"వినీల నాకు ప్రత్యర్థిగా మారలేదు"
"ఒక వేళ మారిందే అనుకో"
"అయినా అనుకున్నది సాధించి తీర్తాను"
"ఆ ప్రోసెస్ లో వినీల అడ్డం వస్తే" తెలివిగా ఓ అస్త్రాన్ని సంధించింది" ప్రొబబులిటీస్ గురించి ఆలోచిద్దాం శశాంకా"
"సోఫియా..." శశాంక కళ్ళిప్పుడు ఎరుపు జీరల్ని నింపుకున్నాయి. "ఆ స్థితివస్తే అప్పుడు వినీల కూడా నాకు శతృవే అవుతుంది"
"దేర్ యూ ఆర్..." ఆ స్థితివస్తే అంటూ నువ్వాలోచిస్తున్నావు. వచ్చిందీ అని నేనంటున్నాను"
"నీ నమ్మకానికి ఆధారం లేదు సోఫియా...ఒకవేళ వినీల తన తండ్రి బాధ్యతల్ని తీసుకున్నా నీ స్థాయి ఆడదానిగా మారడానికి కనీసం దశాబ్దం పడుతుంది. నేననుకున్నది పూర్తి చేయడానికి నాకు కొన్ని రోజులు చాలు"
పగలబడి నవ్వింది సోఫియా...
"ఎందుకు నవ్వు"
"ఆడపిల్లల్ని నువ్వు చాలా తక్కువగా అంచనా వేస్తుంటావు శశాంకా"
"ఎస్ సోఫియా. దోయూ ఆర్ లేడీ, యు నోమచ్ అబౌట్ స్మగ్లింగ్ అండ్ లెస్ అజీట్ లేడీస్"
"వెల్ నీ నిర్ణయం నీది" సరే ఓ క్షణం నిర్లిప్తంగా చూసింది. ఎల్లుండి ఉదయమే నువ్వు ఢిల్లీ బయలుదేరుతున్నావు... డిటైల్స్ రేపు మాటాడుకుందాం. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా వుండు" వెళ్ళబోతూ అంది.
"దేని విషయంలో"
"జయచంద్రపై హత్యాయత్నం చేసింది నువ్వే అని తెలిసిపోయింది. జయచంద్ర ముఠాకి ముఖ్యంగా సర్కార్, కుమార్ దాదాలకి. వినీల విషయంలో నువ్వు తీసుకున్న చొరవ బహుశా అక్కడ వినీల నీ విషయంలో తీసుకోలేకపోవచ్చు. కేర్ ఫుల్ గా వుండు"
సోఫియా పొరపాటు పడలేదు.
హత్యాప్రయత్నం చేసింది 'ప్రసాద్' అని పేపర్లలో ఎప్పుడు వచ్చిందో అప్పుడే సర్కార్, కుమార్ దాదాల దృష్టి శశాంకపైకి పూర్తిగా మళ్ళడంతో శశాంకపై చావుదెబ్బతీయడానికి ఇద్దరూ పథకం వేశారు. బలంగా.
ఇదంతా వూహించని వినీలకూడా సోఫియా అంచనా ప్రకారం జయచంద్ర వ్యాపారంలోకి అతి తెలివిగా రప్పించబడింది.
* * * *
ఆ రాత్రి జయచంద్ర వినీలని పిలిచాడు.
ఉదయమే బాంబే నుంచి వచ్చి తనను కలిసిన టెక్స్ టైల్స్ టైకూన్ రాహుల్ గురించి కాని, ఫైలు సంతకం కాకుండా సక్సేనా చేస్తున్న ప్రయత్నం గురించి అతడు చెప్పిందిగాని వినీలకి తెలియ పరచలేదు. తన ప్రస్తుత స్థితిని ప్రత్యర్థులు అవకాశంగా ఎలా తీసుకుంటున్నదీ వివరించాడు. ఇక్కడ నేను నష్టపోతున్నది కోటి రూపాయిల వ్యాపారాన్ని మాత్రమే కాదు వినీలా. ఆ ఫైలు సంతకం కాకపోతే రెండు దశాబ్దాలుగా నేను పెంచుకున్న పరపతికి విఘాతమేర్పడుతుంది. అన్ని ఏర్పాట్లు చేశానెప్పుడో. ఇక మిగిలిన వ్యవహారం ఫోన్ లో జరిగేదికాదు కాబట్టి నువ్వు పర్సనల్ గా ఫైనాన్స్ మినిస్టర్ని కలవాలి. అదీ నా ఎంపైర్ కి పత్రినిథిగా. నాకు తెలుసు ఒక ఆడపిల్లని ఇలాంటి వ్యవహారాల్లోకి పంపడం సవ్యంకాదని. కాని నాకు మిగిలింది ఉన్నది నువ్వే... నువ్వు సరేనంటే సర్కార్ ని నీకు తోడుగా పంపిస్తాను. ఈ కవర్ ని రహస్యంగా ఆయనకిస్తే చాలు సంతకమైపోతుంది"
అందులో ఏముందీ అని వినీల వివరాలు అడగలేదు. ఆ కవరులోని కాగితం గురించి కాని ఆ కాగితంపై ఫైనాన్స్ మినిస్టర్ పేర్న స్విస్ బ్యాంకులో జమ చేయబడిన ఎకౌంట్ నంబరున్న విషయం కాని జయచంద్ర కూడా చెప్పలేదు.
వినీల తెలివిపై ఆయన ఎంత నమ్మకముందంటే ఆమె అవును అంటే చాలు. వంద మంది మేధావుల మేధస్సుకి సమ ఉజ్జీగా నిలబడగలదు. చేయాల్సిందల్లా తన స్థితిని సెంటిమెంటల్ గా క్యాష్ చేసుకుని ఆమెను తన దారిలోకి మళ్ళించుకోవడం.
ఒక మాఫియా వరల్డ్ 'డాన్' జయచంద్ర ఇక్కడ కూడా తన అహంకారాన్ని అద్భుతంగా కాపాడుకో గలిగాడు.
కేవలం మృత్యువుకు సరిహద్దుల్లో నిలబడ్డ తండ్రిపై ఏ కూతురైనా ఆ మాత్రం సానుభూతి చూపిస్తుంది అన్నది ఆయన థియరీ. అయితే అదిగో వినీల అక్కడే తెలియకుండా తను కోరని ఓ వలయంలో అడుగుపెట్టింది.
సరిగ్గా ఇదే సమయంలో...
సోఫియా ఒంటరిగా తన గదిలో కూర్చుని ఆలోచిస్తూంది.
అప్పటికి సుమారు ఓ అర్థగంటగా రాయల్ సెల్యూట్ తో మనసుని చల్లార్చుకోవాలనుకుంటోంది. ఎప్పుడూ తాగనంత వేగంగా అర బాటిల్ ఖాళీ చేసింది. కానీ గొంతు మండుతూంది తప్ప గుండె మంట తగ్గడం లేదు.
ఏనాడూ లేని ఎందుకింత ఆరడి చెందుతుంది.
శశాంకని తను ప్రేమిస్తోందా... లేక తను కేవలం అతడ్ని శరీరకంగా కోరుతూ అతడి మనసులో వినీలపై వున్న స్థానానికి అసూయ పడుతుందా... ఎవరీ శశాంక... వినీల ఎవరు... ఇంత ఉత్కృష్టమైన వైనంలో వున్న తను ఓ మామూలు ఆడదానిలా కలత చెందడ మేమిటి"
బాటిల్ ని అందుకుని గడగడా తాగింది ఆగకుండా ఆవేదనగా. కళ్ళలో నీళ్ళు, ఆ నీళ్ళ మాటున దాగని ఎరుపు జీరలు.
"యూ రెచ్చడ్ గాళ్" అద్దంలో ఎదురుగా కనిపిస్తున్న తన ప్రతిబింబాన్ని చూస్తూ అసహనంగా అరిచింది. "ఏడుస్తున్నావా... ఛ ఛా... సిగ్గు చేటు. షీనూన్ యువర్ పార్ట్. ఎంత అపురూపమైన జీవితమే నీది. ఎవరికీ తల వంచని ఓ బార్బెరియన్ సొసైటీలో ఆనందంగా వుండక నీకు కన్నీళ్ళా... నీకేమీ కాని ఎవరో నీ ప్రపంచంలో అడుగుపెట్టి రాయిగా మారిన నీ మనసుని కదిపించారని కరిగిపోవాడమేనా. ఎవరన్నారు నీకు బంధాలు అనుబంధాలూ లేవని. ఒక లిక్కర్ బాటిల్ కోసం అమ్మవొడినీ, నీ వాళ్లకి దూరమైనా మాఫియా ఎంఫైర్ ఏ సంబంధమున్నా వుంటే ఆరోజే తెగిపోయి వుండాలే... ఇంకా లేని అనుబంధాల కోసం అలా అర్రులు చాస్తావెందుకు. నీ బంధం నీ సామ్రాజ్యం... నీ అనుబంధం నీ చుట్టూ వున్న డబ్బూ, దర్పం వీటితోనే... ఎస్... ఇలా ఆలోచించావ్ మనిషివైపోతావ్ లేకపోతే ఎస్... యూ డెవిల్"
