Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 81


    
    తను కోరుకున్నది ప్రబంధ ద్వారా ఆ కుటుంబంపైన పగ తీర్చుకోవడమే తప్ప, అనితలూ, ఆదిత్యలూ బలి కావడం కాదు.
    
    "ఇలారా!" పిలిచింది శౌరిని.
    
    ఇలాంటి చర్చలో సౌదామిని జోక్యం చేసుకోవడం శౌరికి నచ్చలేదు. అయినా గది బయటికి వచ్చాడు.
    
    "అక్కడ మీ డాడీ పరిస్థితేమిటో నీకు తెలుసా?" ముఖ్యమంత్రిపై వచ్చిన స్కేండల్ గురించి గుర్తుచేసింది.
    
    "దానితో నాకు పనిలేదు ఆంటీ! కానీ ఇక్కడ ఆదిత్య నా మీద కలియబడి నా ప్రిస్టేజ్ ని నాశనం చేశాడు."
    
    "అందుకని ఆదిత్యని బలంగా దెబ్బ తీయాలనుకుంటున్నావ్"
    
    "దెబ్బ తీయటంకాదు!" ఉక్రోషంగా అరిచాడు. "అవసరమయితే వాడి కథ ముగించేద్దామనుకుంటున్నాను."
    
    "అదో పెద్ద పనా?" శౌరి అహాన్ని చల్లార్చేసింది. "అవును శౌరీ! ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుక్కి హత్య చేయడమూ, తప్పించుకోవడమూ ఓ పెద్ద విశేషం కాదే! కాని ఇప్పుడా? ఈ స్థితిలోనా?"
    
    సౌదామిని చెప్పేదేమిటో అర్ధంకాలేదు శౌరికి.
    
    "శౌరీ...అటు చూస్తే మీ నాన్నగారి పదవి వుంటుందో, ఊడుతుందో తెలీని స్థితిలో కలవరపడుతుంటే, ఇక్కడ నువ్వు ఇలాంటి ఆలోచనల్లో ఉండటం సమంజసమా చెప్పు? నిజమే శౌరీ! నీ స్థాయి మనిషిపైన ఆదిత్యలాంటి సామాన్యుడు కలియబడటం క్షమించరాని నేరం కాని అతడికంత బలాన్నిచ్చింది మన బంగారమేగా? అయినా ఇప్పుడేమైంది? ఆదిత్యని పూర్తిగా రెచ్చగొట్టావ్ గా! ఇక ప్రబంధని ఏ స్థితిలోనూ దగ్గరికి రానివ్వడు. అదేగా మనకి కావాల్సింది కూడా పిచ్చినాన్నా!" బుజ్జగిస్తున్నట్టుగా అంది. "మనం కోరుకున్నదీ, కావాలనుకున్నదీ ప్రబంధ మనకి అనుకూలంగా మారటం తప్ప, ఆదిత్య కడతేరిపోవటం కాదుగా! తెలివిగా అంతా సాధించేశాక మరి నీ ఆవేశం దేనికి?"
    
    చల్లబడిపోయాడు శౌరి "కాని ఆంటీ....నా పరువు..."
    
    అర్దోక్తిగా నవ్వింది "అవసరమైతే ఆదిత్య కాళ్ళు పట్టుకుని ప్రబంధని మనవేపు మళ్ళించుకోవాల్సిన స్థితిలో ఆదిత్య ఉత్తిగా కాలరుపట్టుకున్నాడు అంతేగా? దానికింతలా ఆలోచించాలా? ఇప్పుడు నువ్వు ఆదిత్యపైన అఘాయిత్యం చేస్తే సమస్యల్లో వున్న నీ తండ్రి ఇంకా యిరుక్కోవడమే కాదు, ప్రబంధకి ఆదిత్యపైన సింపతీ పెరిగిపోతుంది. అందుచేత నా మాట విను. ఆవేశాన్ని చల్లార్చుకో ఇప్పుడు ఆదిత్య తిరస్కరించిన ప్రబంధలో ఎంత మార్పు వచ్చేదీ అబ్జర్వ్ చేయి."
    
    అసాధారణమైన తన వాక్చాతుర్యంతో శౌరిని ఎంత ప్రభావితుడిని చేసిందీ అంటే, దూకుడుగా వ్యవహరించి ఆదిత్యకి బుద్ది చెప్పాలనుకున్న శౌరి ఆలోచనలకి ఫుల్ స్టాప్ పడిపోయింది.        
    
    ఒక పోరాటాన్ని ఆపేయగలిగిన సౌదామిని చూస్తుండగానే శౌరి తన స్నేహితులతో బయటికి వెళ్ళిపోయాడు.
    
    బడలికగా కూర్చుండిపోయింది నాటకం పరాకాష్టకి చేరుకుంటూంది. ఆచి తూచి అడుగు వేయటం, వేయించటం అవసరమయిన క్షణాలలో ముఖ్యం. తరువాత జరగాల్సిన అధ్యాయం గురించి ఆలోచిస్తుండగానే ప్రబంధ ఇంటికి వచ్చింది.
    
    తన అంచనా తప్పుకాలేదు. ప్రబంధ మొహం వివర్ణమైవుంది. ప్రబంధ మనసు విప్పి చెప్పే స్థితిలో లేదు.
    
    "ఊహించగలనమ్మా! ఆదిత్య మూలంగా ఇప్పుడు నీ మనసు గాయపడింది కదూ?"
    
    అబ్బురంగా చూసింది ప్రబంధ. అంతేకాదు. తను ఓదార్చబోతుంటే ఆదిత్య అన్న మాటల్నీ చెప్పింది.
    
    "అతని తప్పేముంది? ఆస్థితిలో ఆదిత్యేకాదు, ఆ స్థానంలో ఉన్న ఏ మగాడయినా అలాగే ప్రవర్తిస్తాడు."
    
    "ప్రబంధకి అర్ధంకాలేదు"
    
    "డబ్బుతో, పరపతితో ఆస్తుల్ని కొనొచ్చు. అధికారాన్ని ప్రదర్శించొచ్చు. కానీ మనుషుల్ని గెలుచుకోలేం ప్రబంధా! ఇది నాకు నా జీవితం చెప్పిన సత్యం" జాగ్రత్తగా విషయాన్ని సమన్వయపరుస్తూ చెబుతూంది సౌదామిని. "చాలా కృషితో పేర్చుకున్న ప్రేమసామ్రాజ్యం నీది. అది నాకు తెలుసు. కానీ నీ వాళ్ళెలా హర్షించగలరు?"
    
    "ఏమయింది ఆంటీ?" ఇంకా వివరాల్ని తెలుసుకోవాలనుకుంది ప్రబంధ.
    
    "మీ డాడీ పరిస్థితి అక్కడ విషమించింది"
    
    "తెలుసు"
    
    "అందుకే ముందునుంచీ అనుకుంటున్న ఓ సంబంధాన్ని ఖాయం చేసి నీకు అర్జెంటుగా పెళ్ళి చేయించాలనుకుంటున్నాడు" కె.పి. రాయ్ గురించి క్లుప్తంగా చెప్పింది సౌదామిని.
    
    "సరిగ్గా అలాంటి స్థితిలో నీ ప్రేమ సంగతి మీ డాడీకి చేరేశాడు మీ అన్నయ్య."
    
    ఉద్విగ్నురాలై వింటూంది ప్రబంధ.
    
    "ఆదిత్యలాంటి సామాన్యుడిని నీ తండ్రి ఆమోదించలేకపోతున్నాడు ప్రబంధ! అందుకే నీ అన్నద్వారా ఆ కుటుంబంపైన దాడి ప్రారంభించాడు"
    
    "నిజమా?" కంపించిపోతూ అడిగింది ప్రబంధ.
    
    కావాలని తాత్సారం చేస్తున్న సౌదామినిని నిలదీసింది. "చెప్పు ఆంటీ! అన్నయ్య ఏం చేశాడు?"
    
    ఆప్యాయంగా ప్రబంధను దగ్గరకు తీసుకుంది సౌదామిని "నిజానికి నేను బయటికి చెప్పకూడని విషయాలివి. కానీ కళ్ళముందే నీ కలలు కూలిపోతుంటే ఎలా నిగ్రహించుకోను" నాకు తెలుసు ప్రబంధా! ఆదిత్యని తప్ప నువ్వు మరో మగాడి గురించి ఆలోచించలేవని..." క్షణం ఆగింది. "సూటిగా ఆదిత్యని హెచ్చరించడం కాకా హాస్పిటల్లో వున్న అతడి చెల్లిని కలిశాడు. నా చెల్లితో ఆదిత్య కలిసి తిరక్కూడదనకుండా, ఆదిత్య నీతో కలిసి క్విజ్ లో పాల్గొనకపోతే ఆమెని వివస్త్రని చేసి నడిపిస్తానన్నాడు."
    
    "ఎందుకు?" ప్రబంధ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. "అనితని ఎందుకలా బెదిరించాడు?"
    
    ఆదిత్యకు నీమీద ద్వేషం ఏర్పడాలని, అలా ఆదిత్య నిన్ను కాదనాలని."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS