"ఎంత వరకూ" శశాంక ఎందుకు బయలుదేరిందీ వినీలకి తెలియకపోయినా, వినీల సర్కార్ లు బయలుదేరుతున్న విషయం సోఫియా ముందే తెలియ పరిచింది. అది తెలిసాకనే సర్కార్ ని యుక్తిగా తప్పించే పథకం వేసింది.
"మిమ్మల్నే" రెట్టించాడు. వినీలలాంటి సుకుమారంగా వుండే ఓ ఆడపిల్ల తెలివైనదైతే మాత్రం ఇలాంటి పనిమీద బయలుదేరడం శశాంకకి కోపం తెప్పించడం లేదు. తగుదునమ్మా అంటూ అంతదూరం వచ్చి తనతో తొలిసారి తెలియకుండా పోరాటానికి దిగటమే ఉత్సుకతని కలగజేస్తూంది. "సారీ మీరు మూగ అమ్మాయని తెలుసుకోలేకపోయాను."
ఆవేశంగా తలతిప్పి చూసింది. టేకాఫ్ లో కాస్తా అతడిపై ఒరుగుతూనే.
"థాంక్ గాడ్... చెవుడు లేదు"
"సైలెంట్ గా కూర్చుంటే సంతోషంగా వుంటుంది.
"అందమైన అమ్మాయిల్ని సంతోష పరచడం నాకు ఆనందమే అనుకోండి. కాని ఎంత వరకు వెడుతున్నదీ చెప్పొచ్చుగా..."
"అనకాపల్లి దాకా"
"ట్రైన్ లో వెళ్ళాల్సింది. ఎందుకంటే ఒకవేళ ఈ విమానం ఆ రూట్ లో వెళ్ళినా దూకడం కష్టం కాబట్టి"
"మైండ్ యువర్ బిజినెస్"
"మై బిజినెస్ ఈజ్ కనెక్టెడ్ విత్ యువర్ బిజినెస్" నిష్టూరంగా విషయాన్ని చెప్పాడు. "ఎంతైనా అయిదేళ్ళ పరిచయం."
"అదెప్పుడో భగ్నమైపోయింది" వినీల కనుకొలకుల్లో నీళ్ళు నిలిచాయి అప్రయత్నంగా.
"నెవ్వర్ ఇంత దాకా కాలేదు ఏవో కొన్ని అపార్థాలు తప్ప."
"పాపం ఒంటరిగా వెడుతున్నారేం" ఆమె ఇప్పుడు సోఫియాని ఉద్దేశించి అడిగింది ఎగతాళిగా.
"వెడుతున్నది హనీ మూన్ కి కాదు"
"వెళ్ళాల్సింది"
"ఇంచు మించు ఇప్పుడు అలానే అనిపిస్తోంది" శశాంక మాటలకి ఉక్రోషంగా చూసింది. "అవును వినీలా నేలమీద అరుచుకుని ఆకాశంలో కలుసుకున్నాం కాస్త మూడ్ లో ఆలోచిస్తే హనీమూన్ కి వెడుతున్నట్టు లేదూ"
కొన్ని రోజుల వ్యవధిలో అతడింతగా మారిపోతాడని వూహించని వినీల ఇంత జరిగినా ఏంకానట్టు కబుర్లు చెబుతుంటే విస్మయంగా చూస్తూ వుండిపోయింది అతడ్ని.
"అందంగా వున్నాను కదూ"
"సోఫియా సర్టిఫై చేసిందా" కోపాన్ని పంటి బిగువున ఆపుకుంటూ అంది.
"పాపం ప్రతి అంగుళం కొలిచి వుంటుంది"
"మరేం చెప్పింది"
"ఏమిటి"
"నీ బ్రా సైజు గురించి కూడా"
"షటప్"
"ముసలాడ్ని. పెదవులతో కానీ చూస్తారంతా"
"నీతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ" తల తిప్పుకుంది.
"కరెక్ట్ ఇప్పుడొద్దు. రాత్రికి హోటల్లో కలుసుకుంటాను"
"దేనికి"
"ఎందుకలా కంగారు పడతావు. మన సిటీ కాదు కనీసం మన రాష్ట్రం కాదు. ఎవరూ చూడరు."
"చూసినా సిగ్గు పడేటంత పని నేనేం చేయను"
"గుడ్... అయితే గెట్ రడీ"
"ఎందుకో"
"నువ్వు బ్రతికినంతకాలం మరిచిపోని ఓ ముద్ర వేయడానికి. అవును వినీలా నీ దృష్టిలో నేను పతనమైన వాడ్ని. సో... ఈ రాత్రి ఎనిమిదింటికల్లా నీ గదిలో ముద్దు పెట్టుకోబోతున్నాను."
"ఆవేశంతో ఆమె గుండెలు ఎగిరెగిరి పడుతుంటే అతడి చూపులు అలవోకగా అటు వేపు మళ్ళాయి.
గభాలున పైట సర్దుకుంది "మిస్టర్ శశాంకా... ఒకనాడు నీ మత్తులో తిరిగాను అంటే నిజమేమో. కాని ఈ రోజు నన్ను తాకాలీ అన్నా నీకది సాధ్యంకాని విషయం."
"అలాగా చూపిస్తాగా ఈ రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలకి" అతడు చిలిపిగా అంటున్నట్టు లేదు. ఛాలెంజ్ లా వుంది.
* * * *
ఎయిర్ పోర్టులో దిగిన వినీల శశాంక కోసం ఎదురు చూడలేదు. సరాసరి ముందే రిజర్వు చేయబడిన హోటల్ అశోకాకి వెళ్ళిపోయింది.
అంతకు పూర్వం ఢిల్లీ రెండు మూడు సార్లు వచ్చి వుండడంతో అక్కడ ఏదీ కొత్తగా అనిపించలేదు.
అనుకున్న షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా ఫైనాన్స్ మినిస్టర్ ని ఇంటి దగ్గరే కలుసుకుని కవరు అందించింది.
అతడు కవరు తెరిచి చూసింది రెండే రెండు నిమిషాలు. ఫైలు రేపు మధ్యాహ్నానికల్లా సంతకం చేసి ఓ కాపీ ఇస్తానని మాటిచ్చాడు. వచ్చిన పని అంత సునాయాసంగా పూర్తవుతుందని వూహించని వినీల వెంటనే హైద్రాబాద్ ఎస్.టి.డి.లో సర్కార్ తో మాటాడింది. నాన్నగారి తెలియజేయమని.
ఉబుసుపోక మాట్నీకి వెళ్ళిన వినీల బయటికి వస్తుంటే అప్పుడు గుర్తుకొచ్చింది శశాంక ఛాలెంజ్. శశాంక ఎంత మొండివాడో ఆమెకి తెలియనిది కాదు. ఉదయం ఆరున్నరకల్లా హోటలు సూట్ లోకి వచ్చి లోపల గడియ పెట్టింది. డ్రెస్ చేంజ్ చేసి నైటీతో ఫోంబెడ్ పై పడుకుంది.
