ఊపిరి బిగపట్టుకున్నాడు.
మరో అర నిముషం గడిచింది.
ఓ భయంకరమైన విస్ఫోటనంతో భూమి దద్దరిల్లడంతోపాటు అక్కడ ఇల్లు నేలమట్టమై పోయింది.
పీలికలైపోయిన ఆకారం అవయవాలు చెదురు మదురుగా పడ్డాయి.
ఓ అరక్షణంపాటు గుండెల్ని గుప్పిట పట్టుకున్న కాలనీవాసులిప్పుడు ఆ ఇంటివేపు పరుగెత్తు కొస్తున్నారు.
"వ్వాట్" డి.సి.పి. అవినాశ్ చేతిలోని రిసీవర్ జారిపోయింది... అక్కడ శశాంక ఇంటి దగ్గర బ్లాస్ట్ లో చనిపోయింది ఓ సబ్ ఇన్ స్పెక్టర్.
శశాంక ఇంటిలో తప్పనిసరిగా ఓ ఆధారం దొరికి తీరుతుందని అనుమానించిన అవినాశ్ జీపులో శశాంకతో బాటు అతడింటికి వెళుతూ మార్గ మద్యంలో మనసు మార్చుకుని శశాంకని సరాసరి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చాడు. శశాంకని అక్కడ నిర్భంధించి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గా తనకున్న అధికారాన్ని ఉపయోగించుకున్నాడు. వారెంటుతో సంబంధం లేకుండా శశాంక ఇంటికి సోదా చేయమని ఓ ఎస్.ఐ.ని పంపాడు. ఆ ప్రయత్నంలో బలైపోయాడు ఎస్.ఐ. డైనమైట్ మూలంగా.
నిస్త్రాణగా కొన్ని క్షణాలపాటు నిశ్శబ్దంగా వుండిపోయిన అవినాశ్ పోలీస్ కమీషనర్ కి ఫోన్ చేశాడు.
అప్పుడు తెలిసింది ఎదురుగా కూర్చున్న శశాంకకి జరిగిందేమిటో...
మరో పది నిముషాలలో శశాంకతో బాటు అవినాశ్ శశాంక ఇంటిని చేరుకున్నారు.
చుట్టూ జనం... జనం మధ్యగా పీలికలై పోయిన ఎస్.ఐ. శవం బేలస్టిక్ ఎక్స్ పర్ట్స్ పదిహేను నిమిషాల వ్యవధిలో చెప్పేశారు జరిగిందేమిటో.
ఇదంతా వినడంలేదు శశాంక... నేలమట్టమైన తన ఇంటినే చూస్తున్నాడు.
ఇక్కడే పదిహేను సంవత్సరాల క్రిందట తను అడుగు పెట్టింది. ఈ కుటీరంలోనే తను తీర్చిదిద్దబడింది. ఈ పర్ణశాలలోనే ప్రేమించ బడిందీ, ప్రేమను పంచిందీ, ఆ ప్రేమ సమాధి అయ్యిందీ... మొన్న తన వాళ్ళూ అనిపించుకున్న మనుష్యుల్ని పోగొట్టుకుంటే ఇప్పుడు ఆ స్మృతులకి హద్దులుగా వున్న ఆలయాన్నీ దక్కించుకోలేకపోయాను. కసి, ద్వేషం మనసు పొరల్లో వున్న విచక్షణ మిగిలి వుంటే ఇదిగో ఈ కూలిన గోడల క్రింద సమాధి అయిపోయింది.
స్థాణువులా నిలబడ్డ శశాంక భూజమపై చేయిపడింది. అలా ఆత్మీయంగా పరామర్శించింది డి.సి.పి. అవినాశ్.
"యాదృచ్చికంగా నేను తీసుకున్న నిర్ణయంలో నష్టపోయింది ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని. శశాంకా నా మూలంగానే నువువ్ బ్రతికావని నన్ను అభినందించమనడం లేదు. నువ్విప్పుడు వేసే ప్రతి అడుగూ ఎంత జాగ్రత్తగా పడాలో తెలుసుకోమంటున్నాను. ఇక్కడ తప్పిపోయినా ప్రత్యర్థులు నిన్నంత తేలిగ్గా వదిలి పెడతారని నేననుకోను. చెప్పు నువ్వు కోరుకుంటున్న న్యాయం నీ ఒక్కడి మూలంగా సాధ్యపడకపోవచ్చు. నాకు కొన్ని వివరాలు తెలియచేస్తుంటే నేనూ సహకరించే ప్రయత్నం చేస్తాను."
"ప్రత్యర్థి ఎవరో మీకూ తెలుసు అవినాశ్ గారూ... మరి అరెస్ట్ చేయరేం" భావరహితంగా అన్నాడు శశాంక.
నిర్లిప్తంగా చూసాడు అవినాశ్. "నాకూ కొన్ని పరిమితులున్నాయి శశాంక. కాబట్టే సమయం కొం నేనూ వెయిట్ చేస్తున్నాను."
"ఈలోగా ఇలాంటి అనర్థాలు చాలా జరిగిపోతాయి."
"అవి జరగకూడదంటే కొన్ని అడ్వాన్సు ఇన్ ఫర్ మేషన్స్ నాకివ్వాలి."
"ఇచ్చినా అరెస్ట్ చేయడానికి మీకూ ఆధారాలు కావాలిగా."
"ఏ నేరస్థుడైనా తప్పు చేసి తప్పించుకుంటున్నాడూ అంటే అదో విజయమని గర్వపడనక్కరలేదు. అవి క్రమంగా శిక్షాస్మృతి చేతికందడానికి పేర్చుకుపోతున్న మెట్లుగా అనుకోవాలి.." సాలోచనగా చూస్తూ అన్నాడు అవినాశ్. "ఈ సత్యం నువ్వూ తెలుసుకోవాలి"
"నేనూ నేరం చేసినట్టుగా ఆధారాలు లేవుగా"
"యస్... లేవు కాబట్టే లేని ప్రసాదు పేరుతో నిన్ను నువ్వు రక్షించుకోగలిగావు"
సమీపంలో మరో బాంబ్ పేలినట్టు అదిరిపడ్డాడు శశాంక...
"అవును శశాంకా! ప్రసాద్ లేడని నాకు తెలుసు. కాని రికార్డ్స్ ప్రకారం అతడున్నాడు. అది నువ్వు అడ్వాంటేజ్ తీసుకున్నావు. ఆ విషయం నాకు తెలిసినా నిశ్శబ్దంగా వుండిపోయాను. కాస్త శ్రమ పడితే నువ్వే నేరస్థుడివని సర్కమ్ స్టేన్షియల్ ఎవిడెన్స్ సృష్టించడం నాకు కష్టం కాదు. అయినా వూరుకున్నాను. ఎందుకో తెలుసా. చట్టాన్ని తప్పుదోవ పట్టించిన ప్రత్యర్థి ఆ తప్పు దోవలోనే తనూ శిక్ష అనుభవించాలని. వెల్... రూపని ఎత్తుకుపోయింది జయచంద్ర మనుషులు. ఇది తెలుసుకోడానికి పెద్ద మేథస్సు అవసరం లేదు. అయితే వాళ్ళు నిన్నెక్కడకు రమ్మన్నదీ, రూపని ఎక్కడ దాచిందీ ఆ వివరాలు కనుక్కుని నువ్వు చెప్పగలిగితే చాలు. తర్వాతైనా సరే నా ప్రయత్నం నేను చేస్తాను"
జయచంద్రపై జరిగిన హత్యా ప్రయత్నంలో పరోక్షంగా అవినాశ్ తననెలా కాపాడిందీ అప్పటికే తెలుసుకున్న శశాంక తల పంకించాడు సుముఖంగా. "ఆ విషయం స్పష్టంగా నాకూ తెలీదు మిస్టర్ అవినాశ్. తప్పకుండా తెలుసుకుంటాను. ఇప్పుడు నీకు జరిగిన యీ కష్టానికి బాధ పడటం లేదు కాని రూప విషయంలోనే భయపడుతున్నాను. ఒకవేళ నా మూలంగా రూపకేమైనా జరిగితే" ఓ క్షణం నిర్లిప్తంగా చూశాడు. "అప్పుడు మీకేమీ తెలియజేయలేను. కారణం అదే నా పోరాటంలో చివరి అధ్యాయం అవుతుంది కాబట్టి"
