నిర్లిప్తంగా ఫోన్ పెట్టేసిన శశాంక బయలుదేరబోతూ అన్నపూర్ణని చూశాడు. "రూపాని నిజంగానే కిడ్నాప్ చేశారమ్మా... దీనికి కారణం నేను..." భావరహితంగా చెప్పుకు పోతున్నాడు. "ప్రత్యర్థులు ఎవరన్నా కాని రూపని క్షేమంగా ఇక్కడికి పంపే ఏర్పాటు చేస్తాను."
వెళ్తున్న శశాంక భుజంపై చేయివేశాడు అవినాశ్. "ఫోన్ చేసిందెవరు..."
ఓ అయిదడుగులు ముందుకేసిన శశాంకకి తెలుసు తను చెప్పి వివరాలని అయినా కొంత తెలియచేయాలనుకుంటూ "ప్రసాదనీ అంటారు" తల వంచుకునే అన్నాడు.
"ఐసీ" తల పంకించిన అవినాశ్ "ఇంకా ఏం కండిషన్స్ పెట్టాడు" అడిగాడు నిశితంగా చూస్తూనే...
"చెబుతాను అవినాశ్ గారూ కాని దయుంచి ఇప్పుడు నన్ను ఫోర్స్ చేయకండి"
శశాంక మానసికంగా ఏ స్థితిలో వున్నదీ అర్థం చేసుకోలేని వివేకి కాదు అవినాశ్.
విషయాన్ని జాగ్రత్తగా టేకిల్ చేయాలనుకున్నాడు" రండి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను" అన్నాడు జీప్ దగ్గరికి నడుస్తూ...
కాదనలేకపోయాడు శశాంక.
జీపు నడుపుతున్న అవినాశ్ ఆలోచిస్తున్నదొక్కటే. ఇందాక ఇంకా ఫోన్ లో మాటాడేటప్పుడు "మా ఇంట్లో అన్నాడు అవతలి వేపు వ్యక్తితో... అంటే శశాంక మాటలతోనే రూప విషయంలో ఓ ఆదారం దొరికింది.
అనుభవనీయుడైన పోలీసాఫీసరుగా అవినాశ్ ఆ క్షణంలో ఏం నిర్ణయం తీసుకుంటున్నదీ శశాంకకి తెలీదు.
జీప్ వేగం పెరిగింది.
* * * *
సరిగ్గా ఇదే సమయంలో...
స్టార్ హోటల్ 'సోనీ' రూం నెంబరు 302లో హఠాత్తుగా కేకలు వినిపించాయి. ఫ్లోర్ సూపర్ వైజరు, బేరర్సు పరుగెత్తుకు వచ్చేసరికి ఆ సూట్ లో అద్దెకుంటున్న 'ఆక్యుపేంట్' గిలగిలా నేలపై పడి కొట్టుకుంటున్నాడు...
అతడికి అభిముఖంగా అదే హోటల్ నుంచి తెప్పించుకున్న డిన్నర్ ప్లేటు సగం మాత్రమే ఖాళీ అయివుంది.
జరుగుతున్నదేమిటో తెలుసుకునే లోగానే పక్క గదుల్లోనుంచి కస్టమర్స్ తో బాటు హోటల్ మేనేజరూ అక్కడికి చేరుకున్నాడు.
ముందు 'ఎపిలెప్సీ' లాంటి మూర్ఛ రోగమనుకున్నారు. కాని కాదని తెలుసుకోడానికి పట్టింది అరనిముషమే.
వాంతి చేసుకుంటున్నట్టు గొంతు నుంచి శబ్దం చేస్తున్న ఆ వ్యక్తి కడుపు పట్టుకునే డిన్నర్ ప్లేట్ వేపు చూపిస్తున్నాడు...
హోటల్ మేనేజర్ ఆ వ్యక్తిని హడావుడిగా కారులోకి ఎక్కించి హాస్పటల్ కి తీసుకు వెళ్ళాడు.
బేరర్స్ డిన్నర్ ప్లేటుని తీసుకెళ్ళబోతుంటే "ఆగు" అంటూ వారించాడో కస్టమర్... "నా అనుమానం ఫుడ్ పాయిజనింగ్ జరిగుండాలి. ఆ ప్లేటు అలాగే వుంచు."
అక్కడంతా చూస్తుండగానే ఆ వ్యక్తి పోలీసులకి ఫోన్ చేశాడు.
మరో అయిదు నిముషాలలో లోకల్ పోలీస్ రావడమూ అక్కడ ప్లేటులోని అన్నాన్నీ కూరల్ని పేక్ చేసి గవర్నమెంటు లేబరేటరీస్ కి పరీక్ష కోసం పంపాలని నిర్ణయించడమూ జరిగిపోయింది.
సుమారు ఏడు సంవత్సరాల క్రిందట సిటీలో నిర్మించబడిన ఆ హోటల్ రాష్ట్రంలో అతి ప్రాచుర్యం గలది. అటు ఇండియన్ ఎయిర్ లైన్స్, ఎయిర్ ఇండియా విమానాలకి కేటరింగ్ కాంట్రాక్టులో ఆహార పదార్థాలను సరఫరా చేయడంలో ఏడాదికే లక్షల్లో రాబడిని పొందుతున్న హోటల్.
అంతకు మించి టూరిస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వారు స్పాన్సర్ చేసే స్టార్ హోటల్ గా హైద్రాబాద్ వచ్చే విదేశీయుల్ని సైతం ఎక్కువ ఆకట్టుకుంటున్నది.
ఆ హోటల్లో ఇలాంటి సంఘటన జరగడం ఇదే తొలిసారి.
ఈ విషయం ఏమాత్రం నిర్ధారించబడినా, పత్రికల వరకూ వెళ్ళినా ఆ హోటల్ చరిత్రకి అదే ఆఖరి రోజు కావడంతో బాటు ఇక కోలుకోవడమంటూ వుండదు. ఆ హోటల్ యజమానురాలు మాఫియా ఎంప్రిస్ సోఫియా.
* * * *
రాత్రి తొమ్మిది గంటలు కావస్తూంది.
ఆ కాలనీలో జన సంచారం అప్పటికే పలచబడి పోయింది. రోడ్డుపై స్థంభాలకున్న సోడియం నేపర్ లైట్ల కాంతులు చీకటి కక్కుకుంటున్న నెత్తురు మరకల్ని గుర్తు చేస్తున్నాయి.
నెలకి సుమారు డెబ్బై అడుగుల ఎత్తులో నిర్మించబడిన వాటర్ రిజర్వాయర్ పైకూర్చున్న జయచంద్ర అనుచరుడు. దూరంగా వున్న శశాంక ఇంటినే గమనిస్తున్నాడు.
తెల్లవారేదాకా అక్కడే వుండి ఆ ఇంట విస్ఫోటం జరిగిన మరుక్షణం వార్త జయచంద్రకి తెలియజేయాలి... అది తిరుగులేని ఆదేశం. రూప విషయంలో తక్కిన వివరాలు ఆ ఇంట్లోనే దొరుకుతాయని సర్కార్ ఫోన్ లో చెప్పింది శశాంక ఆ ఇంటికి రావాలని... తలుపు తెరిచిన మరుక్షణం అతడి కథ ముగిసిపోవాలనీను...
మరో రెండు నిముషాలు గడిచాయి నిశ్శబ్దంగా.
అప్పుడు చూశాడు రిజర్వాయర్ పై కూర్చున్న వ్యక్తి ఓ జీపు శశాంక ఇంటిముందు ఆగటాన్ని.
