Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి పేజి 8

    తల్లితో పాటుగా బిగుసుకుపోయి కూర్చోవటం నోరు మెదపకుండా నడవటం లాంటి క్రమశిక్షణ ఉచ్చులోంచి స్వేచ్ఛ వచ్చింది కాబట్టి సరదాగా గడపవచ్చు. ఈ అవకాశం మంచిదే అనుకుంది ఆమని.

    మెట్లమీదుగా దిగివస్తున్న ఆమెను చిత్రంగా చూస్తోంది వర్ధిని!

    "ఈరోజు తిరునాళ్ళు ప్రారంభమవుతాయి కదా! ఏమేం జరుగుతాయి?" అని అడిగింది. వర్ధినికి అవన్నీ జ్ఞాపకం భలే హుషారయి పోయింది.

    "మిమ్మల్ని అమ్మగారు వెళ్ళనివ్వరు కానివ్వండి అమ్మాయిగారూ" అని మొదలెట్టింది.

    "ఈ రోజు అవకాశం దొరికిందిలే చెప్పు"

    "అమ్మగారు మిమ్మల్ని గ్రామంలోకి వెళ్ళి చూచి రమ్మన్నారా?"

    అరక్షణం ఆలోచించి 'అవును' అని అబద్ధం చెప్పింది ఆమని!

    "భలే అదృష్టవంతులండీ మీరు! ముందు అందరూ యజ్ఞశాల దగ్గరకుపోతారు. హోమం పూర్తి అయిం తరువాత బ్రహ్మోత్సవాలు మొదలు అయినట్టు! అంతసేపూ మీ అమ్మగారు అక్కడే వుంటారు కాబట్టి అందరూ గంభీరంగా వుంటారు. ఇక అమ్మగారు ఇంటికి తిరిగి వచ్చేశాక మొదలవుతుంది చూడండి హుషారూ! కొంతమంది అయితే ఈ అయిదు రోజులూ ఇంటికి కూడా వెళ్లరు. పారువేట, వసంతోత్సవం, దొంగలదోపిడి, ఉట్ల పండుగ, ఊరేగింపులో త్రొక్కిసలాట వర్ణించలేం కదండి!

    చూచేందుకు రెండు కళ్ళు చాలవు!"

    "అవన్నీ సరేలే! ఈ రోజు ఏం జరుగుతుందో చెప్పు!

    ఈ రోజా అండి! ఇవాళ మొదటి రోజు కదా! ఉజ్జీలవేట జరుగుతుంది!"

    "ఉజ్జీలవేట అంటే ఏమిటి?"

    "అదా అండి! హోమశాల నించి అమ్మగారు ఇంటికి తిరిగి వచ్చేయగానే చుట్టూ పక్కల గ్రామాలలోంచి వచ్చిన పెళ్ళికాని యువతీ యువకులు అందరూ చెరువు గట్టుమీద చేరుతారు.

    పాల్గొనాలని సంబరపడిన అమ్మాయిలు చెరువులోకి ఏదయినా ఒక వస్తువును విసిరి వేస్తారు. యువకులు గుంపుగా ఈదుకుంటూ చెరువులో పడిపోతారు ఇక చూడండి ఆ సందడి.

    చుట్టూ గట్టుమీద చేరిన వాళ్ళు హుషారు చేస్తారు.

    అమ్మాయి చెరువులోకి విసిరేసిన వస్తువు ముందుగా అందరికి చూపుతుంది. అది తెచ్చి యిచ్చిన యువకుడు ఈ బ్రహ్మోత్సవాలు అయిదు రోజులూ ఆ అమ్మాయితో ఉజ్జీకట్టి తిరగవచ్చు!

    పూర్వకాలంలో అయితే అసలు వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకునేవారట! ఈ రోజుల్లో అలాంటివి ఇష్టపడరు కదండి.

    కేవలం అదొక సంబరంగా పండుగలాగా మిగిలిపోయిందన్న మాట. ఇప్పటికీ మిగిలివున్న ఆచారం ఏమిటి అంటే ఆ ఇద్దరూ జట్టుగా తిరుగుతారు ఈ అయిదురోజులూ!

    ఎవరూ అభ్యంతరం చెప్పరు! తల్లిదండ్రులు కూడ!

    అలా కలిసిన కొన్ని జంటలకు పెళ్ళిళ్ళు అవటం కూడ అప్పుడప్పుడు జరుగుతోంది. కట్నాల బెడద పడలేని ఆడపిల్లల తల్లిదండ్రులు కూడ ఈ పండుగ జరగాలని పట్టుబడుతున్నారిప్పుడు. భలే హుషారుగా వుంటుంది లెండి.

    మీరు మాత్రం ఆ వైపుకి వెళ్ళకండి. అమ్మగారు చూస్తే కోప్పడతారు" అంది వర్ధిని. ఆమని ఆ పండుగ విశేషం అంతా శ్రద్ధగా వింది.

    "ఛ! ఛ! నేనెందుకు పోతాను. మమ్మీ కోప్పడతారు" అంది హాలు దాటుతూ! దారిలో ఆమెకు ఆ పండుగ చూడాలని కోరిక తీవ్రతరం అయింది. ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటుంది మమ్మీ కూడా. కాని వారితో కలసి ఇలా జాలీగా తిరిగితే మాత్రం ఒప్పుకోదు.

    అందుకే ఎప్పుడూ ఆ పండుగ చూడనీయలేదు.

    ఇంక వెళ్ళిపోతే పెద్ద చదువుల మధ్య కూరుకుపోతుంది తాను. అప్పుడు ఇలాంటి వాటిలో చేయి కలపటం కుదరకపోవచ్చు!

    ఒకవేళ మమ్మీకి తెలిసినా చిన్నతనం అని సర్ది చెప్పుకుంటుంది.

    ఎలాగయినా సరే ఉజ్జీల పండుగలో పాల్గొని జీవితమంతా జ్ఞాపకం ఉండే ఓ అందమైన జ్ఞాపకం సంపాదించుకోవాలని తీర్మానించుకుంది ఆమని. జనం మధ్యలోంచి పిల్లిలాగా నడిచి వెళ్ళి తల్లి ప్రక్కన కూర్చుంది.

    అప్పటికే హోమ కుండాల ముందు అక్కసు కూర్చోబెట్టారు పండితులు.

    వేద మంత్రాలు చదువుతూ హోమం చేస్తున్నారు.

    ఘనమయిన ఆ సాంప్రదాయాలను, కాబోతున్న వారసురాల్ని చూచేందుకు జనం అధిక సంఖ్యలోనే వచ్చారు. ముత్తయిదువులు వందల సంఖ్యలో వచ్చి గాయత్రి వెనుక ఉన్న స్థలమంతా ఆక్రమించారు.

    మగవారు పండితుల వెనుక దూరంగా చేరి చూస్తున్నారు.

    ఆమని రాగానే కంఠస్వరాన్ని తగ్గించి ఆమెకు మాత్రమే వినిపించేలాగ అడిగింది రాణి సుమిత్ర "చెప్పినట్టు పూజచేసి వచ్చావా? చిన్నపిల్లలాటలా ఎంచి వచ్చేశావా?" అంది.

    చాలా బుద్ధిమంతురాల్లాగ బదులు చెప్పింది ఆమని!

    "జాగ్రత్తగా పూజ చేశాను. హారతి కూడ యిచ్చాను మమ్మీ! పూజ గది తలుపులు కూడ మూసేశాను" ఈ మాటలు విని తల్లి తృప్తిగా నిట్టూర్చింది. ఆలయంలో ఆడంబరంగా పూజలు జరుగుతున్నాయని ఇంటిలో దైవాన్ని వెనుక విడిచి రావటం తప్పు! అశుభం కూడ! అది గాయత్రి జీవితంమీద ఏదైనా గాయాన్ని చేస్తే తర్వాత ఏడ్చి ప్రయోజనం ఉండదు.

    సకాలంలో తప్పుదిద్దుకున్నందుకు ఆమెకు తృప్తిగా వుంది. చిన్న కూతురు ఆ విధంగా మేలు చేసినందుకు మురిపెంగా చూచుకుంది.

    "క్రాఫ్ చెదిరిపోయిందేమిటి?" అంది పాపిట సవరిస్తూ.

    పాపిట గొలుసు తలమీద ఆనించుకున్న సంగతి తల్లి పసిగట్టేస్తుందేమో అని భయపడింది ఆమని!

    "యాగశాలలోకి వస్తుంటే తోరణాలు పట్టుకున్నాయి" అంది ఆలోచించకుండా.

    "పచ్చాకు తలకు తగిలితే సర్వ శుభాలు కలుగుతాయి. అందుకే తోరణాలు కడతారు. అదీ మంచిదే!" అంటూ చిన్నకూతురు పాపిటలోంచి చెదరిన వెంట్రుకల్ని సవరించింది తల్లి.

    హోమం పూర్తి కావచ్చింది. "అక్క కూర్చున్న చోటునుంచి లేవకూడదు! పుణ్యస్త్రీలు అందరికీ పసుపు కుంకుమ పూలు గంధం అక్షితలు రవికల గుడ్డలు నీ చేతి మీదుగానే పంచాలి ఆమనీ!

    వారి ఆశీస్సులే మనకి శ్రీరామ రక్ష!" అంది.

    ఇంటిలోపని చేసేవారు ఆ వస్తువులు అన్నీ తీసుకుని మహిళలు కూర్చున్న వరుసల ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ పరాచికాలు ఆడుతూ గంధం వగైరాలు ఇచ్చింది ఆమని.

    సంవత్సరానికి ఒకసారి ఆ కుటుంబం నేరుగా ప్రజలందరిని పలకరించే సమయం అది! వారికి వీరికి తీయని జ్ఞాపకంగా మిగిలే రోజు!

    "చాల పెద్దదానివి అయిపోయావు చిన్నమ్మగారూ!"

    "డాక్టరీ చదువుతారట కదా?"

    "అక్కకు ఈ సంవత్సరమే పెళ్ళి చేస్తున్నారట కదా?"

    "ఆ జగదీశ్వరస్వామి మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మా!" లాంటి మాటలు అంటూ ముత్తయిదువలు ఆమె అందించే పండు తాంబూలం రవికల గుడ్డ ముత్తయిదు గంధం అందుకున్నారు.

    ఆ సమయం కోసం ఎదురు చూస్తూ అక్షతలు చేత్తో పుచ్చుకుని సిద్ధంగా కూర్చున్నారు. పుణ్యస్త్రీలను సమ్మానించటం పూర్తి అయింది. ఈలోగా హోమం కూడ పూర్తి అయింది.

    వేద పఠనంతో పండితులు ముందుగా గాయత్రిని ఆశీర్వదించారు. వారందరికీ పేరు పేరునా పాదాభివందనం చేయించింది తల్లి.

    తరువాత 'సభ్యం' అనే మంత్రం చదువుతూ సభకు నమస్కరించమని గాయత్రికి చెప్పారు పండితులు.

    వారు సభ్యం చదువుతూ వుండగా పుణ్య స్త్రీల వైపు తిరిగి అందరికి చేతులు జోడించింది గాయత్రి.

    వారంతా లేచి నిలబడి ఆ కుటుంబ క్షేమాన్ని ఆశిస్తూ అగ్ని దేవుడికి నమస్కారించారు. ఆ తరువాత పచ్చని జల్లులా గాయత్రి మీద అక్షతల వర్షం కురిపించారు.

    కన్నతల్లి కన్నులు ఆ దృశ్యం చూచి చెమరించాయి.

    "సుఖీభవ! సౌభాగ్యవతీ భవ!" అని మనసులో ఆమె మీద అక్షతలు చల్లే దృశ్యాన్ని ఊహించుకుంది సుమిత్ర! అక్షరాలే అక్షతలై ఆమె పెదవులు కూడ దాటి వచ్చాయి.

    అందరితో పాటు తనూ అక్క మీద అక్షతలు గుప్పెడు వేసింది ఆమని! చిలిపీ అన్నట్టుగా చూసింది గాయత్రి!

    అంతటితో హోమ కార్యక్రమం ముగిసి బ్రహ్మోత్సవ కార్యక్రమం ఆరంభమవుతున్నట్టు ప్రకటించాడు ప్రధాన పండితుడు. అందరూ ఒక్కసారి కోలాహలంగా లేచారు.

    రాణి సుమిత్రతో ఒక్క మాట అయినా కలపాలని పుణ్య స్త్రీలు ముందుకు తోసుకు వచ్చారు. పనివారు సామాగ్రి అంతా సర్దుతున్నారు. ఈ సందడిలో పరాకున దూరం అయిపోకుండా పాదాలకు నమస్కరించిన గాయత్రిని పొదివి పట్టుకుంది తల్లి!

    ఇరుగు పొరుగు గ్రామాలనించి వచ్చిన వారిని వీలయినంత ఎక్కువ మందిని పలకరించే ప్రయత్నంలో ఉన్నదామె!

    అదే అదను అనుకుని చల్లగా బయటకు వెళ్ళిపోతున్న స్త్రీలతో కలిసి జారుకుంది ఆమని. ఆలయం వెలుపలకు వచ్చేవరకు తల్లి పిలుపు వినిపిస్తుందని భయపడుతూనే వుంది.

    కాని వనితల మధ్య నిలిచి తన వారసురాలిని వారందరికీ పరిచయం చేసే కార్యక్రమంలో మునిగిపోయివున్న సుమిత్రాదేవి చిన్న కూతురు ఆమని చల్లగా జారుకోవటాన్ని గమనించలేదు.

    అందరి మధ్య అక్కడే ఎక్కడో ఉంది అనుకుంది.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS