Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 80


    "నేనేం నీ చెల్లిని వివస్త్రని చేసి నడిపిస్తాననలేదే!"
    
    "అంటే ఊరుకునేవాడినా..."
    
    "నేను ఊరుకుంటాననుకున్నావా?"
    
    "ఏం చేస్తావ్?"
    
    "బాస్టర్డ్!" అమాంతం శౌరి షర్టు కాలరు పట్టుకున్నాడు ఆదిత్య. "ఐ విల్ టేర్యూ ఇన్ టూ పీసెస్!"
    
    జరిగిందేమిటో ముందు అర్ధం కాలేదు శౌరికి. మొత్తం విద్యార్ధులంతా అటుగా పరుగెత్తుకొస్తుంటే ఆవేశంగా ఆదిత్య కంఠాన్ని పట్టుకున్నాడు.
    
    పుస్తకాలను జారవిడిచిన ఆదిత్య తనేంచేస్తున్నది ఆలోచించకుండా శౌరిని రోషంగా వెనక్కి నెట్టి గోడకి ఆనించి చేయి పైకెత్తాడు.
        
    అప్పటికే శౌరి మిత్రులంతా ఆదిత్యని వెనుకనుంచి పట్టుకున్నారు. మరో అరక్షణం ఆలస్యమైతే చేయి చేసుకునేవారే!
    
    సరిగ్గా అదేసమయంలో అక్కడికి దూసుకొచ్చాడు సూరి తన స్నేహితులతో.
    
    రెండు గ్రూపులుగా విడిపోయిన స్టూడెంట్స్ చేతులుకలిపితే కాంపస్ లో పోరాటం మొదలయ్యేది!
    
    కాని పరిస్థితి గమనించిన ఆదిత్య పట్టు వదిలాడు. సూరి అతడిని వెనక్కి లాగుతుంటే ఆయాసపడుతూనే అన్నాడు "శౌరీ! మరోసారి ఇలా జరిగితే నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వెంత గొప్పింటివాడివైనా గానీ, నీకెంత పలుకుబడి వున్నాగాని తోలు వలిచేస్తాను! నన్నా ఫె బిచ్!"
    
    "ఏమైందిరా?" పొదివిపట్టుకున్న సూరి నచ్చచెబుతూ జరిగిందేమిటో తెలుసుకోవాలనుకున్నాడు "అసలేం జరిగింది?"
    
    "బాస్టర్డ్... అనితని బట్టలిప్పి నడిపిస్తాడట!" గొణుగుతూ, నేలమీద పడ్డ పుస్తకాల్ని అందుకున్నాడు ఆదిత్య.
    
    స్పష్టంగా వినిపించలేదు సూరికి. ఆదిత్యని స్నేహితులకి అప్పచెప్పి సూరి శౌరి దగ్గరికి వెళ్ళాడు "ఏమైంది?"
    
    యూనివర్శిటీ కాంపస్ లో తొలిసారి ఇలాంటి పరాభవం జరిగిన శౌరి ఆ ప్రశ్నకి ఎంత రోషంగా అరిచాడూ అంటే "వెళ్ళి నీ ఫ్రెండుని అడుగు" అన్నాడు కారుకేసి నడుస్తూ.
    
    "అడగాల్సింది తప్పు చేసినవాడిని."    
    
    "అంటే?" సుధీర్ శౌరికి వత్తాసుగా నిలబడ్డాడు. "తప్పు చేసింది శౌరే అంటావ్!"
    
    "అనడం కాదు సుధీర్! నువ్వు సరేనంటే నిరూపిస్తాను."
    
    "ఏమిటి నీకా నమ్మకం?"    
    "నన్నే కాదు ఈ కాంపస్ లో చెట్టునీ, పుట్టనీ అడిగినా చెబుతుంది ఆదిత్య ఏమిటో కాబట్టే పొరపాటు ఆదిత్యది కాదూ అని గట్టిగా చెప్పగలుగుతున్నది."
    
    "గో టు డాగ్స్!" అరిచాడు శౌరి. "తప్పవరిదైనా కానీ మిస్టర్ సూరీ!
    
    ఈరోజు నాపైన కలియబడి ఆదిత్య చాలా పెద్ద తప్పుచేశాడు. ఇక వాడు రోజులు లెక్కపెట్టుకోవాలి. ఎస్..."
    
    శౌరి కారు వెళ్ళిపోయింది.
    
    అప్పటికే దూరంగా నడిచి వెళుతున్న ఆదిత్య దగ్గరకు వేగంగా వెళ్ళాడు సూరి "ఏమిట్రా, ఏమైంది?"
    
    చెప్పలేదు ఆదిత్య అసలు చెప్పాలనిపించలేదు. సూరి తనకున్న ఓ ముఖ్యమైన ఆత్మీయుడు కావచ్చు. కాని విషయం తెలిస్తే రెచ్చిపోతాడు. ఆ తరువాత కాంపస్ వాతావరణం అస్తవ్యస్తమైపోతుంది.
    
    "నిన్నేరా!" రెట్టించాడు సూరి.
    
    "మామూలు గొడవే!"
    
    "మామూలుగా అయితే నువ్వు గొడవ పడవని తెలుసు"
    
    "లీవిట్ సూరీ..." అసలు ఇలాంటి ప్రపంచంలోకి తొలిసారి ఈడ్చుకు వచ్చింది సూరే అన్న ఆలోచన తటాలున మెదిలిందేమో, ఉక్రోషంగా అన్నాడు. "నాకేదో జరిగిపోయినట్టు అంత హడావుడి పడతావేం?"
        
    ఎందుకో ఆదిత్య మాటలు రుచించలేదు సూరికి. ఇంతదాకా వెళ్ళాక శౌరి నిశ్శబ్దంగా ఊరుకోడని తెలిసి బాధనిపించిందేమో నెమ్మదిగా అన్నాడు.
    
    "ఇప్పటికేమీ జరగలేదని తెలుసు ఆదిత్యా! ఇంకేమీ జరగకూడదనే నేనింత ఆందోళనపడుతున్నది"
    
    "కానియ్! అలాంటి స్థితే వస్తే నన్ను నేను కాపాడుకోగలను"
    
    ఆదిత్య ఎందుకింత మొండిగా మాట్లాడుతున్నాడో అర్ధంగాక సూరి మ్రాన్పడి వుండగానే, ప్రబంధ ఆదిత్యకి ఎదురొచ్చింది.
    
    ఏదో గొడవ జరిగిందని వింది కానీ, ఏం జరిగిందో స్పష్టంగా తెలీలేదు. అందుకే చనువుగా దగ్గర కొచ్చింది.
    
    ఆదిత్యనలా చూడగానే మనసు ద్రవించిందేమో అడిగింది ఆదుర్దాగా "మా అన్నయేమన్నా అన్నాడా?"    
    
    ఆ సానుభూతితో మరింత రెచ్చిపోయాడు ఆదిత్య. అసలు మూలకారణం ప్రబంధే అని బలంగా నమ్మి వుండటంతో హెచ్చరికలా అన్నాడు.
    
    "అమోఘం ప్రబంధా! అంతా చేయించి, ఇప్పుడు ఇలా అభిమానాన్ని ప్రదర్శిస్తున్న నువ్వు సామాన్యురాలివి కావు! కాని ఒక్క విషయం గుర్తుంచుకో. నీ అన్న కాదు, సాక్షాత్తు నీ తండ్రి దిగివచ్చినా నా నిర్ణయం మారదు" వెళ్ళిపోయాడు ఆవేశంగా.
    
    అతడు మాట్లాడిందేమిటో సైర్గా అర్ధంకాని ప్రబంధ కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి.
    
    "ఇంత జరిగాక రేపు నువ్వు యూనివర్శిటీలో మొహమెత్తుకుని ఎలా తిరుగుతావు శౌరీ? వాడికి గట్టిగా బుద్ది చెప్పాలి. అంతే!"
    
    శౌరి మిత్ర బృందమంతా రెచ్చగొడుతుంటే జరిగింది గుర్తుచేసుకుంటూ ఆవేశంతో చిందులు తొక్కుతున్నాడు శౌరి.
    
    "ఎస్! ఏదో చేయాలి. అది ఆదిత్య కాలూ, చెయ్యీ తీయించడం కావచ్చు, లేదంటే వాడి చెల్లిని కిడ్నాప్ చేసి అన్నది అమలు చేయటం కావచ్చు"
    
    "శౌరీ!" సౌదామిని కేకతో హఠాత్తుగా ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది.
    
    యూనివర్శిటీ నుంచి వస్తూ స్నేహితులతో శౌరి మాట్లాడుకుంటున్న విషయాల్ని విన్న సౌదామినికి అర్ధమైంది జరిగిందేమిటో ఎందుకో ఆనందంగా లేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS