ఓ క్షణం కళ్ళు మూసుకుంది రగులుకుంటున్న ఆ అలజడినో అదిమిపెడుతున్నట్టుగా... "ఓ పాపని డబ్బు ఖర్చుచేసి కాపాడావనుకుంటా కదూ."
"అవును... చాలా చిన్న వయసులోనే తల్లిదండ్రులకి దూరమైన రూప డబ్బులేక మృత్యువుకి సమీపిస్తున్న సమయంలో నీ డబ్బుతోనే నేను కాపాడాను..." నిట్టూర్చాడు. "ఆ సంతృప్తికిగాని, నేను బ్రతికించుకున్న పసికందు 'రూప' అన్న బాల్యానికి గాని వెలకట్టలేం సోఫియా... దట్స్ టుబి ఎక్స్ పీరియన్స్ డ్"
బయలుదేరాడు శశాంక డబ్బుతో...
ఇంటికి కాదు... శరణాలయానికి...
* * * *
రాత్రి ఎనిమిది గంటలవుతూంది.
శరణాలయంలోకి అడుగుపెడుతున్న శశాంక ఓ క్షణం తత్తరపాటుతో ఆగిపోయాడు.
ఎప్పటిలా ప్రశాంతంగా లేదక్కడ.. చాలా అలజడిగా వుంది దానికి బలమిస్తూ అక్కడ ఓ పోలీసు జీప్ ఆగివుంది. ఎంత ఆందోళన పడిపోయాడు అంటే తేరుకున్న శశాంక రెండు అంగలలో లోపలికి వచ్చాడు.
డిసిపి అవినాశ్ కి అభిముఖంగా కూర్చున్న అన్నపూర్ణ సన్నగా రోదిస్తూంది.
"ఏం జరిగింది" ఆత్రుతగా అడిగాడు అక్కడ నిలబడ్డ జాకీని.
అప్పుడు చూశాడు అవినాశ్ శశాంకని.
"చెప్పండి అవినాశ్ వాట్ హేపెండ్"
"ఓ పాప కిడ్నాప్ చేయబడింది"
"ఎవరు__ ఎప్పుడు..." ఉద్వేగంగా అన్నపూర్ణని చేరుకున్నాడు శశాంక. "ఏం జరిగిందమ్మా... అసలు మిస్సయిందెవరు"
"రూప"
శశాంక మెదడు పొరల్లో నుంచి ఓ బులెట్ దూసుకుపోయింది. ఇందాక కొన్ని క్షణాల క్రితం తను సోఫియాతో గర్వంగా చెప్పుకున్నది రూప గురించే "అసలు ఇదంతా..." శశాంక గొంతూ వణుకుతోంది.
"సాయంకాలమే అంది అమ్మ గుండె నొప్పిగా వుందే అని" అన్నపూర్ణ గొంతు పూడుకు పోతుంది. "హాస్పటల్ కి తీసుకు వెళ్ళాలని చూస్తే కనిపించలేదు. వెదికాం అంతటా. వెంటనే పోలీస్ కంప్లయింటిచ్చాను. నిన్నటినుంచి పదే పదే నన్ను అడుగుతూంది అమ్మా నేను బ్రతుకుతానా అని" వెక్కిపడుతూ ఆగిపోయింది.
అక్కడ గుమిగూడిన పిల్లలు అందరి కళ్ళలోనూ నీళ్ళు...
చూడలేకపోయాడు శశాంక.
"నేను ఇక చచ్చిపోనంకుల్... నువ్వు బతికించావు" రూప పలుకులు పదేపదే గుర్తుకొస్తుంటే శశాంక కళ్ళలోను నీళ్లు జివ్వున తిరిగాయి.
"ఎక్కడికో వెళ్లుంటుందమ్మా... బహుశా మనం వూరికినే గాభరా పడుతున్నామేమో" శశాంకకి తెలుసు తనను తాను మభ్యపెట్టుకుంటున్నానని.
"శశాంకా" అవినాశ్ ఓ మూలకి తీసుకు వెళ్ళాడు. "ఇట్స్ రియల్లీ కిడ్నాప్" నాకు ఇందాకే ఫోనొచ్చింది. తనెవరన్నదీ చెప్పలేదు. కాని నీతో మాటాడతానన్నాడు"
మళ్ళీ తనను రెచ్చగొడుతున్నారు. ఓ పసికందుని అడ్డం పెట్టి తనపై పగతీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఎవరి వుంటుందీ గ్రహించడానికి అతనికి అట్టే టైం పట్టలేదు... అప్పుడు రింగయింది ఫోన్.
"ఎస్" ఒక్క ఉదుటున రిసీవర్ని అందుకున్నాడు శశాంక.
"గుడ్ నువ్వే మాటాడుతున్నావన్న మాట."
"ఎవర్నువ్వు"
"ప్రసాద్"
"తెలివితేటలు ప్రదర్శించకు..."
"నువ్వు ప్రదర్శించావుగా__"
"రూప ఎక్కడ__"
"మా దగ్గరే భద్రంగా వుంది ప్రస్తుతానికి. కాని నువ్వు మేం చెప్పినట్టు చేయకపోతే పాప గుండెకి ఆపరేషన్ కి కుట్లువేశారే... రోజుకి ఒకటి చొప్పున పీకి సంబరపడతాం. పాపం ఇంకా గాయం మానినట్టు లేదు"
"ఏం కావాలి మీకు"
"ఒకటి__ నువ్వు సోఫియాకిక సహకరించకూడదు. రెండు సహకరించనూ అని నువ్వంటే చాలదు కాబట్టి నువ్వు అర్జెంటుగా మా కస్టడీలో కొన్ని రోజులు ఆతిథ్యం తీసుకోవాలి. మరేంలేదు. ఈలోగా సోఫియా పని మేం పట్టేస్తాం.
శశాంక పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఓ నిముషం పాటు నిశ్శబ్దంగా వుండిపోయాడు "సరే... కాని ఒక షరతు... పాపకేం హాని జరక్కూడదు. నేను లొంగిపోతాను మిమ్మల్ని ఎక్కడ కలవాలో చెప్పండి..."
"ఆ వివరాలన్నీ మీ ఇంట్లో వున్నాయి"
"మా ఇంట్లోనా__"
"అవును__ కిటికీనుంచి కాగితం చుట్టిన రాయిని హాల్లోకి విసిరాం వెళ్ళి కలెక్ట్ చేసుకో__ మరో విషయం ఈ సంగతి పోలీసులకి తెలియకూడదు. ముఖ్యంగా నీ పక్కన వున్నాడే అవినాశ్... అతనికి... ఓకె..." ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు...
