Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 89


    
    "అవును వాసుదేవరావ్.... మీరు రిజైన్ చేసిన వెంటనే మిమ్మల్ని రాజ్యసభ మెంబర్ని చేసి, కేంద్రప్రభుత్వంలో స్థానం కల్పించాలను కుంటున్నాను."
    
    వాసుదేవరావ్ కి బోధపడిపోయింది. తనకు ఉద్వాసన చెప్పాలని ప్రధానమంత్రి నిర్ణయించుకున్నాడు. దానికి ఓ ఎరలా రాజ్యసభ సీటు ఆశ చూపిస్తున్నాడు.
    
    "కాని ఇంత అర్జెంటుగా మీరిలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారో అర్ధం కావడం లేదు."
    
    సూటిగా లేండ్ స్కేండల్ గురించి గాని, ముఖ్యమంత్రిపైన ఇంటలిజెన్స్ వర్గాలు అందించిన ఇతర అభియోగాల గురించి గాని చెప్పలేదు ప్రధానమంత్రి.
    
    "రాష్ట్రాన్ని చాలా సమర్ధవంతంగా పరిపాలిస్తున్న మాట నిజమే అయినా, దురదృష్టవశాత్తూ మన శాసనసభాపక్షంలో మీరు మెజారిటీ కోల్పోయారు వాసుదేవరావ్!"
    
    "లేదు" ఉద్విగ్నంగా అరిచాడు ముఖ్యమంత్రి.
    
    "మెజారిటీ సభ్యులు నా పక్షాన ఉన్నారు."
    
    "ఇది నిజం కాదూ అని నిరూపించే ఆధారాలు నా దగ్గరున్నాయి." ప్రధానమంత్రి గొంతు నిశ్చలంగా పలికింది. "అసెంబ్లీలోని మన రెండు వందల పదిహేను మంది ఎమ్మెల్యేల్లో సుమారు రెండు వందల మంది మీకు వ్యతిరేకంగా సంతకాలు చేసి నాకు పంపించారు."
    
    వాసుదేవరావుకి ముచ్చెమటలు పోశాయి.
    
    అసమ్మతివర్గమొకటి వేళ్ళూని బలాన్ని పుంజుకుంటూందని తెలుసుగాని, ఇంత దూరం వెళ్లిందని ఊహించలేకపోయాడు. పైగా తనకు తెలీకుండా సాగిన సంతకాల ఉద్యమం సరాసరి ప్రధానమంత్రిని నమ్మించేదాకా విస్తరించింది.
    
    దశాబ్దాల తన చరిత్ర ముగిసిపోయే తరుణం ఆసన్నమైపోయింది.
    
    "మీరు నాకు అవకాశం యిస్తే నా మెజారిటీ నేను నిరూపించుకుంటాను."
    
    "అవకాశం లేదనుకుంటాను మిష్టర్ వాసుదేవరావ్! అలా చేయడం వలన మీ వైఫల్యం పత్రికలదాకా వెళ్ళడమూ, మీ చరిత్ర కళంకిత మవడమూ తప్ప ప్రయోజనం లేదు. పైగా నేను మెజారిటీ సభ్యుల అభీష్టాన్ని మన్నించాలనుకుంటున్నాను. మరో విషయం ఎప్పుడో కాదు, రేపు ఉదయం లోగా మీరు రాజీనామాని గవర్నర్ కి అందజేయాలి. లేదంటే ప్రజలకి తెలిసేట్టు నేను క్రమశిక్షణ చర్యని తీసుకోవాల్సుంటుంది."
    
    ఫోన్ క్రెడిల్ చేశాడు ప్రధానమంత్రి.
    
    కంపిస్తున్న ముఖ్యమంత్రిని చోదోఅగానే బోధపడిపోయింది జరిగింది ఏమిటో అయినా అతడి ముఖ్యసహచరులుగా మంత్రివర్గంలో చెలామణీ అవుతున్న ఆరుగురూ అడిగారు.
    
    "ఏమైంది సర్?"
    
    జవాబు లేదు.
    
    "మాట్లాడింది ప్రధానమంత్రితోనే?"
    
    ఇంకా తేరుకోలేకపోతున్నాడు.
    
    "బర్తరఫ్ చేశారా?"
    
    "మన అవినీతి వ్యవహారాలన్నీ ఆయనకి తెల్సిపోయాయా?"
    
    "నేను ముందే అనుకున్నాను."
    
    "మరీ ఇంత విచ్చలవిడిగా ఇన్ని ఘోరాలు చేస్తే యిలా జరక్క ఏమౌతుంది?"
    
    "పద్మనాభం గురించి మీకు పూర్వం హెచ్చరించినా పట్టించుకోలేదు మీరు."
    
    "ఇప్పుడు అంతా నాశనమయిపోయింది."

    "సర్వనాశనం చేశారు మీరే."
    
    "కొన్ని గంటలపాటు అతడితోబాటు కూర్హ్సున్న మంత్రివర్గ సహచరులు అనాల్సిందీ, కక్కేయాల్సిందీ కక్కేసి ఆవేశంగా వెళ్ళిపోయారు.
    
    ఒంటరిగా కూర్చుండిపోయాడు- ఇప్పటికింకా ముఖ్యమంత్రే అయిన వాసుదేవరావు.
    
    ఎందుకు యిలా జరిగింది?
    
    ముఖ్యమంత్రి అన్నాక ఈ మాత్రం అవినీతి, లంచగొండితనం మామూలేగా? ఎక్కడ తను పొరపాటు చేశాడు? ఏం చేయాలి? ప్రధాన మంత్రిని ప్రతిఘటించి నిలబడాలా? అలా చేస్తేమాత్రం తను మెజారిటీ నిరూపించుకోగలడా? గుండెల్లో అలజడి.
    
    దీవిలోకి వెళ్ళినట్టు ఒంటరితనం.
    
    కొన్ని కోట్లమంది ప్రకాలని పరిపాలించిన తను ఇప్పుడు కొన్ని గంటలలో పదవీభ్రష్టుడౌతున్నాడు.
    
    తలుపులు బిగించాడు.
    
    బయట ప్రపంచాన్ని చూడాలనిపించటం లేదు.
    
    బాటిల్ తెరచి నౌఖర్ల అవసరం లేకుండా తనే రెండు మూడు గుక్కలు తాగి, బడలికగా సోఫాలో వాలిపోయాడు.
    
    రాయ్ గుర్తుకు వచ్చాడు.
    
    ప్రధానమంత్రితో అంత చనువున్న వ్యక్తి సాగించిన మధ్యవర్తిత్వం యింత దారుణంగా విఫలమైందేం?
    
    అదికాదు అతడిని యింత అమితంగా కలవరపర్చింది.
    
    ఒక బిలియనీర్ కి కోడలు కావాల్సిన తన కూతురు పరిస్థితేమిటి?" తను పదవీభ్రష్టుడైతే రాయ్ తన కూతుర్ని కోడలిగా అంగీకరిస్తాడా?
    
    వెంటనే ఢిల్లీకి ఫోన్ చేశాడు రాయ్ తో మాట్లాడాలని.
    
    రెండు నిముషాల అనంతరం రాయ్ కంఠం బడలికగా వినిపించింది "ఎవరది?"
    
    "నేను వాసుదేవరావ్ ని."
    
    "ఇంత రాత్రివేళా ఈ ఫోనేమిటి?"
    
    వాసుదేవరావు గొంతు తడారిపోయింది. ఈ ఒక్క వాక్యం చాలు రాయ్ లో మార్పు గుర్తించటానికి.
    
    "కొన్ని నిమిషాల క్రితం ప్రధానమంత్రి స్వయంగా ఫోన్ చేశాడు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS