Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 82


    పగలంతా అలసిపోయి వుండడంతో అయిదు నిమిషాలలో నిద్ర పట్టేసింది.


    అలా ఎంతసేపు గడిచిందో ఆమెకు గుర్తు లేదు.


    ఎవరో తలుపు తట్టినట్టయి ఉలికిపడి నిద్రలేచింది.


    ముందు కలేమో అనుకుంది. పక్కనే కూర్చున్న శశాంకని చూడగానే...


    అది కల కాదని తెలుసుకోవడానికి పట్టింది అరక్షణం మాత్రమే. లోపల గడియ పెట్టినట్టే వుంది. ఎలా వచ్చాడో లోపలికి.


    అప్పుడు చూసింది గోడవైపున్న డిజిటల్ వాచ్ ని.


    ఎనిమిది గంటలు కావడానికి సరిగ్గా ఓ అరనిమిషం తక్కువ వుంది.


    ఆమె ద్వారం వైపు పరుగెత్తాలనుకుంది. కాని అప్పటికే ఆలస్యమైంది.


    "ఏం చేద్దామని" శశాంక పట్టు విడిపించుకోలేక అంది కోపంగా చూస్తూ...


    ఇప్పుడామె మెత్తదనం శశాంక గుండెల్ని కుషన్ లా ఒత్తుతుంది. "లవ్ లీ..."


    "విడిచిపెట్టు" అని పెనుగులాడుతున్న వినీలని గట్టిగా పొదవి పట్టుకొని కళ్ళలోకి చూస్తున్నాడు.


    "మర్యాదగా ఒదులు" వినీల పెదవులు అదురుతున్నాయి.


    "వదలకపోతే"


    "కేక పెట్టాల్సి ఉంటుంది."


    "అంతకంటే ఓ ముద్దు పెడితే బెటరుగా ఉంటుంది."


    "ఐ హేట్ యూ" అంత దగ్గరగా శశాంక వేడి ఉచ్చ్వాస నిశ్వాసలు చెంపలకు తాకుతుంటే అదోలా అయిపోతుంది. ఆమెకు తెలుసు క్రమంగా తను వశం తప్పుతున్న విషయం...


    "విశ్వంలో మిలియన్ల నక్షత్రాలున్నాయంటే సులభంగా నమ్మే ఆడపిల్ల, ఇది షిఫాన్ శారీ అనగానే వెంటనే తడిమి చూస్తుంది అవునా, కాదా అని... నువ్వలాంటి దానివి కాదనుకున్నాను. కాని నువ్వూ అక్కడికి వచ్చేసరికి ఆడపిల్లవే_"


    "అక్కడికి అంటే..." ఇప్పుడామె అరిచే ఆలోచనలో లేదు. శశాంక అభియోగానికి జవాబు చెప్పే ప్రయత్నంలో ఉంది.


    "అదే తెలివైన అమ్మాయిల్లో ఉండే 'ఇకీసేవిటీ' నీ బుర్రలోనూ ఉంది"


    "నువ్వు పొరపాటుపడ్డావు శశాంకా... బహుశా సోఫియాతో నీకు గల సంబంధాన్ని ఇలా సమర్ధించుకుంటున్నావేమో... పిచ్చికుక్కలా నిన్ను వెంటాడే సోఫియానిక్కడ రిఫర్ చేస్తున్నందుకు బాధపడకు. ఆమెతో నీకేమీ సంబంధం లేదూ అనడం ఎలా ఉందో చెప్పనా... కుక్క కాటుతో హైడ్రోఫోబియా వచ్చి తగ్గిందనుకున్న పేషెంట్ తన వీలునామాలో తన ఆస్తికి ఎవరెవరు వారసులో అని కాక అర్జెంటుగా ఎవరెవర్ని కరవాలో రాసుకున్నట్లుంది."


    "ఇక్కడ నువ్విలాంటి ఉదాహరణ ఇవ్వడం ఎలా ఉందో నన్నూ చెప్పనియ్... 'X' అనే అబ్బాయిని అతిగా ప్రేమించానని భావించే 'Y' అనే అమ్మాయికి ఓ రోజు 'Z' వచ్చి చెప్పాడట. 'X' బావిలో పడి చచ్చాడని...అప్పుడు ఆ 'Y' చాలా బాధపడుతూ మేం సిటీ వాటర్ తప్ప బావి నీళ్ళు తగమూ అని రెండు వేడి కన్నీటి బొట్లు రాల్చేసిందట..."


    "సరే, నేను ఆ 'Y' లాంటి దాన్నే. విడిచి పెట్టు" పైకి లేవబోయింది.


    కాని శశాంక ఎంత గట్టిగా చేత్తో చుట్టేసాడూ అంటే విడిపించు కోవడం కష్టంగా ఉందే తప్ప ఇబ్బంది లేదు... "వినీలా... నిజంగా నన్ను ప్రేమిస్తే నీ తండ్రిని విడిచి పెట్టగలవా..." ఇప్పుడతడి గొంతులో చిలిపితనం లేదు. సీరియస్ గా అంటున్నాడు. "నన్ను కావాలీ అనుకుంటే నీ తండ్రికి దూరం కాలేవా? నీ తండ్రిని సమర్ధించి నాకు శత్రువ్వి కావాలనుకుంటున్నావా..."


    "అంటే కోరుకున్న మనిషిని సంతృప్తి పరచడానికి కన్న తండ్రిని అలా వదిలేయడమే ప్రేమ అనిపించుకుంటుందా."


    "వినీలా నీ తండ్రి హంతకుడు..."


    "అప్పుడు నువ్వు ధనుష్కోటిని హత్య చేశావుగా"


    "నాది పగ..." శశాంకలో క్రమంగా సహనం నశించిపోతూంది.


    "మా నాన్నది పట్టుదల..."


    "రెండూ ఒకటేనంటావు"


    "కాకపోవచ్చు... కాని డాడీ ఇప్పుడు ఒకప్పటి డాడీ కాడు... మారాడు... మరణానికి సమీపంలో ఉన్నాడు. నువ్వు సోఫియా శరీరం కోసం ఆమె నాశ్రయించినట్టు డాడీ రక్తాన్ని పంచుకున్న నేను మా డాడీ కోసం..."


    సరిగ్గా ఇక్కడే శశాంక వశం తప్పింది... అమాంతం ఆమె పెదవుల్ని ముద్దు పెట్టుకున్నాడు... అది ఆవేశమో ఆమెపై గల లాలసత్వమో ఆ క్షణంలో ఆలోచించలేదు...


    సన్నగా మూలిగింది ఊపిరందనట్టు... చేతుల్తో అతడి చెంపల్ని పట్టుకుని దూరంగా నెట్టబోయింది.


    కాని ఇప్పుడతని పెదవులు ఆమె చెంపల్ని చేరాయి.


    ఆ చెంపలు అతడిలోని మగతనాన్ని రెచ్చగొట్టాయి. ఆమె గోళ్ళు అతడి కంఠాన్ని గీరేస్తుంటే అతడి పళ్ళు ఉన్మాదంగా ఆమె చెంపల్లో గుచ్చుకున్నాయి.


    వినీల కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కాని మగతగా అనిపించింది... ఆమె చేతులిప్పుడు అతడి మెడ వెనుకకు చేరి బలంగా దగ్గరకు లాక్కున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS