ఆయన బోస్ తో 'ఎక్స్యూజ్ మీ' అని నాతో 'ఇటు రామ్మా' అంటూ ఓ మూలకి దారితీశాడు.
నేను ఆయన్ని అనుసరించాను. ఓ కార్నర్ టేబుల్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళి అటూ ఇటూ చూశాడు.
మన భాషరాని సర్దార్జీలెవరో కూర్చుని డ్రింక్ చేస్తూ గలాటాగా మాట్లాడుకుంటున్నారు.
దూరంగా బోస్ నిలబడి, ఎవరితోటో మాట్లాడ్తూ కనిపిస్తున్నాడు. మధ్యలో ఇటు చూస్తూనే ఉన్నాడు.
నేను అతని వైపు వస్తుంటే ఎదురొచ్చి 'కమాన్...అక్కడ కూర్చుందామా?' ఒక టేబుల్ వైపు చూపిస్తూ అడిగాడు.
'నో... వెళ్ళిపోదాం' అన్నాను.
'వాట్?' విస్మయంగా అడిగాడు.
"వెళ్ళిపోదాం..." అతని చేతిని ఆలంబనగా అన్నట్లు గట్టిగా పట్టుకున్నాను.
"వాట్ హాపెండ్... ఒంట్లో బావుందా?" కంగారుగా అడిగాడు.
"చెప్తాను... ముందు ఇక్కడ్నుండి వెళ్ళిపోవాలి... మీరొస్తారా...నేను వెళ్ళనా?" అడిగాను.
"వన్ మూమెంట్... ఆయనతో చెప్పివెళ్దాం. లేకపోతే బాధపడతారు" అన్నాడు.
"నేను వెంటనే వెళ్ళకపోతేనే బాధపడ్తారు. మీరు చెప్పిరండి. నేను పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తుంటాను" అనేసి బయటికి వచ్చేశాను.
అతను వచ్చేదాకా అసహనంగా, పెదవి కొరుకుతూ పచార్లు చేశాను. అతనొచ్చి కారు తీశాక, ఎక్కి కూర్చున్నాను. అతనేం మాట్లాడలేదు.
నా మొహం చిదిపితే రక్తం కారేటంత ఎర్రబడిందేమో... అన్నట్లు ఆవేశం పొంగుకొస్తోంది. హోటల్ రూం చేరేదాకా ఎవరం మాట్లాడలేదు. రూంలోకి వెళ్ళాక, నేను మంచం మీద కూలబడిపోయాను.
అతను "కాఫీ త్రాగుతారా?" అన్నాడు.
నేను తలెత్తి "ఐ థింగ్ ఐనీడ్ ఏ డ్రింక్... మీకు అభ్యంతరమా?" అడిగాను.
"నో... ఏం తెప్పించమంటారు?" అడిగాడు.
నేను చెప్పాను. అతను తెప్పించాడు.
మొదటి రౌండ్ అయ్యాక నోరు విప్పాను.
"నీ స్వంత తండ్రైతే పెళ్ళికి రాకుండా వుంటావా... అని మిమ్మల్ని అడిగాడు చూడండీ... ఆ పెద్ద మనిషి తన స్వంత కూతుర్ని పెళ్ళిపందిరిలోంచి వెళ్ళిపొమ్మన్నాడు! హీ ఆస్క్ డ్ మీ టూ గెట్ ఎవే!"
అతను ఒక్కసారిగా షాక్ తిన్నట్లు "ఏవిటి మీరంటున్నది?" అని అన్నాడు.
"ఆ శంభుప్రసాద్ నా కన్నతండ్రి! తన భార్యా, మిగతా పిల్లలూ నన్ను అక్కడ చూస్తే తనే పిలిచాడని అనుకుని గొడవచేస్తారని భయపడి, పిరికిపందలా నన్ను అక్కడనుండి ఎవరూ చూడకముందే వెళ్ళిపోమని బతిమాలాడు! ఒట్టి పిరికివాడు... అందుకే నన్నూ తమ్ముడ్నీ బాస్టర్డ్స్ గానే వుంచేశాడు! ఐహేట్ హిమ్... ఐ హేట్ మై మదర్! ఐ హేట్ మై సెల్ఫ్..." చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తూ అన్నాను.
అతను ఒక్కమాట కూడా మాట్లాడకుండా కూర్చున్నచోటు నుండి అర అంగుళం కూడా కదలకుండా నన్ను గమనిస్తూ కూర్చున్నాడు.
నేను బాల్యంలో అనుభవించిన అవమానాల్నీ, చేదు సంఘటనల్నీ మననం చేసుకుంటూ, కసిగా వాటికి కారణమైన నా తల్లిదండ్రుల్నీ, పరిస్థితుల్నీ నిందిస్తూ దుఃఖించాను.
నా గురించి ఏదీ దాచకుండా మొత్తం అతనికి చెప్పేశాను. కన్నీళ్ళతో నా పైటకొంగు తడిసిపోయింది.
"ఎక్స్యూజ్ మీ..." అని బాత్ రూంలో కెళ్ళి మొహం కడుక్కుని వచ్చాను.
నేను వచ్చేసరికి అతను మీల్స్ ఆర్డర్ చేసినట్లున్నాడు. భోజనం చేస్తూ కనిపించాడు.
"ఏడవడం అనే ప్రోగ్రాం అయిపోతే మీరూ తినండి" అన్నాడు.
నా ఏడుపుకి అతను ఇచ్చిన ప్రాధాన్యత చూస్తుంటే ఒళ్ళుమండిపోయింది.
"అసలు మీ ఆడాళ్ళకి ఏడుపు ఎందుకొస్తుందీ?" ఆశ్చర్యంగా మొహం పెట్టి అడిగాడు.
అతని ప్రశ్నకి నేను చిరాగ్గా చూశాను.
"ఆప్తులు చచ్చిపోవడం కన్నా పెద్ద కష్టం లేదు. అలా చూస్తే నాకు అమ్మా, నాన్నా ఇద్దరూ పోయారు. అన్నం దొరకకపోవడం మించిన దురదృష్టం లేదు. నాకు చాలాసార్లు దొరకక పస్తులున్నాను. ఫిజికల్ గా మనమీద ఎవరైనా చెయ్యి చేసుకోవడాన్ని మించిన అవమానంలేదు. నేను ఎన్నోసార్లు చెయ్యని తప్పులకి దెబ్బలు తిన్నాను. రెండుమూడుసార్లు పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్ళొచ్చాను. అయినా నేనెప్పుడూ ఇలా తీరికగా కూర్చుని తాగుతూ ఏడవలేదు!" అన్నాడు.
అతను అన్న ఆ చివరిమాట వూచి పుచ్చుకు కొట్టినట్లుగా అనిపించింది.
"తప్పు చేసిన వాళ్ళకే అసహాయత ఆవరిస్తుంది. అసహాయులే ఏడుస్తారని నా నమ్మకం" అన్నాడు.
"కానీ...మీరు చెప్పేలాంటి స్థితప్రజ్ఞత నాకు..." అని చెప్పబోతుంటే ఆపి.
"లాజికల్ గా ఆలోచిస్తే వస్తుంది. మీరిక్కడ అన్నం మానేసి ఖాళీ కడుపుతో తాగిఏడిస్తే ఏం లాభం? మీకు ఇంత బాధని కలిగించిన వాళ్ళు మాత్రం చాలా ఆనందంగా విందు భోజనాలు చేస్తుంటారు. ఔనా? మీరు ఆయనకీ ఇలాంటి బాధనే కలిగించండి" అన్నాడు.
"ఏం చెయ్యను?"
"మీ పెళ్ళికి ఆయన్ని పిలవకండి. కానీ మీ పెళ్ళి ఫలానా రోజున, ఫలానా సమయానికి అని తెలిసేటట్లు చేసి వూర్కోండి చాలు!"
