Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 82


    ప్రబంధకి ఇందాక యూనివర్శిటీలో ఆదిత్య ఎందుకలా మాట్లాడాడో బోధపడిపోయింది. లేచింది ప్రబంధ.
    
    "ఎక్కడికమ్మా?"
    
    "ఆదిత్యకి క్షమాపణలు చెప్పటానికి."
    
    "దానితో సమస్య పరిష్కారం కాదు."
    
    "మరి?"
    
    "ఆదిత్య కోసం నువ్వేమన్నా చేయగలనని నిరూపించుకోవాలి"
    
    "సిద్దంగా వున్నాను ఆంటీ.... కానీ ఎలా?"
    
    చాలాసేపటిదాకా మాట్లాడలేదు సౌదామిని. "ప్రబంధా! అవసరమయితే ఆదిత్య కుటుంబాన్ని కడతేర్చయినా అడ్డు తొలగించుకోవాలనన్నది మీ డాడీ ఆదేశం."
    
    "నేను బ్రతికుండగా అలా జరగనివ్వను."
    
    "ప్రతిక్షణమూ కాపలా కాయలేవుగా?"
    
    "ఏం చేయాలి ఆంటీ?" దుఃఖం ముంచుకొస్తుంటే అంది "నన్నేంచేయమంటావ్?"
    
    "తప్పకుండా చేస్తావా?"
    
    "ప్రాణాలిస్తాను"
    
    "ఇవ్వాల్సింది ప్రాణాలు కాదు."
    
    "మరి?"
    
    "నిన్ను నువ్వు."
    
    అర్ధం కాలేదు ప్రబంధకి.
    
    "అటు నీ పెళ్ళి ఆగిపోవాలన్నా, ఇటు ఆదిత్య కుటుంబానికి ఏ ప్రమాదమూ జరగకూడదన్నా అర్పించాల్సింది ప్రాణాల్ని కాదు ప్రబంధా నీ శీలాన్ని."
    
    "ఆంటీ!" విస్మయంగా చూసింది ప్రబంధ.
    
    చాలా జటిలమయిన ఆలోచనల్ని ప్రబంధ తల కెక్కిస్తున్నట్లు సౌదామినికి తెలుసు. అందుకే పదాల్ని కూర్చి అస్త్రాల్లా సంధిస్తూంది.
    
    "పిచ్చిపిల్లా! ఇలా అన్నానూ అంటే అర్ధం అర్జెంటుగా దానికి సిద్దపడమని కాదు. మానసికంగా అలాంటి స్థితికి ప్రిపేరవమని కనీసం అంతగా మీరిద్దరూ దగ్గరయినట్టు నిరూపించమని" విశ్లేషణలా చెప్పుకుపోయింది సౌదామిని.
    
    "అలా అయితే కేపి రాయ్ నిన్ను కోడలుగా అంగీకరించడు. అంటే నీ తండ్రి కుదిర్చిన పెళ్ళి ఆగిపోతుంది. ఆదిత్య మీద కోపంతో ఆదిలో అతనిని కాదన్న నీ తండ్రి మరో మార్గం లేక ఆదిత్యతో నీ పెళ్ళికి అంగీకరిస్తాడు. అలా ఆదిత్య కుటుంబం పైన ప్లాన్ చేసిన దాడి ఆగిపోతుంది."
    
    "కాని..." ప్రబంధ అనుమానంగా అడిగింది. "ఆదిత్య నేను కనిపించగానే కోప్మతో మండిపడుతుంటే నేనెలా అతన్ని సమీపించగలను?"
    
    "ఆ విషయం నాకొదిలెయ్!"
    
    ప్రేమలో ఇలాంటి పరిస్థితుల్నీ ఎదుర్కోవాల్సి వస్తుందని తెలీని ప్రబంధకి, ఏ ధైర్యంతో సౌదామిని ఇలా హామీ  ఇచ్చిందో అర్ధం కాలేదు. "అసలు ఆదిత్యతో నేను అంతగా దగ్గరయ్యానని డాడీవాళ్ళకెలా తెలుస్తుంది?"
    
    "మీ ఇద్దరి ప్రేమను కావ్యంగా రాయించి పబ్లిష్ చేయిస్తాను. లేదంటే ఫోటోలు తీయించి పత్రికల్లో ప్రకటిస్తాను" మృదువుగా నవ్వింది సౌదామిని. "అవన్నీ నాకు విడిచిపెట్టమంటున్నాగా!"
    
    "ఎందుకో ఇది సవ్యంగా అనిపించడంలేదాంటీ!"
    
    "పిచ్చితల్లీ! మీ డాడీ సవ్యంగా నీ ప్రేమను అంగీకరించకనే ఇలాంటి అపసవ్యపు మార్గంలో వెళ్ళాలంటున్నది...." క్షణం ఆగింది సౌదామిని. "రేపు నీ జీవితం నీది కావాలీ అంటే తప్పదమ్మా! కొంత సాహసానికి సిద్దపడాలి. లేదూ అంటే నేను చేసేదేమీ లేదు."
    
    ఈ చివరి వాక్యం బాంబ్ షెల్ లా పనిచేసింది ప్రబంధపైన. ఈ ప్రపంచంలో తనకు బాసటగా నిలిచిన ఒకే ఒక్క వ్యక్తి సౌదామిని బ్రతుకులో తెలీని వెలితిని అహంకారపు పొరల మధ్య దాచుకుని బ్రతుకుతున్న తనకు, అందమయిన కోణాల్ని దర్శింపచేసింది సౌదామినే. అందుకే నిశ్శబ్దంగా వుండిపోయింది ప్రబంధ.
    
    అంతస్తుల్లో పెరిగిందే తప్ప అపురూపమయిన బాల్యం గురించి, మనసు పంచుకోవాల్సిన ముగ్దత్వం గురించి అంతగా తెలీని ఆడపిల్ల అయినందుకేమో సౌదామిని చెప్పిన దాంట్లో లోతుపాతుల్ని ఆలోచించలేదు. కనీసం తల్లి ప్రేమకీ నోచుకోకుండా బ్రతికిన యువతి ఆమె.
    
    "ఇప్పుడు నేనేం చేయాలి?" అడిగింది అమాయకంగా.
    
    "ఇప్పుడు కాదు, ఈ రాత్రి నుంచీ ఆదిత్య ఇంట్లో తిష్ట వేయగలగాలి."
    
    "కానీ ఒప్పుకుంటాడా?"
    
    "ఒప్పుకోడు వెంటనే అసలే నిన్ను అపార్ధంచేసుకుని ఉండటంతో కొద్దిపాటి ప్రతిఘటనతో తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. నువ్వు భరించాలి. నువ్వు వయసులో మైనర్ వి కాదు కాబట్టి, నీ అన్న నిన్ను బలవంతంగా బయటికి రప్పించే అవకాశం లేదు కాబట్టి, ఇకనుంచి మరింత మొండితనాన్ని ప్రదర్శించి అందరికీ బుద్ది చెప్పాలి."
    
    ప్రబంధ కంపించడం స్పష్టంగా కనిపిస్తూంది.
    
    "అయినా అన్నిటికీ నే నున్నానుగా!"
    
    విషాదపూరితమయిన చాలా ప్రేమ కథలు గుర్తుకొచ్చాయో, లేక పరిస్థితిని ఎదుర్కోగల స్థయిర్యం తనకుందా అన్న అనుమానమే మెదిలిందో ప్రబంధ కళ్ళలో నీళ్ళు నిలిచాయి.
    
    ప్రబంధని బుజ్జగించి గదిలోకి పంపేసిన సౌదామిని చాటుగా నిలబడి గమనించిందామెని చాలాసేపటిదాకా.
    
    మనసెందుకో ద్రవించింది. పరిస్థితులు మరింత విషమిస్తాయి ఇక నుంచీ ఇంతకాలం ప్రశాంతంగా బ్రతికిన ప్రబంధ చాలా ఆటుపోట్లకి గురయిపోతుంది. వాసుదేవరావుని ఇలా ఓడించాలనుకుంటూందే తప్ప, నిజానికి ఆమె ప్రబంధ ఓటమిని కోరుకోవడం లేదు.
    
    ఆదిత్య హృదయంలో ప్రబంధస్థానం ఏమిటో తనకు ఇతమిద్దంగా తెలీకపోయినా, ప్రబంధ త్రికరణశుద్దిగా అతడిని కోరుకుంటూంది. అణువంత అహంకారం వుంటేనేం ఆదిత్యకి అన్నివిధాలా అర్హురాలయిన భార్య కాగలుగుతుంది.
    
    ప్రణయ అనే అమ్మాయి పాత్ర మిగతా కథలో ఎలాంటి మలుపులకి కారణమయినా గాని, చివరిదాకా ప్రబంధకి తను అండగా వుండాలనుకుంది సౌదామిని. ఈ ప్రేమ కథలో తన పాత్ర ప్రారంభం ఎలా జరిగినా, ఆదిలో ఏం అనుకున్నాగానీ ప్రబంధ ప్రేమను కాపాడాలి. మరుజన్మలో అయినా మగనారిగా బ్రతికే పుణ్యఫలాన్ని ఈ జన్మలోనే సంపాదించుకోవాలి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS