Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 79


    "అనిల్ బావున్నాడా? యీమధ్య చూడటం పడలేదు" అన్నాడు.
    "వో మీరు చాలా గుర్తు. యిష్టంకూడా. అడుగుతుంటాడు" అంది.
    శ్రీపతి నీరసంగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు. కస్తూరి చూస్తూ కూర్చుంది పది నిమిషాలు.
    గుమ్మంలో అలికిడిగా అనిపించి లేచి వెళ్ళింది. పన్నెండేళ్ళ కుర్రాడు.
    "శ్రీపతిసాబ్ లేడా?" అన్నాడు.
    "వున్నారు. నిద్రపోతున్నారు. ఒంట్లో బాగాలేదు" అంది.
    "అందుకోసమే యేమన్న తేవాల్నేమో అని వస్తి"
    "నువ్వెవరివి?" అంది.
    "యీడ్నె వుంట. యెవరికన్న యేమన్న పన్లుంటే చేసిపెడుతుంట"
    "మీ అమ్మా నాన్నా యెక్కడుంటారు?" అంది.
    "యెరికలే"
    "లేరా?"
    "యెరికలే."
    పర్సులోంచి పదినోటు తీసి అతనికి యిచ్చి "నాలుగు యాపిల్స్, నాలుగు మొసంబీలు పట్టుకురా. ద్రాక్ష పళ్ళు ఒక పావుకిలో" అంది.
    అతను వెళ్ళాడు. ముందుగదిలో కుర్చీలో కూర్చుంది. కనురెప్పలు వాలుతున్నాయి. లేచి నుంచుని అటూయిటూ అడుగులు వేస్తూ, గుమ్మంలోకి అడుగులు వేసి పరిసరాలు చూసింది. ఆ వీధిలో యెప్పుడో వొకసారి యే యింటికో వచ్చినట్లుగా అనిపించింది. కానీ సరిగా గుర్తురావటంలేదు.
    కుర్చీలో కూర్చుంది.
    ఐదు నిమిషాలు.
    ఆ కుర్రాడు పళ్ళూ అవీ కాగితం పొట్లాలు తెచ్చి బల్లమీద పెట్టి, చిల్లర కూడా బల్లమీద పోశాడు.
    రూపాయిన్నర వుండొచ్చు.
    ఆ పైసల వంక చూపెడుతూ, "తీసుకో" అంది.
    "సాబ్ యిస్తడు" అన్నాడు.
    "పర్లేదు తీసుకో." అంది. తీసుకున్నాడు.
    "మర్ల పొద్దుమీకి వస్త" అని వెళ్ళిపోయాడు.
    తలుపు గడియ వేసింది. ఆ పొట్లాలు పట్టుకుని లోపలికి వచ్చి టేబుల్ మీద పెట్టింది. చాకు వుందేమోనని వెతికింది. చాలా చిన్నది వుంది.
    పళ్ళు అన్నీ నీళ్ళతో కడిగి ట్రేలో పెట్టింది.
    శ్రీపతి నిద్రపోతున్నాడు.
    పదకొండున్నర.
    కుర్చీలో కూర్చుంది. నిద్ర మగతగా కమ్ముకొంది. అతనివంక చూస్తూ కూర్చుంది. యెప్పుడో తెలియకుండా రెప్పలు వాలాయి. మెలుకువ వచ్చేసరికి, శ్రీపతి దిండుమీదకి యేటవాలుగా పడుకుని ఆమెవంక చూస్తున్నట్లుగా కనిపించాడు.
    "మొద్దు నిద్రపోయినట్లున్నాను, టైమెంతైంది?" అని టేబుల్ వంక చూసింది. టేబుల్ మీది అలారం టైం కనిపించటంలేదు సరిగా వస్తువుల వెనక వుండి. అది తిరగటం లేదసలు, కీ ఇవ్వనందున.
    తన చేతికి వున్న వాచీవంక చూసి, "రెండున్నర" అన్నాడు.
    "అమ్మో రెండున్నరే!" అని దిగ్గున లేచి, బాత్రూంలోకి వెళ్ళివచ్చింది.
    ట్రే పట్టుకుని కుర్చీలో కూర్చుని, చాకుతో యాపిల్ ముక్కలు కోస్తోంది.
    చూసి, "అవన్నీ యెక్కడివి?" అన్నాడు.
    "వచ్చాయి."
    "నిద్రపోతున్నావుగా?"
    "మీ పని కుర్రాడు తెచ్చాడు."
    "నువ్వు చెబితే డబ్బులూ__"
    "పర్స్ లోంచి యిచ్చాను" అంది.
    "నాకు పర్స్ లేదే__"
    "నాకు వుందిలెండి." అని చిన్నగా నవ్వి, "తక్కువ డబ్బులుండేవాళ్ళు పర్సు వాడతారు" అంది.
    "అదేమోగానీ, ఆడవాళ్ళు జేబుల్లేక వాడతారు" అన్నాడు.
    నవ్వింది.
    "యెట్లా వుందిప్పుడు?" అంది.
    "అలాగే వుంది."
    "నా కంటికి ఇంకా నీరసంగా కనిపిస్తున్నారు."
    "థెర్మామీటర్ కంటికి యెలా కనిపిస్తున్నదీ అడిగితే సరి."
    టేబుల్ మీదకి చూస్తే కనిపించింది. తీసి అందించింది.
    ఒక నిమిషం తరవాత అందుకుని చూసింది. నూటమూడు.
    "పెరిగింది సాయంత్రం మళ్ళీ డాక్టరుకి చూపిస్తే?" అంది.
    "అవసరం లేదు. పొద్దుటిదాకా అవే మందులు." అన్నాడు.
    కళ్ళు మూసుకున్నాడు. మగతగా నిద్ర.
    మసక చీకటిగా అనిపించింది గదిలో. లేచి దీపం వేసి మంచం దగ్గిరికి వెళ్ళి వాచీలో టైం చూసింది. ఆరున్నర. అతని నుదుటిమీద అరిచెయ్యి ఆనించింది.
    అతను రెప్పలు విప్పాడు. మరింత నీరసంగా వున్నాడు.
    కాఫీ ఇవ్వబోతే వద్దన్నట్లుగా తల కదిపాడు. 'నువ్వు తాగు' అన్నట్లు కళ్ళతో సూచించాడు.
    "నీకు టైం ఐంది." అన్నాడు.
    "కాలేజీకా ఆఫీసుకా?" అంది.
    "యింక వెళ్ళు కస్తూరీ."
    "మీరు పొద్దుటికంటే నీరసంగా వున్నారు. జ్వరం పెరిగింది." అని గోడవైపు చూస్తూ, "నేనిక్కడ రెండు రోజులుంటే అభ్యంతరమా?" అంది.
    "అభ్యంతరం దేనికి? కానీ అవసరం లేదు."
    "ఒక్కరే__"
    "అవసరం అయితే హాస్పిటల్లో చేరతాను. ఫ్రెండ్స్ వస్తూనే వుంటారు. ఇవాళెందుకో రాలేదు" అన్నాడు.
    "హాస్పిటల్ దేనికి? అక్కడేం బాగుంటుంది? రెండురోజులు నేనిక్కడుంటాను."
    "నీకెలా వీలవుతుంది?"
    "నాకేమన్నా వుద్యోగమా, లీవు శాంక్షన్ అవడానికి అవకపోడానికి! మీరేమీ రుణపడొద్దులే. పోనీ లెక్క కట్టిద్దురు." అని తల పక్కకి తిప్పుకుంది. ఆమె కళ్ళలో తడి వుబికింది.
    గమనించాడు.
    "వుండులే" అన్నాడు.
    "యెవరన్నా అడిగితే మీ చుట్టాన్నని చెప్పండి లేకపోతే మిమ్మల్ని యెట్లాగో అనుకుంటారు."
    "అలాంటివి నాకు చాతకావు. కొన్ని దాచకూడదు. దాగవు. మీ సంగతి తెలుసులే__ అన్నట్లుగా లోకువ చెయ్యబోతారు నువ్వు ఫలానా అని చెబుతాను"
    "నేనట్లా బజారెళ్ళి వస్తాను వొక గంటలో." అంది.
    "యెవరికన్నా చెప్పి రావాలా?" అన్నాడు.
    "వుఁహుఁ" అని బయటికి నడిచింది.
    తన యింటికి వెళ్ళి ముసలి భటుడు కనిపిస్తే, నాలుగురోజులు తను యెటో వెళుతున్నట్లూ ఇల్లు కనిపెట్టుకుని వుండమని చెప్పింది.
    గంటన్నరకి తిరిగి వచ్చింది.
    రిక్షా అతను రెండు మూడు అట్టపెట్టెలు ముందు గదిలోనూ మధ్యగదిలోనూ పెట్టాడు.
    అర్థంకాక ఆశ్చర్యంగా చూస్తున్నాడు శ్రీపతి.
    "ఏమిటా పెట్టెలు?" అన్నాడు, మధ్యగదిలో పెట్టిన రెండు పెట్టెల వంక చూస్తూ.
    "ఫ్రూట్స్." అని నవ్వి, టేబిల్ మీద ట్రే పట్టుకుని మంచం దగ్గిరికి వెళ్ళి యాపిల్ ముక్కలు అందించింది. రెండు చిన్న ముక్కలు తిని ఇంక వద్దన్నాడు. కాఫీ పోసిచ్చింది. గటగటా తాగేశాడు.
    "వేడిలేదు కదూ?" అంది.
    రెప్పలు వాల్చి పడుకున్నాడు. కాళ్ళూ చేతులూ ఒకలాగా వంచాడు.
    "వొళ్ళు నొప్పులా?" అంది.
    "వుఁహుఁ" అన్నట్లుగా తల కదిపాడు.
    అతనికి మగత కమ్మి నిద్ర పట్టింది.
    రెండు అట్టపెట్టెలు వంటగదిలోకి చేర్చి మితంగా తెచ్చిన వంట సామాగ్రి సర్దింది. దిమ్మమీద కిరోసిన్ స్టౌ అమర్చింది. దినుసులు సర్దింది.
    ఒక అట్టపెట్టె మధ్య గదిలో తెరిచి, బట్టలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది. కొళాయిలో నీళ్ళు వస్తున్నాయి. 'నయమే భావీ ఓవర్ హెడ్ ట్యాంకూ వున్నట్లున్నయ్!' అనుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS