ఆమె చేతిలోని బాటిల్ ఎగిరింది. ఎదురుగా వున్న అద్దం భళ్ళున పగిలి ఆమె ప్రతిరూపం అంతర్ధానమైంది.
"రాంసింగ్" అరిచింది వెంటనే.
"యస్ మేడమ్" ఒక్క క్షణంలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు సుమారు పాతికేళ్ళు దాటని ధృడకాయుడైన ఓ యువకుడు. దామోదర్ తరువాత ఆ స్థానాన్ని ఆక్రమించి ఆమెకు ముఖ్య అనుచరుడుగా వ్యవహరిస్తున్న వ్యక్తి అతడు.
"వీరయ్య ఎక్కడ" తను విడిచిపెట్టిన వీరయ్యని ఓ కంట కనిపెట్టమని ఆ రోజే ఆదేశించింది సోఫియా"
"సిటీలోనే వున్నాడు మేడమ్... మొన్న రాత్రి ఓ పసిపిల్లల శరణాలయంలోకి వెళ్ళి అన్నపూర్ణ అనే ఓ వృద్దురాలితో మాట్లాడేడు. ఆమె ఆ శరణాలయాన్ని నడుపుతుంది. శశాంక ఆ రోజు డబ్బు పంపమన్నదీ ఆ శరణాలయనికే అని తెలిసింది" సేకరించిన వివరాలన్నీ వరుసగా చెప్పాడు. "పైగా శశాంక తరచూ అక్కడికి వస్తుంటాడట... ఆవిడ్ని సొంత తల్లిలా ట్రీట్ చేస్తుంటాడట..."
"గుడ్" నవ్వింది మత్తుగా "అవసరానికి మించినన్ని విషయాలు తెలుసుకో గలిగావు" అంది సాలోచనగా.
"అదే నిజమైతే శశాంక వినీల వైపు మొగ్గిన మరుక్షణం నన్ను కాదని వెళ్ళిన ఆఖరి క్షణమూ అక్కడి అన్నపూర్ణని నేను ఆయుధంగా వాడుకోవచ్చన్న మాట."
ఈ వాక్యం ఆమె అనలేదు. అనుకుంది అనుకున్నదంతా బయటికి అనడం అలవాటైతే సోఫియా అంత ఎంఫైర్ కి సామ్రాజ్ఞి అయ్యేది కాదు.
* * * *
ఉదయం ఎనిమిది గంటల వేళ...
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళే IC 440 ఎయిర్ బస్ మద్రాసు నుంచి అప్పుడే వచ్చి రన్ వేపై ఆగింది.
ఎయిర్ పోర్ట్ లాంజ్ ఢిల్లీ వెళ్ళే ప్రయాణీకులతో కోలాహలంగా వుంది. బోర్డింగ్ పాస్ తీసుకున్న వినీల మేగజైన్ చదువుతూ ఫైబర్ కార్నర్ లో కూర్చుంటే ఆమెకు చాలా సమీపంలో బాడీగార్డులా నిలబడి వున్నాడు సర్కార్ చుట్టూ పరిశీలనగా చూస్తూ.
ఓ పోర్టర్ వచ్చి సర్కార్ తో చెప్పాడు కౌంటర్ దగ్గర నిలబడ్డ వ్యక్తి తనను పిలుస్తున్నాడని. అనాలోచితంగా అటు వెళ్ళిన సర్కార్ గాని మేగజైన్ చదువుతున్న వినీలగాని గమనించలేదు ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న జాకీ సర్కార్ నేలపై వుంచిన బ్రీఫ్ కేసు తీసి సరిగ్గా అలాంటిదే మరో బ్రీఫ్ కేసు అక్కడుంచడాన్ని.
"హలో" శశాంక పలకరించగానే ముందు ఉలికిపడిన సర్కార్ వెంటనే ఉక్రోషంగా చూశాడు. నేనే పిలిపించింది. ఎంత వరకూ... వంటరిగా బయలుదేరావా" చాలా మామూలుగా మాటాడేస్తున్నాడు.
సరిగ్గా అప్పుడు వినిపించింది "ది పాసింజర్స్ ట్రావెలింగ్ ఇన్ IC 440 ఢిల్లీ ఆర్ రిక్వస్టెడ్ టు పాస్ త్రూ సెక్యూరిటీ ఇమీడియట్లీ."
వినీల కదిలింది సెక్యూరిటీ చెక్ కోసమని. శశాంక నుంచి వెనక్కి వచ్చిన సర్కార్ ఆవేశంతో దూరంగా వున్న శశాంకని చూస్తూనే తన బ్రీఫ్ కేసుతో సెక్యూరిటీ చెక్ కి వెళ్ళాడు.
బ్రీఫ్ కేసు కన్వేయర్ పై వుంచగానే టీ.వి.లో కనిపించింది అందులోని రివాల్వర్... సెక్యూరిటీ స్టాఫంతా గుమిగూడి బ్రీఫ్ కేస్ తెరిపించి చూశారు. అది తన బ్రీఫ్ కేసు కాదని సర్కార్ చెప్పిన మాటలు పూర్తికాకుండానే పోలీసులు అరెస్ట్ చేసి బయటికి తీసుకొచ్చారు. జరిగిందంతా లోపలి నుంచి చూస్తున్న వినీల స్థాణువులా నిలబడిపోయిందో క్షణం. డాడీ చెప్పిందాన్ని బట్టి ఫైనాన్స్ మినిస్టర్ రేపు సాయంత్రానికల్లా ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. ఈ రోజు ఉదయం ఢిల్లీ చేరాక ఆయన్ని కలిసి కవరిచ్చేసినా తక్కిన ఫార్మాలిటీస్ పూర్తి కావడానికి కనీసం రేపు మధ్యాహ్నం వరకూ అయినా పడుతుంది.
అందుకే ఆమె ఒంటరిగానే వెళ్ళడానికి సిద్ధపడింది మరో అయిదు నిమిషాలలో ఫ్లయిట్ బోర్డింగ్ కి పిలుపు రావడంతో వెళ్ళి కూర్చుంది.
విమానం బయలుదేరటానికి మరో రెండు నిమిషాల వ్యవధి ఉందనగా తలపైకెత్తింది ఎవరో పిలిచినట్టయి.
"ఎక్స్ క్యూజ్ మీ మేడమ్... ఇఫ్ యూ డోంట్ మైండ్" నిజానికి సర్కార్ కోసం ఎలాట్ అయిన ఆ సీట్ లో కూర్చుంటానని అడుగుతున్నది శశాంక "కూర్చోమంటారా ఖాళీ అనుకుంటాను."
పెదవులపై విడీ విడని చిరునవ్వుతో తననే తదేకంగా చూస్తున్న శశాంకని అక్కడ అలా చూడడంతో ఎంత ఆశ్చర్యపోయిందీ అంటే కొన్ని సెకండ్లపాటు మాట్లాడలేకపోయింది. అప్పటికే కూర్చుండిపోయాడు పక్కన.
అందుకు కాదు ఆమె ఆవేశపడింది. ఓ కొత్త మనిషిలా పలకరిస్తున్నాడు. ఒకనాడైతే ఆ సన్నివేశాన్ని మరోలా రిసీవ్ చేసుకునేది. ఇప్పుడామె మనసులో విచిత్రమైన శూన్యం. సోఫియా గుర్తుకొచ్చింది. కొత్తగా అంతే. ఆమె ముఖంలోని కొద్దిపాటి ప్రసన్నతా పూర్తిగా అదృశ్యమైపోయింది.
