నేను మాత్రం పంతంగా 'మీతో నేను ఈ సాయంత్రం గడపాలనుకుంటున్నాను. అందుకు దయచేసి అనుమతివ్వండి' అన్నాను.
అతను మౌనంగా మారాడు.
నా గురించి ఏవనుకుంటున్నాడో! నేను ఊపిరి బిగబట్టి అతని జవాబుకోసం ఎదురు చూడసాగాను.
'నో లిల్లీ... నేను ఓ మేరేజ్ రిసెప్షన్ కి ఎటెండ్ అవ్వాల్సి ఉంది. ఆ బ్రైడ్ గ్రూమ్ తండ్రి నాకు గురుసమానుడైన వ్యక్తి. ఐ కాస్ట్ మిస్ దట్...' అన్నాడు.
ఆ డిజప్పాయింట్ మెంట్ కి నాకు కళ్ళల్లో సన్నటితెరలా కన్నీటి పొర ఆవరించింది.
ఇంతలో 'బట్... మీకు అభ్యంతరం లేకపోతే మీరూ జాయిన్ అవ్వచ్చు...' అని అన్నాడతను.
నా చెవుల్లో వీణానాదం సోకినట్లైంది. నిజమో కాదో నిర్ధారించుకోవాలని "ఏవన్నారూ..." అన్నాను.
"మీకు ప్రోబ్లెమ్ ఏవీ లేకపోతే నేనువచ్చి పికప్ చేసుకుంటాను" స్పష్టంగా అన్నాడు.
"థాంక్యూ...ఎన్ని గంటలకి" ఉత్సాహాన్ని దాచుకోకుండా ఆత్రంగా అడిగాను.
'సిక్స్ థర్టీకి ఓ...కే...నా?" అడిగాడు.
నాకైతే అసలు ఆ నిమిషంలో కూడా ఓ...కేనే!
"ఓ...కే...నేను రెడీగా ఉంటాను" అన్నాను.
"దెన్... సీయూ... బై..." అని ఫోన్ పెట్టేశాడు.
ఏ పరీక్ష పాసయిన రోజూ కూడా నా మీద అంత ముచ్చటెయ్యలేదు.
"శభాష్ లిల్లీ..." అని అద్దంలోని నా ప్రతిబింబాన్ని ముద్దు పెట్టుకున్నాను.
నేను ఎంతో కష్టపడి సిద్ధం చేసుకున్న మెరూన్ కలర్ సిల్క్ శారీ, అద్దాల చోలీ వేస్ట్ అవలేదు.
జుట్టు బ్రష్ చేసి లూజ్ గా వదిలేసి, చెవులకీ మెడలో రైస్ పర్ల్ప్ సెట్ పెట్టుకుని, పెదాలకి నేచురల్ షేడ్ లిప్ స్టిక్ లైట్ గావేసి...అద్దంలో చూసుకొన్నాను. ఏదో తక్కువైనట్లు అనిపించింది. కళ్ళకి సన్నగా కాటుక పెట్టుకున్నారు. నాకు నేనే తమాషాగా కనిపించాను.
డోర్ బెల్ మ్రోగింది. గభాల్న వెళ్ళి తలుపు తెరవకుండా, ఓసారి అద్దంలో క్రిందనుండి పైదాకా పరీక్షగా చూసుకుని, అప్పుడు వెళ్ళి తలుపు తెరిచాను.
వైట్ లాల్చీ, పైజామాలో, గెడ్డంతో, కళ్ళద్దాలు పైకి తోసుకుంటూ అతను!
"మే... ఐ..కమిన్" మర్యాదగా అడిగాడు.
"ప్లీజ్..." అడ్డు తప్పుకున్నాను.
అతను లోపలికి వచ్చాడు. సన్నని పరిమళం ఏదో నన్ను ఆవరించినట్లు ఫీలయ్యాను! ప్రేమ అనేది... గులాబీ అత్తరు కంటే మధురమైన భావన.
"వెళ్దామా?" అడిగాడు.
"కాఫీ తీస్కుంటారా?" అన్నాను.
"నో...గెట్టింగ్ లేట్...? టైం చూసుకున్నాడు.
"ఓ...కే..." నేను హేండ్ బ్యాగ్ అందుకున్నాను.
"వన్ మినిట్..." నామొహంలోకి సీరియస్ గా చూసి "మీరు బొట్టు పెట్టుకుంటే ఈ చీర మీదకి బాగా నప్పుతుంది" అన్నాడు.
అతను నన్ను గమనించి చూసి ఈ సూచన చెయ్యడంతో నాకాళ్ళు గాల్లో తేలిపోయాయి!
వెంటనే వెళ్ళి మెరూన్ కలర్ బిందీ పెట్టుకుని అద్దంలో చూసుకున్నాను. ఇందాక ఏదో తక్కువైందని ఎందుకు అనిపించిందో ఇప్పుడు అర్థమైంది!
అతని వైపు తిరగగానే "లుకింగ్ ప్రెట్టీ!" అన్నాడు.
బుగ్గల్లోకి వెచ్చని ఆవిర్లు రావడం మొదటిసారిగా అనుభవం అయింది.
ఇద్దరం క్రిందకి వెళ్ళి, అతని కార్లో కూర్చున్నాం.
అతను పొద్దుట ఆఫీసులో కనిపించిన బోస్ కాదు! ఒక్క ఆఫీసు విషయం కూడా మాట్లాడలేదు. జనరల్ టాపిక్స్, పాలిటిక్స్...ఎన్నో సెటైర్లూ...జోకులూ! జీవితం నా చేతికి అందినట్లు అనిపించింది. ఈ మనిషి నాకు లైఫ్ లాంగ్ సహచరుడు కాకపోయినా ఫర్వాలేదు. ఈ ఒక్క సాయంత్రాన్ని జీవితాంతం మననం చేసుకుంటూ గడిపేస్తాను అనుకున్నాను.
చాలా రిచ్ గా డెకరేట్ చేసిన ఫంక్షన్ హాల్ కి వెళ్ళాం.
బోస్ ని చూడగానే ఒకతను పరిగెత్తుకొచ్చి వినయంగా "రండి సార్...రండి...సార్ మిమ్మల్నే జ్ఞాపకం చేసుకుంటున్నారు" అన్నాడు హిందీలో.
అంతా పెద్ద పెద్ద తలకాయలొచ్చినట్లున్నారు. సెక్యూరిటీ వాళ్ళూ, బయట కార్ల దగ్గర పోలీసులూ కనిపించారు.
"పెళ్ళికొడుకు తండ్రి నాకు ముంబై వచ్చినప్పటినుండీ పరిచయం. స్వంత కొడుకుని ట్రీట్ చేసినట్లు నన్ను ట్రీట్ చేస్తాడు" బోస్ నాతో చెప్పాడు.
నేను అలాగా అన్న ఎక్స్ ప్రెషన్ ఇచ్చాను.
"అదిగో... వస్తున్నారు" అన్నాడు.
ఆయన అక్కడనుండి వెల్ కం మై బోయ్... వెల్ కం... పెళ్ళికెందుకు రాలేదూ? అదే నీ స్వంత తండ్రైతే ఇలా చేస్తావా?" అంటూ నన్ను చూసి ఆగిపోయాడు.
నేను అప్రతిభురాలినై తలపాగాతో వున్న ఆయన్ని అలాగే చూస్తుండిపోయాను.
"సారీ డాడీ...మీట్ మిస్ లిల్లీ... మా కంపెనీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్..." అని నాతో "పెద్ద బిజినెస్ మాగ్నెట్... పేరు..." అని చెప్పబోతుంటే "ఐనో...ఐనో హిమ్!" అని చేతులు రెండూ జోడించి 'బావున్నారా?' అన్నాను.
ఆయన ఈ పరిస్థితిని ఇంకా జీర్ణం చేసుకోలేనట్లు తెల్లబోతూ తలాడించి, వెంటనే భయంగా చుట్టూ చూశాడు. బోస్ మాత్రం సంతోషంగా 'మీకు తెలుసా? వెరీగుడ్...ఎలా' అన్నాడు.
