అప్పటికే ఆర్ధిక శాఖ మంత్రి నుదురు చెమటతో తడిసిపోయింది. ఎక్కడో చూసినట్టుంది శశాంకని. "ఎవర్నువ్వు?"
"రాత్రి మీ దగరకి జాబ్ కోసం కాక మా జాబ్ నిర్వర్తించాలని అమ్మాయిని పంపినవాడ్ని... పాపం ఈ వేళే మీరు ఫారిన్ వెళ్ళిపోతుంటే చాలా హడావుడిగా కార్యక్రమం ముగించ వలసి వచ్చింది."
"నీకెన్ని గట్స్..."
"లెక్కపెట్టి తర్వాత చెబుతాను. ముందో పని చేయండి మిస్టర్ బ్రహ్మచారీ! ఆ రాహుల్ ఫైలు సంతకం ఆపేయండి. లేకపోతే కొంపలు మునుగుతాయి. అలా దిక్కులు చూడకండి. నా మీద ఎటాక్ కావడం అంత సులభం కాదు" మరి కొన్ని ఫోటోలు అతడి ముందుంచాడు. దానితో బాటు బ్రీఫ్ కేస్ లో అయిదు లక్షలు టేబుల్ పై పెట్టాడు. "వూరికినే బ్లాక్ మెయిలింగ్ కోసమే రాలేదు. మీ కష్టానికి ప్రతిఫలమూ తెచ్చాను. ఎందుకంటే మనం డీల్ చేసేదీ బిజినెస్ కాబట్టి."
తన ఇంటికే వచ్చి అంత సిస్టమాటిక్ గా వ్యవహారం నడుపుతున్న శశాంక చేవను నిస్సహాయంగా చూస్తున్నాడు.
"అనుమానించకండి."
"సారీ... వీలు కాదు."
"కాకపోతే ఈ డబ్బుతోపాటు మీ పరపతీ నష్టపోతారు." ఫైనాన్స్ మినిస్టర్ గొంతు తడారిపోయింది. "ఈ సంతకం చేయకపోవడానికి నేను కొన్ని కారణాలు తెలపాలి."
"సింపుల్. ప్రస్తుత దిగుమతి నిబంధనల ప్రకారం పి.టి.ఎ. ని దిగుమతి చేసుకోవడానికి వీలులేదని. కాబట్టి అది దిగుమతి చేసుకోకూడదని రెస్ట్రిక్టెడ్ గూడ్స్ లో ఒకటని రాసేయండి." ఎఫ్.ఎం. వెంటనే సంతకం చేశాడు అదే కామెంట్ రాసి పి.ఎ. తో దాని కాపీ ఒకటి జిరాక్స్ తీయించి శశాంక కోరినట్టు అందచేశారు.
ఇలా ముఖాముఖీ వ్యవహారం నడిపించ గలిగిన వ్యక్తి ఇంతవరకూ ఆ మంత్రి జీవితంలో తారసపడి వుండక పోవడంతో వెళ్తున్న శశాంకని అబ్బురంగా చూస్తూ వుండిపోయాడు.
అప్పుడు ఉదయం పదిన్నర కావస్తుంది.
మరో అయిదు నిమిషాలలో ఫోన్ రింగయింది. నిజానికి అంతా సవ్యంగా వుంటే ఈపాటికి పూర్తి చేసుకు వెళ్ళాల్సిన వినీలది ఆ ఫోన్. ఓ సారీ... కొన్ని అనివార్యకారణాల వలన ప్రపోజల్ రిజక్ట్ చేస్తున్నాను... నో... దీని మీద ఇక ఎలాంటి చర్చావద్దు" అసహనంగా ఫోన్ పెట్టేసాడాయన.
ఇక్కడ హోటల్ లో ఒంటిపై బ్లౌజు లేకుండా ఫోన్ చేసిన వినీలకి కళ్ళనీళ్ళ పర్యంతమైంది.
అయిపోయిందనుకున్న పని మధ్యంతరంగా ఫెయిల్ కావడంతో ఎంత కలవరపడిందీ అంటే వెంటనే తండ్రికి ఫోన్ చేసింది. "అయామ్ సారీ డాడీ... హఠాత్తుగా ఆయన మనసు మార్చుకున్నారు... ఈ రాత్రికి వస్తున్నాను. ఐ థింక్... సోఫియా మేనేజ్ చేసినట్టుంది."
అదిగో అప్పుడు గదిలోకి వచ్చాడు శశాంక బ్లౌజుల్నీ, బ్రాలనీ పట్టుకుని.
* * * *
"సర్... ఆ శశాంక నన్నలా పట్టించినప్పుడే అర్థమైంది ఇలాంటిది మరోటేదో జరుగుతుందని" బెయిల్ పై విడుదలైన సర్కార్ మండి పడుతున్నాడు "వాడి అంతుచూస్తాను"
అనునయంగా వారించాడు జయచంద్ర. "నేను నష్టపోలేదు సర్కార్... ఇక్కడా గెలిచాను..." విశ్లేషించలేదు జయచంద్ర... ముక్తసరిగా అన్నాడు. "రాపిడితోనే ఏ మనిషన్నా రాటుదేలేది. ఈ ఒక్క సంఘటనతో తను పదేళ్ళ అనుభవాన్ని సంపాదించుకుంది వినీల. చావుబ్రతుకుల మధ్య వున్న ఈ తండ్రిపై ఎంతటి సానుభూతిని పెంచుకుంటుందీ అంటే ఇప్పుడు సోఫియాపై. ఆమెకు సహకరిస్తున్న శశాంకపై మరింత ద్వేషాన్ని ఏర్పరచుకుంటుంది. తన మేథకు పదునుపెట్టి ఎదురుదెబ్బ తీసే పథకం ఆలోచిస్తుంది. అంటే వినీల పూర్తిగా నా అధికారానికి వారసురాలై నేను కోరిన మార్గంలోకి సంపూర్ణంగా అడుగుపెట్టినట్టేగా... పోనియ్ ఈ నష్టం రేపటి నా ఎదుగుదలకి పెట్టుబడి... సో ఓ క్షణం చుట్టూ చూశాడు... "ఇప్పుడప్పుడే గదిలోకి డాక్టర్లూ, నర్సులూ వచ్చేట్టు లేరు... సర్కార్... నాకు తెలిసినంత వరకూ సోఫియా నాపై సాధించిన రెండో గెలుపిది" తనని గాయపరచడాన్ని తన గెలుపుగానే అనుకుంటున్నాడాయన. "ఒకటి షిప్పులో బంగారాన్ని కొట్టేయడం. రెండోది ఈ కాంట్రాక్ట్ ఫెయిల్ కావడం. ఇంతవరకూ నేను ఉపేక్షించి శశాంక మూలంగా సోఫియా ఎంత బలపడిందీ తెలుసుకోవడానికే అని సరిపెట్టుకుంటే ఇప్పుడు ఆ బలాన్ని సరిగ్గా అంచనా వేసిన వ్యక్తిగా రెండు చావుదెబ్బలు తీయాలి" తన మేథస్సుని అద్భుతమైన తర్కానికి అన్వయిస్తూ చెప్పాడు.
సరిగ్గా ఇక్కడే ఒకేసారి జరగాల్సిన రెండు పథకాలకి అంకురార్పణ జరిగిపోయింది.
ఈ స్థితిలో కూడా ఆయన ఇలా ఆలోచించ గలగడం సర్కార్ కి ఎంత ఆనందాన్ని కలిగించిందీ అంటే_ ఉత్సాహంగా కదిలాడు శశాంకని చావుదెబ్బ తీసే పథకాలని అమలు చేయడాని కన్నట్టు.
సర్కార్ వెళ్ళిన అయిదు నిముషాలకి వచ్చాడో థొరాసిక్ సర్జెన్. ఆయనకి బాగా సహకరించిన వ్యక్తి. "ఐ థింక్ యూ ఆర్ ఓ.కె. నౌ"
"థాంక్స్ డాక్టర్. మీ సహాయానికి చాలా కృతజ్ఞుడ్ని. ఇప్పుడు నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోవాలి. అంటే అర్థం నేను కోలుకున్నట్టు కాదు. ఇంకా చావు బ్రతుకుల మధ్య వున్నట్టే. ఈ ఏర్పాట్లన్నీ ఇంటి దగ్గరే చేయండి. కాస్త రక్షణగా వుంటుంది. అంతే కాదు... నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించి పోతుందన్న టెంపోని మీరు ఎప్పటిలా మెయిన్ టైన్ చేస్తూనే వుండాలి... ముఖ్యంగా మా అమ్మాయి దగ్గర."
