఎన్నిదేశాలు పాల్గొన్నాయి?"

 

    "తొంబై నాలుగు"

 

    "రైట్. ఇప్పుడు మిస్టర్ రిత్వి. ఒలింపిక్ స్పోర్ట్ గా "జూడో" ఎప్పుడు తొలిసారి పరిచయం చేయబడింది."

 

    "1964 టోక్యో ఒలింపిక్స్ లో" నిశ్చలంగా జవాబు చెప్పాడు రుత్వి.

 

    "ఫెంటాస్టిక్. మిస్టర్ జగన్నాధ్ ఇట్స్ యువర్ టర్న్ అగైన్. ఐరోపా ఖండంలో "వైట్ సిటీలో అన్న" పేరుగల నగరం ఏది?"

 

    "బెల్ గ్రేడ్"

 

    " గుడ్ మిస్టర్ సురేంద్ర. ప్రపంచంలో గ్రేనేట్  సిటీ అనే నగరం పేరేది. అది ఏ దేశానికి చెందినది?"

 

    "స్కాట్ లేండ్ లోని ఆబర్డీన్."

 

    "రైట్" క్విజ్ మాస్టర్ రమేష్ ని చూస్తూ అడిగాడు.

 

    "లావోస్ దేశానికి చెందిన ముఖ్యమైన భాషలు రెండు చెప్పండి."

 

    "లావో అండ్ ఫ్రెంచ్"

 

    "మిస్టర్ రిత్వి! అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఓ రాష్ట్రంపేరు అలాస్కా. అయితే ఈ ప్రాంతాన్ని మరో దేశం నుంచి కొనడం జరిగింది. యు ఎస్  ఎ కి అలాస్కాని అమ్మిన దేశం పేరు?

 

     క్షణం ఆగాడు రుత్వి.

 

    మనసు మొగవేపు దూసుకొస్తున్న ఆలోచనల ముళ్లు విజూష గుండెలను గుచ్చుకొనకముందే రుత్వి చెప్పాడు" యు ఎస్. ఎస్ ఆర్"

 

    "వెరీ కరెక్ట్" అంటూ అభినందించాడు క్విజ్ మాస్టర్.

 

    తేలికపడింది విజూష మనసు.

 

    కలలోకి వచ్చి తనతో కొంతసేపు గడిపి వెళ్లిపోయిన మిలింద్ లా వున్నందుకే రుత్విమీత ఇష్టాన్ని పెంచుకుందో లేక గెలిచిన రుత్విపై తను మాత్రమే గెలుపు సాధించాలన్న ఉత్సుకతతో నిజాయితీగా రుత్వి విజయాన్ని కాంక్షిస్తూందో ఆమెకే తెలియదు.

 

    ఎన్నేళ్ల శూన్య సామ్రాజ్యమైనాగానీ యవ్వనపు స్పందనల్ని నీరవంలో నిక్షిప్తం చేసి నిశీధి ప్రకాదశిలా చాలాదూరం నడిచింది. మనో ప్రాకారాన్ని చుట్టుకున్న ఆలోచనల తీగలని సుతిమెత్తగానో  ముగ్దత్వాన్ని మరిలి కోపంతోనో ఇంతకాలమూ రవలించకుండా  ఆపగలిగింది గానీ అదేంటో మరి ఆమె ఈ క్షణం కొబ్బరిమొవ్వులోకి జారే వెన్నెల బిందువవుతుంది. నిదురుపోతున్న నోరులేని స్మృతుల్ని తట్టిలేపి కలత రేపుతున్న ఏ చిరుస్వప్నాల చిరునామానో తెలుసుకోవాలని తొందరపడుతుంది.

 

    ఎంతసేపు అలా ఆలోచనల మధ్య కూరుకుపోయిందో ఆమెకే తెలీదు. చప్పట్ల మోతతో వాస్తవంలోకి వచ్చింది విజూష.

 

    టీవీలో కనిపిస్తున్న  ఆడిటోరియం జనాన్ని చూస్తూ అంది స్పూర్తితో "క్విజ్ కాంపిటీషన్స్ జరుగుతున్నది రవీంధ్రభారతితోనా?'

 

    "ఎక్కడైతేనేం... మొదటి రౌండ్ పూర్తయింది."

 

    "వ్వాట్" అసంకల్పితంగా బయటికే అనేసింది విజూష. తను అంతసేపు  పరిసరాలను మరిచిపోయి రుత్వికి సంబంధించిన ఆలోచనల్లో కూరుకుపోయింది.

 

    అర్దంకానట్టు తననే చూస్తున్న స్పూర్తితో అంది విజూష" సరిగా ఫాలో కాలేదు స్పూర్తీ"

 

    "నువ్వు అదోలా వుండటం చూసి రుత్వి గురించి బాధపడుతున్నావనుకున్నాను."

 

    విస్మయంగా అడిగింది విజూష మళ్లీ "రుత్వి గురించి బాధ దేనికే?"

 

    "అంటే మొదటి రౌండ్స్ లోరిత్వి వెనకబడ్డ విషయం నీకు తెలీదన్నమాట."

 

    విజూషలో సన్నని ప్రకంపన.

 

    "అవును విజ్జూ... మొదటి రౌండు పది ప్రశ్నల్లో ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పలేనిది రుత్వి మాత్రమే."

 

    పేలుతున్న రంగు బుడగల స్వప్నాన్ని చూస్తున్నట్టు వున్నట్టుండి మనసేం ఇలా ఆత్రపడుతూంది.

 

    డయాస్ పైనున్న రుత్విలో మార్పులేదు.

 

    ఎన్ని సత్యాలని తెలుసుకున్నా ఇంకా మండే పిపాసలా చూపుల ఊహకి అందని సూక్ష్మంలా ... ఎగరని తరంగంలా.. ముడుచుకున్న విహంగంలా... మందహాసంలా... మహాస్త్రంలా... కవచంలా... ప్రవచనంలా.... బిందువులా... సింధువులా....


 
    "నౌది సెకండ్ రౌండ్ స్టార్ట్స్" క్విజ్ మాస్టర్ జగన్నాధ్ ని చూస్తూ "ఈ రౌండ్ వో మన  దేశానికి సంబంధించిన ప్రశ్నల్ని మాత్రం అడబోతున్నాను"

 

    "మన దేశంలో తొలిసారి జాతీయ పతాకాన్ని జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోటపై ఎగురవేసింది ఎప్పుడు?"

 

    "1947 ఆగష్టు పదిహేను"

 

    "రైట్" ఇప్పుడు సురేంద్రుని అడిగాడు. "మన  జాతీయ చిహ్నమైన మూడు సింహాల క్రింద పీఠంలోధర్మచక్రానికి రెండువైపులా రెండు బొమ్మలుంటాయి. అవి ఏంటి?"

 

    "ఒకటిఎద్దు, రెండోది గుర్రం"

 

    "మన నేషనల్ కేలండర్ తొలిసారి అమల్లోకి వచ్చిన సంవత్సరం?'

 

    "1957 మార్చి 22వ తేదీ " అన్నాడు రమేష్.

 

    "ఫైన్" రమేష్ ని అభినందిస్తూ ఇప్పుడు రిత్విని చూపిన క్విజ్ మాస్టర్ "ప్రశ్న కాస్త  క్లిష్టమైనది. అయినా మీరు చెప్పగలరన్న నమ్మకం నాకుంది మిస్టర్ రుత్వి" అన్నాడు అణువంత ఉత్సాహపరుస్తూ.

 

    "కేలండర్ అన్నది ప్రారంభం కావలసింది జనవరి ఒకటో తేదీన మరి మార్చి 22వ తేదీన అమలు చేయడంలో ఉద్దేశ్యం ఏమిటి?"

 

    భావరహితంగా చూసాడు రుత్వి.

 

    ఆ విరామాన్ని కూడా భరించలేకపోయింది విజూష, మరోసారి రుత్వి విఫలం కాబోతున్నాడు.

 

    "గ్రెగేరియన్ అనబడే ఇంగ్లీష్ కేలండర్ లానే శక సంవత్సరం ఆధారంగా మొదలైన మన కేలండర్ లోనూ ఏడాదికి 365 రోజులుంటాయి అయితే మార్చి 22వ తేదీన అమల్లోకి రావడానికి కారణం మన కొత్త సంవత్సరం చైత్రమాసంలో మొదలవుతుంది కాబట్టి ఆ  చైత్రమాసం తొలి రోజు మార్చి 22 వ తేదీ కాబట్టి."

 

    కరతాళధ్వనుల్తో రుత్విని అంతా అభినందిస్తుంటే....

 

    "అయితే ఓ ఏడాది మాత్రం చైత్రమాసం మార్చి 21వ తేదీన ప్రారంభమవుతుంది. అదే లీపు సంవత్సరం" అన్నాడు అప్పటికిగాని తను చెప్పాల్సింది పూర్తికానట్టుగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS