Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 85


    హామీ ఇచ్చాడు డాక్టర్.


    సరిగ్గా ఇదే సమయంలో...


    శశాంక ఇంటిని చేరుకున్న సర్కార్ చుట్టూ పరికించి చూశాడు. కాలనీలో ఎవరూ తనను గమనించడం లేదు. కాంపౌండ్ వాల్ పక్కగా నడుచుకుంటూ ఇంటి వెనుకగా వెళ్ళాడు. అయిదు నిమిషాల వ్యవధిలో వాటర్ ఫైవ్ ద్వారా పైకెక్కి అక్కడున్న ఓ కిటికీ అద్దాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు.


    మరో మూడు నిముషాలలో బెడ్ రూం గూండా మెయిన్ డోర్ ని చేరిన సర్కార్ తన పథకంలో అతి ప్రమాద భూయిష్టమైన చివరి అంశాన్ని పూర్తి చేయడంలో నిమగ్నమయ్యాడు.


    జేబులోని హేండ్ గ్రెనేడ్ బయటికి తీశాడు. సేఫ్టీపిన్ ని బయటికి తీయగానే లీవర్ తెరుచుకుని స్ప్రింగు ఏక్షన్ తో డిటోనేటర్ ని తాకి సుమారు ముప్పై గజాల వ్యాసంలో మనుషులతో బాటు ఇంటినీ నుగ్గు చేస్తుంది.


    పిన్ తీసేసి లీవర్ ని చేతితో అలాగే ఒత్తి పట్టుకుని చుట్టూ రెండు మిల్లీమీటర్ల డయామీటరున్న మైల్డ్ స్టీల్ వైర్ తో చుట్టాడు... మెయిన్ డోర్ లోపలి 'నాబ్'కి వైరు ఓ అంచుని చుట్టి సరిగ్గా దూరాన్ని కొలుచుకుని డైనమైట్ ని సమీపంలో కిటికీ రాడ్ కి అమర్చాడు.


    మెయిన్ డోర్ ఓ అరడుగు లోపలికి నెడితే చాలు డైనమేట్ కి పట్టిన వైరు సడలిపోతుంది. లీవర్ తెరుచుకుని స్ట్రైకర్ తో డిటోనేటర్ ని పేల్చి ఇంచుమించు భవంతిని కూల్చేస్తుంది.


    సంతృప్తిగా అంతా ఓ మారు చూసిన సర్కార్ పెదవులపై కసితో కూడిన చిరునవ్వు మెదిలింది.


    ఢిల్లీ నుంచి ఉత్సాహంగా ఇంటికి వచ్చిన శశాంక తాళం తీసి మెయిన్ డోర్ నెడుతుండగానే పీలికలై పోతాడు.


    సర్కార్ పని పూర్తిచేసిన సంతృప్తితో రెండో పథకం అమలు చేయాలని వెనుకగా నడిచాడు.


                               *    *    *    *


    సాయంకాలం ఏడున్నర ప్రాంతంలో ఢిల్లీ విమానం హైద్రాబాద్ చేరుకుంది.


    ఎయిర్ పోర్టులో శశాంకని పర్సనల్ గా రిసీవ్ చేసుకోడానికి వచ్చిన సోఫియా చూడలేదు తన పక్కాగానే నడుచుకు వెళ్తున్న వినీలని.


    "హార్టీ కంగ్రాచ్యులేషన్స్... సాధించావు" శశాంక చేతిని ఆప్యాయంగా నొక్కి కారుదాకా నడిపించుకు వచ్చింది.


    "హల్లో" ఎవరో పిలిచినట్టయి కారెక్కబోతున్న ఇద్దరూ ఆగారు. వినీల నిలబడి వుంది సమీపంలో.


    "మిస్ సోఫియా... చాలా ఉత్సాహంగా వెళుతున్నావు కదూ... వెళ్లేముందు ఒక్కమాట... గెలిచానని సంబరపడుతున్నావేమో... కాని అంతకు అంతచేసి తీర్తాను. ఎంతో టైం అక్కర్లేదు. సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో, అంత ఘాటుగా డోసిస్తాను. దమ్ముంటే కాపాడుకో. అందులో నీ ప్రియుడి సహకారం నీకున్నా నాకు అభ్యంతరం లేదు... బై" సిట్రాన్ లో కూచుంది.


    శశాంక వెళ్తున్న కారునే చూస్తూ వుండిపోయాడు కొన్ని క్షణాల పాటు.


    "చూశావుగా దాని పొగరు" సోఫియా కారు ఆమె ఇంటి పోర్టికోలో ఆగగానే అంది. "నీకు తెలీదు శశాంకా... ఇప్పుడు వినీల మనకి ప్రత్యర్థి కాబోతుంది"


    "భయపడుతున్నావా" ఓ సోఫాలో రిలాక్సవుతూ అడిగాడు.


    "నో... నెవ్వర్... పిల్లకాకి... పెంకి ఘటంలా మాటాడుతూంది... దెబ్బతిందిగా" ఆమె మాటాడుతూనే ఓ బ్రీఫ్ కేసు అతడి ముందుంచింది. "అయిదు లక్షలు."


    "దేనికి"


    "చెప్పానుగా నువ్వు చేసే ఈ పనికి నీ వాటా పదిశాతమని అదే" మౌనంగా అందుకున్నాడు. "అయినా నాకు తెలీకడుగుతాను... ఇంత డబ్బు ఏం చేస్తుంటావు" పక్కనే కూచుంటూ అడిగింది.


    "అదే ప్రశ్న నిన్ను నేనూ అడిగితే"


    అవాక్కయింది అరలిప్తపాటు. వెంటనే సమాధానం స్ఫురించక నవ్వేస్తూ అంది చివరికి "ఇదో వ్యసనం... సంపాదించాలానే అహంకారం. అంతే"


    "కాని నాకు వ్యసనం కాదు... ఒకప్పుడు కాకపోవచ్చు కాని ఇప్పుడు అవసరం, అవును సోఫియా... పాపపుణ్యాల మీద నాకు నమ్మకం లేదు... కాని మానవత అంటే ఇంకా మమకారం చావకేమో సంపాదించిన డబ్బుని ఓ శరణాలయానికిస్తుంటాను. ఆ విధంగా నాకో గొప్ప గుర్తింపు రావాలన్న కోరికా లేదు... అక్కడ అనాథలైన పసి కందుల్ని చూస్తుంటే నాకు నా బాల్యం గుర్తుకొస్తుంది నీకు తెలీదు సోఫియా... అక్కడ నేను అడుగుపెట్టగానే ఓ ఆలయంలోకి వెళ్లినంత ప్రశాంతత... అలా అని అక్కడ దేవుళ్ళు లేరు ఓ అమ్ముంది. ఆ అమ్మకి తన కడుపున పుట్టని పిల్లలున్నారు చాలామంది" లేచాడు నిర్లిప్తంగా. "అప్పుడప్పుడూ నా ఆవేశానికి పగతీర్చుకోవాలనే ఆరాటానికీ మానసికంగా అలిసిపోతుంటాను సోఫియా. సరిగ్గా అలాంటప్పుడు అక్కడికి వెళ్తుంటాను. ఎంత ఉల్లాసంగా ఉంటుందని. నా ప్రయాణంలో అదో కిక్కునిచ్చే మజిలీ అంతే... వుండడానికే సరైన ఆశ్రయమనిపించుకొని ఆ పాడుబడిన ఇంటినీ, ఆ పసికందుల కోసం అనుక్షణం శ్రమించే అమ్మనీ చూస్తుంటే నేను పాపం చేసి సంపాదించిన డబ్బు అయినా కానీ సాధ్యమైనంత త్వరలో ఓ కొత్త భవంతిని కట్టించి ఇవ్వాలనుకుంటున్నాను. ఎస్... త్వరలోనే ఆ పని చేస్తాను కూడా..." నవ్వుతుందామె. "చాలా సెంటిమెంటల్ గా ఆలోచిస్తావు కదూ"


    "అలా ఆలోచించలేకపోవడం నీ దురదృష్టం సోఫియా... మేకని ఉత్సాహంగా నరికే కసాయి. వాడికీ తను పెంచుకున్న కుక్క పిల్లమీద ప్రేమ వుంటుంది. అది నీ ఆర్గ్యుమెంటుకి అందకపోవచ్చు" సోఫియా మొహం ఎందుకు వివర్ణమైందో అతడికి తెలీదు. సాలోచనగా చూస్తూ అన్నాడు. "ఇంత హడావుడిలో బ్రతికే నువ్వు  ఒక్క అయిదు నిముషాలపాటు ఆ పసిపిల్లల మధ్యకి వెళ్ళి నిలబడు... ఆ పలకరింపులూ... మాటలూ... ఆత్మీయతలూ ఓడిపోతావు సోఫియా... ఇంత వున్నా నీకు సరిగ్గా ఏం లేదో అక్కడే తెలుస్తుంది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS