Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 88


    రాబోతున్న తుమ్ముల్ని ఆపుకుంటూ అన్నాడు... "అదేం కాదు."
    
    "మరి!"
    
    "నా ఇంటికి వచ్చిన అతిథి ఓడించి ఇబ్బందిపెట్టకూడదని." అణువంత అహంతో తన ఓటమిని సమర్ధించుకోవాలనుకున్నాడు గాని, టక్కున అంది ప్రబంధ... "వంకాయ్"
    
    "అదేమిటి?"
    
    "వంకాయ కబుర్లు మానేయండీ అంటున్నా."
    
    చిర్రెత్తుకొచ్చింది ఆదిత్యకి. "అయితే చెప్పండి."
    
    "ఏమిటి?"
    
    "వంకాయకి సంస్కృతంలో చాలా పేర్లున్నా ఓ అయిదుపేర్లు చెప్పండి?"
    
    అవాక్కయి చూసింది పరిహాసంగా అంటున్నాడేమో అని.
    
    "ప్రబంధా....నేను జోక్ వేయడంలేదు. ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి" రెట్టించాడు.
    
    "రేపు చెబుతాను."
    
    "ఇప్పుడే చెప్పాలి."
    
    "ఎంత వ్యవధిలో చెప్పాలో మనం ముందు నిర్ణయించుకోలేదు."
    
    నిశ్శబ్దంగా వుండిపోయాడు.
    
    ఆదిత్య మౌనం బాధని కలిగించిందేమో బిడియంగా అంది- "మీరు చెప్పండి."
    
    నేలచూపులు చూస్తూ అన్నాడు- "భంతాక, వార్తాక, హిందీర, వంగన భన్నాక."
    
    "ఓ.కె!"
    
    అప్పుడు చూశాడు ఆదిత్య.
    
    విద్యుద్దీపపు కాంతిలో స్పటికాల్లా మెరుస్తున్న ప్రబంధ భుజాలు అప్పటికే ఆమె బ్లౌజ్ తీసేసిన సత్యాన్ని గుర్తుచేస్తున్నాయి.
    
    మాటకోసం ఆమె ఏదైనా చేయగల తెగువ గల అమ్మాయిగా తెలుసుగాని, ఇంత సాహసం- అదీ ఇలా తనముందు ప్రదర్శించగలదను కోలేదు.
    
    "మీరు సంశయించాల్సిన పనిలేదు ఆదిత్యా! నేను మాటకి కట్టుబడతాను" ఇప్పుడూ ఆమెలో సహజసిద్దమయిన అహంకారమే ఓటమిని సైతం రాజసంగానే అంగీకరించాలనుకుంటూ అంది- మీరింకా నేను జవాబు చెప్పలేని నాలుగు ప్రశ్నల్ని అడగొచ్చు."
    
    "దేనికి?"
    
    "నేను పూర్తిగా..." ఆగిపోయింది తను ఆడపిల్లనన్న విషయం హఠాత్తుగా గుర్తుకొచ్చినట్టుగా.
    
    పూర్తిగా దగ్గరకాని ఏ ఇద్దరు యువతీ యువకుల నడుమా వూహించలేని ఓ పోటీలో ప్రత్యర్ధిగా నిలబడ్డ ఆదిత్య విచక్షణతో కాదు, అసాధారణమయిన అందంగల ఓ అమ్మాయి ఎరుపెక్కిన చెంపల్ని రెప్పలార్పకుండా చూస్తున్నాడు.
    
    బయట వర్షపు హోరు....
    
    ఏకాంతం...
    
    గుండెల్లో పొగ వేసే గుస గుసలు...
    
    గడుసుగా ఆలోచిస్తున్న యౌవ్వనం....
    
    కుండలతో జలసుధని కుమ్మరించే లాలసత్వం.
    
    పచ్చిక బయళ్ళపైన స్వచ్చందంగా ఎగిరే పసిజింకలా కనిపిస్తున్న ఆమె పొంకాన్ని చూస్తూ కుంభవృష్టిలో కొట్టుకుపోతున్నాడు.
    
                                                            * * *
    
    సరిగ్గా ఇదే సమయంలో...
    
    భాగ్యనగరంలో తన అనుచరుల మధ్య టెన్షన్ గా గడుపుతున్న ముఖ్యమంత్రి భవనంలో ఫోన్ రింగయింది.
    
    ఆ సాయంకాలమే ఢిల్లీనుంచి రాయ్ ఫోన్ చేశాడు- తను ప్రధాన మంత్రితో మాట్లాడినట్టుగా ముఖ్యమంత్రి పదవి తనకిక ఢోకా లేదని నమ్ముతూ సైతం టెన్షన్ గా వున్నాడు.
    
    దానిక్కారణం అధిష్టానవర్గం ఈ విషయం గురించే సమావేశమైందని తెలిసింది. ఏ నిముషంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అర్ధంకాని పరిస్థితి.
    
    ఇంకా ఫోన్ రింగవుతూనే ఉంది.
    
    రిసీవరు అందుకున్నాడు వణుకుతున్న చేతులతో.
    
    "నేను వాసుదేవరావుని మాట్లాడుతున్నాను."
    
    క్షణం విరామం తర్వాత వినిపించింది. "నేను ప్రధానమంత్రిని."
    
    "సర్!" ఒక్క ఉదుటున లేచి నిలబడ్డాడు ముఖ్యమంత్రి వాసుదేవరావు "నేనే..."
    
    "పార్టీకోసం మీరేదన్నా చేయగల విశ్వాసపాత్రులుగా మీమీద నాకు చాలా నమ్మకముంది."
    
    "ఎస్సర్...
    
    "అందుకే బర్తరఫ్ చేసే పరిస్థితులున్నా మీతో వ్యక్తిగతంగా మాట్లాడాలనిపించింది."
    
    "ఎస్సర్!"
    
    "మిమ్మల్ని బర్తరఫ్ చేయడమంటే నన్ను నేను అవమానించుకోవడం లాంటిది."
    
    ఆ వాక్యం చాలా రిలీఫ్ నిచ్చింది వాసుదేవరావుకి.
    
    "నిజానికి మీరు రాష్ట్రానికే పరిమితం కాకూడదు."
    
    ఈ వాక్యం మరింత ఉల్లాసాన్ని కలిగింది.
    
    "కేంద్ర ప్రభుత్వంలో స్థానం సంపాదించుకోవాల్సిన వ్యక్తి మీరు."
    
    "అంతా మీ కరుణ..."
    
    "కరుణ కాదు వాసుదేవరావ్! పార్టీకి అంకితమైన మీలాంటి వ్యక్తుల విషయంలో ఇది నా బాధ్యత."
    
    "అదృష్టవంతుడ్ని."
    
    "అందుకే మీకు అవకాశమిస్తున్నాను."
    
    అర్ధంకాలేదు వాసుదేవరావ్ కి.
    
    "మీ అంతట మీరుగా రాజీనామా చేయండి."
    
    పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపోయాడు. "సర్!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS