శ్రీపతికి వారంరోజుల నుండి జ్వరం. నూటరెండు డిగ్రీలకి తగ్గటమూ లేదు పెరగటమూ లేదు. అన్నం సయించటం లేదు. బ్రెడ్డు కాఫీ తీసుకుంటున్నాడు. ముఖం పీక్కుపోయింది.
"ఏంటి అట్లా వున్నారు?" అంది కస్తూరి.
పక్కన డిస్పెన్సరీ వైపు కళ్ళతో చూపెట్టాడు.
"మీకు అనారోగ్యమా?" అంది.
"యేం, నాదీ ఒళ్ళేగా?"
"చాలా హెల్దీగా వుంటారిప్పుడూ. జ్వరమా?" అంది.
అవునన్నట్లు తలవూపి, "యెక్కడ నుంచి?" అన్నాడు.
"రాత్రి ఒకతను యింటికి తీసుకెళ్ళాడు. అతనితో మరొకతను వున్నాడు. ఆ ఇద్దరితో తెల్లవార్లూ జాగారం ఐంది. ఐదింటికి కునుకు పట్టేసి యెనిమిదిదాకా మెలుకువ రాలేదు." సాధారణంగా తెల్లవార్లూ మేలుకునే వున్నా, ఆరు లోపున యింటికి చేరుతుంది.
"నీకోసం రిక్షా ఎదురుచూస్తోంది" అన్నాడు.
"మీరు కనిపించి రెండు నెలలో ఏమో అవుతోంది. అప్పుడెప్పుడో మీరా టాకీస్ దగ్గిరలో కనిపించారు. ఐదు నిమిషాలకంటే మాట్లాడటానికి వీల్లేకపోయింది. వూళ్ళోనే ఇల్లు తీసుకుని వుంటున్నామన్నారు. జ్వరంతో ఒక్కరూ యెట్లా?" అంది.
"యేముంది కదలగలుగుతున్నాను. వీలుకానప్పుడు హాస్పిటల్లో చేరతాను."
నాలుగు అడుగులు వేసి రిక్షా అతనికి డబ్బులిచ్చి వచ్చి "నేనొచ్చి కాసేపు మీతో మాట్లాడుతూ కూర్చుంటే అక్కడేమన్నా అభ్యంతరం వుంటుందా?" అంది.
"వుఁహూ" అన్నట్లుగా తలవూపాడు. ఆటోలో కూర్చుంది. ఆటో కదిలింది.
ఐదు నిమిషాల్లో శ్రీపతి వుంటున్న యింటిముందు ఆగింది ఆటో.
తను ముందు దిగి, శ్రీపతి దిగటానికి సాయంగా చెయ్యి పట్టుకుంది.
"దిగగలను" అన్నాడు.
ఆటోకి డబ్బులిచ్చాడు.
తాళాలు అతని చేతులోంచి అందుకుని తలుపు తెరిచింది.
కుర్చీల్లో కూర్చున్నారు.
"నాకెందుకు కబురెట్టలేదు. యిట్లా వుంటే" అంది కస్తూరి.
"దేనికి?"
"అవును దేనికి?" అంది తనలో తను అనుకున్నట్లుగా దిగులుగా.
"ఎప్పటినుండి జ్వరం?" అంది.
"వారం రోజుల్నుంచి"
"డాక్టరేమన్నాడు."
"ఏమీ అనలేదు. మందులిస్తున్నాడు. ఏమన్నా అనే జ్వరం గానీ, అనేంతటి జ్వరంగానీ కాదు" అని చిన్నగా నవ్వాడు.
"అన్నం తినొచ్చా?"
"తినొచ్చు గానీ సయించటంలేదు. బ్రెడ్డు కాఫీ తీసుకుంటున్నాను." అని ఏటవాలుగా జారి, తల పేము కుర్చీపై అంచుమీద ఆనించి కనురెప్పలు వాల్చాడు.
కస్తూరి లేచి లోపలిగదిలోకి వెళ్ళింది. పెయింటింగ్ సామాగ్రి చూసి ఆశ్చర్యపోయింది. ఒకక్షణం గది అంతా కలియజూసి, లోనకి వెళ్ళింది. ఖాళీగా వున్న వంటగది. ఆ తరవాత బాత్రూం. వెనక స్థలం లేదు. ప్రక్కలకి కిటికీలు లేవు.
కస్తూరి ముందుగదికి వచ్చేసరికి అతను ఇంటికప్పు వైపు చూస్తూ చూపుడు వేలి కణుపుతో పెదవిమీద నొక్కుకుంటున్నాడు.
"గాలి సరిగా రాదు. ఫ్యాన్ లేకపోతే వుండటం కష్టం" అంది.
"ఫ్యాను వుంది గానీ, వేసవిలో కరెంటు సరిగా వుండదుగా" అని చిన్నగా నవ్వాడు.
"కూర్చోవడం కష్టం. వచ్చి పడుకోండి" అని అతని జబ్బ పట్టుకుంది. లేచాడు. లోపలి గదిలోకి నడిచారు.
మంచం అంచుమీద కూర్చున్నారు.
"ఇప్పుడేమన్నా మందు తీసుకోవాలా?" అంది.
"వూఁ"అని లేవబోయాడు__ "నే తెస్తాగా!" అని గబగబా ముందు గదిలోకి వెళ్ళి మందులు పట్టుకొచ్చి, వాటి సంగతి అడిగింది. చెప్పాడు.
తగరం చించి గోళీ చేతికి యిచ్చి, కూజాలోంచి గ్లాసులోకి నీళ్ళు వొంపి తెచ్చి అందించింది.
దిండుమీదకి వొరిగాడు.
మంహం అంచుమీద కూచుని, "నేనిట్లా యిక్కడ కనిపిస్తే యీ బిల్డింగులో వాళ్ళేమన్నా అనుకుంటారా?" అంది.
"వాళ్ళ ఓపిక__" అన్నాడు.
"అందువల్ల మీకు యిబ్బంది కలగదూ?"
"నాకేం యిబ్బంది? వాళ్ళేమనుకుంటే నాకేమిటి? కాకపోతే యెప్పుడూ యే స్త్రీ కనిపించనందున యెవరూ యేమిటీ అని అడుగుతారు. ఆరా తీస్తారు" అన్నాడు.
"కాలేజీ వదిలేసి పెయింటింగ్ చేస్తున్నారా?" అంది. ఆ సామాగ్రి వంక చూస్తూ.
"అదీ చెయ్యటంలేదు."
లేచి రెండడుగులు వేసి టేబుల్ మీది థెర్మోస్ తెరచి చూసింది_ కాఫీ వుంది. మూత పెట్టేసి బ్రెడ్డు వున్న ప్లాస్టిక్ పళ్ళెం చేత పుచ్చుకుని వచ్చి మంచం అంచుమీద కూర్చుంది.
"వుట్టిది తింటారా?" అంది.
"యిప్పుడేం వొద్దు"
"రెండు స్లైసెస్ తీసుకోండి. లేకపోతే మరీ నీరసంగా అనిపిస్తుంది" అని లేచి ఫ్లాస్కు మూతతీసి కప్పులోకి వంపింది. యింకా రెండు కప్పుల కాఫీ వుంది.
"నువ్వూ తిను." అన్నాడు.
"నాకు దేనికి బ్రెడ్డు?" అంది.
"బ్రెడ్డు తినటానికి జ్వరం రానక్కర్లా. నేను చాలారోజులు బ్రెడ్డు తోటే గడిపేస్తుంటాను. ఇంకో కప్పూ ట్రే పట్రా" అన్నాడు.
తెచ్చింది.
శ్రీపతి లేచి కూర్చున్నాడు. ట్రేలో చెరో కప్పులో బ్రెడ్డు ముంచుకుని తింటున్నారు. కప్పుల్లో మిగిలిన కాఫీ తాగేశారు.
