Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 81


    "అంత చదివి ఆ పని దేనికి?" అంది ధనలక్ష్మి.
    "అదైనా పనేగా!" అంది కస్తూరి.
    "వస్తా" అని యిద్దరి వంకా చూసి వెళ్ళింది ధనలక్ష్మి.
    "యం.ఏ.చదువుతూ మానేసినట్లుగా యెందుకు చెప్పావూ?" అన్నాడు శ్రీపతి సంతోషంగా.
    "ఆమెని చూస్తే అట్లా చెప్పాలనిపించింది. ఆమె సంగతి ఒక్కముక్కలో చెప్పేసెయ్యనా? మిమ్మల్ని పెళ్ళిచేసుకోవాలని కోర్కె. ద్రాక్షపళ్ళు పుల్లన అని అనుకునే దశలో నేనిక్కడ కనిపించాను. ద్రాక్షపళ్ళు కాదు వాక్కాయలు అని అనుకుని తృప్తిపడుతుందిక" అని చిన్నగా నవ్వింది.
    ఆ మరుసటి రోజున అప్పటివరకూ శ్రీపతితో పరిచయం లేని వ్యక్తి __ మేడ మీద వుంటాడు. వచ్చి, "మీకు వొంట్లో బాగాలేదని తెలిసింది" అని కస్తూరి వంక చూసి, "మీ శ్రీమతిగారా" అన్నాడు వ్యంగ్యంగా.
    "నాకు వూరినిండా చాలామంది శ్రీమతులున్నారండీ. సమిష్టి శ్రీమతులు. వాళ్ళలో ఈవిడొకరు. నాకుఇ సుష్రూష చెయ్యటానికి వచ్చింది. తీరికగా లేదు నాకు కాస్త స్వస్థత చిక్కాక ఆమెకి వీలుంటుంది. ఆమెకు ఆసక్తి వుంటే చెప్పి వుంచుకోవచ్చు" అన్నాడు శ్రీపతి.
    "నేనట్లాంటివాణ్ని కానండీ" అన్నాడు గర్వంగా.
    "అయ్యో అలాగా!" అని జాలిపడుతున్నట్లుగా అని, "నేనలాంటి వాడినేనండీ" అన్నాడు శ్రీపతి సంతృప్తిగా.
    ఆ సాయంత్రం మరో ఇద్దరితో వచ్చి, "సంసారులుండే యింట్లో ఇదేం బాగోలేదండీ" అన్నాడు.
    "యిదివరకంతా సన్యాసిగానే వున్నానుగానీ మొన్న జ్వరం వచ్చినప్పటినుంచి నేనూ సంసారినేనండీ" అన్నాడు శ్రీపతి.
    "పోలీసు కేసు అవుతుంది"
    "పోలీసులకి కాకపోతే మీ బాబుకి చెప్పుకో పో" అన్నాడు శ్రీపతి గొంతు పెంచకుండానే.
    "చూద్దురుగాని తెలుస్తుందిగా!" అని వెళ్ళిపోయారు.
    "ఇట్లాంటి గొడవలొస్తయ్యనే వెనకాడాను" అంది కస్తూరి.
    "నేను ఇలాంటి గొడవలని కాదుగానీ నీకు కష్టమూ నష్టమూ అని వెనకాడాను"
    "మీకు పుణ్యం వుంటుంది. ఆ మాట మాత్రం అనకండి" అంది. ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
    "కస్తూరీ యెందుకు నీకంతిది నేనంటే!"
    "నన్ను మీరెప్పుడూ తాకలేదెందుకని? నన్ను చూస్తే మీకేమనిపిస్తుంది? అందరికీ అనిపించినట్లు అనిపించదు. చెల్లెలుగా గానీ అనిపిస్తుందా" అంది.
    "నాకు తోడబుట్టినవాళ్ళు లేరు. ఆ సంగతి తెలియటానికి."
    "యీ గొడవంతా ఆ ధనలక్ష్మి తెచ్చింది" అంది.
    "యిన్ని రోజులనుంచీ ఇక్కడుంటూంటే చాలా డల్ గా వుంటోంది. యిదీ సరదాగానే వుంది. రేపో యెప్పుడో యింటివాణ్ని పంపిస్తారు. వాడికి పావలా తరవాతే యేదైనా! అద్దె పెంచుతానని చెబితే__ఆమె ఆయన చెల్లెలు__అని వాళ్ళతో బుకాయించి వెళ్ళగలడు!"
    మరుసటిరోజుకి శ్రీపతి మరికాస్త కోలుకున్నాడు.
    "నేను కోలుకుంటున్నానుగానీ నువ్వు నీరసించిపోతున్నావు రాత్రుళ్ళంటే మేలుకుని వుండగలవు. పగళ్ళు మేలుకుని వుండటం అలవాటులేదేమో బాగా వడిలిపోయావు. ఇలా ఐతే నేను నీకు చాలా నష్టపరిహారం చెల్లించాలి" అని,"తమాషాకి అన్నాను బాధపడుతూ" అన్నాడు ఆప్యాయంగా.
    ఆ ఆప్యాయతకి చలించిపోయింది.
    రాత్రి అతను నిద్రపోతూ వున్నాడు. ఆమె కుర్చీలో కూచుని చూస్తూ వుంది. కాసేపటికి లేచి, మంచం దగ్గిరికి వెళ్ళి__
    అతని పాదాలమీద చేతులు ఆనించింది. గాఢ నిద్రలో వున్న అతనికి తెలియదు.
    ఆ మరుసటిరోజు వాకిట్లోంచి యెవరో "శ్రీపతిగారూ" అని పిలిస్తే కస్తూరి వెళ్ళి చూస్తూ, చూస్తూండగానే ఆమె కాళ్ళు వొణికాయి. వొంట్లో నెత్తురు మరిగినట్లు ఐంది గిరుక్కున తిరిగి లోనకి వచ్చి శ్రీపతి చెవి దగ్గిరికి వంగి "వాడు అ విజయ్ కుమార్ గాడు వచ్చాడు. అప్పుడప్పుడు వస్తుంటాడా? మీకు బాగా పరిచయమా?" అంది చిన్నగా.
    నెమ్మదిగా లేచి మందుగదిలోకి వెళ్ళి, "హలో విజయ్ కుమార్, మీరా రండి" అని కుర్చీలో కూర్చున్నాడు శ్రీపతి.
    విజయ్ కుమార్ లోపలికి అడుగులు వేసి కుర్చీలో కూర్చున్నాడు.
    కస్తూరి గుమ్మం పక్కగా చప్పుడవకుండా కుర్చీ వేసుకుని కూర్చుని వింటోంది.
    "ఏంటి ఒంట్లో బాగాలేదా? కాస్త డల్ గా అనిపిస్తున్నారు?" అన్నాడు విజయ్ కుమార్.
    "అవును యీమధ్య పదిహేను రోజులనుంచి జ్వరం"
    "అయ్యో అట్లాగా. నాకు తెలపనే తెలవదు. తగ్గిందా?"
    "తగ్గినట్లే" అన్నాడు శ్రీపతి.
    "యింట్లో యెవరో__"
    "నాకు జ్వరంగా వుందని వచ్చి__"
    "ఆవిడా__"
    "నా కాబోయే భార్య" అన్నాడు శ్రీపతి.
    "ఏంటీ!"
    "యింకా తుది నిర్ణయం కాలేదు. ఆ ఆలోచనలో వున్నాం"
    "నాకు కావాల్సిన మిత్రులు అందుకని ఒక విషయం చెప్పదలిచాను మీ శ్రేయస్సు కోరి."
    "సెలవియ్యండి" అన్నాడు శ్రీపతి.
    అదోలా చూసి, "ఆమెకు మీకు బాగా తెలుసా?" అన్నాడు విజయ్ కుమార్.
    "బాగా తెలుసా అంటే ఇటీవలి పరిచయం. పరిచయం ఐనప్పటి నుంచి తెలుసు."
    "ఆమెది గుంటూరు"
    "మీకు బంధువా యేమిటి!"
    "ఛఛా! కాదు. పెద్ద హిస్టరీలే. వొక స్థితిపరుణ్ని వలలో వేసుకోవాలని ప్రయత్నించి. అంతకంటే స్థితిపరుడిమీద కన్నుపడి_అట్లా అట్లా చివరికి బజారుపాలైంది. నేనూ గుంటూరు వాణ్నే కాబట్టి నా పేరు విని నేనూ చెడిపోయిన మనిషి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS