Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 80


    అన్నమూ రసమూ తయారుచేసింది.
    శ్రీపతికి యెనిమిదిన్నరకి మెలుకువొచ్చింది. జ్వరం చూసింది. నూటమూడు.
    "యీ పూట అన్నం తినండి యాంటీ బయోటిక్స్ వాడుతూంటే పర్లేదు, అన్నీ తినొచ్చుగా!" అంది.
    "కుర్రాడు వస్తాడు. క్యారియరు లేదుగానీ హోటల్లో అడిగి తెమ్మను. నీకు భోజనం కావాలిగా__" అన్నాడు.
    "అట్లాగే" అని లోనకెళ్ళి పళ్లెంలో కొద్దిగా చారు అన్నం కలుపుకొచ్చింది.
    "ఇదెక్కడిది?" అన్నాడు.
    "ఆ పెట్టెల్లో వుంది" అంది.
    "ఇంటికెళ్ళి సామాను తెచ్చావా?"
    "వూఁ"
    "నాకెందుకు చెప్పలేదు?"
    "చెప్పకపోయినా యిప్పుడు తెలుస్తుంది కదా అని. నేను హోటలు తిండి తినలేను బాబూ" అంది.
    "నువ్వు అన్నిరకాల తిండికీ అలవాటుపడి వుంటావని నాకు తెలుసులే.
    "తినండి ముందు."
    "అన్నం తినాలనిపించటం లేదు."
    "అన్నం తింటే కాస్త సత్తువగా వుంటుంది, నే తినిపించనా?" అంది.
    "అవసర్లేదు." అని పళ్ళెం వొళ్ళో పెట్టుకుని తింటున్నాడు.
    మంచినీళ్ళ గ్లాసు తెచ్చి చేత్తో పట్టుకుని కూర్చుంది.
    "అక్కడ పెట్టు. అవసరమైనప్పుడు ఇద్దువు. చెయ్యి నొప్పెడుతుంది." అన్నాడు.
    గ్లాసు అరిచేతులో పెట్టుకుని చెయ్యి వొళ్ళో పెట్టుకుంది.
    "యెవరితోనూ చేయించుకోని నేను నీతో యెందుకు చేయించుకోవాలి?" అన్నాడు.
    "నేను మీకు రుణపడి వున్నందున"
    "నువ్వు నాకు రుణపడి వుండటమా భలే! యెప్పుడు?" అన్నాడు.
    "అవును యీ రెండు మూడేళ్ళ నుండి. క్రితం జన్మలో కూడానేమో." అంది.
    మరో పావుగంటకి మగతగా అనిపించి రెప్పలు వాల్చాడు.
    రాత్రి రెండుసార్లు వేళకి లేపి మందు ఇచ్చింది. ఉదయం యెనిమిదైనా లేవకపోతే చెయ్యి నుదుటిమీద ఆనించింది. అతను అలాగే నిద్రపోతున్నాడు. వొళ్ళు బాగా కాలుతుంది.
    తలుపు తాళం పెట్టి రిక్షాలో నిన్న చూసిన ఆ ఆస్పత్రికి వెళ్ళింది. డాక్టరుకి చెబితే, విజిటింగ్ అవర్స్ అయ్యాక వస్తానన్నాడు.
    "టాక్సీలో యెంతసేపు పావుగంట. స్పృహ లేకుండా వున్నారు. జ్వరం యెక్కువైంది." అని బ్రతిమిలాడినట్లుగా అడిగింది.
    సరే అని ఐదు నిమిషాల తరవాత బయల్దేరాడు టాక్సీలో.
    తాళం తీసింది.
    చూసి పరీక్షచేసి, "టైఫాయిడ్ లోకి దింపే అవకాశాలున్నాయ్. చాలా జాగ్రత్తగా వుండాలి" అని ఇంజక్షన్ చేసి మందులు రాసిచ్చాడు. రేపు వుదయం యెలా వుందీ వచ్చి చెప్పమని వెళ్ళిపోయాడు.
    పని కుర్రాడి కోసం చూస్తే పది నిమిషాలకి కనిపించాడు. డబ్బులు చీటీ యిచ్చి, మందులు కొనుక్కురమ్మని చెప్పింది.
    శ్రీపతి రెప్పలు విప్పనేలేదు. మగతగా పడుకునే వున్నాడు.
    కస్తూరికి వంట చేసుకోవాలనిపించలేదు. బ్రెడ్డు తింది. కాఫీ కలుపుకుని తాగింది.
    ఐస్ బ్యాగ్ గానీ తడి బట్టతోగానీ నుదుటిమీద అద్దుతూ వుండమని చెప్పాడు డాక్టరు.
    పగలు కాసేపు ఓ కునుకుతప్ప మేల్కునే వుండి తడిబట్టతో నుదుటిమీద అద్దుతూ మందులు వేస్తూంది.
    రెండో రోజుకి జ్వరం తగ్గింది. "టైఫాయిడ్ ప్రమాదం తప్పింది. ఇక పర్లేదు" అన్నాడు డాక్టరు.
    నిన్నటి రోజున ధనలక్ష్మి లోనకి వచ్చింది, శ్రీపతికి జ్వరం అని తెలిసి. కస్తూరిని అదోలా చూసి వెళ్ళింది. యివాళ వచ్చింది. యివాళ శ్రీపతి మంచంమీదే పడుకునివున్నా కళ్ళుతెరిచి చూస్తూ నిదానంగా మాట్లాడగలుగుతున్నాడు.
    ధనలక్ష్మి, పెయింటింగ్ సామాగ్రి చూసి, "మీకు పెయింటింగ్ కూడా వచ్చునని చెప్పనేలేదు!" అంది.
    "వచ్చుననేం లేదు. సామాగ్రి వుంది. అంతే" అన్నాడు.
    కస్తూరి వంటగదిలోకి వెళ్ళగానే, "ఆవిడెవరు? మీ చుట్టాలా? మీకేమౌతుంది?" అంది ధనలక్ష్మి.
    "చుట్టమూ కాదు, యేమీ కాదు. వేశ్య"
    "మీకు వాళ్ళు కూడా తెలుసా!" అంది ధనలక్ష్మి.
    "నాకు అందరూ తెలుసు"
    "వేశ్య యీ సమయంలో దేనికీ?" అంది ధనలక్ష్మి.
    "వేశ్య అంటే వెలయాలు__అని. డబ్బుకి అవసరాలు తీర్చేమనిషి అని. యిదీ అవసరమేగా?"
    "మేమంతా లేనట్లు అట్లాంటి మనిషిని__" అని ఆగిపోయింది.
    "కానీ నాకు ఈమెతో యెలాంటి అవసరమూ కలగలేదు. తన ఆదాయం వదులుకుని చేస్తోంది!"
    "యేదో స్వార్థం వుండకపోదు" అంది ధనలక్ష్మి.
    "వేశ్యలకి స్వార్థం వుండదు" అన్నాడు. చిన్నగా నవ్వబోయాడు గాని శక్తి చాలలేదు.
    అంతలో కస్తూరి కాఫీ కప్పుల ట్రే పట్టుకుని వచ్చింది.
    "ఈమె మష్టి ధనలక్ష్మిగారని స్టెనో" అని ధనలక్ష్మి వంకచూస్తూ "ఆమె వెలయాలు" అన్నాడు.
    "కానీ శ్రీపతిగారికి నేనేమీ కాను"
    "చెప్తే మేమూ చూసేవాళ్ళం" అంది ధనలక్ష్మి.
    "నాకూ చెప్పలేదు" అంది కస్తూరి.
    "మరి?" అంది ధనలక్ష్మి.
    "కొందరిపట్ల మన బాధ్యతలు చెప్పించుకోనక్కరలేదు చెయ్యడానికి. కొన్ని అనిర్వచనీయమైన రుణానుబంధాలుంటాయ్" అంది కస్తూరి.
    "మీరు చదువుకున్నట్లుగా అనిపిస్తున్నారు__"
    చిన్నగా నవ్వి, "మేము శ్రీగంధంవారిమి. జాతకం బాగోక జీవితం మరోదారి తొక్కింది. యం.ఏ.చదువుతూ మానేశాను" అంది కస్తూరి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS