అదీ అరలిప్త మాత్రమే... అప్పుడు బోధపడింది ఆమెలో పట్టు జారిపోతున్న విషయం.
తన మీద అంతదాకా ఘనీభవించిన ప్రేమంతా కట్టలు త్రెంచుకుందని అనిపించలేదు... ఓ గాడి తప్పిన మగాడి చేతుల్లో నలిగిపోతున్నట్టు గుర్తుకొచ్చింది. అతడెంత ఇష్టమైన వ్యక్తి అయినా ఇలా తను లొంగదు.
ఆ గదిలోని ఎయిర్ కండిషనర్ ని మించిన వేగంతో ఆమె ఉచ్చ్వాస నిశ్వాసలు ఎక్కువవుతుంటే గభాలున లేచి ఓ మూలకి దొర్లింది.
ఇప్పుడామె మొహాన్ని చేతుల్తో కప్పుకుని ఏడుస్తూంది సన్నగా. చేతికి చిక్కగా రక్తం. అతడి పంటి గాటుకి గుర్తుగా చెంపలపై నుంచి జారుతూంది...
అది సిగ్గో, శశాంకని చూడలేని బిడియమో "అసలు నువ్వు లోపలికి ఎందుకొచ్చావు... ఎలా వచ్చావు" అంది రొప్పుతూ కళ్ళు మూసుకునే.
ద్వారం దగ్గర నుంచి వినిపించింది "ఇదే హోటల్లో ఉన్న నాకు కౌంటర్ దగ్గర నీ రూం కీ సంపాదించడం కష్టం కాలేదు వినీలా. ద్వారం తెరిచి మళ్ళీ నీ రూం కీని కౌంటర్ దద్దర ఇచ్చేశాను... లోపల నుంచి కీ రాబ్ ని వేసి నీకు అనుమానం రాకుండా జాగ్రత్తపడి లోపల బాత్ రూంలో వెయిట్ చేశాను. నీ ఫైవ్ స్టార్ సాంప్రదాయం నాకిలా సహకరించింది..." ఓ క్షణం తర్వాత అన్నాడు. "ఇది ఎందుకు జరిగినా ఇప్పుడు నేనొచ్చిన పనికి చాలా ఉపయోగపడింది. చెంపపై పంటిగాటుతో నువ్వు రేపు ఫైనాన్స్ మినిష్టర్ ని కలవలేవు. అందమైన ఆడపిల్లవిగా... చూసేవాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటుంది. పైగా ఇటు చూడు... నీ బ్లౌజులూ, బ్రాసరీస్ నా చేతుల్లో ఉన్నాయి... అవి లేకుండా నువ్వు గది దాటి బయటికెళ్ళలేవు... అంటే నీ 'ఫాలో అవ్' ఆగిపోతుంది కొన్ని గంటలపాటు... అది చాలు నేను రేపుదయం నువ్వు గదిలోనే ఉండిపోడానికి, ఆలోగా నేను కొన్ని పనులు పూర్తి చేసుకోడానికి."
ఆమె ఉద్వేగంగా లేచి చూసేసరికి అతడు లేడు... సూట్ కేసు చెక్ చేసింది. నిజంగానే లేవు బ్రాలూ, బ్లౌజ్ లూ...
అద్దంలో చూసుకుంది... చెంపపై గాట్లు కనిపించాయి ఉదయమే బయటికి వెళ్ళే అవకాశాన్నివ్వనట్టుగా...
అదికాదు ఆ క్షణంలో ఆమెను అంతగా బాధ పెట్టింది.
తను వచ్చిన పనిని ఆపడానికే శశాంక వచ్చినట్టు స్పష్టంగా బోధపడిపోయింది.
* * * *
ఉదయం పది గంటల సమయంలో...
ఫైనాన్స్ మినిష్టర్ తన ఇంటి ఆఫీసులో కూర్చుని ఫైల్స్ ని చూస్తున్నాడు వరుసగా. ఆ రోజు సాయంకాలమే ఆయన విదేశాలకి వెళ్ళిపోతూ ఉండడంతో ముఖ్యమైన ఫైల్సన్నీ సంతకాలు చేయాలని సంకల్పించుకున్నాడు కూడా...
అన్నిటికన్నా ముందు టెక్స్ టైల్ టైకూన్ రాహుల్ పోలిస్టర్ బట్టల తయారీకి ముడి పదార్థమైన పి.టి.ఎ. దిగుమతికి సంబంధించిన ఫైల్ ని ఆమూలాగ్రం చదువుతున్నాడు... ఇక్కడ ఆయన అంత లోతుగా వెళ్ళడానికి కారణం ఈ మధ్య ప్రతిపక్షాలు రూలింగ్ పార్టీపై చాలా గట్టిగా కన్నువేసి ఉంచాయి... ఇప్పటికే బోఫోర్స్, ఫెయిర్ ఫాక్స్ తో పెంటగా ఉన్న పరిస్థితిలో నిబంధనలకి ఎక్కువ దూరంగా ఏ సంతకం చేసినా రగడ మొదలై తన స్విస్ బేంక్ అకౌంటు వివరాలు బయటికొస్తుంది.
అతనికి చాలా నిజాయితీపరుడని పేరుంది... పైగా జయచంద్రతో మంచి స్నేహముంది... అంతకు మించి తను బ్రహ్మచారి అయినా, వెనుక ఏ బాదరబందీ లేకపోయినా డబ్బు మీద, దాన్ని రప్పించగల పదవి మీద అపరిమితమైన ప్రేముంది.
పోలీసులు కోర్టులు కన్నా తమని ఆశ్రయించిన వాళ్లకి తక్కువ ఖర్చుతో వ్యయం చేసే మాఫియా డెన్స్ విస్తరించిన ఈ దేశంలో ప్రభుత్వం కంటే సమాంతర ప్రభుత్వాలు నడిపే అండర్ వరల్డ్ రాకెట్స్ పలుకుబడి గలవని నిరూపించుకోగల్గుతున్న ఉప ఖండంలో ఇలాంటి వ్యవహారాలు కొత్తకాదు... కోటీశ్వరుడు ఒక్కడే అయితే ప్రభుత్వంలో ఏ పనైనా సాధించుకోగలడు... ఇద్దరైనప్పుడే వాళ్ళు 'డెన్స్' ని ఆశ్రయిస్తారు... తమ డబ్బు కన్నా దాని కోసం పనిచేసే చీకటి సామ్రాజ్య చక్రవర్తుల 'ఏక్సెసిబులిటీస్' అసాధారణమైనవి.
సంతృప్తిగా నిట్టూర్చిన ఫైనాన్స్ మినిష్టర్ ఇక సంతకం చేయబోతున్న తరుణంలో అతని పి.ఎ. వచ్చాడు "సర్" అంటూ...
ఓ కవరు అందించి సమీపంలో నిలబడ్డాడు.
దానిపై "ఫ్రం జయచంద్ర, వెరీ కాన్సిడెన్షియల్" అని వుంది. చెప్పాడు పి.ఎ. ఎవరో ఓ వ్యక్తి అర్జెంటుగా ఆయన కందించమని ఇచ్చాడంటూ.
జయచంద్ర కూతురు రావడానికి బడులు ఆ కవరెందుకు పంపబడిందో అర్థం కాని మినిష్టర్ 'ఎన్ వలప్' తెరిచి చూడగానే ఓ పాముని పట్టుకున్నట్టు ఉలిక్కిపడ్డాడు.
అందులో...
నిన్న రాత్రి పది గంటల ప్రాంతంలో ఏదో జాబ్ కావాలని వచ్చిన అమ్మాయితో తను గడిపిన ఫోటో... చాలా అశ్లీలంగా వుంది. ఎక్కడతను?"
శశాంకని పిలిచిన పి.ఎ. శశాంక గదిలోకి రాగానే తను బయటికి వెళ్ళిపోయాడు.
