మనసులోని మాటను అతడికన్నా ధైర్యంగా చెప్పగల ఆడపిల్లగా ప్రబంధ నిర్మొహమాటంగానే కాదు, మనసంతా ఆక్రమించుకున్న ఆలోచనలతో ఖండితంగా చెప్పింది- "ఆదిత్యా! జీవితాన్ని సజీవంచేసే ఓ పరిచయం కోసం నన్ను నేనే కోల్పోవటానికి సిద్దపడినదానిగా ఈ పోటీకి అంగీకరిస్తున్నాను. నేను ఎన్నుకున్న ఈ దారి నేను కోరుకున్న చివరి కూడలికి జన్మస్థానమే అయితే అక్కడ తీయని వేదనని బ్రతుకు నేపథ్యంగా మార్చుకోవాలనుకుంటున్న దాన్ని నేను హిమకలశాన్నో, అగ్ని కీలాన్నో నాకూ తెలీదు. కాని మీ సమక్షంలో ఒక జీవితకాలం గడపాలని నిశ్చయించుకున్నదాన్ని. ఇది శాశ్వత మౌన ప్రవాసంలోకి మార్గం కావచ్చు. లేదూ దూరంలేని ఓ దూరాన్ని తరిగేట్టు చేసే అవకాశమూ కావచ్చు. ఆనందంగా నేను అంగీకరించాలనుకుంటున్నాను" సరిహద్దుల్ని పట్టించుకోని అమ్మాయిగా కాదు, మనసు హద్దుల్ని వ్యక్తం చేయగల అరుదయిన అమ్మాయిగా అనాల్సింది అనేయగలిగింది.
"వెల్!" రవ్వంత గర్వం ఆదిత్య గొంతులో నిజానికి అది గర్వం కూడా కాదు- తన గురించి తపించే ఓ అమ్మాయి గొంతులోని లాలిత్యానికి అతడు సరిగా భాష్యం చెప్పలేని లాలసత్వం "ప్రారంభిస్తున్నాను."
సిద్దంగా వున్నాను."
బయట వర్షం ఇంకా ఉధృతమైంది.
"NATURE REQUIRES FIVE
CUSTOM TAKES SEVEN
LAZINESS TAKES NINE
AND WICKEDNESS ELEVEN"
అన్న కవి ఎవరు? దేని గురించి అన్నాడు? దాని పోబేషన్స్ ని బట్టి మనస్తత్వ శాస్త్రజ్ఞులు మనిషి వ్యక్తిత్వాన్ని ఎలా వర్గీకరించారు?"
సాలోచనగా చూసింది క్షణంపాటు.
ఆ జాప్యాన్ని బట్టి ఆమెకు జవాబు తెలీదనుకున్నాడు. కాని అరనిముషం వ్యవధిలో చెప్పటం ప్రారంభించింది ప్రబంధ..." అలా అన్నది పోయెట్ జాన్ మిల్టన్. అతను వుద్దేశించింది నిద్ర గురించి."
నివ్వెరపోయాడు ఆదిత్య.
"మనిషి జీవితకాలంలో ఇంచుమించు మూడో వంతు సమయాన్ని ఖర్చుచేయాల్సి వచ్చే ఈ నిద్ర గురించి శాస్త్రజ్ఞులు ఇంకా పరిశోధన సాగిస్తున్నా మీరు అడిగిన ఈ నిద్ర చాలామంది ప్రముఖుల్ని చాలా రకాలుగా ప్రభావితుల్ని చేసిందనేది చరిత్ర చెప్పిన సత్యం. నిజానికి నిద్ర గురించి మిల్టన్ అలా అన్నా, మరో రచయిత చార్లెస్ డికెన్స్ ఉత్తర దక్షిణాల వేపు పరుపు వేసుకుంటే తప్ప నిద్రపోలేకపోయాడు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ప్రతిరోజు రెండు బెడ్స్ పై నిద్రపోయేవాడు ఒకటి వేడెక్కిన మరుక్షణం రెండోదాన్ని ఆశ్రయించడం అలవాటుగా థామస్ ఎడిసన్, విన్ స్టన్ చర్చిల్, నెపోలియన్ లాంటి ప్రముఖులు ప్రశాంతమయిన తమ నిద్రే వారి ఎదుగుదలకి కారణమని చెప్పుకునేవారు. ఇకపోతే మీరడిగిన చివరి ప్రశ్న.... ఈ నిద్రపోయే పద్ధతుల్ని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని శాస్త్రజ్ఞులు ఎలా వర్గీకరించారని..."
అప్పటికే ఆదిత్య సన్నగా కంపించడం మొదలుపెట్టాడు చలిఎక్కువై కాదు. నెత్తిపై గుమ్మరించుకోవాల్సిన చెంబుడు నీళ్ళు గుర్తుకొచ్చి.
"మొదటిది రాయల్ పొజిషన్ అంటే వెల్లకిలా, చేతుల్ని పక్కగా, కాళ్ళు కాస్త విడిగా ఉంచుకుని పడుకోవడం దీనికి మనోవైజ్ఞానికులు చెప్పిన భాష్యం అలా పడుకునే అలవాటు గల వ్యక్తులకి ఆత్మస్థయిర్యము, ఆత్మవిశ్వాసం అధికంగా ఉండటమేకాక నిబ్బరమైన వ్యక్తిత్వం గలవారని రెండోది పక్కకు ఒత్తిగిలి మోకాళ్ళని ఒకదానిపై మరొకటుంచిపాదాల్ని ఒకదానికొకటి గొలుసులా బంధించి పడుకోవటం ఇది ఆందోళనకి, ఇతఃరులతో స్నేహబహావ్న్ని పెంచుకోలేని వ్యక్తిత్వాలకు గుర్తంటారు. మూడోది అరచేతులపై తల ఆనించి వెల్లకిలా పడుకోవడం. ఇది తమకున్న మేథస్సు గురించి తెలియక ఆత్మన్యూనతాభావంతో బ్రతికే వ్యక్తుల గుణాన్ని సూచిస్తుంది. నాలుగోది పక్కకు ఒరిగిగాని, బోర్లా పడుకుని గాని, చేతుల్ని తలగడచుట్టూ బిగించడం...ఇదీ భద్రతకోసం, అమితంగా ఆర్తిని ప్రదర్శించే వ్యక్తిత్వానికి సంకేతం. లేదూ, కడుపులోని అనారోగ్యాన్ని నిభాయించుకునే ప్రయత్నం కూడా కావచ్చు."
"ఫైన్!" ఆదిత్య మరో ప్రశ్న అడగబోతుంటే వారించింది ప్రబంధ "ముందు మీరిచ్చిన మాట ప్రకారం నీళ్ళు గుమ్మరించుకోవాలి."
కాదనలేకపోయాడు.
అసలు ఇలాంటి తెలివితక్కువ కమిట్ మెంట్సుకి తను అనాలోచితంగా సిద్దపడినందుకు చింతిస్తూనే బాత్ రూంలోకి వెళ్ళి చెంబుడు నీళ్ళు గుమ్మరించుకున్నాడు.
ఫకాలున నవ్వింది బయటికి వచ్చిన ఆదిత్యని చూస్తూనే- "నేను తడిసినందుకు బాధపడిపోతూ ఇప్పుడు మీరు తడవటం ప్రారంభించారు."
"ఇది ప్రారంభం కాదు ముగింపే..." ఇక జటిలమైన ప్రశ్నల్ని గుమ్మరించేయాలనుకుంటూ క్షణం ఆగేడు తుమ్ములాంటిది వస్తూంటే.
అరక్షణంలో తుమ్మేశాడు కూడా....
అతడి స్థితిని చూస్తూంటే ప్రబంధకి చాలా ఆనందంగా వుంది....."పాపం! జలుబు చేస్తున్నట్టుగా వుంది కదూ?"
"ఇప్పుడు తుమ్ములు గురించి ఓ ప్రశ్న....పదిహేడో శతాబ్దంలో తుమ్ముల గురించి ఐరోపా దేశస్థులు ఏమనుకునేవారు? చరిత్రలో ఎక్కువగా తుమ్మిన వ్యక్తిగా ప్రఖ్యాతి చెందిన వ్యక్తి ఎవరు?"
"పదిహేడో శతాబ్దంలో తుమ్ముల్ని ఆరోగ్యానికి చిహ్నంగా భావించేవారు ఐరోపా దేశస్థులు. అందుకే హాస్పిటల్లో అడ్మిటైన రోగులు సైతం వరుసగా మూడుసార్లు తుమ్మితే ఆరోగ్యం కుదుటపడినట్టుగా భావించి డిశ్చార్జి చేసేవారు. ఇకపోతే తుమ్ముల్లో ప్రపంచ రికార్డు మియామీకీ చెందిన యువతి జూన్ క్లార్క్ డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆగకుండా వరుసగా నూట ఏభై అయిదురోజులు తుమ్మేసిందట."
మరో చెంబుడు నీళ్ళు గుమ్మరించుకున్న ఆదిత్య బాత్ రూంలో నిలబడే ఆలోచించాడు కసిగా.... లాభం లేదు- ప్రశ్నల ట్రెండ్ మార్చకపోతే తను పూర్తిగా తడిసిపోయేట్టున్నాడు.
"పాపం తడవకూడదనుకుంటూ మీరు పూర్తిగా తడిసిపోతున్నారు కదూ?"
