మొదటగా వెళ్ళిన ఇంట్లో... ఓ యాభైఏళ్ళ ముస్లిం స్త్రీ బయటికి వచ్చి "ఎవరుకావాలి" అని ప్రశ్నించింది.
"రషీద్ గారు కావాలి" అన్నాను.
"ఆయన హైద్రాబాద్ వెళ్ళారు. క్లైంట్సా?" అడిగింది.
"అవును. ఆయన భార్యగారు కావాలి" అన్నాను.
"నేను ఆయన భార్యనే, నాతో ఏం పని?" మావైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది.
నా ఆశ చచ్చిపోయింది. "సారీ... మాకు తెలిసిన రషీద్ గారి భార్య పేరు ఇంద్రాణి" అన్నాను.
"తప్పు అడ్రస్ కి వచ్చారు" అని ఆవిడ ఇంక వెళ్ళమన్నట్లు చూసింది.
నా నిరుత్సాహం చూసి లిల్లీ, ఇలా కాదని ఫోన్ లో ఎంక్వైరీ మొదలెట్టింది. ఇద్దరి నెంబర్లు ఎంత రింగ్ అయినా ఎవరూ లిఫ్ట్ చెయ్యలేదు.
"బహుశా... ఈ ఇద్దరిలో ఒకరు అయివుంటారు" ఎంతో ఉత్సాహంగా చెప్పింది.
"మరి...లిఫ్ట్ చెయ్యడం లేదుగా..." అన్నాను.
"ఊళ్ళోనో ఇంట్లోనో వుండకపోవడం ఒక్కటే కారణం కానవసరంలేదు. టెలిఫోన్ ఫాల్ట్ కూడా అయివుండవచ్చు! వెళ్ళిచూద్దాం!" అంది లిల్లీ.
సమస్యని ఓడించాలంటే మనం దానికి తల ఒగ్గకూడదు. త్వర త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని లిల్లీని చూసి నేర్చుకున్నాను.
ఇద్దరం ఆటోలో గాంధీచౌక్ దగ్గరున్న ఆ ఇంటిని డోర్ నెంబర్ సాయంతో పట్టుకున్నాం.
ఇంటి బయట గేటు దగ్గరే అందంగా పాలరాయిమీద మొహమ్మద్ రషీద్, అడ్వకేట్ అన్న అక్షరాలు మెరుస్తూ నన్ను వూరిస్తూ కనిపించాయి. ఈ రషీద్ తప్పకుండా చంద్ర స్నేహితుడే అయివుంటాడు అని నిశ్చయంగా అనిపించింది. లోపల కారు షెడ్డులో ఓపెల్ ఏస్ట్రాకారు హుందాగా వుంది.
"కారు షెడ్డులోవుంది అంటే, ఆయన ఇంట్లోనే వున్నాడన్నమాట!" ఉత్సాహంగా అంది లిల్లీ.
"కుక్క వున్నది జాగ్రత్త" అన్న బోర్డు మమ్మల్ని గేటు బయటే నిలబెట్టేసింది.
మొక్కలకి నీళ్ళుపోస్తున్న తోటమాలి మమ్మల్ని చూసి "సార్...ఆఫీసులో కలుస్తారు" అని ఆఫీసు అడ్రెసు చెప్పబోయాడు.
"ఇప్పుడు ఇంట్లోలేరా?" అడిగాను.
"ఉన్నారు. ఇంటిదగ్గర ఎవరితో మాట్లాడరు"
లిల్లీ తన కార్డు ఇచ్చి "హైద్రాబాద్ నుండి వచ్చాం. కేసు పని మీద కాదని చెప్పు" అంది.
"సరే...వుండండి" అని అతను లోపలికి వెళ్లాడు.
"కొంపదీసి రాంజెఠ్మలానీ లాంటి లాయర్ కాదు కదా! లెవల్ చూస్తుంటే అలాగే వుండి" అంది.
ఇంతలో ఓ గన్ మేన్ బైటికివచ్చి "ఇద్దరూ కలవాలా?" అని అడిగాడు.
"అవును!" అన్నాము.
"రండి...ఐదు నిమిషాలకి మించి టైం లేదుట!" అని గేటుతీశాడు.
బ్రతుకు జీవుడా అనుకుంటూ లోపలికి నడిచాం. నా కళ్ళు కుక్కల కోసం భయంగా గాలిస్తూనే వున్నాయి.
హాల్లో ఓ భారీ కాయం రిమ్ లెస్ కళ్ళద్దాలలోంచి మిమ్మల్ని పరికిస్తూ "రండి...కూర్చోండి" అన్నాడు.
"నమస్తే. మేము చంద్ర అనే మీ ఫ్రెండ్ అడ్రెస్ కోసం వచ్చాము" అని నేరుగా ప్రస్తావించింది లిల్లీ.
ఆయన మొహంలో అదోలాంటి విస్మయం పొడసూపింది. "చంద్రా?" అన్నాడు.
నేను మనసులో దైవప్రార్థన మొదలెట్టాను.
ఇతనికి తప్పకుండా చంద్ర తెలుసు...ఇంకా కాసేపట్లో చెప్పబోతాడు అనుకున్నాను.
ఆయన ఇంట్లోకి ఒక్కసారి తొంగిచూసి, గొంతు తగ్గించి "చంద్ర గురించి ఇంతకాలం తర్వాతం మీరు వచ్చి ప్రశ్నించడం నాకు ఆశ్చర్యంగా వుంది!" అన్నాడు.
నేను ఆనందంతో కేక వెయ్యబోయి ఆపుకుని "అవును... త్వరగా చెప్పండి. మీకు చంద్ర అడ్రెస్ తెలుసా?" అన్నాను.
ఆయన కళ్ళజోడు తీసి తుడుచుకుంటూ -
"అదంతా ఓ పెద్ద కథ..." అన్నాడు.
నా గుండెకొట్టుకునే వేగం నాకు తెలుస్తోంది. "ఏమైంది?" అన్నాను.
"దాదాపు పదేళ్ళ అనుబంధం... ఎన్నో తీపి జ్ఞాపకాలు...మరిచిపోదామన్నా మరపురావు" అని ఆగి మళ్ళీ లోపలికి తొంగి చూశాడు.
"త్వరగా చెప్పండి...మేం చంద్రని అర్జెంటుగా కలుసుకోవాలి" అంది లిల్లీ.
"మీకు చంద్రతో ఏం పని?" కాస్త అనుమానంగా అడిగాడు.
"మా అక్కకు బాగా స్నేహం. ఆమె డైరీలో రాసిన దాన్నిబట్టి అంతగొప్ప వ్యక్తిని కలుసుకోవాలని అనుకున్నాం. మా అక్క కాళింది...మీకు తెలిసే వుంటుంది" గడగడా చెప్పేశాను.
ఆయన ఆలోచించి "గుర్తుకురావడం లేదు" అన్నాడు.
"సరే...ముందు చంద్ర సంగతి చెప్పండి" అంది లిల్లీ.
అక్కపేరు వినగానే స్పందించాల్సిన వ్యక్తి ఇంత మామూలుగా 'గుర్తులేదు' అంటాడేవిటీ అనుకున్నాను.
నాకు మళ్ళీ నిరాశ మొదలైంది.
"చంద్ర నా జీవితంలోకి అనుకోకుండా ప్రవేశించింది. ఆ పరిచయం స్నేహంగా, స్నేహం...ప్రణయంగా మారడానికి ఎంతోసేపు పట్టలేదు. మా ప్రేమ సంగతి నా భార్యకి తెలిసి గొడవైంది.
