"హూ! పెళ్ళి... ప్రపంచం చాలా మారిపోయింది అనుకుంటున్నాం కానీ ఆడపిల్ల విషయంలో ఏం మారలేదు. పెళ్ళి సంబంధాలు అనగానే "తండ్రెవరూ?" ఏం చేసేవాడూ? కులం ఏమిటీ జాతకం వుందా? అనేలాంటి ప్రశ్నలే...అన్నీ సరిగ్గా వుంటేనే కష్టం. ఇంక నాలాంటిదాన్నెవరు చేసుకుంటారు?" నిరుత్సాహంగా అన్నాను.
"మీకు ఎలాంటివాడు కావాలో చెప్పండి" భోజనం పూర్తి చేసి ప్లేట్ లో చెయ్యి కడిగేస్తే అన్నాడు.
అతను అడిగే విధానానికి నేను నవ్వడానికి ప్రయత్నించాను. అయినా కన్నీళ్ళే వచ్చాయి.
"శంభుప్రసాద్ గారి అమ్మాయి అంటే ఎగరేసుకుపోతారు" అన్నాడు.
"వద్దు! ఆయన పేరు వాడకుండా, ఆ అవసరం లేకుండా నాకు పెళ్ళయితేనే చేసుకుంటాను. నా తండ్రి డీటైల్స్ తో అవసరం వున్నవాడు నాకు అవసరంలేదు" అరిచినట్లుగా అన్నాను.
"పోనీ మీ ఎక్స్ పె'క్టేషన్స్ ఏవిటో అవైనా చెప్పండి" అన్నాడు.
"చెప్పానుగా... నన్ను నన్నుగా చూడాలి. నా గుణాలూ, నా ఆకారం... ఇవే చూడాలి. నా గతాన్నీ, మా అమ్మ చరిత్రనీ కాదు!"
"మీరూ అలాగే చూడగలరా?" అడిగాడు "చూడగలను" అన్నాను.
"అయితే మీ గుణాలూ, ఆకారం నాకు నచ్చాయి. నా గుణాలూ ఆకారం మీకు నచ్చాయా? మనం పెళ్ళిచేసుకుందాం!" అన్నాడు.
నేను అపనమ్మకంగా "మళ్ళీ చెప్పండి..." అన్నాను.
అతను మళ్ళీ చెప్పి "నన్ను పెళ్ళిచేసుకుంటారా?" అని అడిగాడు.
"ఆర్ యూ సీరియస్?" అపనమ్మకంగా నేను అడిగాను.
"ఎస్..." అన్నాడు ధృడంగా.
"దెన్... మై అన్సర్ ఈజ్ ఆల్సో ఎస్!" అన్నాను.
"నేను ఎలాంటివాడినో తెలియకుండానే ఒప్పేసుకుంటున్నారా...ఒకవేళ నేను మిమ్మల్ని దుబాయ్ కి అమ్మేస్తేనో!" అన్నాడు.
"నేను అంత అమాయకురాలిలా కనిపిస్తున్నావా? ఒకవేళ మీరు అలాంటి పనులు చెయ్యబోతే ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు!" అన్నాను.
"అనే ఈ సాయంత్రందాకా నమ్మాను. కానీ ఇందాక మీరు మొహాన్ని చేతుల్లో దాచుకుని ఏడుస్తుంటే... అనుమానం వచ్చింది!" అన్నాడు.
"అనవసరంగా ఎమోషనల్ అయ్యాను" అన్నాను.
"అనవసరంగా చేసేవి చెయ్యడం మానేస్తే చాలు... మనకి ఏం అవసరమో ఎలా బ్రతకాలో దానంతట అదే తెలుస్తుంది" తేలిగ్గా అనేశాడు.
"సరే...ఇందాకా మీరు అన్నది నిజమైతే సివిల్ మేరేజ్ చేసుకుందామా?" గుళ్ళో చేసుకుందామా? అడిగాను.
"సివిల్ మేరేజ్" అని చెప్పాడు.
"ఓ.కే." అన్నాను.
లిల్లీ చెప్పడం ముగించి "అలా మా పెళ్ళిమాటలు జరిగిపోయాయి!" అంది.
"అంత ఈజీగానా? అతన్ని నువ్వు ఇంకే వివరాలూ అడగనే లేదా?" ఆశ్చర్యంగా అడిగాను.
"అడగాలని నోరు తెరిచాను... కానీ అతను మూసేశాడు... తన పెదవులతో!" అని నవ్వింది.
"ఆపైన ఏం జరిగిందో నేను అడగనులే!" అని నేనూ నవ్వేశాను.
నిజంగా...నిజంగా లిల్లీ మనసులోవాడే ఆమె జీవిత భాగస్వామి అవుతున్నందుకు సంతోషించాను.
"నాకు ఎప్పుడు చూపిస్తావు?" అడిగాను.
"పెళ్ళిలో. వన్ మంత్ నోటీస్ ఇచ్చాం. వచ్చేనెలలో పెళ్ళి. నువ్వేగా మా పెళ్ళి పెద్దవి!" అంది.
"ఈలోగా మనం..." అని అసంపూర్తిగా ఆపేశాను.
ఆమె నా చేతిని గట్టిగా పట్టుకుని "రేపు బయల్దేరి మనం కర్నూలు వెళ్తున్నాం...ఓ.కే!' అంది.
నా ముఖం సంతోషంతో విప్పారింది.
* * *
ఇంట్లో మాత్రం కురుక్షేత్రమే జరిగింది!
"ఆదివారం పెళ్ళిచూపులు పెట్టుకుని నువ్వు ఊరేగుతానంటావేంటి?" అమ్మ అరిచింది.
"లిల్లీ స్నేహితురాలికి సుస్తీగా వుంటే లిల్లీని వెళ్ళనియ్యి. నువ్వెందుకు తోకలాగా!" నాన్న చిరాకుపడ్డారు.
"ఆదివారం పెళ్ళి చూపులకి ఇక్కడ వుంటాను చాలా?" అన్నాను.
"సరయూ అన్నమాట నిజమే! ఇది ఆపై వాళ్ళిద్దరిలా చెప్పినమాట వినే రకంకాదు. అంతా మనం చేసిన గారాబమే!" అమ్మ కోపంగా అంది.
నేను నాన్నగారి చెయ్యిపట్టుకుని "ఈ ఒక్కసారికి నా కోరిక తీర్చండి...ప్లీజ్!" అన్నాను.
ఆయన కొంచెం సేపు మౌనంగా వుండి "శనివారం సాయంత్రానికల్లా ఇంట్లో వుండాలి" అన్నారు.
నేను సంతోషంగా ఆయన చేతిమీద ముద్దు పెట్టుకుని "అలాగే నాన్నా!" అన్నాను.
* * *
లిల్లీ కర్నూలులోని తన ఫ్రెండ్ కి ఫోనులో పరిస్థితి వివరించి అడ్వకేట్లలో రషీద్ అన్న పేరు గల వ్యక్తిని పట్టుకోమని చెప్పడంతో, అతను ఓ ఐదుగురి అడ్రసులు రెడీగా పెట్టాడు. మేము ఆ ఫ్రెండ్ ఇంట్లోనే దిగి, మా వేట మొదలుపెట్టాం. నాకైతే ఈ ప్రయత్నం వమ్ముకాదని ఎంతో నమ్మకంగా అనిపిస్తోంది.
