ఇట్స్ ఓ.కే, ఉదయం ఆఫీసులో కలుసుకుందాం' అని పెట్టేశాడు.
నాకు మొహంమీద కొట్టినట్టయింది. నా గొంతు వినగానే అతను పాత పరిచయం తవ్వుకుని ఎక్సైట్ అవుతాడనీ, వెంటనే వస్తున్నానని బయల్దేరి వచ్చేస్తాడనీ అనుకున్న నాకు నిరుత్సాహం ఆవరించింది.
వయసులో వున్న అందమైన ఆడపిల్ల ఫోన్ చేస్తే ఉత్సాహం చూపలేదంటే అతనికి తప్పకుండా గర్ల్ ఫ్రెండ్ ఉండే ఉంటుందని అనిపించింది.
టీ.వీ.లో ఏదో ఇంగ్లీషు మూవీ చూస్తూ పడుకున్నాను.
అయినా ఏ మూలో ఫోన్ మోగుతుందనీ, ఒకే ఊళ్లో ఉన్నప్పుడు అతను కర్టెసీకైనా మళ్ళీ మాట్లాడతాడనీ ఆశగా వుంది. ఫోన్ మ్రోగలేదు. డోర్ బెల్ మ్రోగింది. ఒక్క గెంతులో మంచం దిగి తలుపు తీశాను.
రూం సర్వీస్ బోయ్ నిలబడి వున్నాడు. ఆనందంతో విచ్చుకున్న నా ముఖం గాలి తీసిన బుడగలా ముడుచుకుపోయింది. ఆరాత్రి అలాంటి వ్యక్తిని ప్రేమించిన నామీద నాకే కోపం వచ్చింది. కానీ అతనికి నా మనసులో భావాలు తెలీవుగా పాపం... అని సరిపెట్టుకున్నాను. అయినా అసలు నిద్రెలా పడుతోందో!!
ఆ రాత్రి ఎంత పొడుగ్గా ఉందంటే ఎన్నిసార్లు లేచి గడియారం చూసినా ముల్లు ముందుకే జరగలేదు. నాకు అనుమానం కూడా వచ్చింది. ఒకవేళ ఈ ముళ్ళు వెనక్కి నడుస్తున్నాయేమోనని!
తీరిగ్గా తెల్లవారి, వీలైనంత ఆలస్యంగా బద్ధకిస్తూ సూర్యభగవానుడొచ్చాడు! నేను ఆఫీసుకి వెళ్ళిపోయాను. నేను ఫలానా అని చెప్పగానే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు.
'మిస్టర్ బోస్ ఎప్పుడొస్తారూ?' అని పి.ఎ.ని అడిగాను.
'రావటం ఏవిటి? ఆయన ఇక్కడే ఉన్నారు రాత్రంతా...' అంది.
'మరి... మరి... నేను రాత్రి ఇంటికి రింగ్ చేశానే!' అన్నాను.
"కాదు మీ ఫోన్ ఇక్కడికే వచ్చింది మేడమ్. సార్ కాల్ ట్రాన్స్ ఫర్ పెట్టుకున్నారు. నేనే రిసీవ్ చేసుకున్నాను. టెన్ కి నేను వెళ్ళిపోయాను. సార్ మాత్రం ఇంపార్టెంట్ ఫైల్స్ చూస్తూ రాత్రంతా ఆఫీసులోనే ఉన్నారు. ఇప్పుడే కాస్త రిఫ్రెష్ అయినట్లున్నారు మీరొచ్చారని చెపుతాను..." అని ఇంటర్ కంలో నా రాక తెలియజేసింది.
'లోపలికి రమ్మంటున్నారు' అని నవ్వుతూ చెప్పింది.
ఆ గది తలుపు తోసుకుంటూ లోపలికి వెళ్ళడానికి ఎంతో శక్తి కావల్సి వచ్చింది. అతన్ని మరునిమిషంలో చూస్తానన్న ఊహే ఒళ్ళంతా గాల్లో తేలిపోయేటట్లు చేస్తోంది. ఎంత ఫూలిష్ ఊహా...ఈ కాళ్ళు తుడుచుకునే పట్టా... ఈ డోర్... ఆ కార్పట్ ఎంత అదృష్టం చేసుకున్నాయి. అతను ప్రతి రోజూ టచ్ చేస్తాడు కదా అన్న ఆలోచన! నేను నెమ్మదిగా లోపలికి వెళ్ళాను.
'కమిన్...' అతని ముఖం చాలా మామూలుగా, రోజూ చూస్తున్న వాళ్ళని చూస్తున్నట్లే ఉంది! అస్సలు ఆనందంలాంటి భావంలేదు. అతను కూర్చోమనే దాకా ఆగలేక ఎదురుగా వున్న కుర్చీలో కూలబడిపోయేటంత నిస్సారంగా అనిపించింది నాకు.
'చెప్పండి...ఎనీ ఇంప్రూవ్ మెంట్? రిపోర్ట్స్ అన్నీ జాగ్రత్తగా వెరిఫై చేసి నేను చెప్పిన డిఫెక్ట్స్ ఎక్కడున్నాయో గమనించారా? నే... కెనడా వెళ్ళేముందు నాకా ఇన్ ఫర్ మేషన్ కావాలి...' పెన్ తిప్పుతూ నాతో అన్నాడు.
ఇందుకా... నేను రాత్రంతా అంత ఎగ్జయిట్ మెంట్ అనుభవించినది!
నాకు ఎన్నడూ లేనిది భోరున ఏడవాలనిపించింది. కానీ నా ఫ్రొఫెషనలిజమ్, నా మెచ్యూరిటీ వల్ల ఓ మామూలు ఆడపిల్లలా నా భావాలు బయటపడనియ్యలేదు. చాలా జాగ్రత్తగా వాటిని దాచుకుని అతనికి నేను తెచ్చిన ఇన్ ఫర్ మేషన్ ఇచ్చాను. అతను సంతృప్తి పడ్డాక, తలవూపి 'లంచ్ కి హోటల్ కి వెళ్ళి పోతారా? ఆఫీసుకి తెప్పించమంటారా?' అని అడిగాడు. నేను వెంటనే 'మీరు ఎక్కడ తీసుకుంటారూ?' అని అడిగాను.
'నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. నాకు నైట్ నిద్రలేదు కదా! ఐ నీడ్ రెస్ట్' స్థిరంగా అన్నాడు.
'ఓ.కె!' హుందాగా తల ఊపడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
'దెన్ ఐ విల్ మేక్ ఎ మూవ్...' అతను బ్రీఫ్ కేస్ తీసుకుని గదిలోంచి వెళ్ళిపోతుంటే నీరసంగా అనుసరించాను.
డ్రైవర్ నన్ను చూసి దగ్గరకొచ్చి నా చేతిలోని లేప్ టాప్ అందుకుని, కారువైపు దారితీశాడు.
మరోరోజు నిస్సారంగా... నిరర్థకంగా గడిచిపోతోంది... రేపు తిరిగి వెళ్ళిపోతాను. అతను కెనడా వెళ్ళిపోతాడు! ఈలోగా నా మనసులో మాట ఎలా చెప్పాలి? చెప్పడానికి అసలు మనిషి ఆస్కారం ఇస్తేకదా! ఒక్క చిరునవ్వైనా నవ్వలేదు.
ఆఫీసు వ్యవహారాలు తప్ప అన్యమైనవి ఒక్కటి కూడా మాట్లాడలేదు. అసలు తను నాతో కలిసి తిరిగిన ఆ వారం రోజులూ కంప్లీట్ గా మెమరీలోంచీ ఇరేజ్ చేసేశాడేమో అనిపిస్తోంది!
లాభంలేదు. ఏమైనా చెయ్యాలి. అందరికీ తెలివిగా సలహాలిచ్చి సాయపడే నేను ఇలా అశక్తతతో కాలాన్ని నిందిస్తూ కూర్చోలేను. సృష్టిలో ఒకసారి కోల్పోతే తిరిగి సాధించడం అసాధ్యమైనది కాలం ఒక్కటే. బాగా ఆలోచించాను. లంచ్ కూడా చెయ్యలేదు. సాయంత్రం నాల్గింటికి అతని ఇంటికి ఫోన్ చేశాను.
'హలో...' అతని స్వరం...మంద్రంగా... సుతిమెత్తగా, అతని స్వరూపం, స్వభావంతో సంబంధం లేకుండా హాయిగా వినిపించింది.
"నేను లిల్లీని..."
'చెప్పండి మేడమ్!' అదే మొనాటనీ.
'ఈ సాయంత్రం మీకు ఏమైనా ఎంగేజ్ మెంట్స్ ఉన్నాయా?' నాలో బెరుకుని పారద్రోలి మామూలు లిల్లీని అయిపోవడానికి ప్రయత్నించాను.
'యా...వై?'
ఇంకో ఆడపిల్లయితే ఏమీ చెప్పకుండా హర్ట్ అయి వెంటనే ఫోన్ పెట్టేసేది.
