Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి పేజి 7

    అన్నీ మీకు వదిలేసి కృష్ణా రామా అనుకుంటాను" అంది సుమిత్ర.

    "నీ కోరిక అదే అయితే నా మీద ఆశలు పెట్టుకోకు మమ్మీ! నేనసలు పెళ్ళి చేసుకుంటానో లేదో చెప్పలేను. కాని ప్రస్తుతం అయిదారు సంవత్సరాలు మాత్రం గ్యారంటీగా చేసుకోను.

    దయచేసి నా దారిన నన్ను పోనివ్వండి" అంది ఆమని.

    ఆమె అలా అన్నందుకు తల్లి ఆ సమయంలో అంతగా బాధపడలేదు. ఒకరు చదువుకుని పెద్ద పదవులలోకి వెళ్ళటం కుటుంబానికి మంచిదే.

    తన ఆశలు తీర్చే కల్పవల్లి గాయత్రే కావాలి.

    ఆమె అందుకు సిద్ధంగానే వుంది.

    ఆమని చాలా చురుకయిన పిల్ల! చదువుల సరస్వతి అయి విద్యలలో రాణించి కుటుంబానికి మంచి పేరు తెస్తే అంతకన్నా కోరదగినది ఏముంటుంది? అనుకుంది. "అలాగేనమ్మా! బాగా చదువు" అంది ప్రేమగా.


                                   3


    సరిగా ఉషోదయ సమయాన భవనం ముందు మంగళ వాద్యాలు మ్రోగాయి.

    పూజ మందిరంలోంచి వెలుపలకు వచ్చింది రాణిసుమిత్ర!

    కూతుళ్ళిద్దరూ అప్పటికే హాలులో సిద్ధంగా వున్నారు.

    ఇంక ఆమె ఈ అయిదు రోజుల బ్రహ్మోత్సవాలు పూర్తి అయిందాకా చాలా సీరియస్ అయిపోతుంది. ఏ చిన్న పొరపాటుని క్షమించదు.

    అంతకు ముందు రోజు రాత్రి తల్లి ఇచ్చిన సూచనల ప్రకారం వెండి పళ్ళెంలో వస్తువులు అన్నీ సర్దుకుని సిద్ధంగా నిలబడింది.

    పసుపు, కుంకుమ, పూలు, గంధం, కర్పూరం, అడుగు పొడవున కుదురుచేసిన నలుచెదరపు రావి చెక్క, కుదురులో అమర్చి గిరగిర తిప్పేయగానే నిప్పు పుట్టించేందుకు అనువుగా తయారుచేసిన జమ్మి కొయ్య! పన్నీరు, ఒక కొబ్బరి బోండాం, ఎండు కొబ్బరిచెక్క!

    వాటన్నింటిమీద ముఖమల్ రుమాలు కప్పి వుంది.

    రాణి సుమిత్ర మేడమెట్లు దిగి రాగానే ముఖమల్ వస్త్రాన్ని తొలగించి లోపల వస్తువులు అన్నీ సరిగా వున్నాయో లేదో పరిశీలించింది.

    పసుపు కుంకుమ పూలు మొదలయిన వాటిని తన కళ్ళతో చూచి తృప్తి పడింది. ఆ తరువాతనే ప్రయాణానికి సిద్ధం అని సూచించింది.

    వర్ధని ఆమె సూచన గమనించి వరండాలోకి పరుగుతీసింది. అక్కడ గ్రామ పెద్దలు నలుగురు చేరి ఉన్నారు. మాటల్లో పడిపోయారు.

    వెంటనే వెళ్ళి అమ్మగారు ప్రయాణానికి సిద్ధం అయారు." అని చెప్పింది వారితో! ఆ నలుగురూ హడావిడిగా లోనికి వచ్చారు.

    సుమిత్రకు వినయంగా నమస్కరించారు.

    వారికి మంచినీరు వగైరాలు ఇప్పించి అతిధి మర్యాదలు చేయించింది.

    "అమ్మగారూ! ఆలయం దగ్గర అంతా సిద్ధంగా ఉన్నారు. పండితులు కూడా వచ్చేశారు. యజ్ఞం మొదలు పెట్టాలంటే వారు రావటమే తరువాయి అని చెప్పారు. సుమిత్ర లేచి నిలబడింది.

    "ఇంతకాలం ఈ సంప్రదాయాలు మనం కాపాడుకుంటూ వచ్చాం! ఇకనించి కర్తను నేను కాదు పెద్దమ్మాయి గాయత్రి" అని చెప్పింది వారితో.

    ఈ విషయం అందరికి ముందుగానే తెలిసింది.

    అయినా లాంఛనా పూర్వకంగా జరిగింది.

    పెద్దలు గాయత్రి వంక తిరిగారు.

    "అమ్మాయిగారూ! అంతా సిద్ధంగా వుంది. వెడదాం పదండి" అన్నారు. గతంలో ఆ తతంగమంతా తల్లి పక్కన నిలిచి చూస్తోంది చిన్నతనం నుంచి. అందువల్ల వారికేం చెప్పాలో గాయత్రికి తెలుసు.

    "సరే! వెడదాం పదండి" అంటూ బయలుదేరింది.

    పూజా ద్రవ్యాలు తీసుకుని గాయత్రి ముందు నడిచింది. మేళతాళాలతో ఆ బృందం వీధిలోకి వచ్చి ఆలయం వైపుగా నడుస్తున్నారు.

    ఒక వీధి మలుపులో ఆగిపోయింది రాణి సుమిత్ర! ఆమె నరాలు జివ్వుమని లాగాయి.

    పెద్ద పొరపాటు జరిగింది. ఇలాంటి అపశకునం ఎందుకు జరిగింది?

    బయలుదేరి వస్తూ అలవాటు ప్రకారం తానే పూజ గదిలో కొబ్బరి కాయ కొట్టి హారతి ఇచ్చింది. కాని ఈ సంవత్సరం 'కర్త'గా కూర్చుంటున్న గాయత్రి పూజగదిలోకి రాలేదు. తల్లి ఆ గదిలో వుండగా ఎవరూ వెళ్ళకూడదు.

    అది ఆ ఇంటి నియమం! కాని రఈ రోజు ఆమె గదిలోంచి బయలు దేరటానికి బదులుగా అలవాటు చొప్పున తానే బయలుదేరింది.

    జరిగింది పెద్ద పొరపాటే! ఏమిటి ఈ అపశకునం?

    ఇలా ఎందుకు జరిగింది? భగవంతుడా ఏమిటి నీ ఆదేశం!

    ఇప్పుడు మళ్ళీ వెనక్కి పోయినా అపశకునమే!

    అలాగని ఇంటిలోని పూజా దేవతలకు వెనక్కు పెట్టి ఎక్కడో పూజలు చేస్తే ఫలితం ఏమి ఉంటుంది? ఆమె ఆలోచించి ఒక నిర్ణయం చేసింది.

    ఆమని దగ్గరకు వచ్చి ఎవరూ వినకుండా చెవిలో చెప్పింది.

    "మన పూజగదిలో అక్క పేరు మీదుగా కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వటం మరిచిపోయి వచ్చాను. పొరపాటు జరిగింది. నేను కాని అక్క కాని వెనక్కు వెళ్ళడం బావుండదు. నీవు వెళ్ళి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చిరా! ఇది నీకోసం కాదు. అక్క కోసం. ఆ గదిలో తల తిక్క వేషాలేవీ వేయకు. అర్ధమయిందా?" అని అడిగింది.

    ముందు మేళాలు, వెనుక జనం! హారతులు, పూలు చల్లటం ఇదంతా పిచ్చి వాళ్ళ స్వర్గంలా కనిపిస్తోంది ఆమనికి. అయినా పక్కన అమ్మ వుంది కాబట్టి ఆమె ముఖం సీరియస్ గా వుంది కాబట్టి ఉగ్గపట్టుకుని నడిచింది అంతసేపూ. అక్కడ నుంచి ఆ వాతావరణం నుంచి ఎస్కేప్ అయే అవకాశం కన్పించగానే ఎగిరి గంతువేసింది ఆమని.

    "ఏమీ చేయను. కొబ్బరికాయ కొట్టి హారతి యిచ్చి మళ్ళీ తలుపులు మూసేసి ఆలయం దగ్గరకు వచ్చేస్తా మమ్మీ!" అంది చాలా బుద్దిమంతురాల్లాగా!

    "సరే వెళ్ళిరా!" అంది సుమిత్ర! ఆమని ఆగిపోయింది. వారు వెళ్ళిపోయారు ముందుకు. కొంతదూరం పోయాక ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా వెనుదిరిగి ఇంటికి వచ్చింది. నేరుగా పూజ గదిలోకి పోతోంది.

    "అప్పుడే వచ్చేశావేంటి చిన్నమ్మాయిగారు?" అని అడిగింది వర్ధని.

    "పనివుండి వచ్చాలే! నీ పని చూచుకో! ఎవరినీ ఈ గదిలోకి మాత్రం రానివ్వకు" అంటూ పూజ గదిలోకి వెళ్ళింది. తల్లి ఎన్నిసార్లు పిలిచినా ఆ గదిలోకి వెళ్ళేందుకు ఇష్టపడని ఆమని అలా వెళ్ళటం వర్ధనికి ఆశ్చర్యం కలిగించింది.

    అయినా ఆమె ఈ విషయాన్ని ఎక్కువ సీరియస్ గా తీసుకోలేదు. ఏదో చిన్నపిల్ల! అలోచించి కొన్ని పనులూ, ఆలోచించకుండా కొన్ని పనులూ చేస్తుంటుంది అనుకుంటూ తలుపులు దగ్గరగా వేసి తన పనిమీద తాను వెళ్ళిపోయింది.

    ఆమని పూజగదిలోకి కాలుపెట్టటం అరుదయిన సంఘటన!

    చిన్నతనంలో అల్లరి మాటలు ఆకతాయి పనులు, చేస్తుందని తల్లి దూరంగా వుంచింది. పెద్ద అయాక చదువులవల్ల స్నేహాలవల్ల విగ్రహారాధన మీద ఆమెకు కలిగిన వ్యతిరేక అభిప్రాయంవల్ల రాలేదు.

    ఒకటి రెండు సందర్భాలలో తల్లి కోరిక మేరకు వచ్చినా ఎంత త్వరగా బయటకు వెళ్ళిపోదామా అని ఎదురుచూచింది.

    దేవుని మందిరాన్ని ఖరీదయిన చందనపు కర్రతో తయారుచేయించింది సుమిత్ర. దాని ముందు కొబ్బరికాయలు పెట్టి వున్నాయి. ఓకొబ్బరికాయ కొట్టి హారతి వెలిగించింది. తల్లి చేసినట్టుగా కళ్ళు మూసుకుని మంత్రాలు గొణుక్కోవటం తనకిరాదు. చేతులు రెండు జోడించింది.

    అక్క గాయత్రి చేయవలసిన పూజ అది!

    త్వరగా పెళ్ళి కావాలని మంచి వరుడు కావాలని కోరుకునేది! అక్క చేయవలసిన పూజ భర్తకోసం! అది అక్క ప్రతినిధిగా తాను చేస్తోంది కాబట్టి స్వంతంగా ఏమీ కోరుకోలేదు.

    భగవంతుడా! అక్కకు మంచి భర్త దొరకాలి అని కోరుకుంది.

    విధి ఎప్పుడు ఎలాంటి కథలు నడుపుతుందో ఎవరికీ తెలియదు.

    భర్త అనే పదానికి అర్ధం ఎవరికి వారికే వేరుగా వుంటుంది.

    కాని అక్క భర్త కోసం చెల్లిపూజ చేయటం చిత్రమయిన సంఘటన! అక్క భర్త మంచివాడు కావటం చెడ్డవాడు కావటం అక్క సుఖదుఃఖాలకు సంబంధించిందే అది తన జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని అయినా ఎలా చూపగలదు అని అప్పుడు అనుకుందామె.

    ఆమెకు చేతనయిన పద్ధతిలో పూజ పూర్తి అయిన తరువాత వెనుదిరిగి వచ్చేయాలనుకుంది.

    ఆ గదిలో ఒక వస్తువు కన్పించటంతో ఆగిపోయింది.

    దాన్ని పరిశీలించింది. అది సాంప్రదాయకంగా ఆ యింటి ఆడపడుచులకు ఇచ్చే పాపిట గొలుసు! అది తొలిరాత్రిని ఆ యింటి ఆడపడుచుకు తల్లి బహూకరిస్తుంది! ఇంటి బాధ్యత సాంప్రదాయం దాన్ని ధరించటంలో సాంకేతికంగా వుంటాయి అంటే అది అక్కకు దక్కాలి. అమ్మ చేయించింది అక్కకే! అద్దంముందు నిలబడి పాపిటలో పెట్టుకుని చూచుకుంది. ఎంతో బాగా నప్పినట్లు అనిపించింది.

    ఏదో చిన్నతనం తాలూకు చిలిపితనమే దాన్ని వుంచుకోవాలని ఆమె కోరదు. తనకు కావాలనుకుంటే మరెన్నో ఆభరణాలను తల్లి ఇవ్వగలదు. ఇప్పటికే తన దగ్గరున్నాయి.

    ఎన్నడూ పెట్టుకోదు. మరొకరి వస్తువులు అసలు వాడదు.

    కాని అది కొత్త వస్తువు. ఒకరి వస్తువులు వాడకూడదు అనుకునేప్పుడు కొత్తది అయినా తాను వాడి మరొకరికి ఇవ్వకూడదు. ఈ ఆలోచన రాగానే పిన్ను బిగించకుండా దాన్ని యధాస్థానంలో పెట్టేసింది.

    ఎన్నో ఆభరణాలు ఉన్నప్పుడు తొలి రాత్రికి అని ప్రత్యేకంగా మళ్ళీ ఒక గొలుసు ఇవ్వకపోతే ఏమవుతుందో! సాంప్రదాయాలు కొందరికి మధురంగా ఉంటాయి. కొందరికి విసుగ్గా ఉంటాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS