పెళ్ళివారు ఆదివారం చూసుకోవడానికి కుదురుతుందని కబురు చేశారు.
నాకు ఇంట్లో కర్ఫ్యూ పెట్టారు.
బావ అక్కని తీసుకుని వెళ్ళిపోయాడు.
అమ్మ నన్ను సెంట్రీలా కాపలా కాస్తోంది!
రెండు రోజుల్లో నాకు పిచ్చెక్కిపోతుందేమోనన్న అనుమానం వచ్చింది.
లిల్లీ ఊర్నుండి వచ్చి ఉంటుంది. బోస్ ఏమన్నాడో తెలుసుకోవాలి! చిత్రా, వైజయంతీ నేను కాలేజీకి రాకపోతే కంగారుపడి వస్తారేమో... వస్తే నా పరిస్థితి లిల్లీకి తెలియజేయచ్చు!
ఇంట్లోంచి బయటికీ, బయటనుండి ఇంట్లోకి కాలుగాలిన పిల్లిలా తిరగసాగాను. ఆరోజు తరువాత విక్కీని కలుసుకోలేదు. ఏమనుకున్నాడో!
కర్నూలు వెళ్ళే విషయం గురించి చెప్తే ఇంట్లో మళ్ళీ గొడవౌతుంది. ఏవిటీ చిక్కులు? తల పగిలిపోతోంది.
మధ్యాహ్నం చదువుకుంటూ గదిలో కూర్చున్నాను.
"అన్నం తిందువుగాని రా" అంటూ అమ్మ పిలిచింది.
"నాకు ఆకలి లేదు" అన్నాను.
"రమ్మంటున్నాను... రా..." అమ్మ అంత కఠినంగా మాట్లాడగలదని నాకు అప్పుడే తెలిసింది. వెళ్ళి అన్నం ముందు కూర్చున్నాను.
నాన్న నా ఎదురుగా కూర్చున్నారు.
అమ్మ అన్నం వడ్డించి "ఊ... కలుపుకో..." అంది.
నేను కలిపాను. ముద్ద నోట్లో పెట్టుకుంటే ఏడుపు ముంచుకు వచ్చేసింది. మెతుకులు గొంతుకి అడ్డుపడి కొరబోయింది. అమ్మ నెత్తిమీద కొట్టింది. నాకు ఊపిరి అందనట్లయి, దగ్గుతో క్రింద మీదయ్యాను.
నాన్న కంగారుగా అన్నం వదిలేసి నా దగ్గరకి వచ్చి "అయ్యో...పిల్ల తిప్పుకోలేకపోతోందే!" అన్నారు.
అమ్మ మంచినీళ్ళు అందించింది. కాసేపటికి సర్దుకున్నాను. అమ్మా, నాన్న ఇద్దరి కళ్ళల్లో కంగారు. నేను మామూలుగా అయ్యాక ఊపిరి తీసుకున్నారు.
"నాన్నా...ఈ రెండు నిమిషాల్లో పడ్డ బాధకన్నా వందరెట్లు మీ నమ్మకం కోల్పోయిన నిర్భంధంలో నేను పొందుతున్నాను. ఇంకోరోజు ఇలా కట్టడిలో పెట్టారంటే నేను చచ్చిపోతాను..." అని ఏడ్చాను.
నాన్న నా తలని గుండెల దగ్గరగా తీసుకుని "ఊర్కో తల్లీ...ఊర్కో అని ఓదార్చారు.
అమ్మకూడా ఏడ్చేసింది. "నీ మంచి కోరేవాళ్ళమేకానీ చెడు కోరేవాళ్ళం కాదు తల్లీ" అంది.
"అందుకేగా తలవంచుకుని శిక్ష అనుభవిస్తున్నాను. తెగించి పారిపోవడం రెండు నిమిషాల పని" అన్నాను.
నాన్నగారు ఏమనుకున్నారో గానీ "మరి అతనితో ఎందుకు తిరుగుతున్నావు?" అన్నారు.
నేను జరిగిందంతా చెప్పాను.
"అతనిమీద ఇంకే అభిప్రాయం లేదా?" అంది అమ్మ.
"లేదు" అన్నాను.
"అయితే ఆదివారం అతనితో పెళ్ళిచూపులకి ఒప్పుకుంటావా?" అడిగారు నాన్న.
"ఊ..." అన్నాను.
"అయితే కాలేజీకి వెళ్ళు" అన్నారు.
అయినవాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారంటే నాకు ఆశ్చర్యంగా ఉండేది. అది కాస్తా ఈ సంఘటనతో పోయింది. గబాగబా అన్నం తినేసి వెళ్ళి తయారయ్యాను. బట్టలు మార్చుకుంటుంటే, బీరువాలో ఎర్ర డైరీ కనిపించింది. దాని వంక దిగులుగా చూశాను.
* * *
"ఇన్ని రోజులూ ఏమయిపోయావే? నేనే వద్దామనుకుంటున్నాను" అంది నన్ను చూడగానే లిల్లీ.
దానికి నేనేమీ జవాబివ్వకుండా, "ముందు వెళ్ళిన సంగతి ఏవైందో చెప్పు. నీ ప్రేమ విషయం అతనికి చెప్పావా?" అన్నాను.
లిల్లీ నన్ను గట్టిగా కౌగలించుకుంది.
ఆ చర్యతో నాకు శుభవార్తే అని తెలిసిపోయింది.
"కంగ్రాట్స్" చెవిలో చెప్పాను.
"అనుకోకుండా జరిగిపోయింది. నాకే ఇంకా నమ్మశక్యంగా లేదు. ఎలా చెప్పాలా... అని నాలో నేనే తెగ మధనపడిపోతుండగా జరిగింది ఆ సంఘటన..."
* * *
లిల్లీ చెప్పసాగింది.
"నేను ముంబై ఎయిర్ పోర్ట్ లో దిగగానే నాకళ్ళు అతని కోసం ఆత్రంగా వెతికాయి కానీ అతను రాలేదు. రాత్రంతా అతన్ని చూడగానే ఎలా పలకరించాలో అని వేసుకున్న రిహార్సల్స్ అంతా వేస్ట్ అయిపోయింది. నిరుత్సాహంగా నేను రూం బుక్ చేసుకున్న హోటల్ చేరాను. వెళ్ళగానే అతనికి ఫోన్ చేశాను. అతను కాదు ఇంకెవరిదో ఆడగొంతు.
'మే ఐ స్పీక్ టూ బోస్...ఐయామ్ లిల్లీ" అన్నాను.
కాసేపటికి వచ్చి 'హలో... ఎక్కడ దిగారూ?' క్యాజువల్ గా అడిగాడు.
"నేను వస్తున్నానని మీకు చెప్పాను. కానీ మీరు మర్చిపోయినట్లున్నారు..." ఉక్రోషంగా అన్నాను.
'ఎగ్జాట్లీ...చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను' అన్నాడు.
ఫోన్ ని కోపంగా క్రెడిల్ చేసెయ్యాలనిపించింది. అయినా ఓర్చుకుని 'సారీ...ఈ టైంలో డిస్టర్బ్ చేసినందుకు..." అన్నాను.
